Friday, March 10, 2017

తేజ దర్శకత్వంలో స్టార్ వారసురాలు

 చిత్రం, నువ్వు నేను, జయం లాంటి సినిమాలతో ఇండస్ట్రీని మలుపు తిప్పిన దర్శకుడు తేజ. అంత కొత్త వారితో తిరుగులేని విజయాలు సాధించిన ఈ గ్రేట్ డైరెక్టర్, కొంత కాలంగా సక్సెస్ కు దూరమయ్యాడు. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలన్ని వరుసగా ఫ్లాప్ అవ్వటంతో ఆయన కెరీర్ కష్టాల్లో పడింది. లాంగ్ గ్యాప్ తరువాత ప్రస్తుతం రానా హీరోగా ఓ పొలిటికల్ డ్రామాను తెరకెక్కిస్తున్నాడు తేజ. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కావచ్చింది.
నేనే రాజు నేనే మంత్రి పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా తరువాత మరోసారి తన మార్క్ లవ్ స్టోరిని చేసే ఆలోచనలో ఉన్నాడు తేజ. అంతా కొత్త వారితో ఓ క్యూట్ లవ్ స్టోరిని ప్రీపేర్ చేస్తున్నాడు. ఈ సినిమాతో ప్రముఖ హీరో రాజశేఖర్ కూతురు శివానిని హీరోయిన్ గా పరిచయం చేయబోతున్నాడట. గతంలో రాజశేఖర్ హీరోగా తేజ అహం అనే సినిమాను ఎనౌన్స్ చేశాడు. అయితే ఈ సినిమా చర్చల దశలోనే ఆగిపోయింది. గతంలో తేజ పరిచయం చేసిన నటీనటులు ఇప్పుడు స్టార్ గా వెలుగొందుతున్నారు. అదే బాటలో రాజశేఖర్ కూతురికి కూడా తేజ బ్రేక్ ఇస్తాడేమో చూడాలి.

Tuesday, March 7, 2017

మొన్న రజనీ... నిన్న కమల్‌

 తమిళనాడులో రాజకీయాలకు, సినిమాకు అవినాభావ సంబంధం ఉంది. ఇప్పటి వరకూ రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రుల్లో 90 శాతం సినిమాకు చెందిన వారేనన్నది జగమెరిగిన సత్యం. జయలలిత మరణానంతరం సినిమా పరిశ్రమకు సంబంధంలేని ముఖ్యమంత్రి చేతిలోకి ప్రభుత్వం వెళ్లింది. దీన్ని తమిళనాడులోని అత్యధిక శాతం ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో నటుడు కమలహాసన్‌ ఇంతకు ముందెప్పుడూ లేని విధంగా తన భావాలను ట్విట్టర్‌ ద్వారా వెలిబుచ్చడం ప్రజలను ఆకర్షించింది.
కమల్‌ బహిరంగంగానే శశికళ నాయకత్వాన్ని వ్యతిరేకించి, పన్నీర్‌సెల్వంకు మద్దతు ప్రకటించారు. దీంతో ఆయన రాజకీయాలపై ఆసక్తి చూపుతున్నారనే ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో కమల్‌ ఆదివారం రాష్ట్రంలోని నలుమూల అభిమానుల ప్రతినిధులను, తన సంఘానికి చెందిన న్యాయవాదులను కలవడంతో  రాజకీయవర్గాల్లో అలజడి మొదలైంది. అయితే సమావేశంలో రాజకీయ ప్రస్తావన తీసుకురాకపోవడంతో వారు ఊపిరిపీల్చుకున్నారు.

కమల్‌ అభిమానులకు ఈ సమావేశం ఏమాత్రం రుచించలేదు. వారు తన అభిమాన నటుడు రాజకీయాల్లోకి ప్రవేశించాలని కోరుకుంటున్నారు. కమల్‌పై ఒత్తిడి తీసుకొస్తామని, ఆయన రాజకీయరంగ ప్రవేశానికి ఇదే సరైన సమయం అని అభిమానులు అంటున్నారు. కాగా మొన్నటి వరకూ ఇలాంటి రాజకీయ సెగ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఎదుర్కొన్నారు. ఇప్పుడు అలాంటి పరిస్థితే కమలహాసన్‌కు ఎదురవుతోందన్నది పరిశీలకుల మాట.

Monday, March 6, 2017

నిప్పుతో ఆడగలిగే మగాడు దొరకలేదట!

 మాజీ విశ్వసుందరి సుస్మితాసేన్‌ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. కానీ ఇద్దరు పిల్లలను దత్తత తీసుకునిపెంచుకుంటోంది. కొంతకాలం వరకు కెమెరాకు దూరంగా ఉన్న సుస్మిత ఇప్పుడిప్పుడే ఈవెంట్లకు హాజరవుతోంది. అయితే ఈమధ్యకాలంలో సుస్మిత ఎక్కడికి వెళ్లినా ఎంతకాలమని సింగిల్‌గా ఉంటారు, పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని అడుగుతున్నారట. వారికి సమాధానంగా సుస్మిత ఇలా చెప్పుకొచ్చింది. ‘నాయిష్ట ప్రకారమే ఒంటరిగా ఉన్నా.. నా ఛాయిస్‌తో సురక్షితంగా, సంతోషంగా ఉన్నా. ఇతరుల ఛాయిస్‌నీ అలాగే గౌరవిస్తున్నా.. సింగిల్స్‌ అయినా డబుల్స్‌ అయినా గెలవడానికేగా ఆడతాం.. అయినా ఆ ప్రశ్నకి సమాధానం చెప్పితీరాలంటే.. నిప్పుతో ఆడగల మగాడు నాకు ఇంకా దొరకలేదు’ అని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా కొందరి నోటికి తాళం వేసింది సుస్మిత.

Saturday, March 4, 2017

కూతురు నటిస్తే కాళ్లు విరగ్గొడతాడట..

 బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌కి తన కుమార్తె త్రిషాలా నటి కావడం ఇష్టంలేదట. ఒకవేళ త్రిషాలా నటిఅవుతానంటే ఆమె కాళ్లు విరగ్గొట్టేవాణ్ణి అంటున్నారు సంజయ్‌. జైలు నుంచి విడుదలయ్యాక సంజయ్‌ నటిస్తున్న తొలి చిత్రం ‘భూమి’. తండ్రీ కూతుళ్ల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో సంజయ్‌ కుమార్తెగా అదితిరావ్‌ హైదరి నటిస్తోంది. ఆగ్రాలో నిర్వహించిన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సంజయ్‌ను రీల్‌ లైఫ్‌ కూతురు అదితికి రియల్‌ లైఫ్‌ కూతురు త్రిషాలాకి పోలికేంటి అని ఓ విలేకరి అడిగారు. ఇందుకు సంజయ్‌.. ‘త్రిషాలా నటి అవుతానంటే ఆమె కాళ్లు విరగ్గొట్టేవాణ్ణి. కానీ అదితితో నేను అలా చెయ్యలేను’ అని సరదాగా సమాధానమిచ్చారు.
సంజయ్‌, ఆయన తల్లిదండ్రులూ నటీనటులే. అలాంటప్పుడు తన పిల్లల్ని సినిమా రంగం వైపు ఎందుకు రానివ్వాలనుకోవడంలేదని మళ్లీ విలేకరులు ప్రశ్నించారు. ‘త్రిషాలాని మంచి, సురక్షితమైన ఉద్యోగంలో చూడడానికి చాలా కష్టపడ్డాను. మంచి కళాశాలలో చేర్పించాలని చాలా ఖర్చు పెట్టాను. ఇప్పుడు ఎఫ్‌బీఐలో పనిచేస్తోంది. మరోపక్క ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కూడా చేస్తోంది. కానీ హిందీ చిత్ర పరిశ్రమలో ఉండాలంటే ముందు తనకి భాష తెలిసుండాలి. అందులోనూ నటి కావడం అంత సులువు కాదు. నటన పైకి గ్లామరస్‌గా కనిపిస్తుంది కానీ అది చాలా కష్టమైన ఉద్యోగం’ అని చెప్పుకొచ్చారు సంజూ బాబా.

Friday, March 3, 2017

టాలీవుడ్‌ ముద్దుగుమ్మ పెళ్లి కబురు..!

  టాలీవుడ్ లో  అగ్ర హీరోయిన్‌గా  చలామణి అవుతున్న కాజల్‌ అగర్వాల్‌  పెళ్లికి సంబంధించి  పలు రూమర్లు  సోషల్‌ మీడియాలో​  చక్కర్లు కొడుతున్నాయి.  చారడేసి కళ్లతో  చందమామ సినిమాతో స్టార్ గా మారిన కాజల్, తెలుగు, తమిళ సినిమాల్లో  ఓ వెలుగు వెలుగుతోంది.  ఈ ముద్దుగుమ్మ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతోందిట. ఇదే  ఇపుడు  సోషల్‌ మీడియా టాప్‌ టాక్‌.   ముంబైకి  చెందిన ఓ  బిజినెస్ మెన్ తో కాజల్ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిందనీ, వీరిద్దరూ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు.  అంతేకాదు ఇరు కుటుంబ పెద్దలు వీరి ప్రేమ పెళ్ళికి  గ్రీన్‌ సిగ్నల్‌ కూడా ఇచ్చేసారనీ, దీంతో వీరు  ఏడు అడుగులు వేయనున్నారనీ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.  కాజల్ చేసుకోబోయే వ్యక్తికి దేశవ్యాప్తంగా హోటల్స్ చైన్ ఉందని అంటున్నారు.               కాగా టాలీవుడ్‌ మెగా‍స్టార్‌  చిరంజీవి  సెన్సేషనల్‌ మూవీ  ఖైదీ నెం 150లో అమ్మడూ.. లెస్ట్‌ డు కుమ్ముడుతో  అభిమానులను కుమ్మేసిన ఈ కలువ కళ్ళ సుందరి కాజల్ కి ఈ ఏడాది బాగానే కలిసి వచ్చిందని చెప్పాలి.  ప్రస్తుతం వివేగం, నేనే రాజు నేనే మంత్రి తో పాటు డీకే దర్శకత్వంలో ఓ లేడి ఓరియెంటెడ్   చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే  పెళ్లి కబుర్లపై కాజల్‌ అధికారింగా స్పందించేంతవరకు ఈ సస్పెన్స్‌ తప్పదు. మరి.. ఈ శుభవార్త  అభిమానుల చెవిన ఎపుడు వేస్తోందో.. వేచి చూడాల్సిందే..

Monday, February 27, 2017

ఆ కోరిక తీరనుంది!

  వచ్చే అదృష్టాన్ని నిలువరించడం ఎవరితరం కాదు. అలాగే అందని దాని కోసం ఆశ పడడం వృథానే. అలాగని కలల్ని కనడం, వాటిని నెరవేర్చుకోవడానికి కృషి చేయడం సాధికుల లక్షణం. అదే విధంగా అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం తెలివైన వారి పని. ఇక సినీ కథానాయికల విషయానికొస్తే వరించి వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని ఎదిగే వారు కొందరైతే, కోరుకున్న అవకాశాలను సంపాదించుకునే వారు మరి కొందరు. మొదట నుంచి అందాలార బోసి కమర్షియల్‌ హీరోయినన్ లగా పేరు తెచ్చుకుని నటిగా ఒక స్థాయికి చేరిన తరువాత కథలో సెంటరిక్‌ పాత్రలను పోషించాలని ఆశ పడుతుండడం సహజం.
అయితే ఆశపడిన వారందరికీ అలాంటి అవకాశాలు రావడం అన్నది కల్లే. కొందరికి మాత్రం ఆశించకుండానే హీరోయిన్  ఓరియెంటెడ్‌ అవకాశాలు ముంగిట వాలతాయి. ఒకప్పుడు నటి విజయశాంతి అలాంటి లేడీ ఓరియెంటెడ్‌ కథా చిత్రాల్లో నటించి లేడీ సూపర్‌స్టార్‌గా వెలుగొందారు. తాజాగా నటి నయనతార, అనుష్క, త్రిష లాంటి వారు కథల్లో సెంటరిక్‌ పాత్రలో రాణిస్తున్నారు. ఇటీవల నటి సోనియా అగర్వాల్‌ కూడా లేడీ ఓరియెంటెడ్‌ పాత్రలో నటిస్తున్నారు. ఆమె నటిస్తున్న అహల్య అనే చిత్రం ఐదు భాషల్లో తెరకెక్కుతోంది. కాగా నటి కాజల్‌అగర్వాల్‌కు కూడా స్త్రీ ప్రధాన పాత్రతో కూడిన చిత్రాల్లో నటించాలన్న ఆశ పుట్టింది.
ఇప్పటి వరకూ గ్లామరస్‌ పాత్రలకే పరిమితవైున ఈ బ్యూటీ కెరీర్‌ మధ్యలో కాస్త డౌన్ నా మళ్లీ గాడిలో పడింది. ప్రస్తుతం అజిత్‌తో వివేకం చిత్రంలోనూ, విజయ్‌తో ఆయన 61వ చిత్రంలోనూ రొమాన్స్  చేస్తున్న ఈ ఉత్తరాది భామ కోరుకున్నట్లు తాను ఆశపడిన పాత్రలో నటించే అవకాశం వరించిందన్నది తాజా సమాచారం. దర్శకుడు డీకే నయనతార కోసం ఒక హీరోయిన్  సెంటరిక్‌ కథను తయారు చేసుకున్నారు.
ఈ పాత్రలో ఇప్పుడు నటి కాజల్‌అగర్వాల్‌ను ఎంపిక చేసుకున్నారు. కాజల్‌ ఇంతకు ముందు ఆయన దర్శకత్వంలో కవలైవేండామ్‌ చిత్రంలో నటించారు. ఆ స్నేహం కారణంగానే ఈ హీరోయిన్  ఓరియెంటెడ్‌ కథా చిత్రంలో నటించే అవకాశం కాజల్‌ను వరించిందని తెలుస్తోంది. మొత్తం మీద కాజల్‌ కోరుకుంది సాధించుకుంది. ఇప్పుడు ఈ అమ్మడు కూడా నయనతార, త్రిషల వరుసలో చేరబోతున్నందుకు ఆనందంలో తేలిపోతోందట. లక్కు అంటే ఇదే మరి.

Saturday, February 25, 2017

రజనీకాంత్‌ సరసన మరో బాలీవుడ్‌ నటి?

 సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో ‘2.0’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత ఆయన ‘కబాలి’ దర్శకుడు పా రంజిత్‌ దర్శకత్వంలో మరో చిత్రంలో నటిస్తున్నారు. రజనీ అల్లుడు, నటుడు ధనుష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మేలో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శక-నిర్మాతలు చిత్రంలో మిగిలిన నటీనటుల ఎంపిక పనుల్లో పడినట్లు తెలుస్తోంది. రజనీకాంత్‌కి జోడీగా బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌ను అనుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే దర్శక-నిర్మాతలు విద్యాబాలన్‌ను కలిశారని, నటించడానికి ఆమె కూడా ఆసక్తి చూపారని తమిళ చిత్రవర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే విద్యాబాలన్‌ కోలీవుడ్‌లో నటిస్తున్న తొలి చిత్రమిదే అవుతుంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.
లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మిస్తున్న ‘2.0’ చిత్రంలో అమీ జాక్సన్‌ కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబరులో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎ.ఆర్‌. రెహమాన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

Friday, February 24, 2017

రివ్యూ: విన్నర్‌


కథేంటి?: హార్స్‌ రేసింగ్‌నే వ్యాపారంగా చేసుకొన్న కుటుంబానికి చెందిన వ్యక్తి మహేంద్రరెడ్డి (జగపతిబాబు). ఆయన కొడుకే సిద్ధార్థ్‌(సాయిధరమ్‌ తేజ్‌). భార్య చనిపోవడంతో సిద్ధార్థే లోకంగా బతుకుతుంటాడు. కానీ ఉన్నట్టుండి సిద్ధార్థ్‌కి తన తండ్రిపై ద్వేషం పెరుగుతుంది. అందుకే చిన్నప్పుడే ఇంటి నుంచి పారిపోతాడు. పెద్దయ్యాక న్యూ లుక్‌ పత్రికకు క్రియేటివ్‌ హెడ్‌గా పనిచేస్తుంటాడు. ఒక పార్టీలో తొలి చూపులోనే సితార (రకుల్‌ప్రీత్‌సింగ్‌)ని చూసి ప్రేమిస్తాడు. ఒక లక్ష్యం కోసం పాటుపడుతున్న ఆమెని ప్రేమలో దించే క్రమంలో ఓ చిన్న పొరపాటు జరుగుతుంది. దాంతో సితార తండ్రి రాజీవ్‌రెడ్డి (సురేష్‌).. నెంబర్‌ వన్‌ రేసర్‌ అయిన సిద్ధార్థ్‌రెడ్డి(ఠాకూర్‌ అనూప్‌సింగ్‌)తో పెళ్లి చేయాలని నిర్ణయిస్తాడు. అది తెలుసుకొని సిద్ధార్థ్‌ ఎలాగైనా పెళ్లి ఆపాలని వెళతాడు. ఇంతలో సితారే తనకి ఈ పెళ్లి ఇష్టం లేదని, తాను సిద్ధార్థ్‌ని ప్రేమించానని, అతను కూడా హైదరాబాద్‌లో రేసరే అని చెబుతుంది. కావాలంటే సిద్ధార్థ్‌రెడ్డికీ, సిద్ధార్థ్‌కీ మధ్య పోటీ పెట్టమని కూడా చెబుతుంది. అదే సమయంలోనే ఈ పోటీలో త‌న‌ కొడుకు సిద్ధార్థ్‌రెడ్డి గెలుస్తాడని మహేందర్‌రెడ్డి అక్కడికొచ్చి చెబుతాడు. అది చూసి ఒక్కసారిగా షాక్‌ అవుతాడు సిద్ధార్థ్‌. తన స్థానంలో వచ్చిన సిద్ధార్థ్‌రెడ్డి ఎవరో తెలుసుకోవాలనుకొంటాడు. మరింతకీ ఆ సిద్ధార్థ్‌రెడ్డి ఎవరు? రేసింగ్‌లో ఎవరు గెలిచారు? సిద్ధార్థ్‌రెడ్డి అసలు రూపం బయటపెట్టి తన తండ్రికి సిద్ధార్థ్‌ ఎలా దగ్గరయ్యాడు? సితార లక్ష్యం కోసం, ఆమె మనసు సొంతం చేసుకోవడం కోసం సిద్ధార్థ్‌ ఏం చేశాడు? తదితర విషయాల్ని తెరపై చూడాల్సిందే.

ఎలా ఉందంటే?: తెలుగు సినిమాకి అలవాటైన ఫార్ములా కథే ఇది. ఆ మాట కొస్తే ఫార్ములా కథలు తప్పేం కాదు. కాకపోతే ప్రేక్షకుడు థియేటర్లో కూర్చున్నంతసేపూ ఇది మనం చూసేసిన కథే అనిపించకుండా, ఏ సన్నివేశానికి ఆ సన్నివేశం సరదాగా గడిచిపోయిందంటే చాలు.. పాసైపోయినట్టే.. ఆ విషయంలో కొంత వరకు సఫలమయ్యాడు దర్శకుడు. తండ్రీ-కొడుకుల బంధానికి హార్స్‌రేస్‌ నేపథ్యాన్ని జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కథా నేపథ్యంలో కొత్తదనం ఉంది తప్ప కథ, కథనాలు మాత్రం సాధారణంగానే అనిపిస్తాయి. కథ ఎత్తుగడ, హీరోయిన్‌ని చూసి హీరో ప్రేమలో పడటం, ఆ తర్వాత వచ్చే ప్రేమ సన్నివేశాలు రొటీన్‌గా సాగుతాయి. ‘సింగమ్‌ సుజాత’గా పృథ్వీ కథలోకి ప్రవేశించాక సన్నివేశాలు పరుగులు పెట్టాయి. మహేందర్‌రెడ్డి కొడుకుగా, ఠాకూర్‌ అనూప్‌సింగ్‌ ప్రవేశంతో కథ ఆసక్తికర మలుపు తిరుగుతుంది. అయితే ఆ తర్వాత కథ మరింత రక్తి కట్టాల్సి ఉండగా, అలా జరగదు. విరామానికి ముందున్న ఆసక్తి క్రమంగా తగ్గిపోతూ వస్తుంది. ద్వితీయార్ధంలో పీటర్‌హెయిన్స్‌గా అలీ చేసే సందడి, పతాక సన్నివేశాల్లో హార్స్‌రేసింగ్‌ సన్నివేశాలు అలరిస్తాయి. కథంతా ప్రేక్షకుడి వూహకు తగినట్లుగానే సాగుతుంది. ఈ సినిమాలో కొత్తగా ఏదైనా ఉందంటే అది హార్స్‌రేసింగ్‌ నేపథ్యంలో కూడిన సన్నివేశాలే. తొలి సగభాగం స్థాయిలో విరామం తర్వాత కూడా వినోదం మరింత పండుంటే ఈ సినిమా మరోస్థాయికి వెళ్లేది.
ఎవరెలా చేశారంటే: సాయిధరమ్‌తేజ్‌ హుషారుగా నటించాడు. భావోద్వేగంతో కూడిన సన్నివేశాల్లోనూ పర్వాలేదనిపించాడు. డ్యాన్స్‌, ఫైట్ల విషయంలో ఎప్పటిలాగే తన మార్కును చూపించాడు. రకుల్‌ ప్రీత్‌సింగ్‌ అందంగా కనిపించింది. పృథ్వీ, అలీ, వెన్నెల కిషోర్‌ వినోదాన్ని పంచే బాధ్యతను చక్కగా నిర్వర్తించారు. సినిమాలో వాళ్ల పాత్రలే హైలైట్‌ అయ్యాయి. జగపతిబాబు నటన, ఆయన పాత్ర చాలా బాగుంది. ప్రతినాయకుడిగా ఠాకూర్‌ అనూప్‌ సింగ్‌ తన పరిధి మేర బాగానే నటించాడు. సాంకేతికంగా ఈ సినిమాకు మంచి మార్కులు పడతాయి. ఛాయాగ్రహణం, సంగీతం బాగున్నాయి. అబ్బూరి రవి సంభాషణల్లో మెరుపులు కనిపించాయి. దర్శకుడు తాను అనుకున్న కథను అనుకున్నట్లు తెరకెక్కించాడు. అయితే ద్వితీయార్ధంపై దృష్టి పెట్టాల్సింది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. విదేశాల్లో పాటలు, హార్స్‌ రేసింగ్‌ సన్నివేశాలు చక్కటి నిర్మాణ విలువలకు అద్దం పట్టాయి.
చివరిగా: తండ్రీకొడుకుల బంధంతో ‘విన్నర్‌’