Thursday, October 29, 2015

ఓ ఇంటి వాడైన హర్భజన్


 టీమిండియా క్రికెటర్ హర్భజన్ సింగ్ ఓ ఇంటి వాడయ్యాడు. స్నేహితురాలు గీతా బాస్రాను అతడు పెళ్లాడాడు. పంజాబ్‌లోని ఫగ్వారాలోని గురుద్వారాలో గురువారం వీరి వివాహం జరిగింది. తెలుపు రంగు షెర్వానీ, ఎరుపు టోపీ ధరించి భజ్జీ మెరిశాడు. పెళ్లికూతురు సంప్రదాయ ఎరుపు రంగు చీర ధరించింది. వీరి వివాహానికి దగ్గరి బంధువులు, సన్నిహితులు హాజరయ్యారు. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, అతడి సతీమణి అంజలి విచ్చేసి భజ్జీ-బాస్రా దంపతులను ఆశీర్వదించారు. అంతకుముందు హర్భజన్ నివాసంలో మెహందీ, సంగీత్ కార్యక్రమాలు నిర్వహించారు.  నవంబర్ 1న ఢిల్లీలో భజ్జీ-బాస్రా  వివాహ రిసెప్షన్ జరగనుంది. రిసెప్షన్ కు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యే అవకాశముంది. క్రికెటర్లు యువరాజ్ సింగ్, విరాట్ కోహ్లి, అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్, ప్రియాంక చోప్రా తదితర ప్రముఖులు రిసెప్షన్ కు రానున్నారు



Wednesday, October 28, 2015

హర్భజన్‌ పెళ్లి కొడుకైన వేళ ... చిత్రాలు



 ఐదురోజులపాటు అట్టహాసంగా జరుగనున్న క్రికెటర్ హర్భజన్ సింగ్, నటి గీతా బస్రా పెళ్లికి భారీగా సన్నాహాలు చేస్తున్నారు. శుక్రవారం వీరి పెళ్లి జరుగనుంది. దీంతోపాటు మెహిందీ, సంగీత్, రిసెప్షన్ వంటి వేడుకలను నిర్వహించనున్నారు. ఈ వేడుకల కోసం వధూవరులకు ప్రముఖ డిజైనర్ అర్చన కొచ్చర్ వస్త్రాలను రూపొందిస్తున్నారు. పెళ్లిరోజున భజ్జీ, గీత వేసుకునే దుస్తులను అత్యంత సంప్రదాయ శైలితో సరికొత్తగా రూపొందిస్తున్నట్టు ఆమె తెలిపారు.
 'గీత బాగా సంప్రదాయబద్ధంగా డిజైన్ ను కోరుకుంటున్నారు. ఆమె కోసం భారతీయ వర్క్ తో కూడిన లెహెంగా, దుపట్టా, బ్లౌజ్ సిద్ధం చేస్తున్నాం. భజ్జీ కూడా సంప్రదాయ డిజైన్ కు ప్రాధాన్యమిస్తున్నారు. పెళ్లిరోజున ఆయన భారతీయతో ఉట్టిపడే చుడిదార్ ధరించనున్నారు. మెహిందీ, పెళ్లి, రిసెప్షన్ ఇలా వివిధ వేడుకలకు వధూవరులు మెచ్చేరీతిలో డిజైన్ వస్త్రాలను రూపొందిస్తున్నాం' అని ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. ఐదురోజుల ఈ పెళ్లి వేడుకలో భాగంగా నవంబర్ 1న జరుగనున్న రిసెప్షన్ కు క్రికెటర్లు యువరాజ్ సింగ్, విరాట్ కోహ్లి, బాలీవుడ్ ప్రముఖులు హాజరుకానున్నారు.










Tuesday, October 27, 2015

మూడు దేశాల్లో భూవిలయం

పాకిస్తాన్‌లో 200 మంది, అఫ్ఘానిస్తాన్‌లో 63 మంది మృత్యువాత
 అఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్ సరిహద్దులు భారీ భూకంపంతో విలవిల్లాడాయి. హిందూకుష్ పర్వతశ్రేణుల్లో సోమవారం మధ్యాహ్నం సంభవించిన భూకంపం పాక్, అఫ్ఘాన్‌లలో పెను విధ్వంసం సృష్టించి 263 మంది ప్రాణాలను బలిగొంది. 1,300 మందికి పైగా ప్రజలను గాయాలపాల్జేసింది. పెద్దఎత్తున ఆస్తులను ధ్వంసం చేసింది. భూకంప భయంతో భారత్‌లోని కశ్మీర్‌లో ముగ్గురు చనిపోగా, ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. పలు ఉత్తర భారత రాష్ట్రాల్లో ప్రజలు ప్రాణభయంతో వణికారు. అఫ్ఘాన్ రాజధాని కాబూల్‌కు 250 కి.మీ. దూరంలోని జుర్మ్‌లో హిందూకుష్ పర్వతాల కింద 213 కిలోమీటర్ల లోతులో మధ్యాహ్నం 2.39 గంటలకు(భారత కాలమానం ప్రకారం) భూకంపం సంభవించినట్లు అమెరికన్ జియోలాజికల్ సర్వే  తెలిపింది.
అన్ని విధాలా సహకరిస్తాం: మోదీ
 ‘ఎక్కడ ఎలాంటి సాయం కావాలన్నా అందించాలని అధికారులను ఆదేశించాను. పాక్, అఫ్ఘాన్‌తో సహా అందించటానికి సిద్ధంగా ఉన్నాం. జమ్మూకశ్మీర్ సీఎం సయీద్‌తో ఫోన్‌తో మాట్లాడి పరిస్థితి తెలుసుకున్నా. అఫ్ఘాన్ అధ్యక్షుడు ఘనీ, పాక్ ప్రధాని  షరీఫ్‌లతో మాట్లాడి అవసరమైన సాయం అందిస్తామని హామీ ఇచ్చాను. అఫ్ఘాన్‌లో స్కూలు పిల్లలు చనిపోవటం నాకు చాలా ఆవేదన కలిగించింది’అని  ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.


ప్రాణభయంతో పరుగులు...
  హింద్‌కుష్ పర్వత శ్రేణుల్లో సంభవించిన భూ ప్రకంపనలు ఉత్తర, వాయవ్య భారత ప్రాంతాలన కుదిపేశాయి. మధ్యాహ్నం 2.39 గంటలకు సంభవించిన భూకంపం, జమ్మూకశ్మీర్‌తో పాటు, దేశ రాజధాని ఢిల్లీ, పంజాబ్, హరియాణా, ఉత్తరాఖండ్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ తదితర ప్రాంతాలను వణికించింది. ఆఫీసులు, ఆస్పత్రులు, సినిమాహాళ్లల్లోంచి ప్రజలు ఒక్కసారిగా భయంతో బయటకు పరుగులు తీశారు. కశ్మీర్‌లో ముగ్గురు చనిపోయారు. భూకంప వార్తలు వచ్చిన మరుక్షణమే ప్రధానిమోదీ పరిస్థితిని సమీక్షించారు.

Monday, October 26, 2015

పెళ్ళికి ఇంకా టైం ఉంది..

 'నవంబర్‌ 26న మా పెళ్ళంట. ఇది నిజంగా నవ్వు తెప్పించే వార్త. మేమింకా ముహూర్తమే పెట్టుకోలేదు. నా పెళ్ళి తేదీపై మీడియా గందరగోళం సృష్టిస్తోంద'ని అంటోంది అశిన్‌. నవంబర్‌ 26న ఢిల్లీలో అశిన్‌ పెళ్ళంటూ మీడియాలో వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని ఖరాఖండిగా చెప్పింది. అంతేకాదు 'అంగీకరించిన ప్రాజెక్టులు, కాంట్రాక్టులు ఈ ఏడాది చివరి నాటికి పూర్తవుతాయి. ఆ తర్వాతే మా పెళ్ళి జరుగుతుంది. పెళ్ళి ఎప్పుడనేది నేను, మా పెద్దలు చెప్పేవరకు మీడియావాళ్ళు ఓపిక పట్టండి' అంటూ ఘాటుగా స్పందించింది. మైక్రో మ్యాక్స్‌ సహస్థాపకుడైన రాహుల్‌శర్మను అశిన్‌ పెళ్ళి చేసుకోబోతున్న విషయం విదితమే. ఇటీవల జరిగిన అశిన్‌ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో రాహుల్‌ శర్మ ఆరుకోట్ల విలువైన డైమండ్‌ రింగ్‌ను బహూకరించారు కూడా.

Sunday, October 25, 2015

శతకాలతో చెలరేగిన సఫారీలు... భారత్‌ లక్ష్యం 439


ముంబయిలోని వాంఖడే మైదానంలో భారత్‌,సౌతాఫ్రికా మధ్య జరిగిన ఐదో వన్డే మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా 50 ఓవరల్లో 4 వికెట్ల నష్టానికి 438 పరుగులు చేసింది. వన్డేల్లో మ్యాచ్‌ల్లో 443 అత్యధికంగా ఉంది. మరో ఆరు పరుగులు చేసి ఉంటే సౌతాఫ్రికా జట్టు నెంబర్‌ వన్‌గా ఉండేది. సఫారీ బ్యాట్‌మెన్లు డికాక్‌ ( 109), డుప్లెసిస్‌ ( 133), డివిలియర్స్‌ (119) శతకాలు బాది జట్టుకు భారీ స్కోరు అందించారు. సఫారీ బ్యాట్‌మెన్ల దాటికి భారత్‌ బౌలర్లు కెరీర్‌లోనే దారుణమైన గణాంకాలు నమోదు చేసుకోన్నాయి. టాస్‌ గెలిచిన సౌతాఫ్రికా జట్టు బ్యాటింగ్‌ ఎంచుకు ది. ఓపెనరు ఆమాల్ల ( 23) పరుగులకే పెవిలియన్‌ చేరుకఁన్నాడు.మరో ఓపెనరు డికాక్‌ సెంచరీతో జవాజు ఇచ్చాడు.డికాక్‌ ( 109) అతని తోడుగా డుప్లెసిస్‌ కూడా సెంచరీతో అదుకున్నాడు. 133 పరుగులు చేసి రిటైర్డ్‌ హర్డ్‌ వెనుదిగిరాడు. డుప్లెసిస్‌ క్రీజులో కుదురుకునే వరకూ నెమ్మదిగా అడినా శతకం తర్వాత విశ్వరూపం చూపాడు. మరో డైజర్‌అన్‌ బ్యాట్‌మైన్‌ ఎబి డివిలియర్స్‌ మరో సారి తన విశ్వరూపం బౌలర్లపై చూపాడు. డివిలియర్స్‌ ( 119) పరుగులు చేసి అవుట్‌ అయ్యాడు. చివర్లో మిల్లర్‌ (22), బెహార్డీన్‌ (16) దాటిగా ఆడటంతో దక్షిణాఫ్రికా జట్టు 438 పరుగులు చేయగలిగింది. 
దక్షిణాఫ్రికా ఆటగాళ్లు వన్డేల్లో ఆరోసారి 4 వందల పైచిలుకు స్కోర్ చేశారు.

Tuesday, October 20, 2015

ఐపీఎల్‌కూ గుడ్‌బై...

ఏంటీ షాక్... మనసు జీర్ణించుకోలేకపోతోంది. సెహ్వాగ్ ఆటను ఇక చూడలేమా..? అంతర్జాతీయ క్రికెట్‌లో సరే. ఐపీఎల్‌లోనూ అతను ఆడటం లేదా..? ఎందుకీ కఠిన నిర్ణయం. ఏం వయసైపోయిందని అప్పుడే రిటైరవుతున్నాడు..! తొలి ఓవర్లోనే అలా బంతులు ఎగిరి స్టాండ్‌లో పడుతుంటే మేం తీన్‌మార్ వేయడం ఇష్టం లేదేమో..! జిడ్డురా బాబూ అంటూ టెస్టులకు రాని స్నేహితులు, వీరూ ఉన్నాడురా అంటే ఉరుకుతూ వచ్చేవాళ్లు. 

                     పొగరుగా ఎగిరే షోయబ్ అక్తర్ బంతిని అలవోకగా సిక్సర్ బాదుతుంటే... ఎవరినైనా భయపెట్టే బ్రెట్‌లీ బౌన్సర్‌ని స్టాండ్స్‌లోకి పంపిస్తుంటే...  స్టెయిన్ బుల్లెట్ బంతులు కూడా బౌండరీలు దాటుతుంటే... బంతిని ఎలా తిప్పుతాడో తెలియని వార్న్ కూడా తలపట్టుకుంటే... దానర్థం ఒక్కటే. అక్కడ సెహ్వాగ్ ఆడుతున్నాడని.
                      1999లో సెహ్వాగ్ జట్టులోకి వచ్చినా రెండేళ్ల పాటు సాధారణ క్రికెటర్లలో ఒకడు మాత్రమే. 2001లో కొలంబోలో న్యూజిలాండ్‌పై 69 బంతుల్లోనే సెంచరీ బాదినప్పుడు తొలిసారి అనిపించింది... ఆహా... ఏం ఆటగాడు దొరికాడురా అని. అప్పటి నుంచి 12 ఏళ్ల పాటు భారత అభిమాని ఎప్పుడూ వినోదం కోసం వెతుక్కోవాల్సిన అవసరం రాలేదు. సచిన్ లాంటి దిగ్గజంతో సరిసమానంగా షాట్లు ఆడాలంటే ఎంత గొప్ప ఆటగాడై ఉండాలి. ప్రత్యర్థులు 300 లక్ష్యాన్ని ఎదురుగా ఉంచినా... వీరూ పది ఓవర్లు ఉంటే చాలురా బాబూ అనుకునేవాళ్లం. ఎదురుగా ఎంత గొప్ప బౌలర్ ఉన్నా అదురూ బెదురూ లేదు. బ్యాటింగ్ చేయడం క్లిష్టంగా ఉన్న పిచ్‌పై కూడా పునరాలోచన లేదు. బాదడం ఒక్కటే తెలుసు. ఉన్నంతసేపు దడదడలాడిస్తూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించడమే తెలుసు.
                        95 పరుగుల మీద ఒక్క బంతి కూడా వృథా చేయకుండా సిక్సర్ కొట్టాలంటే ఎంత ధైర్యం కావాలి. టెస్టు మ్యాచ్‌లో 294 పరుగుల దగ్గర స్పిన్నర్ బౌలింగ్‌లో ముందుకు రావాలంటే ఎంత ఆత్మవిశ్వాసం ఉండాలి. అందుకే.. వీరూలాంటి విధ్వంసం మరెవరికీ సాధ్యం కాదు. గత దశాబ్ద కాలంలో... ఆ మాటకొస్తే క్రికెట్‌లోనే అత్యంత విధ్వంసకర ఓపెనర్ సెహ్వాగ్. తను రిటైరైతే క్రికెట్ ప్రపంచం రిచర్డ్స్‌ను గుర్తుకు తెచ్చుకుంటోంది. ఈ ఒక్క పోలిక చాలు తను అభిమానులు, సహచరుల గుండెల్లో ఎలాంటి స్థానం సంపాదించుకున్నాడో

                           ప్రశంసల వెల్లువ
  అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు పలికిన దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ కు క్రికెట్ ప్రపంచంతో పాటు   పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.

ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు కావలసిన వినోదాన్ని సెహ్వాగ్ అందించాడు. ఎంతోమంది యువ క్రికెటర్లలో స్ఫూర్తిని నింపాడు. అతని భవిష్యత్తు బాగుండాలి’         -శశాంక్ మనోహర్

సెహ్వాగ్‌కు నా అభినందనలు. దేశానికి ఎన్నో గొప్ప విజయాలను అందించాడు. భారత క్రికెట్‌కు తను రిచర్డ్స్. దిగ్గజాల్లో ఒకడిగా ఆటకు వీడ్కోలు చెబుతున్నాడు. అంకితభావం ఉంటే ఎలా ఎదగొచ్చో వీరూను చూసి నేటి తరం క్రికెటర్లు నేర్చుకోవాలి’     - అనురాగ్ ఠాకూర్

రిచర్డ్స్ బ్యాటింగ్‌ను నేను ప్రత్యక్షంగా చూడలేదు. కానీ ప్రపంచంలోని ఉత్తమ బౌలర్లను సెహ్వాగ్ బాదడం కళ్లారా చూశాను. వీరూలాంటి మైండ్‌సెట్ ఉన్న ఆటగాడిని చూడలేం. మిగిలిన ఆటగాళ్లు సింగిల్ కోసం ఆడే చోట వీరూ బౌండరీ కోసం ప్రయత్నిస్తాడు’      -ధోని
 

వీరూ భాయ్ నీతో కలిసి ఆడగలగడం నా అదృష్టం. నీది అద్భుతమైన కెరీర్. నీ మార్గదర్శకత్వానికి, నువ్విచ్చిన జ్ఞాపకాలకు కృతజ్ఞతలు. ఆధునిక క్రికెట్‌లో నువ్వు దిగ్గజం’     -కోహ్లి
 
శుభాకాంక్షలు వీరూ. నువ్వు అద్భుతమైన వినోదాన్ని అందించావు. ఎన్నో గొప్ప జ్ఞాపకాలను అందించినందుకు కృతజ్ఞతలు       -లక్ష్మణ్


ఆటలోనూ, జీవితంలోనూ సెహ్వాగ్ దృక్పథం అంటే నాకు చాలా ఇష్టం. తను ఆడిన ఎన్నో గొప్ప ఇన్నింగ్స్‌ను రెండో ఎండ్‌లో నిలబడి చూశాను. మనందరిలో ఇంకా సంతోషాన్ని, నవ్వులను వీరూ తెస్తాడు. తన ప్రదర్శనలతో ఆటపై తన ముద్రను వేసి వెళుతున్నాడు’     -సచిన్



టాపార్డర్‌లో సెహ్వాగ్‌లా బ్యాటింగ్ చేసే క్రికెటర్ మరొకరు లేరు. జట్టు కోసం ఎప్పుడూ కష్టపడేవాడు. తన రెండో ఇన్నింగ్స్ కూడా సంతోషంగా సాగాలి’     -కుంబ్లే


Monday, October 19, 2015

సెహ్వాగ్ వీడ్కోలు?

ఎంత కొట్టామన్నది కాదు, ఎంత వేగంతో కొట్టామన్నది ముఖ్యం... సెహ్వాగ్‌కు మాత్రమే సరిపోయే డైలాగ్ ఇది.
సిక్సర్‌తో ట్రిపుల్ సెంచరీని అందుకోవడం ఎలా ఉంటుంది... వీరూకి మాత్రమే తెలిసిన మజా.
టెస్టు ఓపెనర్ అంటే వికెట్ కాపాడుకోవడం కాదు...
వీర విధ్వంసం సృష్టించడం ఎలాగో సెహ్వాగ్ మాత్రమే చూపించిన విద్య.\

 ఒకటా, రెండా ఎన్నో అద్భుతాలు వీరేంద్ర సెహ్వాగ్ బ్యాటింగ్ నుంచి జాలువారాయి. సచిన్ అంతటివాడిని కావాలని క్రికెట్‌లోకి వచ్చిన సెహ్వాగ్ ఒక దశలో మాస్టర్‌నే మించిపోయాడు. దూకుడు అంటూ ఇప్పుడు కొందరు వల్లె వేయవచ్చు గాక... కానీ అసలు దూకుడు ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా మైదానంలో నేర్పించిన ఘనత సెహ్వాగ్‌దే. అతను క్రీజ్‌లో ఉన్నంతసేపు ఎంతటి భారీ లక్ష్యమైనా చిన్నదిగానే కనిపిస్తుంది. బ్యాటింగ్ చేసేటప్పుడు ఆ బంతిని బౌండరీ దాటించడంపైనే దృష్టి పెట్టే ఈ ‘నజఫ్‌గఢ్ నవాబ్’కు ఫుట్‌వర్క్, సాంప్రదాయ షాట్లు లాంటివి పట్టవు.
ఎవరైనా దానిని గుర్తు చేసినా అతను పట్టించుకోడు! తక్కువ శ్రమ-ఎక్కువ ఫలితం అనే సిద్ధాంతంతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించే శైలి అతడిని స్టార్‌ను చేసింది. భారత్‌కు అరుదైన, అనూహ్య విజయాలు అందించింది. సాధారణంగా టెస్టుల్లో ఒక రోజు ఆటంతా ఆడితే జట్టు మొత్తం చేయగలిగే స్కోరు 284. కానీ సెహ్వాగ్ ఒక్కడే దీనిని ఒక్కరోజులో కొట్టి పడేశాడు.

భారత్ టెస్టుల్లోకి వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా ఏ బ్యాట్స్‌మన్‌కూ అందని ‘ట్రిపుల్ సెంచరీ’ అతను పాకిస్తాన్ గడ్డపై సాధించిన రోజున గర్వించని భారతీయుడు లేడు. మరో నాలుగేళ్లకు మరో ‘ట్రిపుల్’ను బాది ఎవరికీ అందని ఎత్తులో నిలిచిన అతను వన్డేల్లోనూ ‘డబుల్’తో తన విలువను చూపించాడు. టెస్టుల్లో ఊహించడానికే సాధ్యం కాని 82 స్ట్రయిక్‌రేట్ అతనికే చెల్లింది.


అంతర్జాతీయ క్రికెటర్‌గా సెహ్వాగ్‌ది మహోజ్వల కెరీర్! 12 ఏండ్ల కెరీర్‌లో 104 టెస్టుల్లో 49.34 సగటుతో 8586 పరుగులు చేసిన వీరూ 23 సెంచరీలు, 32 అర్ధ సెంచరీలు కొట్టాడు. అలాగే 251 వన్డేల్లో 35.05 సగటుతో 8273 పరుగులు చేశాడు. ఇందులో 15 అర్ధ సెంచరీలు, 38 అర్ధ సెంచరీలున్నాయి. టెస్టుల్లో సెహ్వాగ్ రెండు ట్రిపుల్ సెంచరీలు కొట్టాడు. భారత తరపున ట్రిపుల్ సెంచరీ సాధించిన మొదటి ఆటగాడు సెహ్వాగే. అత్యంత వేగంగా త్రిశతకం సాధించిన ఘనత (278 బంతుల్లో) కూడా సెహ్వాగ్‌దే! వన్డేల్లో సచిన్ తర్వాత డబుల్ సెంచరీ సాధించిన రెండో బ్యాట్స్‌మన్ సెహ్వాగే!  

హాస్య నటుడు కళ్లు చిదంబరం కన్నుమూత

  ప్రముఖ హాస్య నటుడు కళ్లు చిదంబరం(70) కన్నుమూశారు. గత కొంతకాలంగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న ఆయన విశాఖ పట్నం కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కొల్లూరు చిదంబరం ఆయన అసలు పేరు, 1989లో ఆయన నటించిన కళ్లు చిత్రంతో ఆయనకు కళ్లు చిదంబరంగా పేరు వచ్చింది. ఆయన స్వస్థలం విశాఖపట్నం జిల్లా అక్కయ్యపాలెం. కళ్లు సినిమాలో నటనకు నందు పురస్కారం అందుకున్నారు.300లకు పైగా సినిమాల్లో ఆయన నటించారు. విశాఖపట్నం పోర్టులో చిదంబరం ఉద్యోగిగా పనిచేశారు. కళ్లు, కొండవీటి దొంగ, చంటి, గోవిందగోవిందా, అమ్మోరు, మనీ, ఎదురులేని మనిషి, మృగరాజు, శ్వేతనాగు, గ్లామర్, సివంగి, గంగపుత్రులు, కాలచక్రం, తొలిపాట, మైత్రి, ప్రేమకు సై సహా పలు చిత్రాల్లో నటించారు.