Saturday, November 12, 2016

కొత్త రూ.2వేల నోటుపై షాకింగ్ న్యూస్‌& కొత్త నోట్లన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి?

కొత్త రూ.2వేల నోటుపై షాకింగ్ న్యూస్‌

ఆర్‌బీఐ గ‌వ‌ర్న‌ర్‌.. ఉర్జిత్ ప‌టేల్ సంత‌కంతో  ప్రజల చేతుల్లో మిలమిలాడుతున్న 2వేల రూపాయ‌ల నోటుపై  షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది.  నకిలీ  నోట్లకు చెక్ పెట్టేలా అత్యంత జాగ్రత్తగా  డిజైన్ చేసిన ఈ తాజా నోట్లలో అదనపు సెక్యూరిటీ ఫీచర్స్  పొందుపరచలేదన్న  వార్త కలకలం రేపుతోంది. సరిపడా సమయంలేక  భద్రతా లక్షణాలను పాత రూ. 500 నుంచి రూ. 1,000 నోట్ల మాదిరిగా ఉంచినట్టు సీనియర్ ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు.  హై సెక్యూరిటీ ఫీచర్స్ ను   జోడించడానికి పెద్ద కసరత్తు చేయాల్సి వస్తుందని,  ఈ  ప్ర్రక్రియకు కనీసం ఐదు నుంచి ఆరు సంవత్సరాల సమయం పడుతుందని ఆయన వివరించారు. 
ఇలాంటి ఎక్స్ ర్ సైజ్   చివరిసారి 2005 లో చేపట్టారన్నారు. వాటర్ మార్క్స్,  సెక్యూరిటీ థ్రెడ్, ఫైబర్,  గుప్త చిత్రం లాంటి  ఇతర భద్రతా ఫీచర్స్ చేర్చడానికి   అనేక అనుమతులు, ఫైనల్ గా క్యాబినెట్ ఆమోదం అవసరమని తెలిపారు.  నూతన నోట్ల నిర్ణయం  ఆరు నెలల క్రితం జరిగిందనీ , దీంతో భద్రతా లక్షణాలు మార్చే  సమయం  చాలక,  డిజైన్ మార్చినా, భద్రతా లక్షణాలను పాత నోట్ల మాదిరిగానే ఉంచినట్టు ఆ  అధికారి తెలిపారు.

మరోవైపు కొత్త కరెన్సీ నోట్లకు పాకిస్తాన్ నుంచి పొంచి వున్న నకిలీ  ముప్పుపై  ప్రశించినపుడు.. అసాధ్యమని తేల్చి పారేశారు..డిజైన్ మాత్రమే మార్చబడింది తప్ప భద్రతా లక్షణాలు అలాగే ఉన్నాయన్నారు. పాకిస్థాన్  ప్రభుత్వ ముద్రణాలయంలో నకిలీ నోట్లు   ప్రింట్ అవుతున్నాయని ఆయన గుర్తు చేశారు.

కొత్త నోట్లన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి?

 కేంద్ర ప్రభుత్వం 500, 1000 రూపాయల నోట్లను రద్దుచేస్తున్నట్లు ప్రకటించిన కాసేపటికే రిజర్వు బ్యాంకు గవర్నర్ ఊర్జిత్ పటేల్.. కొత్త 2వేలు, 500 రూపాయల నోట్లను చూపించారు. అప్పటికే భారీ మొత్తంలో ఈ నోట్లు రిజర్వు బ్యాంకుకు చేరుకున్నాయి. కానీ వీటన్నింటినీ ఎక్కడ ముద్రించారు, ఎలా తీసుకొచ్చారు? ఇదంతా ఆసక్తికరమే. గత ఆరు నెలలుగా ఒక చార్టర్డ్ విమానం నిండా కొత్త నోట్లను మైసూరులోని ప్రభుత్వ ప్రెస్ నుంచి ఢిల్లీలోని రిజర్వు బ్యాంకు ప్రధాన కార్యాలయానికి తరలిస్తూనే ఉన్నారు.


ఇన్నాళ్లుగా అసలు మైసూరులో విమానాశ్రయం ఎందుకు, అక్కడ అనవసరం అని భావించినవాళ్లు ఇప్పుడు ఈ విషయం తెలిసి నోళ్లు వెళ్లబెడుతున్నారు. ఇక్కడ ఒకే ఒక్క రన్‌వే ఉంది. అక్కడి నుంచే కొత్త నోట్లన్నీ సురక్షితంగా, అత్యంత రహస్యంగా ఢిల్లీకి, పలు నగరాల్లో ఉన్న రిజర్వు బ్యాంకు శాఖలకు చేరుకున్నాయి. మూడోకంటికి తెలియకుండా కేవలం అతి కొద్దిమందికి మాత్రమే తెలిసిన ఈ వ్యవహారాన్ని జాగ్రత్తగా పూర్తిచేయడంలో మైసూరు విమానాశ్రయానిది కూడా ప్రధాన పాత్రే. 
500, 1000 రూపాయల నోట్లను రద్దుచేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించేసరికే ఈ నోట్లన్నీ వివిధ నగరాల్లో ఉన్న రిజర్వు బ్యాంకు శాఖలకు చేరిపోయాయి. తర్వాత అక్కడి నుంచి వివిధ బ్యాంకులకు వాటిని తరలించారు. మైసూరులో ఉన్న భారతీయ రిజర్వు బ్యాంకు నోటు ముద్రణ్ లిమిటెడ్ సంస్థలో కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈ నోట్లను ముద్రించారు. ఆ ప్రెస్‌కు ప్రత్యేకమైన రైల్వేలైను, నీళ్ల పైపులైన్ కూడా ఉన్నాయి. రెండు దశాబ్దాల నాటి ఈ ప్రపెస్‌ ప్రపంచంలోనే అత్యుత్తమమైన ప్రింటింగ్ ప్రెస్‌లలో ఒకటిగా పేరొందింది. ఇక్కడే ప్రత్యేకంగా కరెన్సీ ముద్రణకు కావల్సిన పేపర్ తయారీ విభాగం కూడా ఉంది. 
ఆరు నెలల క్రితమే రెండు వేల రూపాయల నోట్ల ముద్రణ మొదలైనా, ఆ విషయం ఎవరికీ తెలియలేదు. ఒక్కో బ్యాంకుకు రూ. 20 లక్షల నుంచి రూ. 2 కోట్ల వరకు వాటివాటి సామర్థ్యాన్ని బట్టి ఈ కొత్త నోట్లను పంపిణీ చేశారు. కేవలం డబ్బుల రవాణా కోసమే కేంద్ర ప్రభుత్వం ఒక ప్రైవేటు చార్టర్డ్ విమానాన్ని అద్దెకు తీసుకుంది. ఇందుకోసం ఈ విమానానికి రూ. 73.42 లక్షలు చెల్లించారు.

 


 

 

Friday, November 11, 2016

పాత నోట్లతో చెల్లింపులకు గడువు పెంపు



పాత నోట్లతో ప్రజా వినియోగ సేవల బిల్లుల చెల్లింపునకు గడువు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో 14వ తేదీ అర్థరాత్రి వరకు పాత రూ.500, 1000 నోట్లతో విద్యుత్‌, నీటి బిల్లులు, ఆస్తిపన్ను, తదితర ప్రజా వినియోగ పన్నులు చెల్లించ వచ్చు. తొలుత 11వ తేదీ అర్థరాత్రి వరకే అవకాశం ఇచ్చినప్పటికీ ప్రజల నుంచి అనూహ్య స్పందన రావటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇవాళ రాత్రి 7గంటల వరకు దాదాపు రూ.40కోట్ల పన్నులు వసూలయ్యాయని నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తెలిపారు. మరో 72గంటల పాటు గడువు పొడిగించినందున నగరవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

రివ్యూ: సాహసం శ్వాసగా సాగిపో

 కథేంటంటే?: లీలా (మంజిమ మోహన్‌)కి సినిమాలంటే ఇష్టం. వైజాగ్‌కి చెందిన తన స్నేహితురాలు మైత్రేయితో కలిసి స్క్రిప్ట్‌ రైటర్‌గా చిత్ర పరిశ్రమలో స్థిరపడాలని ప్లాన్‌ చేస్తుంది. కొన్ని రోజులు గడిపేందుకు మైత్రేయి ఇంటికి వస్తుంది. అక్కడే మైత్రేయి సోదరుడైన రజనీకాంత్‌(నాగచైతన్య)కి దగ్గరవుతుంది. రజనీకాంత్‌కు బైక్‌పై ప్రయాణమంటే చాలా ఇష్టం. కన్యాకుమారికి బైక్‌పై వెళ్లాలనుకొంటాడు. అది తెలిసి లీలా కూడా ప్రయాణమవుతుంది. ఇద్దరూ కన్యాకుమారి వెళ్లి తిరిగొచ్చే సమయంలో రోడ్డు ప్రమాదానికి గురవుతారు. ఆస్పత్రిలో రజనీకాంత్‌ని చేర్పించిన లీలా.. మహారాష్ట్రలో ఉన్న తన అమ్మానాన్నలపై జరిగిన హత్యాయత్నం గురించి తెలుసుకొని అక్కడికి వెళ్లిపోతుంది. అయితే రజనీ, లీలా కన్యాకుమారి నుంచి తిరిగి వస్తుండగా జరిగింది ప్రమాదం కాదని, లీలాని అంతం చేయాలనే పథకం అని ఆ తర్వాత తెలుస్తుంది. మరి రజనీకాంత్‌ అప్పుడెలా స్పందించాడు? ఇంతకీ లీలాని చంపాలనుకొన్నది ఎవరు? రజనీకాంత్‌.. మహేష్‌గా ఎలా మారాడు? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
 ఎలా ఉందంటే?: గౌతమ్‌మేనన్‌ మార్క్‌ సినిమా ఇది. తొలి సగభాగం ‘ఏమాయ చేసావె’ తరహాలోనే ఓ పక్కింటి కుర్రాడి ప్రేమకథని చూపించారు. కానీ ఇక్కడ ఆ ప్రేమకథని ఓ రోడ్‌ట్రిప్‌ నేపథ్యంలో చూపించడం కాస్త కొత్తగా అనిపిస్తుంది. రోడ్డుపై ప్రమాదం జరగడం, అది కూడా ఓ పథకం ప్రకారమే అన్న విషయం తెలియడంతోనే అసలు కథ మొదలవుతుంది. అప్పటిదాకా ఆడుతూ పాడుతూ తిరిగిన ఓ కుర్రాడికి అనుకోని కష్టం ఎదురైనప్పుడు ఎలా స్పందించాడు? ఎలా ధైర్యం కూడగట్టుకొన్నాడు? అనే విషయాల్ని సహజంగా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. మలి సగభాగమంతా శత్రువుల నుంచి లీలా అమ్మానాన్నల్ని కాపాడటం నేపథ్యంలోనే సాగుతుంది. ఆ భాగమంతా కూడా యాక్షన్‌, ఛేజింగ్‌ సన్నివేశాలే ఎక్కువగా ఉండటంతో పాటల్ని కూడా పక్కనపెట్టారు. చివరి పదిహేను నిమిషాలు కథ మరింత ఆసక్తికరంగా సాగుతుంది. కథానాయకుడు కేసులోని చిక్కు ముడులను విప్పేది అప్పుడే. అయితే అంతకుముందు సుదీర్ఘంగా సాగిన యాక్షన్‌ ఘట్టాలే ప్రేక్షకులకు బోర్‌ కొట్టినట్టు అనిపిస్తాయి. లీలాని ఎందుకు చంపాలనుకొంటున్నారనే విషయాన్ని చివరి వరకు కూడా బయటపెట్టక పోవడంతో ప్రేక్షకులు అసహనానికి గురవుతారు. కానీ చివరి పది నిమిషాల్లోనే ఆ చిక్కుముడినంతా మాటలతోనే చెప్పిస్తారు. థ్రిల్లింగ్‌తో కూడిన ఈ కథకి విలనిజం ప్రధానం. కానీ అది కూడా బలంగా ఏమీ పండలేదు. బాబా సెహగల్‌ బాగానే నటించాడు కానీ... ఆ పాత్రలో విలనిజం మాత్రం పండలేదు. తాను... నేను, చకోరి... పాటలు బాగున్నాయి. వెళ్లిపోమాకే పాట బాగున్నప్పటికీ అది ప్లేస్‌మెంట్‌ సరిగ్గా కుదర్లేదనిపిస్తుంది.
ఎవరెలా చేశారంటే?: నాగచైతన్య తన పాత్రలో ఒదిగిపోయాడు. ప్రేమ సన్నివేశాలతో పాటు, యాక్షన్‌ ఘట్టాల్లో కూడా చక్కటి భావోద్వేగాలు పండించాడు. మంజిమ మోహన్‌ తొలి సగభాగంలో అందంగా కనిపించింది. ముఖ కవళికల్లో సమంతని అనుసరించినట్టు అనిపిస్తుంది. ఆమె సంభాషణలు చెప్పేటప్పుడు సమంతే గుర్తుకొస్తుంది. కామత్‌ అనే పోలీసు పాత్రలో బాబా సెహగల్‌ ఒదిగిపోయాడు. రాకేందుమౌళి ప్రాధాన్యమున్న స్నేహితుడి పాత్ర చేశాడు. ఇక మిగిలిన పాత్రల గురించి చెప్పుకోదగినంత ఏమీ లేదు. సాంకేతికంగా ఈ సినిమాకి మంచి మార్కులే పడతాయి. ఎ.ఆర్‌.రెహమాన్‌ సంగీతం బాగుంది. ఛాయాగ్రహణం కూడా సహజంగా ఉంది. ‘ద గాడ్‌ఫాదర్‌’ స్ఫూర్తితో కథ రాసుకొన్నట్టు టైటిల్‌ కార్డ్స్‌లో వేశారు గౌతమ్‌మేనన్‌. కథానాయకుడి పాత్ర అందుకు స్ఫూర్తి ఇచ్చుండొచ్చేమో కానీ... ఈ తరహా కథలు తెలుగుకి కొత్తేమీ కాదు.
చివరిగా: కాసేపు కాలక్షేపమే ఆశించి సాగిపో..  

Thursday, November 10, 2016

శతకాలే శభాష్ అనేలా..


ఇంగ్లండ్ ఆటగాళ్లు సింహనాదం చేశారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ముగ్గురు ఆటగాళ్లు శతకాల మోత మోగించారు. తొలి టెస్టుకు ఆతిథ్యమిస్తున్న రాజ్ కోట్ స్టేడియం దద్దరిల్లేలా భారత్ పని పట్టారు. తొలి రోజు పూర్తి ఆధిపత్యం కొనసాగించిన ఇంగ్లండ్ జట్టు.. రెండో రోజు కూడా అదే ఊపును ప్రదర్శించి శతకాలతో శభాష్ అనిపించింది.
జో రూట్, మొయిన్ అలీ, బెన్ స్టోక్స్ లు శతకాలు సాధించి భారత్ బౌలింగ్ ను తీవ్రంగా గాయపరిచారు. బుధవారం టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ జట్టులో జో రూట్(124) సెంచరీ చేయగా, ఈ రోజు ఆట ఆరంభంలో మొయిన్ అలీ(117) శతకం పూర్తి చేశాడు. ఆ తరువాత మిడిల్ ఆర్డర్ ఆటగాడు బెన్ స్టోక్స్ మరో శతకం సాధించడంతో  ఇంగ్లండ్ భారీ స్కోరు నమోదు చేసింది.
311/4 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్ జట్టులో మొయిన్ అలీ(117) ఐదో వికెట్ గా అవుటయ్యాడు. అనంతరం బెన్ స్టోక్స్-బెయిర్ స్టోల జోడి ఇన్నింగ్స్ ను చక్కదిద్దే బాధ్యతను తీసుకుంది. ఈ జోడి ఆరో వికెట్ కు 99 పరుగులు జోడించిన తరువాత బెయిర్ స్టో(46)అవుటయ్యాడు. దాంతో లంచ్ సమయానికి ఇంగ్లండ్ ఆరు వికెట్ల నష్టానికి 450 పరుగులు చేసింది. ఆపై ఇంగ్లండ్ ఆటగాడు వోక్స్(4)కూడా తొందరగా అవుట్ కావడంతో భారత్ శిబిరంలో కాస్త ఆనందం చోటు చేసుకుంది.

 అయితే భారత్ ఆనందానికి బెన్ స్టోక్స్ (128)చెక్ పెట్టాడు. ఒక క్లాసికల్ ఇన్నింగ్స్ ఆడి సెంచరీ సాధించాడు. దాంతో ఇంగ్లండ్ సునాయాసంగా 500 పరుగుల మార్కును చేరుకుంది. టెయిలెండర్ అన్సారీ(37) ఫర్వాలేదనించడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో  537 పరుగులు చేసింది. ఇదిలా ఉండగా, భారత్ లో సిరీస్ లో ఒక ఆతిథ్య జట్టు తొలి ఇన్నింగ్స్ లో మూడు శతకాలు నమోదు చేయడం 2009 తరువాత ఇదే తొలిసారి. 2009లో మోతేరాలో జరిగిన తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో శ్రీలంక మూడు శతకాలు సాధించింది.

Wednesday, November 9, 2016

రూ.2వేల నోటులో అది లేదట!


 
రూ.500, రూ.1000 నోట్ల స్థానంలో కొత్తగా రూ.500, రూ.2000 నోట్లను ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. మరింత భద్రతతో కూడిన నోట్లను ఆర్‌బీఐ మార్కెట్లోకి విడుదల చేస్తుంది. కొత్తగా రానున్న రూ.500 నోటు పాత రూ.500 నోటుకు పూర్తి భిన్నంగా ఉంటుందని, దీంతో పాటు రూ.2000 నోటుకు 17 ప్రధాన లక్షణాలు ఉన్నాయి.
కొత్త రూ.500నోటు గురించి ఆసక్తికర విషయాలు.
* మహాత్మాగాంధీ కొత్త నోట్లగా పిలిచే వీటిపై నంబర్‌ ప్యానెల్స్‌ మధ్యలో ‘ఈ’ లెటర్‌ ఉంటుంది.
* కొత్త నోట్లపై 2016 ముద్రణ, ఆర్‌బీఐ గవర్నర్‌ డా.ఉర్జిత్‌ ఆర్‌ పటేల్‌ సంతకం, స్వచ్ఛభారత్‌ లోగో ముద్రించబడి ఉంటుంది.
* నోటు వెనుక భాగంలో చారిత్రక కట్టమైన ఎర్రకోట, దానిపై జాతీయ జెండా ఉంది.
* 66మి.మి×150మి.మి పరిమాణం, బూడిద రంగు వర్ణంలో కొత్త నోట్లు ఉండనున్నాయి.
* కంటిచూపు లేని వారు సునాయాసంగా గుర్తుపట్టే విధంగా ప్రత్యేక గుర్తులను పెట్టారు. గాంధీ ముఖచిత్రం, అశోక చిహ్నం, ఐదు బ్లీడ్‌ లైన్స్‌, చేతికి తగిలే విధంగా ఉండే చిన్న సర్కిల్‌ నోటుకు కుడివైపు ఉంటాయి.
కొత్త రూ.2000 నోటు విషయాలు
* 2000 సంఖ్యారూపంతో పాటు.. దేవనాగరి లిపిలో 2000 సంఖ్య
* నోటుకు మధ్యలో మహాత్ముడి ముఖచిత్రం
* ఎడమవైపు ఆర్‌బీఐ, 2000 చిన్న అక్షరాలు
* నోటు మధ్యలో ఉండే ఆర్‌బీఐ మార్కు థ్రెడ్‌ రంగు ఆకుపచ్చ బదులుగా నీలం రంగు.
* కుడివైపు అశోక చిహ్నం.. మహాత్మాగాంధీ ముఖచిత్రంతో పాటు 2000 ఎలక్ట్రోటైప్‌ వాటర్‌మార్క్‌.
* నోటుకు కుడి, ఎడమ వైపు ఉండే బ్లీడ్‌ లైన్స్‌ ఏడు ఉంటాయి.
* వెనుక భాగంలో స్వచ్ఛభారత్‌ లోగో
* భారత్‌ ప్రయోగించిన అంగారక ఉపగ్రహం మంగళయాన్‌ చిహ్నం
* దేవనాగరి లిపిలో 2000 సంఖ్య
ఈనెల 11వ తేదీ నుంచి అన్ని ఏటీఎంలలో కొత్త నోట్లు ప్రజలకు అందుబాటులోకి రానున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి కార్యదర్శి అశోక్‌ లవాస ప్రకటించారు. నల్లధనాన్ని నిరోధించేందుకు పెద్ద నోట్ల చలామణీని రద్దు చేసి వాటి స్థానంలో కొత్త నోట్లను ప్రవేశపెడుతున్నారు. కొత్తగా వచ్చే రూ.2000నోట్లలో నానో జీపీఎస్‌ సిస్టమ్‌ను అమర్చనున్నట్లు వస్తున్న వార్తలపై ఆర్‌బీఐ స్పందించింది. కొత్త నోట్లపై నానో జీపీఎస్‌ సిస్టమ్‌ పెడుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తమని వాటిని నమ్మవద్దని ప్రకటించింది.

Tuesday, November 8, 2016

అతడి సంపాదన.. వారానికి రూ. 3 కోట్లు!

  స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో పేరు చెబితే చాలు.. సాకర్ అభిమానులు ఆనందంతో ఉప్పొంగిపోతారు. అలాంటి రొనాల్డోకు ఇప్పుడు బంపర్ ఆఫర్ తగిలింది. రియల్ మాడ్రిడ్ క్లబ్‌తో అతడికి ఐదేళ్ల కాంట్రాక్టు కుదిరింది. మరో పదేళ్ల పాటు తాను ఆడుతూనే ఉంటానని ఒప్పందం సందర్భంగా అతడు చెప్పాడు. దీని ప్రకారం అతడికి అక్కడ వారానికి దాదాపు రూ. 3 కోట్లకు పైగా చెల్లిస్తారు. దీంతో ప్రపంచంలోనే అత్యధికంగా సంపాదించే ఫుట్‌బాల్ ప్లేయర్‌గా రొనాల్డో నిలిచిపోతాడు. తన జీవితంలో మిగిలిన కాలమంతా తాను ఆటను ఎంజాయ్ చేస్తూనే ఉంటానని.. మరో పదేళ్ల పాటు ఆడతానని స్పష్టం చేశాడు. ఈ కాంట్రాక్టుతో.. సంపాదన విషయంలో బార్సిలోనా ఫుట్‌బాలర్ లియోనెల్ మెస్సీ కంటే అగ్రస్థానంలోకి రొనాల్డో దూసుకెళ్లాడు. 
 
'వరల్డ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్' టైటిల్‌ను ఇప్పటికి మూడుసార్లు గెలుచుకున్న రొనాల్డో.. ఈ ఏడాది కూడా చాలా విజయాలు సాధించాడు. అతడి పెనాల్టీ షూటవుట్ షాట్‌తో మాడ్రిడ్ 11వ సారి చాంపియన్స్ లీగ్‌ను గెలుచుకుంది. అంతకుముందు యూరో 2016ను పోర్చుగల్ గెలుచుకోవడంలో కూడా రొనాల్డోదే కీలక పాత్ర. ఇటీవలి కాలంలో రియల్ మాడ్రిడ్ కాంట్రాక్టులను పునరుద్ధరించుకున్నవాళ్లలో రొనాల్డో లేటెస్ట్ స్టార్ అయ్యాడు. అతడి కంటే ముందు  గరెత్ బేల్, లుకా మాడ్రిక్, టోనీ క్రూస్ కూడా మంచి ఆకర్షణీయమైన కాంట్రాక్టులే పొందినట్లు సమాచారం.
 
రొనాల్డో మాంచెస్టర్ యునైటెడ్ నుంచి మాడ్రిడ్‌కు మారిన తర్వాత 8 సీజన్లలో 360 గేమ్స్ ఆడి 371 గోల్స్ సాధించాడు. ఈ క్లబ్‌లో ఇంతవరకు ఎవరూ చేయనన్ని గోల్స్ చేయడంతో 2009లోనే రికార్డు స్థాయి ఫీజు పొందాడు. ఇక ముందు ఎవరు ఏం చెప్పాలన్నా.. రొనాల్డో కంటే ముందు, ఆ తర్వాత అని చెప్పుకోవాల్సి ఉంటుందని మాడ్రిడ్ ప్రెసిడెంట్ ఫ్లోరెంటినో పెరెజ్ వ్యాఖ్యానించారు. రొనాల్డోను ప్రశంసల్లో ముంచెత్తారు.

Sunday, November 6, 2016

ఇది జూనియర్‌ అక్కినేని ‘ఫ్యామిలీ’

 అక్కినేని నాగార్జున కుమారులు అఖిల్‌, నాగచైతన్య త్వరలో ఓ ఇంటివారు కాబోతున్న సంగతి తెలిసిందే. అక్కినేని అఖిల్‌.. ఫ్యాషన్‌ డిజైనర్‌ శ్రియ భూపాల్‌ని, అక్కినేని నాగచైతన్య.. సమంతని వివాహం చేసుకోబోతున్నారు. ఇప్పటివరకు ఈ కాబోయే జంటలు విడివిడిగా దిగిన ఫొటోలే సోషల్‌మీడియాలో కనిపించాయి కానీ తొలిసారి నలుగురూ కలసి ఒకే ఫొటో దిగారు. సమంత, నాగచైతన్య, అఖిల్‌, శ్రియలు కలిసి దిగిన ఫొటోని సమంత ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేస్తూ.. ‘ఫ్యామిలీ’ అని హ్యాష్‌టాగ్‌ ఇచ్చింది. అఖిల్‌, శ్రియల వివాహం ఇటలీలో జరగబోతున్నట్లు సమాచారం. సమంత, నాగచైతన్యలు వచ్చే ఏడాది వివాహం చేసుకోబోతున్నారు.

Saturday, November 5, 2016

రానే వచ్చింది ఆ రోజు

 అల్లు అర్జున్‌ రంగంలోకి దిగాడు. హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త చిత్రం ‘డీజే... దువ్వాడ జగన్నాథమ్‌’ కోసం శుక్రవారమే సెట్లోకి అడుగుపెట్టాడు. ఈ రోజు కోసం ఎదురు చూశానని... సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ సెట్లోకి అడుగుపెట్టడం బాగుందని అల్లు అర్జున్‌ ట్విట్టర్‌లో తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ‘సరైనోడు’ తర్వాత బన్నీ కెమెరా ముందుకు రాలేదు. కుటుంబంతో గడుపుతూ, కొత్త కథల్ని వింటూ గడిపారు. కొంత కాలం కిందటే ‘డీజే’కి పచ్చజెండా వూపారు. అల్లు అర్జున్‌, పూజ హెగ్డే జంటగా దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే ప్రారంభమైంది. అయితే అల్లు అర్జున్‌పై శుక్రవారం నుంచి చిత్రీకరణ మొదలుపెట్టారు. ఈ సినిమాలోని పాత్ర కోసం ఆయన ప్రత్యేకంగా సన్నద్ధమైనట్టు తెలిసింది. రెండు కోణాల్లో సాగే ఆ పాత్ర కోసం శారీరకంగా కసరత్తులు చేయడంతోపాటు, హావభావాల విషయంలోనూ ప్రత్యేకంగా శిక్షణ తీసుకొన్నట్టు తెలిసింది. ‘‘ఆర్య’ చూసినప్పట్నుంచి అల్లు అర్జున్‌తో సినిమా చేయాలనేది నా కల. ఆ రోజు వచ్చింది’’ అని హరీష్‌ శంకర్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.