Friday, September 30, 2016

రివ్యూ: హైపర్‌


 కథేంటంటే?: నిజాయతీ గల ఓ ప్రభుత్వాధికారి నారాయణమూర్తి (సత్యరాజ్‌). ఆయన కొడుకే సూర్య (రామ్‌). తండ్రి అంటే సూర్యకి ప్రేమే కాదు తండ్రి కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటాడు. ఓ బిల్డింగ్‌ నిర్మాణానికి అనుమతినిస్తూ సంతకం చేయమని మంత్రి రాజప్ప (రావు రమేష్‌) నారాయణమూర్తి దగ్గరికి ఫైల్‌ పంపుతాడు. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఆ నిర్మాణాన్ని చేపడుతున్నారని.. సంతకం పెట్టనని నారాయణమూర్తి ఆ ఫైల్‌ని తిరస్కరిస్తాడు.
 దీంతో నారాయణమూర్తిపై కక్ష పెంచుకొన్న మంత్రి రాజప్ప సామదాన భేద దండోపాయాల్ని ప్రదర్శిస్తాడు. మంత్రి బెదిరింపులకు నారాయణ మూర్తి తన నిజాయతీని వదలుకున్నాడా? తన తండ్రిని మంత్రి టార్గెట్‌ చేశాడని తెలిశాక సూర్య ఏం చేశాడు? మంత్రికీ, సూర్యకీ మధ్య జరిగిన పోరాటంలో గెలుపెవరిది? సూర్యపై మనసుపడ్డ భానుమతి (రాశిఖన్నా) కథేమిటి? తదితర విషయాల్ని తెరపైనే చూడాలి.
ఎలా ఉందంటే?: తెలుగు చిత్రసీమ కొత్తదనం వైపు పరుగులు పెడుతున్న సమయమిది. ప్రేక్షకుడు చూడని ఓ కొత్త విషయాన్ని చూపించాలనే ప్రయత్నం తరచూ జరుగుతోంది. కొత్త రకమైన సినిమాలు రావటం వెనక ప్రధాన కారణం అదే. అలాగని మనకు అలవాటైన కమర్షియల్‌ ఫార్ములా కథలు ఇంకా దూరం కావడం లేదు. ఆ తరహా చిత్రాలకి బీ.. సీ కేంద్రాల నుంచి ఇప్పటికీ మంచి ఆదరణ లభిస్తుండడంతో దర్శకనిర్మాతలు ఆ కథల్ని నమ్ముతూ తెరకెక్కిస్తున్నారు.

‘హైపర్‌’ కూడా ఆ కోవకి చెందినదే. ఇందులోని కథ.. కథనం కొత్తదనం లేకున్నా కమర్షియల్‌ అంశాలకు కొరత లేకుండా చూశారు. పాటలు.. ఫైట్లు.. రొమాన్స్‌.. వాటి మధ్య ఓ రివెంజ్‌ డ్రామా.. ఇలా మాస్‌ ప్రేక్షకులకు కాలక్షేపాన్నిచ్చే అన్ని అంశాల్ని పక్కాగా ఉండేలా చూశారు. కొత్తదనం ఆశించే ప్రేక్షకుడికి కాస్త ఇబ్బందే. తొలి సగం సరదా సన్నివేశాలతో తీర్చిదిద్దారు. రామ్‌.. రాశిఖన్నాల మధ్య వినోదం- రొమాన్స్‌.. కుటుంబ నేపథ్యంతోనే సాగిపోతుంది.
 
విరామానికి ముందే ఓ మలుపు వస్తుంది. అక్కడ్నుంచి అసలు కథ మొదలవుతుంది. అయితే ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుడు వూహించినట్టే సాగుతాయి. తన తండ్రిని కాపాడినందుకు రౌడీషీటర్‌ గజ (మురళీశర్మ)తో సూర్య ఫ్రెండ్‌షిప్‌ చేయడం.. మంత్రి రాజప్ప ఫోన్లో చెప్పినట్టుగా చేస్తూ సూర్య కార్లు మారుస్తూ వెళ్లిపోయే సీన్లలో పాత వాసన కనిపిస్తుంది. రామ్‌లోని హైపర్‌ యాక్టివ్‌నెస్‌ని అభిమానులకి చూపించాలనే ప్రయత్నంగా కనిపిస్తుంది.
ఎవరెలా చేశారంటే?: చిత్రంలో రామ్‌.. రాశిఖన్నా.. రావు రమేష్‌ల పాత్రలే కీలకం. ముగ్గురూ బాగా నటించారు. ముఖ్యంగా రామ్‌ ఎప్పట్లాగే హుషారైన కుర్రాడిగా సందడి చేశాడు. డ్యాన్సులు.. ఫైట్లు చక్కటి ఈజ్‌తో చేసేశాడు. రాశిఖన్నా అందంగా కనిపించింది. రావు రమేష్‌ మంత్రి రాజప్ప పాత్రలో ఒదిగిపోయారు. సత్యరాజ్‌ పాత్రకు తగ్గట్టుగా నటించారు. ఇక మిగిలిన పాత్రల గురించి చెప్పుకొనేంత ఏమీ లేదు. సాంకేతికంగా ఈ సినిమాకి మంచి మార్కులే పడతాయి. జిబ్రాన్‌ పాటలు.. మణిశర్మ నేపథ్య సంగీతం పర్వాలేదు. అబ్బూరి రవి కలం అక్కడక్కడా మెరిసింది. రిమోట్‌తో ముడిపెడుతూ అమ్మాయిల జీవితం గురించి రాసిన మాటలు బాగున్నాయి.
 
చివరగా.. ఇది తెలిసిన ‘హైపర్‌’ 

Thursday, September 29, 2016

ఏడేళ్ల ప్రేమకు బ్రేకప్?

 అటు తమిళంలో, ఇటు తెలుగులో (డబ్బింగ్) వరుస చిత్రాలతో దూసుకెళ్తున్న కథానాయకుడు విశాల్. నటుడు శరత్‌కుమార్ కుమార్తెగానే కాకుండా హీరోయిన్‌గానూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు వరలక్ష్మి. విశాల్, వరలక్ష్మి ప్రేమించుకుంటున్నారని, త్వరలో పెళ్లి కూడా చేసుకోనున్నారని గుసగుసలు వినిపించాయి. ‘‘తమిళ నడిగర్ సంఘం ఆధ్వర్యంలో కల్యాణ మండపం కడుతున్నాం. అది పూర్తి కాగానే అందులో జరిగే మొదటి పెళ్లి నాదే’ అని విశాల్ చెబుతూ వచ్చారు.

ఆయన పెళ్లాడనున్నది వరలక్ష్మీనే అని చాలామంది ఫిక్సయ్యారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్‌లో వరలక్ష్మి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తమిళ చిత్ర పరిశ్రమతో పాటు టాలీవుడ్‌లోనూ హాట్ టాపిక్‌గా మారాయి. ‘‘ప్రేమ ఇటీవల పరిహాసంగా మారుతోంది. ఓ వ్యక్తి ఏడేళ్ల బంధాన్ని తేలిగ్గా వద్దనుకున్నాడు. అది కూడా తన మేనేజర్ ద్వారా ఆ అమ్మాయికి ఆ విషయం తెలియజేశాడు. ప్రపంచంలో ప్రేమ ఏమైపోతోందో? ఎక్కడుందో?’’ అంటూ ఆమె ఆవేదనగా ట్వీట్ చేశారు.

విశాల్‌ని ఉద్దేశించే ఆమె ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని కోలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. విశాల్‌ను వరలక్ష్మి ప్రేమించడం ఆమె తండ్రి శరత్‌కుమార్‌కి నచ్చలేదని, పెళ్లికి ఆయన సమ్మతం వ్యక్తం చేయలేదని ఓ టాక్ ఉంది. దానికి తోడు నడిగర్ సంఘం ఎన్నికల్లో విశాల్, శరత్‌కుమార్ మధ్య మనస్పర్థలు వచ్చాయి కూడా. ఒకవేళ విశాల్-వరలక్ష్మి బ్రేకప్ వెనక శరత్‌కుమార్ హస్తం ఉండి ఉంటుందేమోనన్నది కొందరి ఊహ. ఇంతకీ వరలక్ష్మి ట్వీట్ వెనక ఆంతర్యం ఏంటో ఆ పెరుమాళ్లకే ఎరుక.

రాజకీయాల్లోకి మహేష్‌బాబు?

 సినిమాలు - రాజకీయాల మధ్య అవినాభావ సంబంధం ఉంది. సినిమాల్లో స్టార్‌ డమ్‌ అనుభవించి రాజకీయాల్లో ఓ మెరుపులా వచ్చిన తారలు ఎంతోమంది. ఆ లిస్టులో మహేష్‌బాబు చేరుతున్నాడా.. అని డౌటు పడొద్దు. ఇది వేరే మేటర్‌. మహేష్‌ బాబు - కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కబోతోందన్న సంగతి తెలిసిందే. మురుగదాస్‌ సినిమా పూర్తయ్యాక ‘శ్రీమంతుడు’ కాంబోలో సినిమా మొదలవుతుంది. ఈ కథా నేపథ్యం రాజకీయాల చుట్టూ తిరగబోతోందని టాక్‌. మహేష్‌ ముఖ్యమంత్రి పాత్రలో కనిపిస్తాడని చెప్పుకొంటున్నారు. ‘దూకుడు’లో మహేష్‌ ఎమ్‌.ఎల్‌.ఏ పాత్రలో కనిపించాడు కదా? ఇప్పుడు సీఎమ్‌గా ప్రమోషన్‌ వచ్చిందన్నమాట. 2017 జనవరిలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం కొరటాల శివ స్క్రిప్టుని తీర్చిదిద్దే పనిలో ఉన్నారని టాక్‌.

Wednesday, September 28, 2016

రాడనుకున్నారు.. రాలేడనుకున్నారు..!


మ్యాచ్‌ ఎలాంటి స్థితిలో ఉన్నా.. ఒత్తిడి అతని దరి చేరదు. సెహ్వాగ్‌ లాంటి భీకర ఓపెనర్‌ విఫలమైన చోట కూడా అతను అవలీలగా భారీ స్కోర్లు చేయగలడు. స్వలాభం కోసం శతకాలు బాదాలని అతను ఎప్పుడూ కోరుకోలేదు. జట్టు కోసం అవసరమైతే సమిధలా మారి 90ల్లో ఔటైన సందర్భాలు కోకొల్లలు. అందుకేనేమో భారత్‌ చరిత్రాత్మక విజయాలు కొన్ని అతని భీకర పోరాటంతోనే సాధ్యమైనా.. సరైన గుర్తింపులేక అవి తెరవెనుకే కనుమరుగైపోయాయి. కానీ అతను పోరాటం ఆపలేదు.. ఎందుకంటే మైదానంలో పట్టుదలకు, బ్యాటింగ్‌లో తెగువకు అతను నిలువుటద్దం. ‘చివరి అవకాశం ఇవ్వండి సగర్వంగా క్రికెట్‌ను నుంచి తప్పుకొంటాం’ అంటూ జట్టులో స్థానం కోల్పోయి సీనియర్‌ క్రికెటర్లు అభ్యర్థిస్తున్న వేళ.. జట్టులో స్థానం కోసం బ్యాట్‌తోనే పోరాడతాను అంటూ ధైర్యంగా ప్రకటించి మళ్లీ టెస్టు జట్టులో తాజాగా స్థానం పొందిన ఆ క్రికెటరే గౌతమ్‌ గంభీర్‌.
2007లో పాకిస్థాన్‌తో జరిగిన తొలి ప్రపంచకప్‌ ఫైనల్లో గంభీర్‌ 75 పరుగులు చేయడంతోనే భారత్‌ భారీ స్కోరు చేయగలిగింది.. తొలి టీ20ప్రపంచకప్‌ విజేతగా అవతరించింది. 2011లో భారత్‌ 28 ఏళ్ల తర్వాత గెలిచిన వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో కూడా గంభీర్‌ భీకరంగా పోరాడి 97 పరుగులతో టీమిండియా విజయానికి బాటలు వేశాడు. ఓపెనర్‌గా వచ్చిన అతను 41.2 ఓవర్‌ వరకూ క్రీజులో నిలిచి భారత్‌ విజయం దాదాపు ఖరారైన దశలో ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో అతను శతకం చేసినట్లయితే చరిత్రలో నిలిచిపోయేవాడే కానీ.. అప్పుడు జట్టు అవసరాల మేరకు 90లో కూడా హిట్టింగ్‌ చేయడానికి మొగ్గుచూపాడు. అయితే అందరూ చివర్లో సిక్స్‌ బాదిన ధోనీ(91 నాటౌట్‌)నే ఆకాశానికి ఎత్తేశారు. దీంతో గంభీర్‌ పోరాటం కనుమరుగైపోయింది. ఇక్కడ ధోనీ పోరాటాన్ని తక్కువ చేయడం కాదు గానీ.. 275 పరుగుల లక్ష్య ఛేదనలో 31 పరుగులకే సీనియర్లు సెహ్వాగ్‌, సచిన్‌ పెవిలియన్‌ చేరిన దశలో గంభీర్‌ అసాధారణ పోరాటానికి సరైన గుర్తింపు దక్కలేదనేది గత కొంతకాలంగా అతను జట్టుకు దూరమైన తీరే చెప్తోంది..!
కెరీర్‌ సాగిందిలా..!
2003లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన గంభీర్‌ అతి తక్కువ కాలంలో నమ్మదగిన బ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు పొందాడు. కెరీర్‌లో 56 టెస్టులాడి అందులో ఒక ద్విశతకం, 9 శతకాలు, 21 అర్ధశతకాలు సాధించాడు. 147 వన్డేల్లో 11 శతకాలు, 31 అర్ధశతకాలు.. టీ20 కెరీర్‌లో 37 మ్యాచ్‌లాడి 7 అర్ధశతకాలు చేశాడు. అయితే 2014లో చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడిన గంభీర్‌ ఐపీఎల్‌లో మాత్రం తన బ్యాటింగ్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ముందుండి నడిపిస్తూ విజయవంతమైన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.


సహచరులైనా తగ్గేది లేదు..!
ఆటలో దూకుడుగా ఉండే గంభీర్‌ ప్రత్యర్థి క్రికెటర్లతోనే కాదు.. సహచర క్రికెటర్లపైనా తరచూ గొడవకు దిగడం అతని కెరీర్‌ను కొంత మసకబార్చింది. భారత టెస్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లితో 2013లో జరిగిన ఓ ఐపీఎల్‌ మ్యాచ్‌లో ప్రత్యక్షంగా గొడవకు దిగి అప్పట్లో సంచలనానికి తెరలేపగా.. వన్డే, టీ20 కెప్టెన్‌ ధోనితో గత కొంతకాలంగా ప్రచ్ఛన్న యుద్ధాన్నే నడిపిస్తున్నాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో ధోని బ్యాటింగ్‌ చేస్తుండగా టెస్టు తరహాలో ‘అటాకింగ్‌ ఫీల్డింగ్‌’ ఈ వాదనకు మరింత బలం చేకూర్చాడు గంభీర్‌. కెప్టెన్లతో ఈ స్థాయిలో విభేదాలు ఉన్న అతను ఇక భారత్‌ జట్టులోకి రావడం దాదాపు అసాధ్యంగానే క్రికెట్‌ పండితులు తేల్చేశారు. కానీ నిలకడైన అతని ఆటతీరు, భారత్‌ కోచ్‌ కుంబ్లే, సెలెక్టర్ల చొరవతో మళ్లీ అతను టీమిండియాలోకి పడిలేచిన కెరటంలా అడుగుపెట్టాడు. ‘సమర యోధుడు భగత్‌సింగ్‌ నాకు ఆదర్శం. ఆయన స్ఫూర్తితోనే చివరివరకూ పోరాడుతాను’ అంటూ జట్టులోకి ఎంపికైన అనంతరం గంభీర్‌ ప్రకటించాడు. స్వదేశంలో భారత్‌ ఇంకా 12 టెస్టులు ఆడనున్న నేపథ్యంలో వివాదాల జోలికి వెళ్లకుండా గంభీర్‌ ఆటతో అందర్నీ మెప్పిస్తాడా లేదా మళ్లీ పాత గొడవలకు ఆజ్యం పోసి కెరీర్‌ను ముగిస్తాడో మరికొద్ది రోజుల్లోనే తేలనుంది.
 
 

Tuesday, September 27, 2016

జోడీ కుదిరిందా?

‘నేను శైలజ’ చిత్రంతో ఆకట్టుకొంది కీర్తి సురేష్‌. ప్రస్తుతం నాని ‘నేను లోకల్‌’ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ఈలోగా మరో మంచి అవకాశం అందుకొన్నట్టు ఫిల్మ్‌నగర్‌ వర్గాలు చెబుతున్నాయి. అల్లు అర్జున్‌ కథానాయకుడిగా లింగుస్వామి దర్శకత్వంలో ఓ చిత్రం ఇటీవలే లాంఛనంగా మొదలైంది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో కథానాయికగా కీర్తి సురేష్‌ని ఎంచుకొన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ‘దువ్వాడ జగన్నాథమ్‌’గా రెడీ అవుతున్నాడు బన్నీ. ఈ సినిమా పూర్తయ్యాకే లింగుస్వామి ప్రాజెక్ట్‌ సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈలోగా నటీనటుల్ని, మిగిలిన సాంకేతిక నిపుణుల్ని ఎంచుకొనే పనిలో పడింది చిత్రబృందం. అధికారిక వివరాలు త్వరలో తెలుస్తాయి.

బాహుబలిని చంపినప్పుడు నేనక్కడ లేను

 మూడు భాషల్లో తెరకెక్కించే చిత్రాల్లో ఇకపై నటించనని మిల్కీబ్యూటీ తమన్నా అన్నారు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో తమన్నా ఈ విషయాన్ని మీడియాతో పంచుకున్నారు. ‘అభినేత్రి పూర్తిగా హారర్‌ సినిమా కాదు, అది వినోదం కోసమే. ఈ సినిమాలో దయ్యం ఉంటుంది, కానీ అది ఎవర్నీ భయపెట్టదు. మూడుభాషల్లో చిత్రాన్ని తెరకెక్కించడం సులభమైన పని కాదు, అది చాలా కష్టం. దీన్ని తమిళం, హిందీ భాషల్లో మాత్రమే తెరకెక్కించాలని అనుకున్నారు. తెలుగులో నాకు మంచి మార్కెట్‌ ఉందని నేను సలహా ఇవ్వడంతో ఈ భాషలోనూ తీశారు. మూడు సినిమాల్లో నటించినట్లు అనిపించింది, సినిమాని ఒకే షెడ్యూల్‌లో పూర్తి చేశాం. ఈ మూడు భాషలు ఒకదానికొకటి చాలా విభిన్నంగా ఉంటాయి కాబట్టి డైలాగ్‌ పలికే విధానం కూడా తేడాగా ఉంటుంది. తెలుగు సన్నివేశం పూర్తి చేసిన తర్వాత తమిళ్‌, హిందీ చేసేదాన్ని. ఒకే సన్నివేశాన్ని మూడుసార్లు మూడు భాషల్లో చేయడంతో చాలా అలసిపోయేదాన్ని’ అని చెప్పారు.
అనంతరం ‘జాగ్వార్‌’ చిత్రంలోని ప్రత్యేక గీతం గురించి ప్రశ్నించగా.. ‘ఇప్పటికే ఆ పాట షూటింగ్‌ పూర్తి చేశాం. ప్రేక్షకులు నా ప్రత్యేక గీతాల్ని ఇష్టపడతారనుకుంటున్నా. దక్షిణ చిత్ర పరిశ్రమలో ప్రజలు స్టార్‌ హీరోయిన్లు ప్రత్యేక గీతం చేస్తే ఎందుకు అసహనంగా భావిస్తారో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఇలాంటి ఇబ్బంది హిందీ చిత్ర పరిశ్రమలో ఉండదు. దీపికా, కత్రినా, కరీనా ప్రత్యేక గీతాల్లో నటించారు. దక్షిణ చిత్ర పరిశ్రమలో ఉన్న ఈ సమస్యను బ్రేక్‌ చేయాలి అనుకున్నా. పాటను హుందాగా కొరియోగ్రఫీ చేసినప్పుడు ఎందుకు నటించకూడదు?’ అని ప్రశ్నించారు తమన్నా. ‘జాగ్వార్‌’ పాటకు ఎక్కువ పారితోషికం తీసుకున్నారా? అని అడిగితే వెంటనే.. ‘నేను ఎప్పుడూ ఎక్కువ పారితోషికమే తీసుకుంటా’ అని చెప్పారు.
చేయబోతున్న సినిమాల గురించి మాట్లాడుతూ తమన్నా బాహుబలి క్లైమాక్స్‌ సన్నివేశం చేయాల్సి ఉందన్నారు. దాంతో బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడని ప్రశ్నించగా తమన్నా ఇలా సమాధానం ఇచ్చారు. ‘బాహుబలిని కట్టప్ప చంపినప్పుడు నేనక్కడ లేను, ఇంకెవరైనా ఉండి ఉంటారని అనుకోను. నాకు తెలిసి రాజమౌళి ఈ సన్నివేశం చిత్రీకరణను తొలి విభాగంలోనే పూర్తి చేసుంటారు. ఎవరికీ ‘బాహుబలి’ కథ తెలియదు’ అని చెప్పారు.

Monday, September 26, 2016

‘బాహుబలి 2’ ట్రైలర్‌ ఎప్పుడంటే?

 ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘బాహుబలి 2’ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం పతాక సన్నివేశాల చిత్రీకరణను జరుపుకుంటోంది. ఈ చిత్రం విడుదల కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే నవంబరులో చిత్రం షూటింగ్‌ పూర్తి కానుందని సమాచారం. హీరో ప్రభాస్‌ పుట్టినరోజు సందర్భంగా అక్టోబరు 23న చిత్రం ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ‘బాహుబలి’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా మంచి వసూళ్లను రాబట్టడంతో దానికి కొనసాగింపుగా తీస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘బాహుబలి’ ట్రైలర్‌ యూట్యూబ్‌లో విడుదలైన 24 గంటల్లోనే దాదాపు 40 లక్షల మంది వీక్షించడం గమనార్హం.
ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా ఈ చిత్రంలో ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. కీరవాణి చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 28న ‘బాహుబలి 2’ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.

సమంత చేసిన పూజ ఏంటి?

‘వచ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతున్నాం’ అని ఇటీవల విడివిడి ఇంటర్య్వూల్లో అక్కినేని నాగచైతన్య.. సమంతలు చెప్పేయటం తెలిసిందే. దీంతో వీరి వ్యవహారంపై ఇప్పుడు అందరికి స్పష్టత వచ్చేసింది. ఇదిలా ఉంటే.. వీరిద్దరూ పక్కపక్కనే కూర్చొని పూజ చేసిన ఫోటోలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

పక్కపక్కనే కూర్చున్న చైతూ.. సమంతలు కుంకుమ బొట్లు పెట్టుకుని కనిపించారు. వీరికి చుట్టూ వేదపండితులు నిల్చుని ఉన్నారు. పెళ్లికి ముందుగా జరిపే పూజలో భాగంగా సమంత ఈ కార్యక్రమంలో చైతుతో కలిసి పాల్గొందని ఫిల్మ్‌ వర్గాల టాక్‌. మరి కొందరేమో.. దోష నివారణ నిమిత్తం ఈ పూజలు చేసినట్లు చెబుతున్నారు.
అయితే ఈ విషయం గురించి సమంత, నాగచైతన్య సోషల్‌మీడియా ద్వారా ఏమీ మాట్లాడలేదు. సమంత, నాగచైతన్య హిందు, క్రిస్టియన్‌ సంప్రదాయాల ప్రకారం రెండుసార్లు పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.