Sunday, January 31, 2016

'కళావతి' మూవీ రివ్యూ


2014లో రిలీజ్ అయి ఘనవిజయం సాధించిన చంద్రకళ (అరణ్మనై) సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన మరో హార్రర్ కామెడీ చిత్రం అరణ్మనై 2. ఈ చిత్రాన్ని 'కళావతి' పేరుతో తెలుగులో అనువాదం చేసి  రిలీజ్ చేశారు. సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ ఫుల్ జానర్ గా పేరున్న హార్రర్ కామెడీ లో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా సిద్దార్థ్, త్రిష లాంటి స్టార్ లు కూడా యాడ్ అవ్వడం సినిమా మీద అంచనాలను పెంచేసింది. మరి 'చంద్రకళ'కు సీక్వెల్ గా తెరకెక్కిన 'కళావతి' తెలుగు ఆడియన్స్ ను ఏ మేరకు భయపెట్టింది..?
కథ
ఓ జమీందార్ బంగ్లా చుట్టూ తిరుగుతోంది కళావతి కథ. ఆ బంగ్లాలో ఉన్న దెయ్యం అక్కడికి వచ్చే వారిని వెంటాడుతూ భయపెడుతూ ఉంటుంది. ఆ దెయ్యం మూలంగానే జమీందార్ కోమాలోకి వెళతాడు. అతని పెద్ద కొడుకుపై కూడా దెయ్యం దాడి చేస్తోంది. ఆ సమయంలో అక్కడ ఉన్న అతీంద్రియ శక్తుల పని పట్టాలనుకుంటాడు జమీందార్ చిన్న కొడుకు (సిద్దార్థ్), అందుకు అతనికి కాబోయే భార్య (త్రిష) సాయం చేస్తుంది. ఈ పోరాటంలో బంగ్లాలో ఉన్న దెయ్యం చనిపోయిన తన చెల్లెలు కళ(హాన్సిక) అని తెలుసుకుంటాడు సిద్దార్థ్. అసలు కళ దెయ్యంగా ఎలా మారింది..? చివరకు సిద్దార్థ్ కళకు ఎలా విముక్తి కలిగించాడు అన్నదే మిగతా కథ.



నటీనటులు
తొలిసారిగా హర్రర్ జానర్ లో నటించిన సిద్దార్థ్ ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా చాలా రోజులుగా సరైన హిట్ లేని సిద్దూకి ఈ సినిమా మంచి పేరు తీసుకువచ్చింది. త్రిష నటనతో పాటు గ్లామర్ షోతోనూ ఆకట్టుకుంది. ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్ బీచ్ సాంగ్ తో కమర్షియల్ కంటెంట్ ను యాడ్ చేసింది. చంద్రకళ సినిమాలో కనిపించిన తరహా పాత్రలో హన్సిక మరోసారి మెప్పించింది. ముఖ్యంగా చెల్లెలుగా, తరువాత దెయ్యంగా కూడా అద్భుతంగా నటించింది. కోవై సరళ, సూరిల కామెడీ టైమింగ్ బాగుంది.

సాంకేతిక నిపుణులు
చంద్రకళ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు సుందర్.సి మరోసారి అదే ఫామ్ చూపించాడు. ముఖ్యంగా తొలి భాగం విజయం సాధించటంతో తన మీద ఏర్పడ్డ అంచనాలను అందుకునే స్థాయి సినిమాను తెరకెక్కించటంలో విజయం సాధించాడు. హిప్ హాప్ తమీజా సంగీతంతో సినిమా స్థాయిని పెంచాడు. పాటలు పెద్దగా ఆకట్టుకోకపోయినా నేపథ్య సంగీతం బాగా కుదిరింది. ఆర్ట్ వర్క్, సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ బాగున్నాయి.

ఓవరాల్ గా కళావతి, సౌత్ సిల్వర్ స్క్రీన్ పై హర్రర్ కామెడీలకు తిరుగులేదని ప్రూవ్ చేసిన సక్సెస్ ఫుల్ సినిమా

కంగారూలను క్లీన్‌స్వీప్‌ చేసేశారు


ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరిగిన ఉత్కంఠ చివరి టీ20 మ్యాచ్‌లో భారత్‌ 7 వికెట్ల తేడాతో విజయం సాధించి మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-0తో కంగారూలను క్లీన్‌స్వీప్‌ చేసేసింది. 198 పరుగుల ఛేదనకు దిగిన టీమిండియా విజయానికి చివరి ఓవర్‌లో 17 పరుగులు అవసరం అయ్యాయి. హిట్టర్‌ యువరాజ్‌ సింగ్‌ (15 నాటౌట్‌: 12 బంతుల్లో 1×4, 1×6) వరుసగా తొలి రెండు బంతుల్ని ఫోర్‌, సిక్స్‌గా బాది మ్యాచ్‌ను మలుపుతిప్పగా.. సురేశ్‌ రైనా (49 నాటౌట్‌: 25 బంతుల్లో 6×4, 1×6) చివరి బంతిని బౌండరీకి తరలించి భారత్‌ను విజయ సంబరాల్లో ముంచెత్తాడు. టాప్‌ఆర్డర్‌లో రోహిత్‌ శర్మ (52), శిఖర్‌ ధావన్‌ (26), విరాట్‌ కోహ్లి (50) సమయోచిత బ్యాటింగ్‌తో ఆకట్టుకోవడంతో భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 200/3తో లక్ష్యాన్ని ఛేదించగలిగింది.
 వాట్సన్‌ అజేయ శతకం వృథా
టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ ఎంచుకుంది. గాయపడిన అరోన్‌ ఫించ్‌ స్థానంలో ఆసీస్‌ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించిన వాట్సన్‌ (124 నాటౌట్‌: 71 బంతుల్లో 10×4, 6×6) భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగి శతకంతో చెలరేగాడు. మరో ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖాజా (14), షాన్‌ మార్ష్‌ (9), మాక్స్‌వెల్‌ (3) తక్కువ పరుగులకే వరుసగా పెవిలియన్‌ చేరుతున్నా.. వాట్సన్‌ ఎక్కడా జోరు తగ్గించకపోగా.. మరింత దూకుడుగా ఆడాడు. షాన్‌ మార్ష్‌తో కలిసి రెండో వికెట్‌కి 53 పరుగులు జతచేసిన షేన్‌ వాట్సన్‌.. నాలుగో వికెట్‌కి ట్రావీస్‌ హెడ్‌(26)తో కలిసి 7.5 ఓవర్లలోనే ఏకంగా 93 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. దీంతో ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 197 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది. భారత్‌ బౌలర్లలో ఆశిష్‌ నెహ్రా, అశ్విన్‌, జడేజా, యువరాజ్‌, బుమ్రా తలో వికెట్‌ తీశారు.

Saturday, January 30, 2016

హిట్ వచ్చింది... పారితోషికం పెంచేసింది

 విజయం చాలా పనులు చేస్తుంది. సంతోషాన్ని కలిగిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అవకాశాలను పెంచుతుంది. ముఖ్యంగా పారితోషికాన్ని రెట్టింపు చేస్తుంది. ఎవరు కాదన్నా అవునన్నా ఇది నిజం. ఇక నటి కీర్తి సురేష్ ఇందుకు అతీతం కాదు. ఇదు ఎన్న మైకం చిత్రంతో కోలీవుడ్‌లోకి రంగ ప్రవేశం చేసిన ఈ బ్యూటీ సీనియర్ నటి మేనక సురేష్ వారసురాలన్న విషయం తెలిసిందే. మాలీవుడ్‌లో కొన్ని చిత్రాలు చేసిన కీర్తిసురేష్‌పై పొరుగు రాష్ట్రాల చిత్ర దర్శక నిర్మాతల దృష్టి పడింది. ఫలితంగా ఈ వర్ధమాన తారకు తమిళం, తెలుగు భాషలలో విజయం వరించింది.

  తెలుగులో రామ్‌తో నటించిన నేను శైలజ చిత్రం కీర్తిసురేష్ విజయానికి పునాది వేసింది. తమిళంలో శివకార్తికేయన్‌తో నటించిన రజనీమురుగన్ చిత్రం దాన్ని కొనసాగించింది. దీంతో కీర్తి తన పారితోషికాన్ని ఒక్కసారిగా పెంచేశారనే ప్రచారం కోలీవుడ్‌లో జోరందుకుంది. అయితే ఈ ప్రచారాన్ని కీర్తి కొట్టి పారేస్తున్నారు. తనేమంటున్నారో చూద్దాం. నేను నటించిన తెలుగు చిత్రం నేను శైలజ తమిళంలో శివకార్తికేయన్‌తో నటించిన రజనీమురుగన్ చిత్రం విజయం సాధించడం సంతోషంగా ఉంది. దీంతో పాటు నా బాధ్యత పెరిగింది.

 సాధారణంగా చిత్ర జయాపజయాలు మన చేతుల్లో ఉండవు. అయితే మా అమ్మ మేనక నటి అవడంతో నాకు మార్గదర్శిగా ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఇక తమిళంలో బాబీసింహాతో నటిస్తున్న పాంబు సండై, ధనుష్ సరసన నటిస్తున్న చిత్రం షూటింగ్ పూర్తి అయ్యాయి. ప్రస్తుతం శివకార్తికేయన్ సరసనే మరో చిత్రం చేస్తున్నారు. అదే విధంగా నేను పారితోషికం పెంచేశాననే ప్రచారంలో నిజం లేదని కీర్తిసురేష్ స్పష్టం చేశారు.

ఫేస్ బుక్ లో కొత్త షేర్ ఆప్షన్..!

 సామాజిక మీడియా దిగ్గజం ఫేస్ బుక్.. యూజర్లకు మరో కొత్త అవకాశం కల్పిస్తోంది. వినియోగదారుల కోసం తమ ఈవెంట్స్ పేజీలో సరికొత్త ఫీచర్ ను ప్రవేశ పెడుతోంది. అందులో చేరినవారు.. తమ రైడ్స్ (సవారీ) ను పంచుకునే వీలు కల్పిస్తోంది. రైడ్ షేరింగ్ కాన్సెప్ట్ తో ఇప్పటికే ఎన్నో ప్లాట్ ఫామ్స్ ఉన్నా, ఫేస్ బుక్ కూడా తమ ఈవెంట్ పేజీలో ఈ ఆప్షన్ కు శ్రీకారం చుడుతోంది. ఈ అవకాశంతో ఒకే దారిలో వెళ్లేవారు ఫేస్ బుక్ ద్వారా క్యాబ్ రైడ్ షేర్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది.
ఫేస్ బుక్ పేటెంట్ అప్లికేషన్.. తమ్ ఈవెంట్ పేజీ స్టోర్ లో మరిన్ని ఆసక్తికరమైన ప్రణాళికలు చేపట్టనున్నట్లు సూచిస్తోంది. ఈవెంట్ పేజీలోని రైడ్ షేరింగ్ సెంటర్ ను రెట్టింపు చేయనున్నట్లు చెబుతోంది. ఈ అవకాశాన్ని వినియోగించుకొనేందుకు వీలుగా ఫేస్ బుక్ ఈవెంట్ పేజీలో ప్రధానంగా  'గోయింగ్' అనే ఫీచర్ ను ఏర్పాటు చేసింది. దీనికి రెండు ఉప జాబితాలనూ జోడించింది. 'గోయింగ్ అండ్ డ్రైవింగ్' 'గోయింగ్ బట్ నాట్ డ్రైవింగ్'  పేరుతో ఉన్న ఈ ఆప్షన్లను వినియోగించుకొని యూజర్లు రైడ్ షేర్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఇప్పటికే కొన్ని దేశాల్లో అమల్లో ఉన్న మొత్తం మూడు ఆప్షన్లలో గోయింగ్, నాట్ గోయింగ్ ఆప్షన్లపై జనం ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రయాణికులు తమ ఆసక్తికి అనుగుణంగా  రైడ్స్ ను షేర్ చేసుకునేందుకు ఫేస్ బుక్ వీలుకల్పిస్తోంది. క్రిస్మస్ సందర్భంగా పరిచయం చేసిన ఈ కొత్త అవకాశాన్ని అమెరికాలో ఫేస్ బుక్ వినియోగదారులు ఇప్పటికే మెసెంజర్ ద్వారా వినియోగిస్తున్నారు. మెసెంజర్ లో ముందుగా తమ స్నేహితులతో చాట్ చేసి,  క్యాబ్ ను బుక్ చేసుకోవడం ద్వారా ఈ కొత్త ప్రయత్నాన్ని వాడకంలోకి తెచ్చారు.

Thursday, January 28, 2016

ఫిబ్రవరిలో పెళ్లి పీటలెక్కనున్న మరో క్రికెటర్‌

  భారత క్రికెటర్లు హర్భజన్‌ సింగ్‌, రోహిత్‌ శర్మలు ఇటీవలే ఓ ఇంటివారైన సంగతి తెలిసిందే. ఇప్పుడు వీళ్ల లిస్ట్‌లో క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ కూడా చేరనున్నాడు. భారత క్రికెటర్లలో ఎలిజిబుల్‌ బ్యాచిలర్స్‌లో ఒకరైన ఇర్ఫాన్‌ ఫిబ్రవరిలో పెళ్లి చేసుకోనున్నట్లు సమాచారం.
ఇప్పటివరకు ఇర్ఫాన్‌ తన వ్యక్తిగత విషయాల గురించి మీడియాతో ప్రస్తావించలేదు. అయితే ఈ మధ్య పెళ్లి గురించి వార్తలు వెలువడుతుండడంతో ఆఖరికి ఇర్ఫాన్‌ నోరు విప్పాడు. ఫిబ్రవరిలో పెళ్లి చేసుకుంటున్న విషయం నిజమేనని మిగతా వివరాలు త్వరలో వెల్లడిస్తానని తెలిపాడు. పెళ్లి వేడుకలు చాలా ఘనంగా జరుగనున్నాయని, వధువుతో పాటు ఇర్ఫాన్‌ చెల్లెలికి కూడా సూరత్‌ నుంచి ఆభరణాలు డిజైన్‌ చేయిస్తున్నట్లు ఇర్ఫాన్‌ సన్నిహితులు తెలిపారు.

Wednesday, January 27, 2016

రాత్రంతా మేల్కొని...

 ‘‘నిద్రకూ నాకూ అస్సలు పడదు.. ఒక్కరోజు కూడా నేను మనస్ఫూర్తిగా పడుకోను..’’ అంటోంది శ్రుతి హాసన్‌. మరి రాత్రిళ్లు పడుకోకుండా ఏం చేస్తుంటారు? అని అడిగితే.. ‘‘పార్టీలకు వెళ్లి.. తెల్లవారుఝామువరకూ అక్కడే గడపడం నాకు ఇష్టం ఉండదు. సెట్‌ నుంచి నేరుగా ఇంటికే వెళ్లిపోతా. రేపు షూటింగ్‌ అంటే నాకు నిద్ర పట్టదు. సన్నివేశం ఏమిటి? ఆ సన్నివేశంలో ఎవరితో నటించాలి? అనే విషయాలే ఆలోచిస్తా. ఒకటికి పది సార్లు డైలాగ్‌ పేపర్‌ చదువుతూ కూర్చుంటా. షూటింగ్‌ లేకపోయినా అంతే. సంగీత సాధనలో రాత్రంతా గడిపేస్తుంటా. కొత్త కొత్త ట్యూన్లు అప్పుడే పుడతాయి. నాకే కాదు.. ఏ సంగీత దర్శకుడైనా అంతేనేమో. రాత్రిళ్లు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒంటరిగా పని చేసుకోవాలని అనుకొనేవాళ్లకు అదే సరైన సమయం. మూడు నాలుగు గంటలు ప్రశాంతంగా పడుకొంటా. అంతే.. మళ్లీ షూటింగ్‌కి సిద్ధమైపోతా’’ అని చెప్పుకొచ్చింది.

ఆన్‌లైన్‌లో ఘరానా మోసం!

 కొత్తకోట రూరల్: ఇటీవల ఆన్‌లైన్‌లో బుక్ చేసిన వాటర్‌ ఫిల్టర్‌కు బదులు ఓ వినియోగదారుడికి ఇటుక రాయి వచ్చింది. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోటలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. పాలెం గ్రామానికి చెందిన బాల్‌రెడ్డి స్నాప్‌డీల్‌లో ఇటీవల రూ.8 వేలు వెచ్చించి వాటర్‌ ఫిల్టర్‌ను బుక్ చేసుకున్నాడు.
             మంగళవారం కొరియర్ బాయ్ వచ్చి కస్టమర్ బుక్ చేసుకున్న వస్తువుకు సంబంధించి ఓ బాక్స్ అందజేశాడు. దీంతో బాల్‌రెడ్డి బాక్స్‌ను తీసుకుని ఇంటివద్దకు వెళ్లి తెరిచి చూడగా వాటర్‌ఫిల్టర్‌కు బదులు ఇటుక రాయి కనిపించింది. దీంతో అతడు ఒక్కసారిగా అవాక్కయ్యాడు. ఈ మోసం ఆన్‌లైన్ వారి మూలంగా జరిగిందా.. లేదా కొరియర్ సంస్థ ద్వారా జరిగిందా అన్న తెలియాల్సి ఉంది.

Tuesday, January 26, 2016

నా వ్యక్తిగత జీవితం మీకెందుకు?

 ‘దేశముదురు’లో సిమ్లా ఆపిల్‌లా ఆకర్షించింది హన్సిక. ఒక్క సినిమాతోనే స్టార్‌డమ్‌ సంపాదించేసింది. దాదాపు అగ్ర కథానాయకులందరితోనూ నటించింది. గతకొంతకాలంగా తెలుగు సినిమాలేం చేయకపోయినా తమిళనాట మాత్రం బిజీనే. ఆమె నటించిన చిత్రాలు కొన్ని అనువాదరూపంలో తెలుగు ప్రేక్షకుల్ని పలకరిస్తుంటాయి. ఇప్పుడు ‘కళావతి’గా భయపెట్టబోతోంది హన్సిక. ‘చంద్రకళ’ చిత్రానికి ఇది కొనసాగింపు. సిద్ధార్థ్‌, త్రిష, పూనమ్‌ బజ్వా ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

‘చంద్రకళ’కి కొనసాగింపుగా వస్తున్న చిత్రం ‘కళావతి’. ఇందులో నేను గర్భిణీగా కనిపిస్తా. ఈ పాత్రని ఓ సవాల్‌గా తీసుకొన్నా. గర్భిణీలు ఎలా నడుస్తారు? ఎలా కూర్చుంటారు? అనే విషయాలని నిశితంగా గమనించిన తరవాతే సెట్లో అడుగుపెట్టా. త్రిష, పూనమ్‌, నేనూ కలసి నటించాం. త్రిషకీ నాకూ మధ్య ఏవో గొడవలు జరిగాయని వార్తలొచ్చాయి. వాటిలో నిజం లేదు. తనతో నాకు ఎప్పటి నుంచో పరిచయం. ఈ సినిమాతో స్నేహితులమైపోయాం.
* నిజానికి దెయ్యం సినిమాలంటే నాకు చాలా భయం. ఇప్పటి వరకూ ఒక్క సినిమా కూడా చూడలేదు. ‘చంద్రకళ’, ‘కళావతి’ సినిమాల్నీ మా అమ్మని పక్కన కూర్చోబెట్టుకొని చూశా. నటించేటప్పుడు మాత్రం ఎలాంటి భయం ఉండదు. కానీ చూడాలంటే మాత్రం ఒణుకొచ్చేస్తుంటుంది.
 
 * నటిగా నాకు తెలుగు, తమిళం రెండు భాషలూ ముఖ్యమే. ఎక్కడ మంచి కథలొస్తే అక్కడ నటిస్తా. తెలుగు సినిమాలకు నేనేం దూరం కాలేదు. మంచి కథ అనిపిస్తే నటించడానికి ఎప్పుడూ సిద్ధమే. ఇప్పుడిప్పుడే తెలుగు భాషకూడా అర్థం అవుతోంది. కానీ... స్పష్టంగా మాట్లాడలేకపోతున్నా. 
* ఖాళీ సమయంలో బొమ్మలు గీస్తుంటా. ఒత్తిడిలో ఉన్నాననిపిస్తే వెంటనే బ్రష్‌ పట్టుకొని... కూర్చుండిపోతా. ఏడెనిమిది గంటలు అలసట లేకుండా అలా బొమ్మలు వేస్తూనే ఉంటా. ఈమధ్యే రెండు బొమ్మలు వేశా. త్వరలోనే నా పెయింటింగ్స్‌తో ఓ ప్రదర్శన నిర్వహించాలని ఉంది. * నాకు తిండిపై ధ్యాస తక్కువే. చాలామంది తినడం కోసం బతుకుతారు. (నవ్వుతూ) నేను మాత్రం బతకడం కోసం తింటుంటా. ఇది వరకు బాగా బొద్దుగా ఉండేదాన్ని. సన్నబడాలని నాకే అనిపించింది. అందుకే ఇలా స్లిమ్‌ అయ్యా.
నా వ్యక్తిగత విషయాలు మీడియాలో వస్తుంటాయి. వాటిపై నేను స్పందించను. నా పని చూసి మాట్లాడండి. నా జీవితం గురించి మీకెందుకు? 30 మంది అనాధ పిల్లల్ని చేరదీసి వారి ఆలనా పాలనా చూసుకొంటున్నా. అదీ నా వ్యక్తిగతమే. నా మానసిక సంతృప్తి కోసం నేను ఎంచుకొన్న మార్గం అది. ప్రస్తుతం నా చేతిలో నాలుగు తమిళ చిత్రాలున్నాయి. తెలుగులో కొత్త సినిమాలేం ఒప్పుకోలేదు.