Thursday, September 8, 2016

ఇంకొక్కడు :రివ్యూ

            విక్రమ్‌ సినిమాలెప్పుడూ కొత్తగా ఉంటాయి. జయాపజయాల్ని పక్కన పెడితే... ఏదో ఓ కోణంలో కొత్తదనం చూపించడానికి ప్రయత్నిస్తుంటాడు. నటుడిగా తనలోని భిన్నకోణాన్ని ఎప్పటికప్పుడు ఆవిష్కరిస్తూనే ఉంటాడు. అందుకే ‘అపరిచితుడు’ తర్వాత విక్రమ్‌కి సరైన విజ‌యాల్లేక‌పోయినా.. అతని సినిమా అంటే ప్రత్యేక ఆసక్తి చూపిస్తుంటారు. ఈసారీ ‘ఇంకొక్కడు’పై అలాంటి ఆశ‌లూ, అంచనాలూ కలిగాయి. మరి.. విక్రమ్‌ ఈసారైనా తన స్థాయికి తగిన సినిమా చేశాడా? ఇంతకీ ఈ ‘ఇంకొక్కడు’ ఎవరు?
కథేంటంటే..:మలేసియాలో భారత దౌత్య కార్యాలయంపై దాడి జరుగుతుంది. ఎనభై ఏళ్ల ముసలాడు అక్కడివాళ్లందరినీ చితగ్గొట్టి కొంతమందిని చంపేస్తాడు. సీసీ కెమెరాల్లో చూస్తే ఆ వృద్ధుడు ఓ ఉత్ప్రేరకం ప్రభావంతో అంత శక్తివంతుడయ్యాడన్న విషయం అర్థమవుతుంది. ఆ మందు పేరు.. ‘స్పీడ్‌’. ఇన్‌హేల‌ర్‌‌ రూపంలో ఉండే ఆ మందు పీలిస్తే... క్షణాల్లో ఓ వ్యక్తి పది రెట్ల బలవంతుడవుతాడు. అయితే ఆ ప్రభావం 5 నిమిషాలే ఉంటుంది. ఈ స్పీడ్‌ అరాచక శక్తుల చేతుల్లోకెళితే చాలా ప్రమాదం. అందుకే ఈ కేసుని ఛేదించడానికి ఇండియా నుంచి అఖిల్‌ (విక్రమ్‌) వెళ్తాడు. తనో రా ఏజెంట్‌. నాలుగేళ్ల క్రితం మలేసియాలోనే తన భార్య (నయనతార)ని కోల్పోతాడు. దానికీ, ఇప్పుడు స్పీడ్‌ ఉపద్రవానికీ కారణం.. ఒక్కడే. తనే లవ్‌ (విక్రమ్‌). అఖిల్‌ భార్య ఎందుకు చనిపోయింది? మలేసియా వెళ్లిన అఖిల్‌ ఏం చేశాడు? అనేదే.. ‘ఇంకొక్కడు’ కథ.
ఎలా ఉందంటే..: ఇదో సైంటిఫిక్‌ థ్రిల్లర్‌. ప్రారంభ సన్నివేశాలు ఆసక్తిగానే సాగుతాయి. అండర్‌ కవర్‌ ఆపరేషన్‌ కోసం అఖిల్‌ మలేసియా వెళ్లడం.. అక్కడ ఒక్కొక్క ఆధారం సంపాదించడం అంతా బాగుంది. లవ్‌ పాత్ర రాక.. ఈ కథకు కీలకమైన మలుపు. అక్కడి నుంచి అఖిల్‌ - లవ్‌ల మధ్య పోరాటం కూడా కీలకమే. అయితే ఈ కీలకమైన భాగాన్ని దర్శకుడు ఆనంద్‌ శంకర్‌ సరిగ్గా డీల్‌ చేయలేదేమో అనిపిస్తుంది. ఈ సినిమా అంతా.. ‘స్పీడ్‌’ మందు చుట్టూనే తిరుగుతుంది. దాని వల్ల కలిగే నష్టాలేంటి? అనే విషయాన్ని తెరపై సరిగ్గా చూపించలేదు. దాంతో.. తెరపై హీరో చేసే విన్యాసాలకు ప్రేక్షకుడు సరిగ్గా కనెక్ట్‌ అవ్వడు. సెకండాఫ్‌లో స్క్రీన్‌ప్లే కూడా గ్రిప్పింగ్‌గా లేదు. ఐదు నిమిషాలకు ఓసారి ఎవరో ఒకరు స్పీడ్‌ మందు తీసుకోవడం, దాని చుట్టూ సన్నివేశాల్ని అల్లడం.. దీనికే సరిపోయిందంతా. నిత్యమేనన్‌ పాత్రని సరిగ్గా వాడుకోలేదు. నయనతార చుట్టూ అల్లిన కథ కూడా క‌న్విన్సింగ్‌గా లేదు. వినోదం లేకపోవడం ఈ సినిమా ప్రధాన లోపం. పాటలు  బోర్‌ కొట్టిస్తాయి. పతాక సన్నివేశాలు కాస్త ఉపశమనం కలిగిస్తాయంతే. 
ఎవరెలా చేశారంటే..: విక్రమ్‌ తన శక్తివంచన లేకుండా సినిమాని కాపాడే ప్రయత్నం చేశాడు. అఖిల్‌, లవ్‌ రెండు పాత్రల్లోనూ వైవిధ్యం చూపించాడు. అయితే లవ్‌ పాత్రకే ఎక్కువ మార్కులు పడతాయి. లవ్‌ పాత్రలో విక్రమ్‌ గెటప్‌, బాడీ లాంగ్వేజ్‌ బాగున్నాయి. నయనది కూడా సీరియస్‌గా కనిపించే పాత్రే. నాజర్‌ కాసేపే కనిపిస్తాడు. మిగిలినవాళ్లవన్నీ మనకు తెలియని మొహాలే. సాంకేతికంగా కెమెరా పనితనం బాగుంది. మలేసియా అందాల్ని బాగా చూపించారు. హారీశ్‌ పాటల్లో కొత్తదనం లేదు. పాటలు ఈ సినిమాకి అడ్డు తగిలాయి.
చివరిగా: ఇంకొక్కడు ‘స్పీడ్‌’ తగ్గింది

Monday, September 5, 2016

ఇంకా సిగ్గు పోలేదు


నేను తీసుకునే నిర్ణయాలు సరైనవని నేనెప్పుడూ అనుకోనంటోంది రాశీ ఖన్నా. నాలో నేను చూడని నటిని నా దర్శకులు చూస్తారు, అందుకే దర్శకుల నమ్మకాన్ని బట్టి కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకుంటానని చెబుతోంది. తెలుగు చిత్రసీమలో జోరు మీదున్న కథానాయికల్లో రాశి ఒకరు. ప్రస్తుతం రామ్‌తో ‘హైపర్‌’, గోపీచంద్‌తో ‘ఆక్సిజన్‌’లో నటిస్తోంది. కెరీర్‌ పరంగా మీ ప్రణాళికలు ఎలా ఉంటాయని అడిగితే ‘‘చిత్రసీమలో మనం అనుకున్నట్లు ఏదీ జరగదు. పరిస్థితుల్ని బట్టి అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవాలి. అందుకే నేనెప్పుడూ ప్రణాళికలు వేసుకోను. నేను సినిమా రంగానికొచ్చి ఏళ్లు గడుస్తున్నా నాలో సిగ్గు మాత్రం పోలేదు. తెరపై కొన్ని పాత్రలు చూస్తున్నప్పుడు ఇలాంటిది నేను చేయగలనా? అనుకుంటుంటా. దర్శకులు నా పాత్ర గురించి చెబుతున్నప్పుడూ అలాగే అనిపిస్తుంది. వాళ్లు నన్ను దృష్టిలో పెట్టుకొని ఆ పాత్రని సృష్టించారంటే నేను చేయగలననేగా అర్థం. అందుకే నాలో ఓ పాత్రపై సందేహాలున్నప్పటికీ దర్శకులిచ్చే ధైర్యంతో పచ్చ జెండా వూపేస్తుంటా. అలా చేసిన ప్రతిసారి నాకు మంచి ఫలితాలే లభిస్తుంటాయ’’ని చెప్పింది రాశీ ఖన్నా.

Tuesday, August 9, 2016

మూడు గంటలు వెయ్యి రూపాయలు

ఎంత ఎదిగినా మూలాల్ని, ఎంత ఎత్తుకు చేరుకున్నా నడిచొచ్చిన దారిని మర్చిపోకూడదు. ఆ అనుభవాలే వెలకట్టలేని పాఠాల్ని, భవిష్యత్తుకు కావాల్సినంత భరోసాని అందిస్తుంటాయి. ఆ మాటే చెబుతోంది సమంత. తెలుగు చిత్రసీమలో అత్యధిక పారితోషికం తీసుకొంటున్న కథానాయికల జాబితాలో సమంత పేరు కూడా ఉంటుంది. కానీ ఒకప్పుడు వెయ్యి రూపాయలు సంపాదించడానికి అల్లాడిపోయిందట. మూడేసి గంటలు నిలబడాల్సివచ్చేదట. ఈ విషయాన్ని సమంతే చెప్పుకొచ్చింది. ‘‘పద్నాలుగేళ్ల నుంచీ నా అవసరాలకు సరిపడా డబ్బుని నేను సంపాదించుకోవడం మొదలెట్టా. చిన్న చిన్న పనులెన్నో చేశా. పెళ్లి జరుగుతున్నప్పుడు వీధి గుమ్మం దగ్గర పన్నీరు చల్లడానికి ఇద్దరు అమ్మాయిల్ని నిలబెడతారు కదా? ఆఖరికి ఆ పనీ చేశా. మూడు గంటలు నిలబడితే... వెయ్యి రూపాయలు ఇచ్చేవారు. ఎంత సంపాదించానన్నది కాదు. అది నా కష్టార్జితం. ఆ మాటే గొప్ప సంతృప్తిని ఇచ్చేది. ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నా... అప్పటి కిక్‌ రావడం లేద’’ంటోంది సమంత..

Thursday, July 14, 2016

కబాలి కొత్త పోస్టర్ అదిరింది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన కబాలి రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్రయూనిట్ ప్రమోషన్ లో వేగం పెంచింది. ఇప్పటికే నిర్మాత అఫీషియల్ గా సినిమా డేట్ ఎనౌన్స్ చేయగా.. సెన్సార్ సభ్యులనుంచి కూడా సినిమా సూపర్ అన్న టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా మీద ఏర్పడుతున్న అంచనాలను మరింత పెంచే స్థాయిలో ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

రిలీజ్ డేట్ తో పాటు ఉన్న ఈ పోస్టర్ లో రజనీ గాయలతో కనిపిస్తున్నాడు. సాధారణంగా రజనీ సినిమా అంటే వన్ మేన్ షోలా సాగుతుంది. హీరోయిన్ తో పాటు ఇతర పాత్రధారులెవరికి పెద్దగా గుర్తింపు రాదు కానీ కబాలి విషయంలో మాత్రం హీరోయిన్ పాత్రకు చాలా ప్రాధాన్యం ఇస్తున్నారు. తాజాగా రిలీజ్ అయిన పోస్టర్ లోనూ రజనీ హృదయంలో రాధికా ఆప్టే ఉన్నట్టుగా చూపించారు.

మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రజనీ, రాధికల మధ్య అందమైన ప్రేమకథ కూడా ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. వంద కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన కబాలి రిలీజ్ కు ముందే 200 కోట్ల బిజినెస్ చేసింది. ఈ నెల 22న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్న కబాలి రికార్డ్ స్థాయిలో 3500 థియేటర్లలో ప్రదర్శించేందుకు చిత్రయూనిట్ ఏర్పాట్లు చేస్తోంది.

Wednesday, July 13, 2016

చూడకుండా ఉండలేనే...

సాయిరామ్‌శంకర్ హీరోగా నటిస్తున్న చిత్రం నేనోరకం శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. రేష్మీమీనన్ కథానాయిక. సుదర్శన్ సలేంద్ర దర్శకుడు. శ్రీకాంత్‌రెడ్డి నిర్మిస్తున్నారు. మహిత్ నారాయణ్ సంగీత దర్శకత్వంలో అంబట్ల రవి రచించిన చూడకుండా ఉండలేనే ఒక్క క్షణమైనా.. అనే పల్లవితో రూపొందిన ఈ చిత్ర సాంగ్ టీజర్‌ను దేవిశ్రీప్రసాద్ బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేనోరకం టీజర్, సాంగ్స్ ఎంటర్‌టైనింగ్‌గా వున్నాయి. సాయిరామ్‌శంకర్ కెరీర్‌లో ఈ సినిమా బెస్ట్ ఫిల్మ్ అవుతుంది. మహిత్‌నారాయణ్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. పాటలతో పాటు నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది అన్నారు. 

సాయిరామ్ శంకర్ మాట్లాడుతూ సమకాలీన అంశాల్ని స్ఫూర్తిగా తీసుకుని ఆద్యంతం ఆసక్తికరమైన కథ, కథనాలతో థ్రిల్లింగ్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. నా గత చిత్రాలకు భిన్నంగా వుండే చిత్రమిది అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ టైటిల్‌కు తగ్గట్లుగానే సరికొత్త ట్రీట్‌మెంట్‌తో రూపొందిస్తున్నాం. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుందన్న నమ్మకముంది అన్నారు. ఈ నెలలోనే పాటల్ని విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నాం. తమిళంలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని రాధిక శరత్‌కుమార్ ఆసక్తిచూపిస్తున్నారు అని నిర్మాత తెలిపారు.

Tuesday, July 12, 2016

ఈ హన్సికని మీరు చూసి ఉండరు!

మనకు తెలిసిన హన్సిక అందమైన కథానాయిక మాత్రమే. కానీ వ్యక్తిగా ఆమెలో చాలా కోణాలున్నాయి. అన్నిటినీ మించి మానవత్వం పరిమళించే మంచి మనసు ఆమె సొంతం. ‘దయచేసి ఇతరులకు సహాయం చేయండి.. ఇది వర్షాకాలం. నిరాశ్రయుల మౌలిక అవసరాలు తీర్చడంలో మీవంతు సాయం చేయండి. మనం చేయగలిగిన అతిచిన్న పని ఇది’ అని హన్సిక ట్వీట్‌ చేశారు. అందరికీ చెప్పడమే కాదు, ఆమె చేసి కూడా చూపిస్తున్నారు.
చిన్నారులను దత్తత తీసుకుని వారి ఆలనా, పాలనా చూసుకుంటున్నారు. పెయింటింగ్‌లు వేస్తూ వాటి అమ్మకం ద్వారా వచ్చిన డబ్బులను పలు సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారు. తాజాగా ఇళ్లు లేక, రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌లపై నిద్రించే నిస్సహాయుల దగ్గరికి స్వయంగా తానే వెళ్లి దుప్పట్లు, బట్టలు, ఇతర సామాగ్రిని అందించారు హన్సిక. నిద్రపోతున్న వారి దగ్గరకు నిశ్శబ్దంగా వెళ్లి వాళ్ల పక్కన ఈ సామాగ్రిని ఉంచి వచ్చారామె. హన్సిక చేస్తున్న ఈ సమాజసేవ వీడియోను అభిమానులు సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఇది హాట్‌ టాపిక్‌గా మారింది.

Monday, July 11, 2016

అనుష్కపై పొగడ్తల వర్షం

 సల్మాన్‌ఖాన్‌ ప్రధానపాత్రలో తెరకెక్కి ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటున్న చిత్రం ‘సుల్తాన్‌’. రంజాన్‌ సందర్భంగా విడుదలైన ఈ చిత్రంలో సల్మాన్‌ఖాన్‌తో పాటు ఆర్ఫాగా అనుష్కశర్మ నటనపైప్రశంసల వర్షం కురుస్తోంది. సల్మాన్‌కి దీటుగా కుస్తీ సన్నివేశాల్లో మెప్పించింది అనుష్క. తొలుత చాలామంది పేర్లను పరిశీలించిన దర్శకుడు అలీ.. ఆ పాత్రలో అనుష్కను కాకుండా వేరే వారిని చూడలేమంటూ పొగిడేస్తున్నాడు.
‘‘‘సుల్తాన్‌’ సినిమాలోని ఆర్ఫా పాత్రకు అనుష్క శర్మ తప్ప మరెవ్వరూ న్యాయం చేయలేరు. అత్యద్భుతమైన ప్రతిభ దాగి ఉన్న సహజనటి ఆమె’’ అంటూ పొగడ్తల్లో ముంచెత్తాడు దర్శకుడు. అంతేకాదు.. ఈ చిత్రంలో కండలవీరుడికి సరిజోడీగా కనిపించిన ఈ సొట్టబుగ్గల సుందరీమణీ గురించి గతంలో సల్మాన్‌ కూడా ‘‘ప్రతిభ ఉన్న వారితో పనిచేయటం చాలా బాగుంటుంది’’ అని పొగిడేశాడు.
నిజమే.. ‘సుల్తాన్‌’ చిత్రంలో మల్లయోధురాలిగా అనుష్క పోషించిన పాత్ర ఆమెలోని భిన్నమైన ప్రతిభకు అద్దంపడుతుంది మరి.

సచిన్ తో పోల్చడం ఆపండి!

 పరుగుల యంత్రాన్ని తలపిస్తూ ఇప్పటికే పలు ఘనతలను తన ఖాతాలో వేసుకున్న టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పై ఉన్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నాడు. ఆ దిగ్గజ ఆటగాడితో తనను దయచేసి పోల్చవద్దంటూ అభిమానులకు మరోమారు విజ్ఞప్తి చేశాడు. అసలు తనకు సచిన్ తో ఎటువంటి పోలికా లేదని విరాట్  తెలిపాడు.  సచిన్ తో తనను పోల్చే విషయాన్ని ఇకనుంచైనా ఆపాలని విజ్ఞప్తి చేశాడు. ఈ విషయంలో అభిమానులు, మీడియా కాస్త సంయమనం పాటించాలని సూచించాడు.
'అసలు సచిన్ తో నాకు పోలిక లేదు. అతనితో నన్ను ఎందుకు పోల్చుతున్నారో అర్థం కావడం లేదు. సచిన్ ఆడినన్ని రోజులు ప్రజలకు అతనొక ఆదర్శం. ఆ రకమైన ఘనతను సాధించానని నేను అనుకోవడం లేదు. టెండూల్కర్ చాలా మందికి ప్రేరణగా నిలిచాడు.. మానవతా కోణంలో కూడా సచిన్ కు నేను ఏమాత్రం సరిపోను'అని విరాట్ తెలిపాడు.