Saturday, February 13, 2016

రజనీ చిత్రం కోసం 20కోట్లతో సెట్

  సూపర్‌స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం కోసం చెన్నైలోని ఓ ప్రాంతం అత్యాధునిక నగరంగా మారుతోందన్నది తాజా సమాచారం.రజనీకాంత్ ఇంతకు ముందెప్పుడూ లేనట్టుగా ఏకకాలంలో రెండు భారీ చిత్రాల్లో నటిస్తున్న విషయం పాఠకులకు తెలిసిందే. అందులో ఒకటి 2.ఓ. ఇది ఎందిరన్ చిత్రానికి సీక్వెల్ అన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బ్రహ్మాండ చిత్రాల దర్శకుడు శంకర్ వెండితెరపై ఆవిష్కరిస్తున్న మరో అద్భుత సృష్టి 2ఓ చిత్రం అని చెప్పవచ్చు.ఇప్పటి వరకూ భారతీయ సినీ చరిత్రలో రూపొందనటువంటి అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా నమోదు కానున్న చిత్రం ఇది.ఈ చిత్రాన్ని లైకా సంస్థ 250 కోట్ల బడ్జెట్‌లో నిర్మిస్తున్నట్లు సమాచారం. రజనీకాంత్ సరసన ఇంగ్లాండ్ బ్యూటీ ఎమీజాక్సన్ నటిస్తున్న ఈ చిత్రంతో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్ విలన్‌గా మారుతున్నారు. చెన్నైలో ప్రారంభమైన 2ఓ చిత్రం షూటింగ్ ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది.

 హాలీవుడ్ స్టంట్ మాస్టర్ నేతృత్వంలో
 తాజా షెడ్యూల్ ఈ నెల 18 నుంచి చెన్నైలో ప్రారంభం కానుందన్నది సమాచారం. ఈ చిత్రం కోసం స్థానిక పూందమల్లి సమీపంలో రూ.20 కోట్ల ఖర్చుతో బ్రహ్మాండమైన సెట్‌ను వేస్తున్నారు.ఇది పలు ఏకరాల స్థలంలో ఒక ఆధునిక నగరంగా తయారవుతోందన్నది గమనార్హం.ఈ సెట్‌లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలిసింది.ఇందు కోసం హాలీవుడ్ స్టంట్ డెరైక్టర్ కెన్నీ పెట్స్ తన టీమ్‌తో చెన్నైకి చేరుకుని ఆ సెట్‌లో ఇప్పటికే ఫైట్ సీక్వెన్స్‌ను కంపోజ్ చేస్తున్నారు. ఈ స్టంట్ మాస్టర్ ది రాక్,ట్రైనింగ్ డే సీక్వెల్స్ తదితర హాలీవుడ్ చిత్రాలకు పని చేశారన్నది గమనార్హం. ఈ చిత్రంలో ఫైట్ సన్నివేశాలను చిత్రీకరించడానికి కొన్ని ఆధునిక త్రీడీ కెమెరాలను రప్పించారు.
 
 సెల్‌ఫోన్స్ నిషిద్దం

 షరతులు వర్తిస్తాయి అన్నట్లుగా దర్శకుడు శంకర్ చిత్ర యూనిట్‌కు కొన్ని నిబంధనలను విధించారు. షూటింగ్ స్పాట్‌కు ఎవరూ సెల్‌ఫోన్లు తీసుకురాకూడదు. చిత్రానికి సంబంధించిన వారు మినహా బయటి వారెవరికి షూటింగ్ స్పాట్‌కు రావడానికి అనుమతి నిషిద్దం లాంటి నిబంధనలు విధించారట.

కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమా రివ్యూ


మతిమరపు కుర్రాడు ప్రేమలో పడితే పడే పాట్లేంటో చూపించి ప్రేక్షకులని ఫ్లాట్‌ చేసేసిన నాని 'భలే భలే' బ్లాక్‌బస్టర్‌ తర్వాత ఈసారి పిరికి ప్రేమికుడి అవతారమెత్తాడు. చిన్నప్పుడే మహాలక్ష్మి ప్రేమలో పడి, పదిహేనేళ్లయినా ఆ ప్రేమ గురించి కనీసం తన స్నేహితులకి కూడా చెప్పుకోలేని కృష్ణగాడి 'వీర' ప్రేమగాథ ఇది. హీరోయిన్‌ అన్నయ్యో పెద్ద రౌడీ. ఒంటి చేత్తో ఎంత మందినైనా నరికి అవతలేసే వ్యక్తి చెల్లిని ప్రేమిస్తున్నానని పిరికి హీరో ఎలా చెప్పగలడు? అవడానికి కృష్ణగాడి ప్రేమకథే అయినా దాంట్లో 'వీరత్వం' కోణాన్ని జోడించడం కోసం దర్శకుడు హను రాఘవపూడి వేరే ఉపకథలు సిద్ధం చేసి మెయిన్‌ లైన్‌లోకి తెలివిగా కలిపాడు. 
                   రొమాంటిక్‌ సినిమాలో థ్రిల్లర్‌, కామెడీ, యాక్షన్‌ వగైరా జోనర్లన్నీ చేరి ఒక కొత్త రకమైన అనుభూతిని కలిగిస్తాయి. ఇదే కథని చాలా వైల్డ్‌గా, వయొలెంట్‌గా చెప్పవచ్చు. కానీ దర్శకుడు వినోదాన్ని నమ్ముకున్నాడు. హీరో కార్లోకి చేరి, కథ హైవే ఎక్కేసరికి ఇక ఫన్‌కి చోటు లేదనుకుంటే... అనూహ్యమైన పాత్రలతో కామెడీ సృష్టించి నవ్వులకి లోటు లేకుండా చూసుకున్నాడు. హ్యూమర్‌ పండించే విషయంలో దర్శకుడి క్రియేటివిటీ చాలా సందర్భాల్లో విశేషంగా మెప్పిస్తుంది. హీరో పిరికితనంపై బేస్‌ చేసుకుని అందించిన ఫన్‌ ఒకెత్తు అయితే, బ్రహ్మాజీ క్యారెక్టర్‌ బండారం బయటపడే సీన్‌, మురళీశర్మ-పృధ్వీ-ప్రభాస్‌ శ్రీను ట్రాక్‌, చిన్న పాప, ఆమె చేతిలోని బొమ్మ చుట్టూ అల్లుకున్న సీన్స్‌ బాగా నవ్విస్తాయి. 
నిజానికి కృష్ణగాడి ప్రేమకథ ఇంటర్వెల్‌కే కొలిక్కి వచ్చేస్తుంది. అక్కడ్నుంచీ అతని వీరగాథకి తెర లేస్తుంది. లవ్‌స్టోరీకి ఆల్‌మోస్ట్‌ శుభం కార్డు పడేసరికి 'నా జీవితంలో కష్టమైన హాఫ్‌ అయిపోయింది, ఇష్టమైన హాఫ్‌ ఇప్పుడు మొదలవుతుంది' అని ఇంటర్వెల్‌ దగ్గర కృష్ణగాడు ఆనందపడతాడు. కానీ తనకే కాదు, దర్శకుడికీ కష్టమైన హాఫ్‌ రెండోదే అవుతుంది. అంతదాకా తన ప్రేమ గురించి హీరోయిన్‌ అన్నకి తెలీకుండా తప్పించుకు తిరిగిన కృష్ణగాడు ఇప్పుడు ఎంతో మంది నుంచి వచ్చే ఎన్నో సమస్యలని ఎదుర్కొంటూ అటు తన మహాలక్ష్మిని, ఇటు ముగ్గురు పిల్లల్ని కూడా కాపాడుకోవాల్సి వస్తుంది. ఇంటర్వెల్‌ వరకు కామెడీతో కాలక్షేపం చేసిన దర్శకుడికి సెకండ్‌ హాఫ్‌లో అన్ని కథల్ని ఒక కొలిక్కి తెస్తూ, వినోదం మిస్‌ అవకుండా, అలాగే రోడ్‌ జర్నీ బోర్‌ కొట్టకుండా చూసుకోవాల్సిన పరీక్ష ఎదురవుతుంది. 
హీరో కాబట్టి కృష్ణగాడు సక్సెస్‌ అయిపోతాడనేది మనందరికీ తెలిసిందే. కానీ ఈ పరీక్షలో హను రాఘవపూడి ఎలా నెగ్గుకొస్తాడన్నదే కీలకం. చాలా సబ్‌ప్లాట్స్‌ ఉండడం, మెయిన్‌ స్టోరీలో కామెడీ తగ్గడం వల్ల వేరే ట్రాక్స్‌తో కామెడీ పండించాల్సి రావడం, ఇంటర్వెల్‌కి ముందు ఉన్నన్ని ట్విస్టులు క్లయిమాక్స్‌కి ముందు కూడా ఉండాలని ఆరాటపడడం వగైరా ఇబ్బందుల వల్ల కాసింత గందరగోళం నెలకొంటుంది. అయితే హను రాఘవపూడి చాలా వరకు తన తెలివితేటలతో మేనేజ్‌ చేసేసాడు. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ కోసమని సెకండ్‌ హాఫ్‌లో రెండు పాటలు ఇరికించాడు. కనీసం ఆ చివరి పాటనైనా ఎడిట్‌ చేసేసినట్టయితే బాగుండేది. హైవేలో దూసుకుపోతున్న బండిలోని పాసింజర్‌ సడన్‌గా 'లూ బ్రేక్‌'కి వెళ్లినట్టు అడ్డుపడి, 'త్వరగా కానివ్వండి' అనేలా తయారైందది. క్లయిమాక్స్‌లో పిల్లలపై పెట్టిన ఎమోషనల్‌ డ్రామా కూడా అవసరానికి మించి సాగదీసినట్టుంది. హీరోని 'బాలకృష్ణ' అభిమానిగా చూపించడం, దానికోసం కొన్ని సీన్లు జోడించడం ఏదో బాలయ్య అభిమానుల్ని ఆకట్టుకునే ప్రయత్నంలా ఉందే తప్ప దాని వల్ల కథకి ఒరిగిన ప్రయోజనం ఏమీ లేదు. 
               పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడం ఇంత ఈజీనా అన్నట్టుగా ప్రతి పాత్రనీ రక్తి కట్టిస్తోన్న నాని మరోసారి అద్భుతమైన అభినయంతో ఈ కథకి రథ సారథి అయ్యాడు. వంక పెట్టలేని నటనతో తెరపై కృష్ణగాడే తప్ప నానిని కనిపించకుండా చేసాడు. చివర్లో ఎమోషనల్‌గా బరస్ట్‌ అయ్యే సీన్లో నానిలోని పరిపూర్ణ నటుడు కనిపిస్తాడు. హీరోయిన్‌ పాత్రలో మెహ్రీన్‌ తేలిపోయింది. కాస్త బొద్దుగా ఉన్న ఈ అమ్మాయిని కాస్టూమ్స్‌తో కవర్‌ చేసే ప్రయత్నం జరిగింది. క్యూట్‌గా ఎట్‌ ది సేమ్‌ టైమ్‌ డామినేటింగ్‌గా కనిపించాల్సిన పాత్రకి ఆమె న్యాయం చేయలేకపోయింది. సపోర్టింగ్‌ స్టార్‌ కాస్ట్‌ అంతా కూడా అలరించారు. ముఖ్యంగా బ్రహ్మాజీ, మురళీ శర్మ, పృధ్వీ, రాజేష్‌ కామెడీకి బాగా హెల్పయ్యారు. పిల్లల్లో చిన్న పాప నైనీ అయితే ముద్దుగా ఉండడమే కాకుండా చాలా సహజంగా నటించి మార్కులు కొట్టేసింది. 
సాంకేతికంగా ఉన్నతంగా ఉన్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌ పెద్ద ఎస్సెట్‌ అయ్యాడు. సంగీతం కూడా రొటీన్‌గా కాకుండా ఫ్రెష్‌గా అనిపించింది. సంభాషణలు బాగున్నాయి. చిన్న సినిమా అని ఎక్కడా రాజీ పడకుండా రిచ్‌గా తెరకెక్కించడంలో ప్రొడ్యూసర్స్‌ ఎఫర్ట్స్‌ మెచ్చుకోవాలి. 'అందాల రాక్షసి' చిత్రాన్ని పొయెటిక్‌గా ప్రెజెంట్‌ చేసే ప్రయత్నంలో బోర్‌ కొట్టించిన హను రాఘవపూడి ఈసారి క్రియేటివ్‌గా కాంప్రమైజ్‌ కాకుండా ఒక మంచి ఎంటర్‌టైనర్‌ని అందించాడు. ఈ సినిమాతో అతడిని ఆడియన్స్‌ హైగా రేట్‌ చేస్తారు. తననుంచి మరిన్ని క్రియేటివ్‌ ఎంటర్‌టైనర్స్‌ని ఎక్స్‌పెక్ట్‌ చేస్తారు. 
               ట్విస్టులెక్కువయి, రన్నింగ్‌ టైమ్‌ కాసింత పెరిగి కృష్ణగాడి 'గాడీ' ఒక్కోసారి గాడి తప్పినా కానీ సరదా సందర్భాలు, థ్రిల్లింగ్‌ సన్నివేశాలు, అనూహ్యమైన మలుపులు, ఆకట్టుకునే పాత్రల సమ్మేళనంతో.. విసుగు లేని వినోదంతో అంతిమంగా వీర ప్రేమగాథ రక్తి కట్టిస్తుంది. 
బోటమ్‌ లైన్‌: వినోదభరిత ప్రేమగాథ!

Thursday, February 11, 2016

‘బాహుబలి’ ఈ యేడాదే?!

 ‘బాహుబలి’ ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన అద్భుతం ఇంకా కళ్లముందు కదులుతూనే ఉంది. ఇప్పుడు అందరి దృష్టీ ‘బాహుబలి 2’పైనే. ‘బాహుబలి - ది కన్‌క్లూజన్‌’ ఎప్పుడొస్తుందో అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ విషయంపై రాజమౌళి కూడా ఓ క్లారిటీ ఇచ్చేశారు. ‘‘అనుకొన్నది అనుకొన్నట్టు జరిగితే ఈ యేడాది చివర్లో బాహుబలి 2ని విడుదల చేసేస్తాం..’’ అంటూ ఓ శుభవార్త చెవిన వేశారు. ‘‘ప్రస్తుతం 40 శాతం చిత్రీకరణ పూర్తయింది. ఈ యేడాదే విడుదల చేయాలనుకొంటున్నాం. అంతగా కుదరకపోతే... వచ్చే యేడాది ప్రధమార్థంలో తీసుకొస్తాం’’ అంటున్నారు జక్కన్న. ‘బాహుబలి’ ప్రభంజనాన్ని ఇంకా కొనసాగించాలన్నది రాజమౌళి ఆలోచన. అంటే... బాహుబలి 2నే కాదు, 3,4లను కూడా చూడొచ్చు.

Tuesday, February 9, 2016

కిడ్నీ వ్యాధిగ్రస్తుడి కోసం ఆటో నడిపిన అఖిల్

 కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఏడేళ్ల చిన్నారి అశ్విత్‌రెడ్డిని సినీ హీరో అక్కినేని అఖిల్ పరామర్శించారు. మంచు లక్ష్మి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఓ ప్రైవేట్ టీవీ చానల్ ద్వారా అశ్విత్‌రెడ్డి దుస్థితిని తెలుసుకున్న అఖిల్ మంగళవారం ఖమ్మం వచ్చారు. ఈ సందర్భంగా అశ్విత్‌రెడ్డి వైద్యానికి అవసరమయ్యే డబ్బు కోసం ఆటో నడిపి కొంత మొత్తం సేకరించారు. నగరంలోని నర్సింహస్వామి దేవాలయం రోడ్డులో ఉంటున్న కట్టూరి కృష్ణారెడ్డి, కవితలకు కుమారుడు అశ్విత్‌రెడ్డి, కుమార్తె అనుషిత ఉన్నారు.     రెండు నెలల క్రితం అశ్విత్ డెంగీ జ్వరం బారినపడటంతో వైద్య పరీక్షలు చేయించారు. ఆ సమయంలో అతనికి రెండు మూత్రపిండాలు పాడైనట్లు వైద్యులు తెలిపారు. వైద్యం కోసం ఆస్తి, బంగారం అమ్మి రూ.6 లక్షల వరకు ఖర్చు చేశారు. కిడ్నీ మార్పిడికి రూ.10 లక్షల వరకు ఖర్చు వస్తుందని డాక్టర్లు చెప్పారు.  అంతమొత్తం వెచ్చించే స్థోమత అశ్విత్‌రెడ్డి తల్లిదండ్రులకు లేదు. ఈ నేపథ్యంలో టీవీ చానల్ ద్వారా విషయాన్ని తెలుసుకున్న అఖిల్ ఖమ్మం వచ్చి ఆటో నడిపి డబ్బులు సేకరించి ఇచ్చాడు.

Monday, February 8, 2016

కథ కుదిరింది


‘నేను.. శైలజ’ అంటూ ఓ ప్రేమకథ వినిపించి తొలి అడుగులోనే ఆకట్టుకొన్న దర్శకుడు కిషోర్‌ తిరుమల ఇప్పుడాయనకు వరుసగా అవకాశాలు దక్కుతున్నాయి. నితిన్‌తో ఓ సినిమా ఓకే చేసుకొన్న కిషోర్‌..ఇప్పుడు వెంకటేష్‌కీ కథ వినిపించేశారు. ప్రస్తుతం మారుతి దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు వెంకటేష్‌. ఆ తరవాత కిషోర్‌ సినిమా పట్టాలెక్కుతుంది. మల్టీ డైమెన్షన్‌ రామ్‌మోహన్‌ నిర్మాత. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఇటీవలే వెంకటేష్‌గారికి కథ వినిపించా. ఆయనకు బాగా నచ్చింది. ఆయన సినిమాలంటే వినోదంతో పాటు కుటుంబ ప్రేక్షకులకు నచ్చే అంశాలూ ఉండాలనుకొంటారు. అలాంటి కథే ఇది. ప్రస్తుతం నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. త్వరలోనే పూర్తి వివరాలు ప్రకటిస్తామ’’న్నారు.

Sunday, February 7, 2016

నో డౌట్.. వాళ్లు విడిపోయారు!

 చూడబోతే 2016 'బ్రేక్ అప్ ఇయర్'గా రికార్డులకెక్కేలా ఉంది. ఈ ఏడాది ఆరంభం నుంచి బాలీవుడ్ ప్రముఖ జంటలంతా 'బ్రేక్ అప్' బాట పట్టారు. తాజాగా క్రేజీ జంట విరాట్ కోహ్లి-అనుష్క శర్మలు కూడా అదే దారిలో నడిచినట్లు రుజువులతో సహా నిరూపిస్తున్నారు సినీ డిటెక్టివ్ లు. ఎప్పుడూ తమ విహారయాత్రలతో వార్తల్లో నిలిచే ఈ ప్రేమ పక్షులు గత కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. నెలరోజుల క్రితమే వీరు విడిపోయారని చెప్పడానికి పలు అంశాలు కూడా అనుకూలిస్తున్నాయి.
ఇన్ స్టాగ్రామ్ లో 'హార్ట్ బ్రేక్'..
కొన్ని రోజుల క్రితం విరాట్ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ పేజీలో సెల్ఫీ పోస్ట్ చేసి 'హార్ట్ బ్రేక్' అంటూ దానికో క్యాప్షన్ జోడించాడు. ఆ 'హార్ట్ బ్రేక్' క్యాప్షన్ బ్రేకింగ్ న్యూస్ అవుతుందని భావించాడో ఏమో వెంటనే దాన్ని తొలగించాడు.  కానీ ఆ కాస్త వ్యవధిలోనే ఫ్యాన్స్ అసలు విషయాన్ని పసిగట్టేశారు. విరాట్ అంతటితో ఊరుకున్నాడా.. 'హార్ట్ బ్రేక్' క్యాప్షన్ తొలగించిన వెంటనే అనుష్కను 'అన్ ఫాలో' చేసేశాడు. దాంతో అభిమానులు ఓ నిర్ధారణకు వచ్చేశారు.

గడ్డం కూడా తీసేశాడు..
సాధారణంగా పంజాబీల వివాహ సమయంలో జరిగే కొన్ని వేడుకల్లో వరుడు గడ్డంతో ఉండటం వారి సంప్రదాయం. వివాహం కోసమే విరాట్ గడ్డం పెంచుతున్నాడని ఓ భారీ రూమర్. ఇప్పుడు దాన్ని నిజం చేస్తూ విరాట్ గడ్డం తీసేసి కనబడుతున్నాడు. అనుష్క పెళ్లికి  నిరాకరించడంతోనే  విరాట్ ఈ నిర్ణయం తీసుకున్నాడట.

ఇక వారి సన్నిహితుల కథనం ప్రకారం.. విరాట్-అనుష్కలు నెల క్రితం విడిపోయిన మాట నిజమేనని, అయితే వారిద్దరూ ఇష్టపూర్వకంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.  ప్రస్తుతం వారిద్దరూ కెరీర్ మీద సీరియస్ గా దృష్టి పెట్టాలనుకుంటున్నారని, అయినా ఆ నిర్ణయం విరాట్ ది కాదని చెబుతున్నారు. కాగా విరాట్ టీ ట్వంటీ ప్రిపరేషన్ లో బిజీగా ఉండగా.. అనుష్క సుల్తాన్ షూటింగ్ లో బిజీ.  మొత్తానికి గడసరి క్రికెటర్, సొగసరి హీరోయిన్ల ప్రేమకథ ఇలా ఊహించని మలుపు తిరిగింది.

Saturday, February 6, 2016

యువీకి షాక్‌.. వాట్సన్‌కి లక్‌

  ఐపీఎల్‌ గత రెండు సీజన్లలో అత్యధిక ధరకు అమ్ముడుపోయి వేలంలో రారాజుగా వెలుగొందిన భారత్‌ స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ యువరాజ్‌ సింగ్‌కు తాజాగా ఐపీఎల్‌-9 సీజన్‌ వేలంలో దిమ్మతిరిగే షాక్‌ తగిలింది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఫ్రాంచైజీ 2014 సీజన్‌లో యువరాజ్‌ని రూ.14 కోట్లకు కొనుగోలు చేయగా.. తర్వాత ఏడాది దిల్లీ డేర్‌డెవిల్స్‌ ఏకంగా రూ.16 కోట్లు వెచ్చించి మరీ దక్కించుకుంది. అయితే ఈ రెండు సీజన్లలో యువరాజ్‌ సింగ్‌ పేలవ ఆటతీరుతో ఫ్రాంచైజీలను తీవ్రంగా నిరాశపరిచాడు. శనివారం బెంగళూరులో జరిగిన వేలంలో రూ.2కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన యువరాజ్‌ను దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. అయితే రూ.7కోట్లకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ దక్కించుకుని అందర్నీ ఆశ్చర్య పరిచింది. అంటే గత రెండేళ్లతో పోలిస్తే యువరాజ్‌ ధర దాదాపు సగానికి సగం పడిపోయిందన్నమాట. దాదాపు 351 మంది క్రికెటర్లు శనివారం వేలంలో నిలిచారు.

Wednesday, February 3, 2016

చిరంజీవికి నేడు ఆపరేషన్

 మెగాస్టార్ చిరంజీవి గురువారం ఆపరేషన్ చేయించుకోనున్నారు. ముంబైలోని బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో భుజానికి ఆయన శస్త్రచికిత్స చేయించుకోనున్నారని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. చాలా కాలంగా ఆయన భుజం నొప్పితో బాధ పడుతున్నారని, కత్తి సినిమా షూటింగ్ కు ముందే ఆపరేషన్ చేయించుకోవాలని భావించి ముంబై ఆస్పత్రిలో చేరారని తెలిపాయి. చాలా రోజుల క్రితమే ఆపరేషన్ చేయించుకోవాలని అనుకున్నా కుదరలేదని వెల్లడించాయి.
చిరంజీవి సతీమణి సురేఖ ఆయన వెంట ఉన్నారు. ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఆయన దాదాపు రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. ఆయనను ఎప్పుడు డిశ్చార్జి చేస్తారనేది వెల్లడి కాలేదు. పూర్తిగా కోలుకున్నాకే ఆయన హైదరాబాద్ కు తిరిగొచ్చే  అవకాశముందని సమాచారం. కత్తి సినిమా రీమేక్ నటించేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. ఈ సినిమా షూటింగ్ మార్చిలో ప్రారంభంకానుంది. వివి వినాయక్ దర్శకత్వం వహిస్తారు.