Thursday, January 28, 2016

ఫిబ్రవరిలో పెళ్లి పీటలెక్కనున్న మరో క్రికెటర్‌

  భారత క్రికెటర్లు హర్భజన్‌ సింగ్‌, రోహిత్‌ శర్మలు ఇటీవలే ఓ ఇంటివారైన సంగతి తెలిసిందే. ఇప్పుడు వీళ్ల లిస్ట్‌లో క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ కూడా చేరనున్నాడు. భారత క్రికెటర్లలో ఎలిజిబుల్‌ బ్యాచిలర్స్‌లో ఒకరైన ఇర్ఫాన్‌ ఫిబ్రవరిలో పెళ్లి చేసుకోనున్నట్లు సమాచారం.
ఇప్పటివరకు ఇర్ఫాన్‌ తన వ్యక్తిగత విషయాల గురించి మీడియాతో ప్రస్తావించలేదు. అయితే ఈ మధ్య పెళ్లి గురించి వార్తలు వెలువడుతుండడంతో ఆఖరికి ఇర్ఫాన్‌ నోరు విప్పాడు. ఫిబ్రవరిలో పెళ్లి చేసుకుంటున్న విషయం నిజమేనని మిగతా వివరాలు త్వరలో వెల్లడిస్తానని తెలిపాడు. పెళ్లి వేడుకలు చాలా ఘనంగా జరుగనున్నాయని, వధువుతో పాటు ఇర్ఫాన్‌ చెల్లెలికి కూడా సూరత్‌ నుంచి ఆభరణాలు డిజైన్‌ చేయిస్తున్నట్లు ఇర్ఫాన్‌ సన్నిహితులు తెలిపారు.

Wednesday, January 27, 2016

రాత్రంతా మేల్కొని...

 ‘‘నిద్రకూ నాకూ అస్సలు పడదు.. ఒక్కరోజు కూడా నేను మనస్ఫూర్తిగా పడుకోను..’’ అంటోంది శ్రుతి హాసన్‌. మరి రాత్రిళ్లు పడుకోకుండా ఏం చేస్తుంటారు? అని అడిగితే.. ‘‘పార్టీలకు వెళ్లి.. తెల్లవారుఝామువరకూ అక్కడే గడపడం నాకు ఇష్టం ఉండదు. సెట్‌ నుంచి నేరుగా ఇంటికే వెళ్లిపోతా. రేపు షూటింగ్‌ అంటే నాకు నిద్ర పట్టదు. సన్నివేశం ఏమిటి? ఆ సన్నివేశంలో ఎవరితో నటించాలి? అనే విషయాలే ఆలోచిస్తా. ఒకటికి పది సార్లు డైలాగ్‌ పేపర్‌ చదువుతూ కూర్చుంటా. షూటింగ్‌ లేకపోయినా అంతే. సంగీత సాధనలో రాత్రంతా గడిపేస్తుంటా. కొత్త కొత్త ట్యూన్లు అప్పుడే పుడతాయి. నాకే కాదు.. ఏ సంగీత దర్శకుడైనా అంతేనేమో. రాత్రిళ్లు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒంటరిగా పని చేసుకోవాలని అనుకొనేవాళ్లకు అదే సరైన సమయం. మూడు నాలుగు గంటలు ప్రశాంతంగా పడుకొంటా. అంతే.. మళ్లీ షూటింగ్‌కి సిద్ధమైపోతా’’ అని చెప్పుకొచ్చింది.

ఆన్‌లైన్‌లో ఘరానా మోసం!

 కొత్తకోట రూరల్: ఇటీవల ఆన్‌లైన్‌లో బుక్ చేసిన వాటర్‌ ఫిల్టర్‌కు బదులు ఓ వినియోగదారుడికి ఇటుక రాయి వచ్చింది. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోటలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. పాలెం గ్రామానికి చెందిన బాల్‌రెడ్డి స్నాప్‌డీల్‌లో ఇటీవల రూ.8 వేలు వెచ్చించి వాటర్‌ ఫిల్టర్‌ను బుక్ చేసుకున్నాడు.
             మంగళవారం కొరియర్ బాయ్ వచ్చి కస్టమర్ బుక్ చేసుకున్న వస్తువుకు సంబంధించి ఓ బాక్స్ అందజేశాడు. దీంతో బాల్‌రెడ్డి బాక్స్‌ను తీసుకుని ఇంటివద్దకు వెళ్లి తెరిచి చూడగా వాటర్‌ఫిల్టర్‌కు బదులు ఇటుక రాయి కనిపించింది. దీంతో అతడు ఒక్కసారిగా అవాక్కయ్యాడు. ఈ మోసం ఆన్‌లైన్ వారి మూలంగా జరిగిందా.. లేదా కొరియర్ సంస్థ ద్వారా జరిగిందా అన్న తెలియాల్సి ఉంది.

Tuesday, January 26, 2016

నా వ్యక్తిగత జీవితం మీకెందుకు?

 ‘దేశముదురు’లో సిమ్లా ఆపిల్‌లా ఆకర్షించింది హన్సిక. ఒక్క సినిమాతోనే స్టార్‌డమ్‌ సంపాదించేసింది. దాదాపు అగ్ర కథానాయకులందరితోనూ నటించింది. గతకొంతకాలంగా తెలుగు సినిమాలేం చేయకపోయినా తమిళనాట మాత్రం బిజీనే. ఆమె నటించిన చిత్రాలు కొన్ని అనువాదరూపంలో తెలుగు ప్రేక్షకుల్ని పలకరిస్తుంటాయి. ఇప్పుడు ‘కళావతి’గా భయపెట్టబోతోంది హన్సిక. ‘చంద్రకళ’ చిత్రానికి ఇది కొనసాగింపు. సిద్ధార్థ్‌, త్రిష, పూనమ్‌ బజ్వా ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

‘చంద్రకళ’కి కొనసాగింపుగా వస్తున్న చిత్రం ‘కళావతి’. ఇందులో నేను గర్భిణీగా కనిపిస్తా. ఈ పాత్రని ఓ సవాల్‌గా తీసుకొన్నా. గర్భిణీలు ఎలా నడుస్తారు? ఎలా కూర్చుంటారు? అనే విషయాలని నిశితంగా గమనించిన తరవాతే సెట్లో అడుగుపెట్టా. త్రిష, పూనమ్‌, నేనూ కలసి నటించాం. త్రిషకీ నాకూ మధ్య ఏవో గొడవలు జరిగాయని వార్తలొచ్చాయి. వాటిలో నిజం లేదు. తనతో నాకు ఎప్పటి నుంచో పరిచయం. ఈ సినిమాతో స్నేహితులమైపోయాం.
* నిజానికి దెయ్యం సినిమాలంటే నాకు చాలా భయం. ఇప్పటి వరకూ ఒక్క సినిమా కూడా చూడలేదు. ‘చంద్రకళ’, ‘కళావతి’ సినిమాల్నీ మా అమ్మని పక్కన కూర్చోబెట్టుకొని చూశా. నటించేటప్పుడు మాత్రం ఎలాంటి భయం ఉండదు. కానీ చూడాలంటే మాత్రం ఒణుకొచ్చేస్తుంటుంది.
 
 * నటిగా నాకు తెలుగు, తమిళం రెండు భాషలూ ముఖ్యమే. ఎక్కడ మంచి కథలొస్తే అక్కడ నటిస్తా. తెలుగు సినిమాలకు నేనేం దూరం కాలేదు. మంచి కథ అనిపిస్తే నటించడానికి ఎప్పుడూ సిద్ధమే. ఇప్పుడిప్పుడే తెలుగు భాషకూడా అర్థం అవుతోంది. కానీ... స్పష్టంగా మాట్లాడలేకపోతున్నా. 
* ఖాళీ సమయంలో బొమ్మలు గీస్తుంటా. ఒత్తిడిలో ఉన్నాననిపిస్తే వెంటనే బ్రష్‌ పట్టుకొని... కూర్చుండిపోతా. ఏడెనిమిది గంటలు అలసట లేకుండా అలా బొమ్మలు వేస్తూనే ఉంటా. ఈమధ్యే రెండు బొమ్మలు వేశా. త్వరలోనే నా పెయింటింగ్స్‌తో ఓ ప్రదర్శన నిర్వహించాలని ఉంది. * నాకు తిండిపై ధ్యాస తక్కువే. చాలామంది తినడం కోసం బతుకుతారు. (నవ్వుతూ) నేను మాత్రం బతకడం కోసం తింటుంటా. ఇది వరకు బాగా బొద్దుగా ఉండేదాన్ని. సన్నబడాలని నాకే అనిపించింది. అందుకే ఇలా స్లిమ్‌ అయ్యా.
నా వ్యక్తిగత విషయాలు మీడియాలో వస్తుంటాయి. వాటిపై నేను స్పందించను. నా పని చూసి మాట్లాడండి. నా జీవితం గురించి మీకెందుకు? 30 మంది అనాధ పిల్లల్ని చేరదీసి వారి ఆలనా పాలనా చూసుకొంటున్నా. అదీ నా వ్యక్తిగతమే. నా మానసిక సంతృప్తి కోసం నేను ఎంచుకొన్న మార్గం అది. ప్రస్తుతం నా చేతిలో నాలుగు తమిళ చిత్రాలున్నాయి. తెలుగులో కొత్త సినిమాలేం ఒప్పుకోలేదు.

తొలి టీ20లో ఆసీస్‌ను చిత్తు చేసిన ధోనీసేన


  ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్ ల ట్వంటీ 20 సిరీస్ లో టీమిండియా బోణి చేసింది. మంగళవారం ఇక్కడ జరిగిన తొలి ట్వంటీ20లో టీమిండియా 37 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్ విసిరిన 189 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ఆసీస్ 151 పరుగులకే చాపచుట్టేసి ఘోర ఓటమి పాలైంది. కెప్టెన్ ఆరోన్ ఫించ్(44) ఫర్వాలేదనిపించగా, స్టీవ్ స్మిత్(21), డేవిడ్ వార్నర్(17), షేన్ వాట్సన్(12), ట్రావిస్ హెడ్(2), వేడ్(5),ఫాల్కనర్ (10)లు నిరాశపరచడంతో ఆసీస్ చిత్తుగా ఓడింది. తొలుత బ్యాటింగ్ లో ఆకట్టుకున్నటీమిండియా.. ఆపై బౌలింగ్ లో కూడా రాణించి సమష్టి విజయాన్ని నమోదు చేసింది. టీమిండియా బౌలర్లలో బూమ్రా వికెట్లు సాధించగా, అశ్విన్, జడేజా, హార్దిక్ పాండ్యాలకు తలో రెండు వికెట్లు లభించాయి. చాలాకాలం తర్వాత జట్టులోకి వచ్చిన ఆశిష్ నెహ్రా నాలుగు ఓవర్లలో 30 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు.
 
  అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా విరాట్ కోహ్లి దూకుడుగా ఆడటంతో 189 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థికి నిర్దేశించింది. కోహ్లి(90 నాటౌట్; 55 బంతుల్లో9 ఫోర్లు, 2 సిక్స్లర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడగా, అతని జతగా సురేష్ రైనా(41;34 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకున్నాడు. ఓపెనర్ రోహిత్ శర్మ (31; 20 బంతుల్లో 4 ఫోర్లు, 1సిక్స్) దూకుడుగా ఆడే క్రమంలో అవుట్ కాగా, శిఖర్ ధావన్(5) అనవసర షాట్ కు యత్నించి అవుటయ్యాడు. ఈ జోడి తొలి వికెట్ కు 40 పరుగులు చేసింది. కాగా, వీరిద్దరూ ఒక పరుగు వ్యవధిలో అవుట్ కావటంతో టీమిండియా జట్టులో ఒక్కసారిగా ఆందోళన రేగింది.

అయితే విరాట్, రైనాల జోడి సమయోచితంగా ఆడి ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగింది.  ఈ క్రమంలోనే విరాట్ 33 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయగా, మరోవైపు రైనా కూడా చక్కటి సహకారం అందించాడు. ఈ జోడి మూడో వికెట్ కు 134 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి టీమిండియాను పటిష్ట స్థితికి చేర్చింది. అయితే చివరి ఓవర్ రెండు బంతికి రైనా అవుటయ్యాడు. ఆ తరుణంలో బ్యాటింగ్ కు వచ్చిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని(11 నాటౌట్; 3బంతుల్లో 1 సిక్స్, 1ఫోర్) బ్యాట్ ఝుళిపించడంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది.

Monday, January 25, 2016

అసిన్‌ వెడ్డింగ్‌ రిసెప్షన్‌ అదుర్స్‌



 తెలుగు, తమిళంతోపాటు బాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి అసిన్‌ మైక్రోమ్యాక్స్‌ సహవ్యవస్థాపకుడు రాహుల్‌ శర్మను ఇటీవల వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి వెడ్డింగ్‌ రిసెప్షన్‌ను ముంబయిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినీ నటులు అక్షయ్‌కుమార్‌, సుస్మితా సేన్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండెంజ్‌, ఖుష్భు, రానా, వెంకటేశ్‌, శిల్పా శెట్టి, రాజ్‌కుంద్ర, ప్రీతీ జింటా, మనీష్‌ పాల్‌, మాధవన్‌ తదితరులు హాజరై సందడి చేశారు. నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోలను అసిన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.












 

రజనీ, సైనా, సానియాకు 'పద్మ' అవార్డులు



 తెలుగు తేజాలు సానియా మీర్జా, సైనా నెహ్వాల్ , తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తదితర ప్రముఖులను పద్మ అవార్డులు వరించాయి. రజనీకాంత్ , ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు పద్మవిభూషణ్.. సైనా, సానియా, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, డాక్టర్ నాగేశ్వర్ రెడ్డిలకు పద్మభూషణ్ అవార్డులను అందజేయనున్నారు. సోమవారం కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. ఈ ఏడాది మొత్తం 118 మందికి పద్మఅవార్డులను ప్రకటించగా, 10 మందికి పద్మవిభూషణ్, 19 మందికి పద్మభూషణ్ అవార్డులను అందజేయనున్నారు. ప్రముఖ నృత్యకళాకారిణి యామిని కృష్ణమూర్తి, పండిట్ రవిశంకర్, రిలయన్స్ ఇండస్ట్రీ వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీలకు పద్మవిభూషణ్ అవార్డును ప్రధానం చేయనున్నారు.  ప్రముఖ దర్శకుడు రాజమౌళికి పద్మశ్రీ అవార్డును ప్రకటించారు. అవార్డులకు ఎంపికైన వారి వివరాలు..
పద్మవిభూషణ్: రజనీకాంత్, రామోజీ రావు, జగ్ మోహన్ (జమ్ము కశ్మీర్ మాజీ గవర్నర్), పండిట్ రవిశంకర్, యామిని కృష్ణమూర్తి, గిరిజా దేవి (సంగీతం), విశ్వనాథన్ శాంతా, ధీరూభాయ్ అంబానీ (మరణాంతరం), డాక్టర్ వాసుదేవ్ ఆత్రే (సైన్స్ అండ్ ఇంజనీరింగ్), అవినాశ్ దీక్షిత్
పద్మభూషణ్: సానియా మీర్జా, సైనా నెహ్వాల్, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, అనుపమ్ ఖేర్, ఉదిత్ నారాయణ్, వినోద్ రాయ్ (మాజీ కాగ్), బ్రిజేందర్ సింగ్, బర్జీందర్ సింగ్, స్వామి తేజోమయనంద, రామ్ సుతార్, ప్రొఫెసర్ రామనుజ తాతాచార్య, హీస్నమ్ కన్హేలాల్

పద్మశ్రీ: రాజమౌళి, ప్రియాంక చోప్రా, అజయ్ దేవగన్, ఉజ్వల్ నికమ్ (న్యాయవాది), అవస్థీ

Sunday, January 24, 2016

యువీ కనీస ధర రూ. 2 కోట్లు

 గత రెండు ఐపీఎల్‌ సీజన్లలోనూ రూ.15 కోట్లకు పైగా ధర దక్కించుకుని లీగ్‌లోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు యువరాజ్‌ సింగ్‌. నిరుడు అతణ్ని ఎంచుకున్న దిల్లీ ఈసారికి అతణ్ని వదిలేసింది. దీంతో మళ్లీ అతను వేలంలోకి రాబోతున్నాడు. ఈసారి యువీ కనీస ధర రూ.2 కోట్లుగా నిర్ణయించారు. యువీతో పాటు కెవిన్‌ పీటర్సన్‌, షేన్‌ వాట్సన్‌, ఇషాంత్‌ శర్మ, ఆశిష్‌ నెహ్రా, దినేశ్‌ కార్తీక్‌, స్టువర్ట్‌ బిన్నీ, సంజు శాంసన్‌, ధవల్‌ కులకర్ణి, మైకేల్‌ హసిలు కూడా రూ.2 కోట్ల కనీస ధర జాబితాలో ఉన్నారు. ఫిబ్రవరి 5న వేలం నిర్వహిస్తారు.

వేలంలోకి రానున్న కొందరు ప్రధాన ఆటగాళ్లు
కనీస విలువ రూ. 2 కోట్లు: యువరాజ్ సింగ్, పీటర్సన్, వాట్సన్, ఇషాంత్, మిషెల్ మార్ష్, ఆశిష్ నెహ్రా, దినేశ్ కార్తీక్, స్టువర్ట్ బిన్నీ, సంజు శామ్సన్, ధావల్ కులకర్ణి.
రూ. 1.5 కోట్లు: డేల్ స్టెయిన్, మోహిత్ శర్మ, జాస్ బట్లర్.
రూ. 1 కోటి: ఇర్ఫాన్ పఠాన్, టిమ్ సౌతీ.
రూ. 50 లక్షలు: మార్టిన్ గప్టిల్, జాసన్ హోల్డర్, బరీందర్ శరణ్