Friday, March 23, 2018

ఒక్క సినిమా చేస్తే చాలనుకున్నా!


‘ఎం.ఎల్‌.ఎ’ అంటే మంచి లక్షణాలున్న అబ్బాయి మాత్రమే కాదు. మంచి లక్షణాలున్న ‘అమ్మాయి’ కూడా. కాజల్‌ అలాంటి కథానాయికే. అందం, అభినయాల కలబోత కాజల్‌. ‘లక్ష్మీ కల్యాణం’ నుంచి మొన్నొచ్చిన ‘అ..!’ వరకూ తన దగ్గరకు వచ్చిన ప్రతి పాత్రకూ న్యాయం చేసింది. అందాల ప్రదర్శన హద్దుల్లోనే ఉంచుతూ ఊరించింది. కమర్షియల్‌ కథానాయికగా గుర్తింపు పొందింది. అగ్ర కథానాయకులందరితోనూ జోడీ కట్టింది. ఈ ప్రయాణంలో యాభై చిత్రాల్ని పూర్తి చేసింది. తన తొలి కథానాయకుడు కల్యాణ్‌ రామ్‌తో మరోసారి నటించిన చిత్రం ‘ఎం.ఎల్‌.ఎ’ . ఈరోజు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా కాజల్‌తో బాతాఖానీ!


యాభై చిత్రాల మైలు రాయిని దాటేశారు... సెంచరీ కొట్టే ఆలోచనలు ఉన్నాయా?
(నవ్వుతూ) అసలు ఇన్ని సినిమాలు చేస్తానని అస్సలు అనుకోలేదు. ‘లక్ష్మీ కల్యాణం’ రోజులు నాకింకా గుర్తు. ‘ఈ ఒక్క సినిమా చేస్తే చాలు భగవంతుడా’ అనుకున్నా. ఆ సినిమా వీలైనంత త్వరగా పూర్తి చేసి, మళ్లీ నా చదువులు నేను చదువుకుందామనుకున్నా. కానీ.. అక్కడి నుంచి వరుసగా అవకాశాలు వచ్చాయి. ఇదిగో.. వెనక్కి తిరిగి చూసుకుంటే యాభై సినిమాలు పూర్తయ్యాయి.

‘కథానాయికగా నేను స్థిరపడినట్టే’ అని ఎప్పుడు అనిపించింది..?
‘మగధీర’తో ఆ నమ్మకం వచ్చింది. అంతకు ముందు కూడా కొన్ని సినిమాలు చేసినా ఎక్కడో చిన్న బెరుకు ఉండేది. ‘నాకూ సినిమాకూ సెట్‌ అవ్వదేమో’ అనిపించేది. కానీ ‘మగధీర’ విజయం నాపై నాకు నమ్మకాన్ని కలిగించింది.

ఈ ప్రయాణంలో కథానాయకుల ఆధిపత్య ధోరణి ఎప్పుడూ ఎదురవ్వలేదా?
లేదు. నన్ను చాలా బాగా చూసుకున్నారు. ‘సినిమా అంటే నా ఒక్కడి వల్ల కాదు.. అది సమష్టి బాధ్యత’ అనే విషయం నేను పనిచేసిన కథానాయకులందరికీ తెలుసు. కాబట్టి నాకు గౌరవం ఇచ్చారు. మంచి పాత్రలు దక్కాయి. కొన్నిసార్లు వాళ్లతో సమానమైన పాత్రలు లభించాయి.

కథానాయకులందరితోనూ నటించారు... ‘ఫలానా వాళ్లతో నటించాలి’ అనే కోరికలు మిగిలిపోయాయా?
నటించిన వాళ్లందరితోనూ మరోసారి నటించాలని వుంది. ఇప్పుడు కల్యాణ్‌రామ్‌తో చేసినట్టు..

మీ తొలి కథానాయకుడు కల్యాణ్‌రామ్‌. ‘లక్ష్మీ కల్యాణం’ నుంచి ‘ఎం.ఎల్‌.ఎ’ వరకూ ఆయనలో ఏమైనా మార్పులు కనిపించాయా?
‘లక్ష్మీ కల్యాణం’ సమయంలో నాకు సినిమా గురించి ఎలాంటి అవగాహన లేదు. సెట్లో ఎలా ఉండాలో, కెమెరా ముందు ఎలా నిలబడాలో కూడా అర్థమయ్యేది కాదు. ఆ సమయంలో కల్యాణ్‌ రామ్‌ సలహాలు ఇచ్చేవారు. ఇప్పుడు మాత్రం ఇద్దరం చర్చించుకుని మరీ సన్నివేశంలో నటించాం. ఇప్పటికీ ఆయన నాకు విలువైన సలహాలు ఇస్తున్నారు. ఈ ప్రయాణంలో ఇద్దరం మారాం. ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. నా తొలి కథానాయకుడిగా కల్యాణ్‌రామ్‌కి ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఇస్తాను. ‘ఎం.ఎల్‌.ఎ’ సెట్లో తొలిరోజు ఆయన్ని చూసినప్పుడు పాత స్నేహితుడ్ని కలుసుకున్న అనుభూతి కలిగింది.

‘ఎం.ఎల్‌.ఎ’లో మీ పాత్ర ఎలా ఉండబోతోంది?
కథానాయిక పాత్రలకు ప్రాధాన్యం ఉన్న కథలు చాలా తక్కువ వస్తున్నాయి. అలాంటి కథల్లో ‘ఎం.ఎల్‌.ఎ’ కూడా ఉంటుంది. కథలో కీలకమైన పాత్ర నాది. ఓ మంచి సందేశం కథలో మిళితమై సాగుతుంది. సందేశం అంటే... బలవంతంగా ఏదో రుద్దుతున్నట్టు ఉండదు. దాన్నీ వినోద భరితంగా చెప్పే ప్రయత్నం చేశారు.

కథానాయికగా ఇంత అనుభవం వచ్చింది కదా, ఇక ముందు కథల ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు?
కథల విషయంలో ముందు నుంచీ నేను జాగ్రత్తగానే ఉంటున్నాను. అయితే ఇక మీదట మరింత ఆచి తూచి అడుగులేయాలి. అయితే ఒక్కటి మాత్రం చెప్పగలను. అన్ని సినిమాలూ కథలు నచ్చే ఒప్పుకోం. కొన్ని కొన్ని ప్రత్యేక కారణాలుంటాయి. ప్రతీసారీ మంచి కథలు, మంచి పాత్రలూ రావు. డబ్బుల కోసం కూడా కొన్ని సినిమాలు చేయాలి.

యాభై చిత్రాల్లో కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమా ఒక్కటీ కనిపించలేదు. అనుష్క, నయనతారలా లేడీ సూపర్‌స్టార్‌ ఇమేజ్‌ కోరుకోవడం లేదా?
ఎవరినో చూసి, నేనూ అలానే ఉండాలి అనుకోవడం నాకు ఇష్టం ఉండదు. నా ప్రయాణం నాది. కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాలు నాకూ వచ్చాయి. అప్పట్లో కాల్షీట్లు సర్దుబాటు చేయడం కుదరక కొన్ని వదులుకున్నా. అయితే కథానాయిక ప్రాధాన్యం ఉన్న కథలంటే.. హారర్‌, థ్రిల్లర్‌ లేదంటే ఓ సమస్య కోసం పోరాటం చేసే స్త్రీ పాత్రలే అనుకోవడం తప్పు. మంచి ప్రేమకథలూ చేయొచ్చు. వ్యాపార విలువలు ఉన్న సినిమాలూ చేయొచ్చు. అలాంటి పాత్రలు వస్తే తప్పకుండా చేస్తా.

మీరు నటించిన సినిమాలు చూస్తే మీకేమనిపిస్తుంది? ‘ఇంకొంచెం బాగా నటిస్తే బాగుణ్ను’ అనుకుంటారా?
నాకే కాదు.. నటీనటులు ఎవరికైనా అలానే అనిపిస్తుంది. నాకైతే ఇంకొంచెం ఎక్కువ అనిపిస్తుంది. నా కుటుంబంలో సినీ పరిశ్రమకు చెందిన వాళ్లెవరూ లేరు. నాకు దగ్గరుండి నేర్పించే గురువులూ లేరు. నాకు నేనే నేర్చుకుంటూ వెళ్లాలి. అందుకే కెరీర్‌ ఆరంభంలో కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు. కొన్ని సినిమాలు చూస్తుంటే.. ‘అలా ఎందుకు నిలబడ్డాను? డైలాగ్‌ ఇలానే ఎందుకు చెప్పాను?’ అనిపిస్తుంటుంది. మరో పదేళ్ల తరవాత ఇప్పటి సినిమాలు చూస్తే.. అలాంటి భావనే కలుగుతుందేమో?

 

Tuesday, February 27, 2018

‘శ్రీదేవి ఇద్దరి కుమార్తెల గురించే నా దిగులు’

 శ్రీదేవి మృతితో ఆమె ఇద్దరు కుమార్తెలు జాన్వి, ఖుషి గురించి దిగులు పడుతున్నానని నటి షాలినీ కపూర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. జాన్వి కథానాయికగా నటిస్తున్న తొలి సినిమా ‘దఢక్‌’. ఇందులో షాలినీ కపూర్‌ ఆమె తల్లి పాత్ర పోషిస్తున్నారు. శ్రీదేవి మరణవార్త విని దిగ్భ్రాంతికి గురయ్యానని ఆమె చెప్పారు.

‘అద్భుతమైన నటి శ్రీదేవి మృతి నన్ను చాలా బాధించింది. ఆమె చక్కటి నటన, విభిన్నమైన పాత్రలు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుంటాయి. నా ఆలోచనలన్నీ ఆమె కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషుల చుట్టూ తిరుగుతున్నాయి. నేను అన్నింటి కంటే ఎక్కువగా ఆమె ఇద్దరు కుమార్తెల గురించి బాగా దిగులుపడుతున్నా’.
‘‘దఢక్‌’లో జాన్వి తల్లి పాత్రలో నటిస్తున్నారు. ఆమెకి, శ్రీదేవికి మధ్య ఉన్న ప్రేమ గురించి నాకు బాగా తెలుసు. ఆ అనుబంధాన్ని మాటల్లో వివరించలేం. ఆమె గురించి తలుచుకుంటుంటే చాలా బాధగా ఉంది. శ్రీదేవి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’ అని ఆమె పేర్కొన్నారు.
 

Monday, December 11, 2017

ఇదే వాగ్ధానం.. ఎప్పటికీ ప్రేమలో ఉంటాం..


భారత క్రికెట్‌ జట్టు సారథి విరాట్‌ కోహ్లీ, బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ ఓ ఇంటివారయ్యారు. కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది బంధువులు, స్నేహితులు సమక్షంలో ఈ ప్రేమ జంట ఒక్కటైంది. ఇటలీలోని తాస్కానిలోని ఓ రిసార్టులో విరాట్‌, అనుష్కలు పెళ్లి చేసుకున్నారు. 2013లో ఓ వాణిజ్య ప్రకటన షూటింగ్‌ సందర్భంగా కలిసిన కోహ్లీ, అనుష్క కొన్నేళ్లుగా సన్నిహితంగా ఉంటున్నారు. పెళ్లి చేసుకోవాలని ఈ ప్రేమ జంట ఈ మధ్యనే నిర్ణయించుకున్నా ఆ విషయం అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. శుక్రవారం అర్ధరాత్రి అనుష్క కుటుంబం ముంబయి నుంచి దిల్లీ వెళ్లగా వీరిద్దరి వివాహంపై వూహాగానాలు జోరందుకున్నాయి. అందుకు తగినట్లుగే అనుష్క, విరాట్‌ వివాహబంధంతో ఒకటయ్యారు. ఇటలీ నుంచి తిరిగొచ్చాక ఈ నెలాఖరులో విరుష్క జోడి ముంబయిలో పెళ్లి విందు ఇవ్వనుందని, జనవరి 4న ముంబయిలోని బాంద్రా కుటుంబ కోర్టులో పెళ్లి రిజిస్ట్రేషన్‌ ఉంటుందని తెలిసింది. మరోవైపు విరాట్‌, అనుష్క జంటకు సామాజిక మాధ్యమాల్లో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
రెండు చోట్ల వివాహ విందు
ఇటలీలో కొద్దిమంది కుటుంబ సభ్యుల మధ్య ఒక్కటైన ఈ జంట తమ బంధువుల కోసం ఈ నెల 21న దిల్లీలో, మిత్రులు, క్రికెటర్ల కోసం ఈ నెల 26న ముంబయిలో వివాహ విందు ఇవ్వనున్నట్టు ప్రకటించారు.
ట్విటర్‌లో పెళ్లి చిత్రాలు..
విరాట్‌కోహ్లీ, అనుష్కశర్మలు తమ పెళ్లి చిత్రాలను ట్విటర్‌లో పోస్టు చేశారు. ట్విటర్‌లో చిత్రాలను ఇప్పటికే వేల సంఖ్యలో అభిమానులు రీట్వీట్‌ చేశారు.

విరాట్‌-అనుష్క పెళ్లి అయిపోయిందా?

 విరాట్‌- అనుష్క పెళ్లి.. గత కొన్ని రోజులుగా అందరి నోటా నానుతున్న మాట. ఇద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు రావడం.. దాన్ని అనుష్క మేనేజర్‌ ఖండించడం.. ఆ తర్వాత అనుష్క ఎయిర్‌పోర్ట్‌లో కనిపించడం.. ఇలా కొన్నిరోజులుగా దీనిపై చర్చ నడుస్తూనే ఉంది. ఇటలీలో ఈ వారంలో వీరిద్దరూ పెళ్లి పీటలెక్కబోతున్నారంటూ కూడా వార్తలు వచ్చాయి. వీటికి కొనసాగింపుగా మరో ఆసక్తికరమైన వార్త ఒకటి బయటకొచ్చింది. అదేంటంటే.. ఇప్పటికే వీరిద్దరికీ పెళ్లయిపోయిందని!
వీరిద్దరి గురించి సోషల్‌మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఓ స్పోర్ట్స్‌ జర్నలిస్టు ఈ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. గురువారం భారత్‌ను వీడిన ఈ జంట శనివారమే ఒక్కటయ్యిందని, త్వరలో అధికారికంగా ప్రకటించబోతున్నారని పేర్కొన్నారు. అయితే, దీన్ని కూడా ఆ ఇరువురు గానీ, వారి కుటుంబసభ్యులు గానీ అధికారికంగా ధ్రువీకరించలేదు.
మరోవైపు వీరి పెళ్లికి సంబంధించిన మరికొన్ని వార్తలు సైతం చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఇటలీలోని టస్కనీ ప్రాంతంలో ఆరు ఎకరాల సువిశాలమైన ప్రాంతంలో ఉన్న అతి విలాసవంతమైన విల్లాలో వీరి వివాహం జరగనుందని, పంజాబీ సంప్రదాయంలో తంతు నిర్వహించనున్నారని తెలుస్తోంది. అంతేకాదు సంప్రదాయ బాంగ్రా నృత్యాలకు ఈ వేడుక వేదిక కానుందట. ఆహ్వానం అందిన వారిని మాత్రమే విల్లాలోకి అనుమతించే విధంగా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

పెళ్లి తర్వాత డిసెంబర్‌ 26న ముంబయిలో రిసెప్షన్‌ ఉంటుందని, దానికి కూడా క్రికెట్‌, బాలీవుడ్‌ వర్గాల నుంచి కొందరికి మాత్రమే ఆహ్వానముంటుందని సమాచారం. బాలీవుడ్‌ నుంచి షారుఖ్‌ఖాన్‌, ఆమీర్‌ఖాన్‌తో పాటు, క్రికెటర్లు తెందుల్కర్‌, యువరాజ్‌ సింగ్‌కు పెళ్లికి ఆహ్వానం అందినట్లు ఇది వరకే వార్తలు వచ్చాయి. ఏదేమైనా ప్రేమను ఏ మాత్రం సంశయించకుండా బయటపెట్టిన కోహ్లీ.. పెళ్లి విషయంలో మాత్రం ఇంత వరకు స్పందించకపోవడం గమనార్హం. ఎవరో ఒకరు అధికారికంగా ప్రకటించేంత వరకూ ఈ ప్రచారానికి తెరపడే అవకాశాలు కనిపించడం లేదు.
 

Saturday, December 9, 2017

విరాట్‌ పెళ్లికి వెళ్లేది వాళ్లిద్దరేనా?

 భారత క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, బాలీవుడ్‌ స్టార్‌ అనుష్క శర్మల వివాహ సందడి ప్రారంభమైనట్లే కనబడుతోంది. అధికారికంగా వీరి పెళ్లిపై ఇరు వర్గాల నుంచి ఎలాంటి సమాచారం లేకపోయినా జరుగుతున్న పరిణామాలు చూస్తే వీరి వివాహం ఖాయంగా కనిపిస్తున్నది.  కాగా శుక్రవారం కుటుంబంతో సహా అనుష్క ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో దర్శనమివ్వడంతో  ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చాయి. అదే సమయంలో కొన్నాళ్ల క్రితం డెహ్రాడూన్‌లో వీళ్లిద్దరిని ఆశీర్వదించిన పురోహితుడు కూడా విమానం ఎక్కేందుకు రావడంతో పెళ్లి వార్త నిజం కావొచ్చని అంచనా వేస్తున్నారు.
అయితే ఈ వివాహానికి సంబంధించి మరో వార్త ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. విరాట్ తన వివాహానికి కేవలం ఇద్దరు క్రికెటర్లను మాత్రమే ఆహ్వానించాడట. టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తో పాటు యువరాజ్ సింగ్‌లకు విరాట్ వివాహ ఆహ్వానం అందినట్లు సమాచారం. భారత జట్టు శ్రీలంకతో జరిగే వన్డే, టీ-20 సిరీస్‌తో బిజీగా ఉండటంతో విరాట్ సచిన్, యువీలతో పాటు తన బాల్య మిత్రులు కొందరిని వివాహానికి ఆహ్వానించాడట. మూడు నెలల క్రితమే ప్లాన్ చేశారని, విరాట్, అనుష్కల కుటుంబాలు కావాలనే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారని విరాట్ సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ నెల 12న ఇటలీలోని మిలాన్‌లో కోహ్లి, అనుష్కలు పెళ్లి చేసుకోబోతున్నారని కొంతమంది చెబుతుండగా, 15వ తేదీన వీరి వివాహం జరుగనున్నట్లు మరికొంతమంది చెబుతున్నారు.

Monday, October 23, 2017

వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్‌ వచ్చేస్తోంది..

 సోషల్‌ మీడియా యాప్‌లో ఎక్కువగా ప్రాచుర్యం సంపాదించుకున్న వాట్సాప్‌, కొత్త కొత్త ఫీచర్లతో అలరిస్తోంది. తాజాగా వాట్సాప్‌ గ్రూప్‌ వాయిస్‌, వీడియో కాలింగ్‌ ఫీచర్‌ను కూడా యూజర్లకు అందుబాటులోకి తీసుకొస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ ఐఫోన్‌ యాప్‌ లేటెస్ట్‌ బీటా వెర్షన్‌లో అందుబాటులో ఉంది. ఇప్పటికే వాట్సాప్‌ ఈ ఏడాదిలో పలు ఫీచర్లను ప్రవేశపెట్టి, 1 బిలియన్‌కు పైగా యూజర్లను తన సొంతం చేసుకుంది.  ఇటీవ‌ల ఐఫోన్ల‌లో ఉప‌యోగించే వాట్సాప్ అప్‌డేట్ కోడ్‌లో ఈ విషయానికి సంబంధించి సంకేతాలు ఉన్న‌ట్లు అంత‌ర్జాతీయ టెక్నిక‌ల్ వెబ్‌సైట్లు చెబుతున్నాయి.  2.17.70 ఐఓఎస్‌ అప్‌డేట్‌లో గ్రూప్‌ కాల్స్‌కు సంబంధించిన సూచనలు కలిగి ఉందని, ప్రస్తుతం ఇది ధృవీకరణ అయినట్టు డబ్ల్యూఏబీటాఇన్ఫో ఆదివారం ట్వీట్‌ చేసింది. 
గ్రూప్‌ వాయిస్‌ కాల్స్‌ గురించి చాలా సంకేతాలున్నప్పటికీ, గ్రూప్‌ వీడియో కాల్స్‌కు సంబంధించి ఒకే ఒక సంకేతం ఉన్నట్టు పేర్కొంది. గ్రూప్‌ వాయిస్‌ కాల్స్‌కు ఫీచర్‌పై ఈ యాప్‌ ప్రస్తుతం పనిచేస్తుందని, వచ్చే ఏడాది దీన్ని విడుదల చేయనున్నట్టు అంతకముందే పలు రిపోర్టులు నివేదించాయి. గ్రూప్ వీడియో కాలింగ్ గురించి కొద్దిగా సందిగ్ధ‌త ఉన్నా... గ్రూప్ వాయిస్ కాలింగ్ స‌దుపాయాన్ని మాత్రం వాట్సాప్ త్వ‌ర‌లో త‌ప్ప‌కుండా క‌ల్పించ‌నుంద‌ని తెలుస్తోంది. అయితే ఈ ఫీచ‌ర్లు ఎప్పుడు అందుబాటులోకి వ‌స్తాయనే విష‌యం ఇంకా తెలియాల్సి ఉంది.

Sunday, October 22, 2017

పుట్టిన రోజు శుభాకాంక్షలు ప్రభాస్‌

 
 యంగ్ రెబల్‌ స్టార్ ప్రభాస్ కొత్త చిత్రం సాహో ఫస్ట్ లుక్‌ వచ్చేసింది. ప్రభాస్‌ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ తమ అధికారిక ట్విట్టర్‌ పేజీలో దీనిని రిలీజ్ చేశారు. విదేశీ వీధుల్లో పొగ మంచు మసకలో.. ముసుగు ధరించిన ప్రభాస్‌ నడిచి వస్తున్న పోస్టర్‌ను వదిలారు. చూస్తుంటే హాలీవుడ్ స్థాయిలోనే దర్శకుడు సుజిత్ దీనిని రూపొందిస్తున్నాడేమో అనిపిస్తుంది.

Friday, October 20, 2017

క్రికెట్‌లో రాజు.. రారాజు

 
సుమారు 15 ఏళ్ల పాటు క్రికెట్‌ మైదానంలో తనదైన శైలిలో అలరించాడు వీరేంద్ర సెహ్వాగ్‌. మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ తెందుల్కర్‌తో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగి ఒంటి చేత్తో జట్టుకు విజయాలను అందించాడు. ఆ తర్వాత తనదైన ట్వీట్‌ షాట్లను సంధిస్తూ అభిమానుల్ని అలరిస్తూనే ఉన్నాడు. ఈ రోజు వీరూ 39వ పుట్టిన రోజును జరుపుకొంటున్నాడు. ఈ సందర్భంగా మాజీ, ప్రస్తుత క్రికెటర్లు, అభిమానుల నుంచి సెహ్వాగ్‌కు సామాజిక మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

* బౌలర్లకు ఎన్నో నిద్రపట్టిని రాత్రులు మిగిల్చి, విధ్వంసానికి మారుపేరుగా నిలిచిన వీరేంద్ర సెహ్వాగ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు: సురేశ్‌ రైనా
* హ్యాపీ బర్త్‌ డే సెహ్వాగ్‌: అనిల్‌ కుంబ్లే
* క్రికెట్‌లో తొలి ఇన్నింగ్స్‌లో రాజుగా.. వ్యాఖ్యాతగా రెండో ఇన్నింగ్స్‌లో రారాజుగా వెలిగిపోతున్న వీరేంద్ర సెహ్వాగ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. పండగ చేస్కో: హర్ష భోగ్లే
* ఎప్పుడైతే సెహ్వాగ్‌ క్రికెట్‌ ఆడటం మానేశాడో... అప్పట్నుంచే నేను ఇంట్లో కూర్చుని క్రికెట్‌ చూడటం మానేశా. హ్యాపీ బర్త్‌ డే సెహ్వాగ్‌: విజేందర్‌ సింగ్‌
* వీరూ నువ్వు మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నా: పార్ధీవ్‌ పటేల్‌
* గోల్డెన్‌ హార్ట్‌ కలిగిన లెజండ్‌ వీరూకి పుట్టిన రోజు శుభాకాంక్షలు: మిథున్‌ మన్‌హాస్‌
* హ్యాపీ బర్త్‌ డే పాజీ: మహమ్మద్‌ షమి
* హ్యాపీ బర్త్‌ డే లెజండ్‌. మరింత కాలం నిన్ను చూసేలా దేవుడు దీవించాలని కోరుకుంటున్నా: క్రిస్‌ గేల్‌
* హ్యాపీ బర్త్‌ డే వీరూ. ఫియర్‌లెస్‌ అన్న పదానికి అర్ధం చెప్పినందుకు ధన్యవాదాలు. నాన్‌ స్ట్రైకర్‌ ఎండ్‌లో ఉండి నీ త్రిశతకాన్ని చూడగలిగాను: రహానె
* క్రికెట్‌ చరిత్రలో విధ్వంసకరమైన ఓపెనింగ్‌ బ్యాట్స్‌మెన్‌గా పేరు తెచ్చుకున్న వీరూకి హ్యాపీ బర్త్‌ డే. వ్యాఖ్యాతగా నువ్వు మమ్మల్ని ఇలాగే ఎంటటైన్‌ చేస్తూ ఉండు: ఇషాంత్‌ శర్మ
* అంతర్జాతీయ క్రికెట్‌లో 17,253 పరుగులు, టెస్టుల్లో రెండు త్రిశతకాలు సాధించిన ఇద్దరు క్రికెటర్లలో ఒకడు, వన్డే క్రికెట్‌ మ్యాచ్‌లో 200పైగా పరుగులు సాధించిన వీరేంద్ర సెహ్వాగ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు: ఐసీసీ
* వీరూ భాయ్‌కి జన్మదిన శుభాకాంక్షలు. సోషల్‌ మీడియాకి ఎక్కువ సమయం కేటాయించు: హర్భజన్‌ సింగ్‌
1999లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన సెహ్వాగ్‌ 104 టెస్టుల్లో 49.34 సగటుతో 8,586 పరుగులు చేయగా 251 వన్డేల్లో 35.05 సగటుతో 8,273 పరుగులు సాధించాడు. 1999లో పాకిస్థాన్‌పై సెహ్వాగ్‌ వన్డే క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. 2004లో అదే పాకిస్థాన్‌పై టెస్టుల్లో తొలి త్రిశతకాన్ని నమోదు చేశాడు సెహ్వాగ్‌. భారత్‌ తరఫున ఈ ఘనత అందుకున్న మొదటి ఆటగాడు సెహ్వాగ్‌. ఆ తర్వాత 2008లో దక్షిణాఫ్రికాపై సెహ్వాగ్‌ 319 పరుగులు చేశాడు. 2011లో వెస్టిండీస్‌పై ఇండోర్‌లో జరిగిన వన్డేల్లో ఈ డాషింగ్‌ ఓపెనర్‌ 149 బంతుల్లో 219 పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు మన సెహ్వాగ్‌. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మన వీరేంద్రుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పేయండి.