Monday, September 26, 2016

‘బాహుబలి 2’ ట్రైలర్‌ ఎప్పుడంటే?

 ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘బాహుబలి 2’ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం పతాక సన్నివేశాల చిత్రీకరణను జరుపుకుంటోంది. ఈ చిత్రం విడుదల కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే నవంబరులో చిత్రం షూటింగ్‌ పూర్తి కానుందని సమాచారం. హీరో ప్రభాస్‌ పుట్టినరోజు సందర్భంగా అక్టోబరు 23న చిత్రం ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ‘బాహుబలి’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా మంచి వసూళ్లను రాబట్టడంతో దానికి కొనసాగింపుగా తీస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘బాహుబలి’ ట్రైలర్‌ యూట్యూబ్‌లో విడుదలైన 24 గంటల్లోనే దాదాపు 40 లక్షల మంది వీక్షించడం గమనార్హం.
ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా ఈ చిత్రంలో ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. కీరవాణి చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 28న ‘బాహుబలి 2’ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.

సమంత చేసిన పూజ ఏంటి?

‘వచ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతున్నాం’ అని ఇటీవల విడివిడి ఇంటర్య్వూల్లో అక్కినేని నాగచైతన్య.. సమంతలు చెప్పేయటం తెలిసిందే. దీంతో వీరి వ్యవహారంపై ఇప్పుడు అందరికి స్పష్టత వచ్చేసింది. ఇదిలా ఉంటే.. వీరిద్దరూ పక్కపక్కనే కూర్చొని పూజ చేసిన ఫోటోలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

పక్కపక్కనే కూర్చున్న చైతూ.. సమంతలు కుంకుమ బొట్లు పెట్టుకుని కనిపించారు. వీరికి చుట్టూ వేదపండితులు నిల్చుని ఉన్నారు. పెళ్లికి ముందుగా జరిపే పూజలో భాగంగా సమంత ఈ కార్యక్రమంలో చైతుతో కలిసి పాల్గొందని ఫిల్మ్‌ వర్గాల టాక్‌. మరి కొందరేమో.. దోష నివారణ నిమిత్తం ఈ పూజలు చేసినట్లు చెబుతున్నారు.
అయితే ఈ విషయం గురించి సమంత, నాగచైతన్య సోషల్‌మీడియా ద్వారా ఏమీ మాట్లాడలేదు. సమంత, నాగచైతన్య హిందు, క్రిస్టియన్‌ సంప్రదాయాల ప్రకారం రెండుసార్లు పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.

Sunday, September 25, 2016

‘నగరం’ ఫస్ట్‌లుక్‌ విడుదల

 సందీప్‌కిషన్‌, రెజీనా జంటగా లోకేశ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘నగరం’. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను చిత్రకథానాయిక రెజీనా ట్విట్టర్‌ ద్వారా విడుదల చేశారు. జావేద్‌రియాజ్‌ ఈ సినిమాకి స్వరాలు సమకూర్చారు. త్వరలోనే ఆడియో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొంది.

Wednesday, September 21, 2016

సల్మాన్‌ నాతో నటించడానికి ఒప్పుకోలేదు

 సెలబ్రిటీ వారసులుగా సినీ పరిశ్రమలో అడుగుపెడితే వారికి ప్రత్యేకమైన గౌరవం దక్కుతుంది. అవకాశాలు.. పాపులారిటీ సులభంగా వస్తాయి. అయితే దాన్ని నిలుపుకోవడం మాత్రం వారి ప్రతిభపై ఆధారపడి ఉంటుంది. సినీ నేపథ్యమున్న కుటుంబం నుంచి వస్తే చాలా ఉపయోగాలు.. వెసులుబాటులుంటాయి. కానీ.. సోనమ్‌ కపూర్‌ మాత్రం అదే ఇబ్బందులను తెచ్చిపెడుతోందని తెగ బాధపడిపోతోంది.
‘‘నా తండ్రి వల్ల నేను చాలా సినిమాల్లో నటించే అవకాశం కోల్పోయాను. ‘ప్రేమ్‌ రతన్‌ ధన్‌పాయో’ సినిమాని తీసుకోండి. మొదట ఈ చిత్రంలో సల్మాన్‌ నాతో నటించడానికి ఒప్పుకోలేదు. ‘అనిల్‌ కపూర్‌ నా సన్నిహిత స్నేహితుడు. అలాంటిది అతని కుమార్తెతో నేను ఎలా రొమాన్స్‌ చేయగలను?’ అని సల్మాన్‌ అన్నాడు. అతికష్టం మీద నటించేందుకు ఒప్పుకున్నాడు. అలాగే ‘దర్శకురాలు ఫరాఖాన్‌ మా అమ్మకు స్నేహితురాలు. కానీ ఫరాఖాన్‌ చిత్రాల్లో ఒక్క దాంట్లో కూడా నేను నటించలేదు. చిన్నప్పట్నుంచి తెలిసిన అమ్మాయిని కాబట్టి తనకు నేను నటిగా కనిపించకపోవచ్చు’ అని ఆవేదన వ్యక్తం చేస్తోంది సోనమ్‌.

Tuesday, September 20, 2016

సల్మాన్‌ని వెంటాడుతున్న వ్యాధి

 ‘దబాంగ్‌’ ఖాన్‌ సల్మాన్‌ 50 ఏళ్ల వయసులోనూ ఫిట్‌నెస్‌ని కాపాడుకోవడానికి ఎన్నో కసరత్తులు చేస్తుంటాడు. భాయ్‌ ఎంత బిజీగా ఉన్నా తన డైట్‌ని చక్కగా అనుసరిస్తాడు. అలాంటి సల్లూభాయ్‌ కొన్ని సంవత్సరాలుగా ఓ భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నాడట.
సల్మాన్‌ 2007లో పార్ట్‌నర్‌ సినిమాలో నటిస్తున్నప్పుడు దవడ భాగంలో తీవ్ర నొప్పి వచ్చిందట. దాంతో భాయ్‌ వైద్యులను సంప్రదిస్తే ట్రైజెమినల్‌ న్యూరల్జియా వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపారు. ఈ వ్యాధి వచ్చినప్పుడు ముందు దవడ భాగంలో తీవ్ర నొప్పి ఉంటుంది. తర్వాత అది నిదానంగా మెదడుపై ప్రభావం చూపుతుంది.
ఈ విషయం తెలిసి సల్మాన్‌ వెంటనే కొన్నాళ్ల పాటు షూటింగ్‌ వదిలేసి సీక్రెట్‌గా తన సోదరులతో కలిసి అమెరికా వెళ్లి చికిత్స చేయించుకుని వచ్చినట్లు సమాచారం. అప్పటికి కనీసం ఇంట్లో వారికి కూడా ఈ విషయం తెలీదట. ట్రీట్‌మెంట్‌ పూర్తికాగానే సరిగ్గా విశ్రాంతి తీసుకోకుండా వెంటనే భారత్‌ వచ్చి షూటింగ్‌లో పాల్గొన్నాడట. ఈ వ్యాధి కారణంగా భాయ్‌ క్రమం తప్పకుండా చెకప్‌లు చేయించుకుంటున్నాడు. తనకు ఇలాంటి సమస్య ఉన్నా భాయ్‌ ధైర్యంగా, ‘సుల్తాన్‌’లా దర్జాగా లైఫ్‌ని ఎంజాయ్‌ చేయగలగడం విశేషం.

Friday, September 9, 2016

ఇటు 33..అటు 61!

 ఇప్పుడు అమలా పాల్ వయసు 24 ఏళ్లు మాత్రమే. మరి, ఇటు 33... అటు 61 ఏంటనుకుంటున్నారా? హీరోల వయసండీ. సిల్వర్ స్క్రీన్‌పై ఓ పక్క యంగ్ హీరోలతో రొమాన్స్ చేస్తున్న ఈ మలయాళీ బ్యూటీ, మరో పక్క సీనియర్ హీరోల సరసన కూడా సై అంటున్నారు. ఇప్పుడీ బ్యూటీ నటిస్తున్న తమిళ సినిమా ‘వడ చెన్నై’ హీరో ధనుష్ వయసు 33 ఏళ్లు. యంగ్ హీరోల సినిమాల్లో మంచి చాన్సులు వస్తున్నప్పుడు సీనియర్ హీరోల పక్కన నటించడానికి అమలా పాల్ వయసున్న హీరోయిన్లు ఆలోచిస్తారు. ఎందుకంటే.. సీనియర్ హీరోయిన్ కింద ట్రీట్ చేసి, యంగ్ హీరోలు చాన్సులు ఇవ్వరేమోననే భయం.

 కానీ, అమలా పాల్‌కి అటువంటి భయాలు ఉన్నట్లు కనిపించడం లేదు. 33 ఏళ్ల ధనుష్ సరసన నటిస్తూనే, 61 ఏళ్ల సత్యరాజ్ పక్కన నటించడానికి సంతకం చేసేశారు. మోహన్‌లాల్, అమలా పాల్ జంటగా నటించిన మలయాళ సినిమా ‘లైలా ఓ లైలా’ను సత్యరాజ్ హీరోగా తమిళంలో ‘మురుగవేల్’గా రీమేక్ చేస్తున్నారు. ఒరిజినల్ వెర్షన్‌లో పోషించిన పాత్రనే మళ్లీ తమిళంలో చేస్తున్నారు అమలా పాల్. 61 ఏళ్ల సత్యరాజ్ పక్కనే కాదు.. మరో నాలుగేళ్లు పెద్దైన రజనీకాంత్ సరసన కూడా ఆమె నటించనున్నారట.

ఆ కారులో షికారు బేజారు!

                        సినిమాలో లీడ్ రోల్ చేసే ఆర్టిస్ట్ లుక్ ఎలా ఉంటుందో విడుదలకు ముందు చూపించడానికి ఫస్ట్ లుక్ విడుదల చేస్తుంటారు. ఫేవరెట్ స్టార్ లుక్ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తారు. నయనతార అభిమానులు ఆమె టైటిల్ రోల్ చేస్తున్న తాజా చిత్రం ‘డోర’ ఫస్ట్ లుక్ కోసం అలానే ఎదురు చూశారు. లుక్ బయటికొచ్చింది. నయనతార వెనక్కి తిరిగి ఉన్న ఈ లుక్‌ని చూసి, ‘మేడమ్ కొంచెం టర్నింగ్ ఇచ్చుకుంటే బాగుండేది’ అని ఫ్యాన్స్ అనుకోవడం సహజం. కానీ, ఈ పోస్టర్‌లో నయనతార ముందు కారు, పైన మేఘాల్లో కనిపిస్తున్న ఫేసు చూసి, సమ్‌థింగ్ డిఫరెంట్ మూవీ చేస్తోందని ఆనందపడుతున్నారు.

 దాసు రామస్వామి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఈ హార్రర్ మూవీ రూపొందుతోంది. తెలుగులో మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ - ‘‘ఇప్పటివరకూ వచ్చిన హార్రర్ చిత్రాలకు భిన్నంగా, వైవిధ్యమైన కథాంశంతో ఈ చిత్రం ఉంటుంది. ఊహించని మలుపులతో ఆసక్తికరంగా సాగుతుంది. నయనతార పాత్ర చాలా బాగుంటుంది’’ అన్నారు. ఈ చిత్రంలో ఓ కారు పాత్ర కీలకంగా ఉంటుంది. ఆ కారులో షికారు చేసేవాళ్లు బేజారైపోతారట. దానికీ, డోరాకీ లింకేంటి? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.

ఆమిర్‌ కొత్త లుక్‌ అదుర్స్‌

 ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకునే ఆమిర్‌ ఖాన్‌ విభిన్న రకాల పాత్రలతో అలరిస్తుంటాడు. అందుకే ఆయన్నిఅభిమానులు మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ అని పిలుస్తుంటారు. పీకేలో మానవ రూపంలో ఉన్న గ్రహాంతరవాసిగా కొత్తలుక్‌లో కనిపించి అందరినీ మెస్మరైజ్‌ చేసిన ఆమిర్‌ ఇప్పుడు ‘సీక్రెట్‌ సూపర్‌స్టార్‌’ అనే చిత్రంలో అతిథి పాత్రలో నటిస్తున్నారు. దానికి సంబంధించిన ఆమిర్‌ లుక్‌ ఒకటి బయటికి వచ్చింది. అందులో ఆమిర్‌ పెద్ద మీసాలు, తలకు హెడ్‌గేర్లు తగిలించుకుని విభిన్న అవతారంలో కనిపిస్తున్నారు. ఈ సినిమాలో ఆమిర్‌ది మ్యూజిక్‌ డైరెక్టర్‌ పాత్ర. ఓ బాలికకి మ్యూజిక్‌ నేర్పిస్తూ ఆమెని సెలబ్రిటీని చేయాలని పరితపిస్తుంటాడు. సినిమాలో ఆమిర్‌ది మ్యూజిక్‌ డైరెక్టర్‌ పాత్ర అయినప్పుడు ఇలాంటి విచిత్ర లుక్‌లో ఆమిర్‌ ఎందుకు ఉన్నాడన్న విషయం బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.