Wednesday, April 6, 2016

‘సర్దార్ గబ్బర్ సింగ్’ లీకైంది..!

పొద్దుటూరులో సీడీ షాపులపై పోలీసుల దాడులు
పోలీసుల అదుపులో ఇద్దరు అనుమానితులు



  విడుదల కంటే ముందే సర్దార్ గబ్బర్‌సింగ్ చిత్రం లీకైందంటూ పుకార్లు వినిపించాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా పోలీసులు బుధవారం ఉదయం నుంచి దాడులు చేశారు. పవన్‌కల్యాణ్ నటించిన సర్దార్‌గబ్బర్‌సింగ్ ఈనెల 8న విడుదల కానుంది. అయితే ఈ చిత్రానికి  సంబంధించిన సీడీలు మార్కెట్‌లోకి విడుదలయ్యాయనే సమాచారం ఇంటెలిజెన్స్ వర్గాలకు అందింది. దీంతో రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారుల సమాచారం మేరకు ప్రొద్దుటూరుతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న పలు సీడీ షాపులు, తయారీ దారులపై పోలీసులు దాడులు నిర్వహించారు.
ఈ చిత్రానికి పని చేసిన కొందరు టెక్నీషియన్ లు రెండు రోజుల క్రితం ల్యాబ్ నుంచి కాపీ చేసుకున్నట్లు పుకార్లు వినిపించాయి. ప్రొద్దుటూరులోని  పలు సీడీ షాపులలో పోలీసులు సోదాలు చేశారు. సీడీలను తయారు చేసి ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్న దుకాణాలపై కూడా దాడి చేసి హార్డ్ డిస్క్‌లు, సీడీ రైటర్‌లను పరిశీలించారు. టూ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇద్దరిని, త్రీ టౌన్ పరిధిలో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ మేరకు వారిని బైండోవర్  చేసి తహ సీల్దార్ వద్ద హాజరుపరిచారు. పోలీసుల అదుపులో ఉన్న అనుమానితులను చిత్రం విడుదల అయ్యే వరకూ ప్రతి రోజూ స్టేషన్‌లో హాజరు కావాలని అధికారులు ఆదేశించారు. అయితే సర్దార్ గబ్బర్‌సింగ్ చిత్రానికి సంబంధించిన  సీడీలు ఎవరి వద్ద దొరకలేదని పోలీసులు తెలిపారు. దీంతో అభిమానులతో పాటు థియేటర్ యజమానులు కూడా ఊపిరి పీల్చుకున్నారు.

ప్రజల కంటే ఐపీఎల్‌ క్రికెట్‌ ముఖ్యమా?

బీసీసీఐని నిలదీసిన బాంబే హైకోర్టు
మహారాష్ట్ర ప్రజల కంటే ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌ నిర్వహణ ముఖ్యమా? అని బాంబే హైకోర్టు బుధవారం బీసీసీఐని నిలదీసింది. మహారాష్ట్రలోని వివిధ నగరాల్లో ఏప్రిల్‌ 9నుంచి మే 29 వరకు మొత్తం 20 క్రికెట్‌ మ్యాచ్‌లు నిర్వహించవలసి ఉంది. క్రికెట్‌ పిచ్‌లను ఒక సారి తడిపేందుకు సుమారు 60 వేల లీటర్ల నీరు అవసరమవుతుంది. మహారాష్ట్రలో రాజధాని ముంబయితో సహా పలు ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. అందువల్ల క్రికెట్‌ మ్యాచ్‌లను నీటి ఎద్దడి లేని రాష్ట్రాల్లో నిర్వహించుకోవాలని బీసీసీఐకి హైకోర్టు సూచించింది. నీటి ఎద్దడి సమస్యకు సంబంధించి దాఖలైన రెండు పిటిషన్లను హైకోర్టు ధర్మాసనం విచారించింది. తాగు నీటి సమస్య తీవ్రంగా ఉండగా, పిచ్‌లను తడపడానికి నీటిని వృధా చేస్తే ఎలా అని ధర్మాసనం ప్రశ్నించింది. అంతేకాకుండా ఇక్కడ తాగునీటి ఎద్దడి ఉన్న విషయం మీకు తెలియదా? అని కూడా ప్రశ్నించింది. 2015లో అనావృష్టి వల్ల 3,228 మంది ఆత్మహత్య కు పాల్పడ్డారని జర్నలిస్టు తిరోడ్కర్‌ హైకోర్టులో దాఖలు చేసిన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అందువల్ల బీసీసీఐ వినియోగించే ప్రతి నీటి బొట్టుకు పైసలు వసూలు చేయాలని ఆయన కోరారు. విలువైన నీరు వృధా చేయకుండా సంబంధిత సంస్థలకు ఆదేశించాలని ఆయన తన పిటిషన్‌లో కోరారు. మహారాష్ట్రలో ఐపీఎల్‌ క్రికెట్‌ నిర్వహణ వల్ల చాలా నీరు వృధా అవుతుందని 'లోక్‌సత్తా మూవ్‌మెంట్‌' అనే స్వచ్ఛంద సంస్థ ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. కాగా దీనిపై బీసీసీఐ వాదన మరోలా ఉంది. తాము తాగునీరు కాకుండా ఇతర నీటిని పిచ్‌లను తడిపేందుకు ఉపయోగిస్తున్నామని ఆ సంస్థ నిర్వహకులు చెబుతున్నారు. నాగపూర్‌, పుణే, ముంబయి నగరాల్లో క్రికెట్‌ మ్యాచ్‌ల నిర్వహణకు సంబంధించి టికెట్లను అమ్మేశామని, ఇప్పుడు వీటిని రద్దు చేస్తే చాలా నష్టపోతామని ఐపీఎల్‌ చైర్మన్‌ రాజీవ్‌ శుక్లా ఆవేదన వ్యక్తం చేశారు.

రీ ఎంట్రీకి రెడీ అవుతోన్న టాలీవుడ్ స్టార్ హీరో ..

  బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా.. లాంటి సినిమాలతో టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన సిద్ధార్థ్, తరువాత ఆ సక్సెస్ ను కొనసాగించలేకపోయాడు. వరుస ఫ్లాప్ లతో డీలా పడ్డ సిద్ధూ టాలీవుడ్ వదిలేసి చెన్నై వెళ్లిపోయాడు. అక్కడ కూడా మంచి సక్సెస్ లు రాకపోవటంతో అవకాశాలు తగ్గిపోయాయి. అడపాదడపా సినిమాలు చేస్తూ కెరీర్ నెట్టుకొస్తున్న సిద్ధార్థ్ మరోసారి టాలీవుడ్ ఇండస్ట్రీ మీద దృష్టిపెట్టాడు.
              చందమామ కథలు సినిమాతో జాతీయ అవార్డ్ సాధించిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు, ఇటీవల గుంటూరు టాకీస్ సినిమాతో మరోసారి ఆకట్టుకున్నాడు. ఆర్ట్ సినిమాలే కాదు కమర్షియల్ సినిమాలు కూడా చేయగలనని ప్రూవ్ చేసుకున్న ఈ దర్శకుడు, ప్రస్తుతం ఓ రొమాంటిక్ ఎంటర్ టైనర్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో సిద్ధార్థ్ ను హీరోగా తీసుకోవాలని భావిస్తున్నాడట. ఇప్పటికే సిద్దూకి కథ కూడా చెప్పి ఒప్పించిన ప్రవీణ్, త్వరలోనే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తున్నాడు.

Tuesday, April 5, 2016

'కామెంట్లపై వార్నింగ్ ఇచ్చిన హీరోయిన్'

 ఇకపై ఎవరైనా తనపై కామెంట్స్ చేసేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని విమర్శకులను హెచ్చరించింది బాలీవుడ్ హీరోయిన్ జరైన్ ఖాన్. తన బాధను వెల్లడించేందుకు ఇన్ స్టాగ్రామ్ ను మార్గంగా ఎంచుకుంది. తన స్కూలు డేస్, కాలేజీ రోజులలో ఎలా ఉండేదో తెలిపేందుకు ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. 'నా శరీరం నా ఇష్టం. నేను ఎలా ఉండాలో చెప్పేందుకు మీరేవరు. ఎవరి సమస్యలు వారికి ఉంటాయి' అని ఆగ్రహం వ్యక్తం చేసింది. గత కొంతకాలం నుంచి ఆమె శరీరాకృతి గురించి చాలా రకాల విమర్శలొస్తున్నాయి. ఆమె బాడీ బికినీకి ఒప్పేలా ఉందడని, ఆమె చాలా లావుగా ఉంటుందని అందుకే అవకాశాలు ఇవ్వాలంటే దర్శకనిర్మాతలు బెదురుతారంటూ వచ్చిన కామెంట్లపై తీవ్ర స్థాయిలో మండిపడింది.
2010లో సల్మాన్ ఖాన్ సరసన 'వీర్' మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత హౌస్ ఫుల్, హేట్ స్టోరీ 3 మూవీలలో నటించింది. బాలీవుడ్ లో జీరో సైజ్ భామలకే గిరాకీ ఎక్కువని, కానీ జరైన్ ఈ ఇండస్ట్రీకి సెట్ అవ్వదంటూ విమర్శల నేపథ్యంలోనూ కొన్నిసార్లు అవకాశాలు కోల్పోయింది. 'ఇప్పటికే చాలా కేజీలు తగ్గాను. అయినా సన్నబడాలని, మెరుపుతీగలా తయారవ్వాలంటే నా వల్ల కాదు. ఒకసారి నా ఫొటోలు చూస్తే మీకే అర్థమవుతోంది. వైట్ డ్రెస్ 9వ తరగతి, పింక్ డ్రెస్ ఇంటర్ చదువుతున్నప్పుడు దిగిన ఫొటోలు. అప్పటికి, ఇప్పటికీ నన్ను నేను ఎలా మలుచుకున్నానో ఆ బాధలు నాకు తెలుసు. ఇక ఎవరి వ్యాఖ్యలు నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు' అని బొద్దుగుమ్మ తీవ్రంగా విరుచుకుపడింది. చాలా మంది హీరోయిన్లు లావుగా ఉన్నప్పటికీ ఆమెను లక్ష్యంగా చేసుకుని కామెంట్లు రావడంతో మనస్తాపానికి లోనై ఈ విధంగా జరైన్ ఖాన్ తన బాధను వెల్లగక్కింది.

వాళ్ల బ్రేకప్‌ ఉత్తిదేనా..?

 బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారిన రణ్‌బీర్‌ కపూర్‌.. కత్రినా కైఫ్‌ బ్రేకప్‌ విషయం ఓ పట్టాన కొలిక్కిరావట్లేదు. ఇటీవల బ్రేకప్‌ అయిన వీరిద్దరిని కలపడానికి ఒకవైపు వారి స్నేహితులు.. సన్నిహితులు ప్రయత్నాలు చేస్తున్నా.. మరోవైపు ఎక్కడికి వెళ్లినా రణ్‌బీర్‌.. కత్రినా ఎడమొహం.. పెడమొహంగా ఉంటున్నారు. దీంతో ఇక వాళ్లిద్దరు కలిసే అవకాశాలు లేవని బీటౌన్‌లో అనుకున్నారు. అయితే తాజాగా జరిగిన ఓ సంఘటన వీరిద్దరు మళ్లీ ఒక్కటవుతున్నారన్న సందేహాన్ని కలిగించిందట.
ప్రస్తుతం వీరు బ్రేకప్‌ అయినా.. ‘జగ్గాజాసూస్‌’ సినిమాలో కలిసి నటిస్తున్నారు. అయితే ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరైన రణ్‌బీర్‌.. కత్రినా ఒకరినొకరు కలవకుండా వేరువేరుగా ఉన్నారట. కానీ.. వీరిద్దరికి సన్నిహిత స్నేహితురాలైన ఆర్తి పుట్టిన రోజు పార్టీకి మిస్‌ కాకుండా ఒకే సమయంలో వచ్చారట. అంతేకాదు.. ఇరువురు ఆప్యాయంగా పలుకరించుకొని చాలా సేపు మాట్లాడుకున్నారట. పార్టీ పూర్తయ్యే వరకు అక్కడే ఉండి రణ్‌బీర్‌ వెళ్లిన తర్వాత కత్రినా వెళ్లిపోయిందట. దీంతో వీరిద్దరు మళ్లీ కలిసిపోతున్నారంటూ బాలీవుడ్‌లో గుసగుసలు వినబడుతున్నాయి. అయితే ఇది అంత విశ్వసనీయ సమాచారం కాకున్నా ఒకవేళ నిజంగానే సర్దుకుపోయి.. ప్రేమను కొనసాగిస్తే వారి జంటను అభిమానించే అభిమానులకు సంతోషకరమైన విషయమే కదా!

Monday, April 4, 2016

పెళ్లయ్యాక సినిమాలు మానేశా: హీరోయిన్‌


గత జనవరిలో రాహుల్‌ శర్మను పెళ్లాడి వైవాహిక జీవితంలో అడుగుపెట్టింది బాలీవుడ్ ముద్దుగుమ్మ ఆసిన్ థొట్టుంకల్‌. పెళ్లయిన తర్వాత ఎలాంటి సినిమా ఆఫర్లు ఆమె ఒప్పుకోవడం లేదట. ఈ విషయాన్నే పెళ్లికి ముందు కూడా చెప్పింది. అయినా తనకు పలు సినిమాల ఆఫర్లు వస్తున్నాయంటూ కథనాలు వస్తుండటంతో మళ్లీ ఓసారి వివరణ ఇచ్చింది.                 'నేను గతంలో చెప్పిన దానిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయిన నా మీడియా మిత్రులందరికీ మరోసారి తెలియజేస్తున్నా. నేను ఎలాంటి అసైన్‌మెంట్లను ఒప్పుకోవడం లేదు. నా బ్రాండ్‌ ఎండార్స్‌మెంట్లు సహా నా కమిట్‌మెంట్లన్నింటినీ పెళ్లికి ముందే పూర్తి చేశాను. నా వర్క్‌ గురించి, అసైన్‌మెంట్ల గురించి ఊహాగానాలు చేయడం మానుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. ప్రస్తుతం నేను వాటిని చేయడం లేదు. పెళ్లికి ముందే నేను ప్రకటన చేశాను' అని ఆసిన్ తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో వెల్లడించింది. మైక్రోమాక్స్ కో ఫౌండర్ అయిన రాహుల్‌-ఆసిన్ పెళ్లి జనవరి 19న జరిగిన సంగతి తెలిసిందే. క్రైస్తవ, హిందూ సంప్రదాయాల ప్రకారం వీరి వివాహం జరిగింది.                    2008లో 'గజినీ' సినిమాతో బాలీవుడ్‌కు హాయ్‌ చెప్పిన ఆసిన్‌.. పెళ్లికి ముందు చివరగా అభిషేక్ బచ్చన్ నటించిన 'ఆల్ ఈజ్ వెల్‌' సినిమాలో హీరోయిన్‌గా కనిపించింది.

ఐపీఎల్‌ టికెట్ల అమ్మకాలు షురూ..

 ఉప్పల్‌ స్టేడియంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆడే ఐపీఎల్‌ మ్యాచ్‌ల టికెట్ల అమ్మకం మొదలైంది. ఈనెల 16న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో సన్‌రైజర్స్‌ సొంతగడ్డపై తొలి మ్యాచ్‌ ఆడుతుంది. సన్‌రైజర్స్‌హైదరాబాద్‌ డాట్‌ ఇన్‌, బుక్‌మైషో డాట్‌ కామ్‌ వైబ్‌సెట్లలో టిక్కెట్లు కొనుక్కోవచ్చు. జింఖానా మైదానంలోని హెచ్‌సీఏ కార్యాలయంలో బాక్స్‌ ఆఫీస్‌, కెఫీ కాఫీ డే ఔట్‌లెట్లలో టికెట్లు అందుబాటులో ఉంటాయి. ఈ ఐపీఎల్‌ సీజన్‌ ఈ నెల 9నుంచి ఆరంభం కానుంది. తొలి మ్యాచ్‌లో ముంబయి, పుణె జట్లు తలపడనున్నాయి

ఒక పెద్ద హీరో.. నలుగురు కుర్ర హీరోలతో..

  ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా ఐదుగురు హీరోలతో ప్రముఖ బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్ ఆడిపాడనుంది. తన తదుపరి ఒకే చిత్రంలో ఐదుగురు నటులతో కలిసి నటించనుంది. వీరిలో ఒకరు అగ్రహీరో, సూపర్ స్టార్ షారుక్ ఖాన్ కాగా మిగితా నలుగురు యంగ్ హీరోలు.
ఇంగ్లిష్ వింగ్లిష్ చిత్రాన్ని తెరకెక్కించి మంచి హిట్ కొట్టిన గౌరీ షిండే ఆ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రంలో అలియాభట్ హీరోయిన్ గా నటించనుండగా ఆష్కి-2 ఫేమ్ ఆదిత్యరాయ్ కపూర్, అలి జాఫర్, అంగాడ్ బేడి, కునాల్ కపూర్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. షారుక్ ఖాన్ కూడా నటించనున్న ఈ చిత్రంలో ఆయన పాత్ర ఏమిటనే విషయం మాత్రం ఇంకా గోప్యంగానే ఉంది.