Thursday, January 24, 2019

మరో కట్టప్ప!

  ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ చిత్రంలో కీలక పాత్ర చేస్తావా? అని దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి అడగ్గానే వెంటనే ఒప్పుకొన్నానని అంటున్నారు ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు సముద్రఖని. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ప్రధానపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా రెండో భారీ షెడ్యూల్‌ ఇటీవల ప్రారంభమైంది. ఈ షెడ్యూల్‌లోనే సముద్రఖని కీలక పాత్రలో నటిస్తున్నారట. ఈ విషయాన్ని ఆయన ఓ తమిళ మ్యాగజైన్‌కు ఇచ్చిన  ఇంటర్వ్యూలో వెల్లడించారు.
‘నేను దర్శకత్వం వహించిన ‘నాడోడిగల్‌’ సినిమా చూసి రాజమౌళి సర్‌ నాకు ఓ పెద్ద మెసేజ్‌ పెట్టారు. అప్పటినుంచి నేను రాజమౌళి సర్‌తో టచ్‌లో ఉన్నాను. ఇటీవల ఆయన నన్ను తన ఇంటికి ఆహ్వానించారు. తన కుటుంబీకుల్ని పరిచయం చేశారు. అప్పుడే నాకు ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ సినిమా గురించి తెలిసింది. ఇందులో ఓ కీలక పాత్ర ఉంది చేస్తావా? అని అడిగారు. నేను క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే ఒప్పేసుకున్నాను. అయితే ముందు ఆయన స్క్రిప్ట్‌ చదవాలని చెప్పారు. సరేనన్నాను’ అని వెల్లడించారు.
             ప్రస్తుతం చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇందులో ముగ్గురు కథానాయికలకు ఆస్కారం ఉన్నట్లు తెలుస్తోంది. సమంత, కీర్తి సురేశ్, ప్రియమణి, అదితిరావు హైదరి పేర్లు వినపడుతున్నాయి. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో దానయ్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా శాటిలైట్‌ హక్కులు రికార్డు స్థాయిలో రూ.132 కోట్లకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది.

Wednesday, January 23, 2019

చక్కర్లు కొట్టిన కోహ్లి, ధోని

Virat Kohli And MS Dhoni Enjoyed Riding A Segway - Sakshi

 న్యూజిలాండ్‌ గడ్డపై శుభారంభం చేసిన టీమిండియా మంచి ఊపుమీద ఉంది. బుధవారం జరిగిన మొదటి వన్డేలో కివీస్‌ను చిత్తుగా ఓడించి కోహ్లి సేన భారీ విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌ ముగిసిన తర్వాత మెక్‌లీన్‌ మైదానంలో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, వికెట్‌ కీపర్‌ ఎంఎస్‌ ధోని కాసేపు సందడి చేశారు. సెల్ఫ్‌ బ్యాలెన్సింగ్‌ టూవీలర్‌ ‘సెగ్‌వే’పై చక్కర్లు కొట్టారు. (కివీస్‌ గడ్డపై తొలి వన్డే మనదే!)

ముందుగా కోహ్లి దీనిపై హుషారుగా ప్రయాణించాడు. రకరకాల విన్యాసాలు చేస్తూ అక్కడున్నవారిని అలరించాడు. తర్వాత ధోని కూడా తనదైన శైలిలో కూల్‌గా చక్కర్లు కొట్టాడు. బీసీసీఐ ట్వీట్‌ చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సాధారణంగా మైదానం సిబ్బంది సులువుగా ప్రయాణించేందుకు ‘సెగ్‌వే’ను వినియోగిస్తారు. కాగా, భారత్‌-న్యూజిలాండ్‌ రెండో వన్డే ఈనెల 26న జరగనుంది.

Tuesday, January 22, 2019

‘మా ఇద్దరినీ అంతం చేయాలని చూస్తున్నారు’

 గ్లామరస్‌ మాఫియా కారణంగానే తమ సినిమాకు థియేటర్లు దొరకలేదని, అందుకే పరాజయం చవిచూడాల్సి వచ్చిందని బాలీవుడ్‌ మూవీ ‘రంగీలా రాజా’ నిర్మాత, సెంట్రల్‌ బోర్డు ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌(సీబీఎఫ్‌సీ) మాజీ చైర్మన్‌ పహ్లజ్‌ నిహలానీ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ‘ సెన్సార్‌ బోర్డు చైర్మన్‌గా ఉన్న సమయంలో కఠినంగా వ్యవహరించినందు వల్లే కొంతమంది నన్ను టార్గెట్‌ చేశారు. నా కారణంగా హీరో గోవిందాను ఇబ్బంది పెడుతున్నారు. నన్ను, గోవిందాను అంతం చేయాలని చూస్తున్న ఆ వ్యక్తులు ఎవరో నాకు తెలుసు. ఇండస్ట్రీ మొత్తం కొంతమంది చేతుల్లో చిక్కుకుపోయింది. కార్పోరైటేజషన్‌ పేరుతో నా వంటి నిర్మాతలను అణగదొక్కాలని చూస్తున్నారు. అయినా భయపడేది లేదు. మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయం సాధిస్తా’ అని వ్యాఖ్యానించారు.
ఇక ఈ విషయం గురించి మాట్లాడిన గోవిందా.. ‘ గత తొమ్మిదేళ్లుగా పరిస్థితి ఇలాగే ఉంది. నా సినిమాలకు థియేటర్లు దొరకకుండా కొంతమంది అడ్డుతగులుతున్నారు. నేనేమీ రాజకీయాల్లో లేనుకదా. దయచేసి నా పనిని సక్రమంగా చేసుకోనివ్వండి’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా గోవిందా ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘రంగీలా రాజా’ సినిమా శుక్రవారం విడుదలైంది.

Tuesday, June 12, 2018

‘కోహ్లి’ని అరెస్ట్‌ చేసిన పోలీసులు

 వివాదాస్పద నటుడు, బిగ్‌బాస్‌ మాజీ పోటీదారు అర్మాన్‌ కోహ్లిని ముంబై పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతని గర్ల్‌ ఫ్రెండ్‌, ఫ్యాషన్‌ స్టెలిస్ట్‌ నీరూ రాంధవాను దారుణంగా కొట్టి, హింసించిన కేసుల్లో ముంబైలో పోలీసులు అర్మాన్‌ కోహ్లిని అదుపులోకి తీసుకున్నారు. గత వారమే శాంతాక్రజ్‌ పోలీసు స్టేషన్‌లో ఇతనిపై కేసు నమోదైంది. 
స్టెలిస్ట్‌ నీరూ, నటుడు అర్మాన్‌ కోహ్లి మూడేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య ఆర్థిక సంబంధమైన విషయాల్లో తరచూ గొడవ జరుగుతూ వస్తోంది. ఈ గొడవ జూన్‌ 3 మరింత తారాస్థాయికి చేరింది. గొడప పడే క్రమంలో ఉన్మాదిలా మారిన కోహ్లి.. నీరూను బలంగా నెట్టేయడంతో ఆమె మెట్లపైనుంచి దొర్లుకుంటూ కిందపడిపోయిందని రిపోర్టులు పేర్కొన్నాయి. అంతటితో ఆగకుండా ఆమె జుట్టుపట్టుకుని తలను నేలకేసి గట్టిగా బాదాడని, తీవ్రంగా గాయపడ్డ ఆమె.. తనను ఆస్పత్రికి తీసుకెళ్లాలని ఎంత వేడుకున్నా అతను వినలేదని తెలిసింది.
కోహ్లి చేతిలో చావుదెబ్బలు తిన్న చాలా సేపటి తర్వాత అతికష్టం మీద ఆస్పత్రికి వెళ్లగలిగిన బాధితురాలు.. చివరికి పోలీసులను ఆశ్రయించింది. అప్పటికే కోహ్లి అజ్ఞాతంలోకి పారిపోయాడు. ఐపీసీ 323, 326, 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం ముమ్మరంగా పోలీసులు గాలించి, ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. తనను కోహ్లి, బయట తిరగనీయకుండా చేస్తానన్నడని నీరూ తన ఫిర్యాదులో పేర్కొంది. అతను ఎలాంటి వాడో ప్రతి ఒక్కరికీ తెలుసని, ఎవరికీ తాను బయటపడనని పేర్కొంది.

Tuesday, April 10, 2018

పాన్‌ కార్డులో కొత్త ఆప్షన్‌

ఆధార్‌-పాన్‌ అనుసంధానంలో ట్రాన్స్‌జెండర్లు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం లభించింది. పాన్‌ కార్డులో థర్డ్‌జెండర్‌ ఆప్షన్‌  కల్పిస్తూ ..ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (సిబిడిటి)  సోమవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆదాయపు పన్ను శాఖ జారీ చేసే పాన్‌కార్డు దరఖాస్తులో ట్రాన్స్‌జెండర్లను ప్రత్యేక కేటగిరీగా గుర్తించిన కేంద్రం వారికోసం ఈ  ప్రత్యేక ఆప్షన్‌ను కేటాయించింది.
స్త్రీ, పురుషుల మాదిరిగా ట్రాన్స్‌జెండర్లకు ఓ ఆప్షన్‌ను కేటాయిస్తూ ఆదాయ పన్ను శాఖ నిబంధనలను ప్రభుత్వం సవరించింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను సీబీడీటీ సోమవారం విడుదల చేసింది. పాన్ కోసం దరఖాస్తు చేసే ట్రాన్స్‌జెండర్ల కోసం దరఖాస్తు ఫారంలో ప్రత్యేకంగా ఓ టిక్ బాక్స్‌ను ఏర్పాటు చేశారు.
కాగా ఇన్ని రోజుల ఆధార్‌-పాన్‌ అనుసంధానంలో హిజ్రాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనికి కారణం ఆధార్‌ కార్డులో జెండర్‌ ఎంపికలో ఆడ, మగతోపాటు హిజ్రాలకు ప్రత్యేకంగా థర్డజెండర్‌ ఆప్షన్‌ ఉన్నప్పటికీ పాన్‌ కార్డు దరఖాస్తులో ఆ వెసులుబాటు లేకపోవడమే. ఆధార్‌కార్డుల్లో థర్డ్‌ జెండర్‌ అనీ, పాన్‌కార్డుల్లో మాత్రం పురుషుడు/మహిళ అని ఉండటంతో హిజ్రాలు తమ ఆధార్‌ నంబర్లను పాన్‌కు అనుసంధానించుకోలేక ఇబ్బందులకు గురయ్యారు.ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో హిజ్రాలకు పాన్‌ కార్డుల ధరఖాస్తుకు, ఆధార్‌తో అనుసంధానికి సంబంధించిన సమస్యలు తొలగిపోయాయి.

Friday, April 6, 2018

ఐపీఎల్‌ టోర్నీ శనివారమే ప్రారంభం


అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ఐపీఎల్‌ మెగా టోర్నీ ఈ శనివారమే ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో నిర్వాహకులు ఏర్పాట్లలో బిజీ అయ్యారు. మరోపక్క ఆటగాళ్లు సైతం వరుస ప్రాక్టీస్‌ సెషన్స్‌లో పాల్గొంటూ తీరిక లేకుండా గడుపుతున్నారు.
ఈ ఏడాది ఐపీఎల్‌ ప్రారంభ వేడుకలకు అన్ని జట్ల కెప్టెన్లు హాజరు కాని సంగతి తెలిసిందే. కొన్ని కారణాల వల్ల ముంబయి ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ సారథులు రోహిత్‌ శర్మ, మహేంద్ర సింగ్‌ ధోనీ మినహా మిగతావారెవరూ ఆరంభ వేడుకల్లో పాల్గొనడం లేదని టోర్నీ నిర్వాహకులు తెలిపారు. ఐతే, ఈ ఏడాది ఒకే వేదికపై అన్ని జట్ల కెప్టెన్లను చూడలేకపోతున్నాం అని అభిమానులు నిరుత్సాహ పడిపోయారు. తాజాగా నిర్వాహకులు ఐపీఎల్‌ ట్రోఫీతో ఎనిమిది జట్ల సారథులతో ఫొటో షూట్‌ నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఐపీఎల్‌ ట్విటర్‌ పేజీ ద్వారా పంచుకున్నారు.
ట్రోఫీతో అన్ని జట్ల కెప్టెన్లను ఒకేసారి చూడటంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. ‘ఈ సీజన్‌లో ఇలా అన్ని జట్ల కెప్టెన్లనూ ఒకే వేదికపై చూస్తామనుకోలేదు, చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ తిరిగి ఐపీఎల్‌లో ఆడటం ఎంతో ఆనందంగా ఉంది’ అని నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు.

Thursday, April 5, 2018

పొద్దున్నే ఐదున్నరకు సెహ్వాగ్‌ తలుపు కొట్టాడు

 తర్వాత పిలిచి మాట్లాడతా అన్నాను: గంగూలీ
  ‘శ్రీలంకతో ఫైనల్‌ ఓడిపోయిన మరుసటి రోజు ఉదయం 5.30 గంటలకు వీరేంద్ర సెహ్వాగ్‌ నాతో మాట్లాడేందుకు వచ్చాడు. నిద్రమత్తులో లేచి తలుపు తీశాను. ఇప్పుడు కాదు తర్వాత మాట్లాడతాను అని చెప్పాను’ అని గంగూలీ తన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో సౌరభ్‌ గంగూలీ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘2001లో ముక్కోణపు సిరీస్‌ కోసం శ్రీలంక పర్యటనకు వెళ్లాం. శ్రీలంకతో జరిగిన ఫైనల్లో 121 పరుగుల తేడాతో భారత్‌ ఓడిపోయింది. అనవసరపు షాట్‌కు యత్నించిన సెహ్వాగ్‌ రనౌట్‌ రూపంలో వెనుదిరిగాడు. ఆ తర్వాతి రోజు ఉదయం 5.30 గంటల సమయంలో నా గది తలుపు మోగింది. తిరిగి భారత్‌ వెళ్లే క్రమంలో ఎయిర్‌పోర్టుకు వెళ్లే ముందు నన్ను కలవాలని వచ్చాడు. కానీ, నాకు ఏమో అంత పొద్దున్నే సెహ్వాగ్‌తో మాట్లాడే మూడ్‌ లేదు. దీంతో తర్వాత పిలిచి మాట్లాడతా అని చెప్పాను. ముందు రోజు ఫైనల్లో తాను ఆడిన విధానం పట్ల కెప్టెన్‌ సంతృప్తిగా లేడు.. ఏమనుకుంటున్నాడో తెలుసుకోవాలని వచ్చాడు. కానీ, నేను మాట్లాడలేదు’ అని గంగూలీ అప్పటి సంగతిని గుర్తు చేసుకుని చెప్పాడు.
ఈ ఏడాది ఐపీఎల్‌లో సెహ్వాగ్‌ కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌కు మెంటార్‌గా బాధ్యతలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. శనివారం ఐపీఎల్‌ మెగా టోర్నీ ప్రారంభంకానుంది. 

Monday, April 2, 2018

సినిమాలు లేకపోయినా... ఆమె హవా తగ్గలేదు!

 లోకనాయకుడు, నటుడు కమల్‌ హాసన్‌ కూతురిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది నటి శ్రుతీహాసన్. అయితే కొంతకాలం నుంచి సినిమాలకు దూరంగా ఉంటోంది ఈ భామ. తన బాయ్‌ఫ్రెండ్ మైఖేల్‌ కోర్స్‌లేతో షికార్లు చేస్తూ బిజీ బిజీగా ఉంది. ఈ జంట త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని వదంతులు ప్రచారంలో ఉన్నాయి.
ఏడాది నుంచి శ్రుతి ఏ సినిమా చేయకపోయినా... తెరపై అభిమానులకు కనిపించకపోయినా. ట్వీటర్‌లో మాత్రం ఆమె హవా కొనసాగిస్తోంది. భారీ సంఖ్యలో అభిమానులు ఆమెను ఫాలో అవుతున్నారు. రజనీకాంత్, కమల్‌ హాసన్, మోహన్‌లాల్‌ వంటి స్టార్లను వెనక్కి నెట్టి ముందు వరుసలో నిలిచింది శ్రుతి. ఏడు మిలియన్ల మంది అభిమానులు ట్వీటర్‌లో ఈ నటిని ఫాలో అవుతున్నారు. సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చినా.. ఆమె హవా మాత్రం తగ్గలేదంటున్నారు నెటిజన్లు. నటి సమంత, శ్రుతికి కాస్త దగ్గర్లో ఉంది. సమంతను ట్వీటర్‌లో 6.53 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.