Tuesday, July 12, 2016

ఈ హన్సికని మీరు చూసి ఉండరు!

మనకు తెలిసిన హన్సిక అందమైన కథానాయిక మాత్రమే. కానీ వ్యక్తిగా ఆమెలో చాలా కోణాలున్నాయి. అన్నిటినీ మించి మానవత్వం పరిమళించే మంచి మనసు ఆమె సొంతం. ‘దయచేసి ఇతరులకు సహాయం చేయండి.. ఇది వర్షాకాలం. నిరాశ్రయుల మౌలిక అవసరాలు తీర్చడంలో మీవంతు సాయం చేయండి. మనం చేయగలిగిన అతిచిన్న పని ఇది’ అని హన్సిక ట్వీట్‌ చేశారు. అందరికీ చెప్పడమే కాదు, ఆమె చేసి కూడా చూపిస్తున్నారు.
చిన్నారులను దత్తత తీసుకుని వారి ఆలనా, పాలనా చూసుకుంటున్నారు. పెయింటింగ్‌లు వేస్తూ వాటి అమ్మకం ద్వారా వచ్చిన డబ్బులను పలు సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారు. తాజాగా ఇళ్లు లేక, రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌లపై నిద్రించే నిస్సహాయుల దగ్గరికి స్వయంగా తానే వెళ్లి దుప్పట్లు, బట్టలు, ఇతర సామాగ్రిని అందించారు హన్సిక. నిద్రపోతున్న వారి దగ్గరకు నిశ్శబ్దంగా వెళ్లి వాళ్ల పక్కన ఈ సామాగ్రిని ఉంచి వచ్చారామె. హన్సిక చేస్తున్న ఈ సమాజసేవ వీడియోను అభిమానులు సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఇది హాట్‌ టాపిక్‌గా మారింది.

Monday, July 11, 2016

అనుష్కపై పొగడ్తల వర్షం

 సల్మాన్‌ఖాన్‌ ప్రధానపాత్రలో తెరకెక్కి ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటున్న చిత్రం ‘సుల్తాన్‌’. రంజాన్‌ సందర్భంగా విడుదలైన ఈ చిత్రంలో సల్మాన్‌ఖాన్‌తో పాటు ఆర్ఫాగా అనుష్కశర్మ నటనపైప్రశంసల వర్షం కురుస్తోంది. సల్మాన్‌కి దీటుగా కుస్తీ సన్నివేశాల్లో మెప్పించింది అనుష్క. తొలుత చాలామంది పేర్లను పరిశీలించిన దర్శకుడు అలీ.. ఆ పాత్రలో అనుష్కను కాకుండా వేరే వారిని చూడలేమంటూ పొగిడేస్తున్నాడు.
‘‘‘సుల్తాన్‌’ సినిమాలోని ఆర్ఫా పాత్రకు అనుష్క శర్మ తప్ప మరెవ్వరూ న్యాయం చేయలేరు. అత్యద్భుతమైన ప్రతిభ దాగి ఉన్న సహజనటి ఆమె’’ అంటూ పొగడ్తల్లో ముంచెత్తాడు దర్శకుడు. అంతేకాదు.. ఈ చిత్రంలో కండలవీరుడికి సరిజోడీగా కనిపించిన ఈ సొట్టబుగ్గల సుందరీమణీ గురించి గతంలో సల్మాన్‌ కూడా ‘‘ప్రతిభ ఉన్న వారితో పనిచేయటం చాలా బాగుంటుంది’’ అని పొగిడేశాడు.
నిజమే.. ‘సుల్తాన్‌’ చిత్రంలో మల్లయోధురాలిగా అనుష్క పోషించిన పాత్ర ఆమెలోని భిన్నమైన ప్రతిభకు అద్దంపడుతుంది మరి.

సచిన్ తో పోల్చడం ఆపండి!

 పరుగుల యంత్రాన్ని తలపిస్తూ ఇప్పటికే పలు ఘనతలను తన ఖాతాలో వేసుకున్న టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పై ఉన్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నాడు. ఆ దిగ్గజ ఆటగాడితో తనను దయచేసి పోల్చవద్దంటూ అభిమానులకు మరోమారు విజ్ఞప్తి చేశాడు. అసలు తనకు సచిన్ తో ఎటువంటి పోలికా లేదని విరాట్  తెలిపాడు.  సచిన్ తో తనను పోల్చే విషయాన్ని ఇకనుంచైనా ఆపాలని విజ్ఞప్తి చేశాడు. ఈ విషయంలో అభిమానులు, మీడియా కాస్త సంయమనం పాటించాలని సూచించాడు.
'అసలు సచిన్ తో నాకు పోలిక లేదు. అతనితో నన్ను ఎందుకు పోల్చుతున్నారో అర్థం కావడం లేదు. సచిన్ ఆడినన్ని రోజులు ప్రజలకు అతనొక ఆదర్శం. ఆ రకమైన ఘనతను సాధించానని నేను అనుకోవడం లేదు. టెండూల్కర్ చాలా మందికి ప్రేరణగా నిలిచాడు.. మానవతా కోణంలో కూడా సచిన్ కు నేను ఏమాత్రం సరిపోను'అని విరాట్ తెలిపాడు.

Saturday, July 9, 2016

ప్రేమ విఫలమైతే..

ప్రేమ విఫలమైతే బాధ పడకూడదంటున్నారు నటి కాజల్‌అగర్వాల్. తన వ్యక్తిగత అనుభవమో ఏమోగానీ ఈ భామ ప్రేమ గురించి చాలానే చెప్పారు. ఈ తరం యువత ప్రేమలో పడడం సర్వసాధారణంగా మారిందన్నారు. అయితే అందరి ప్రేమ సక్సెస్ కావడం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలాగని ప్రేమలో విఫలమైన వారు ఇక జీవితమే లేదని బాధ పడకూడదన్నారు. అది కరెక్ట్ కాదనీ, అలాంటి మానసిక వేదన నుంచి బయట పడాలన్నారు. ప్రేమించడం, ప్రేమించబడడం సహజం అన్నారు.

అయితే అలా ప్రేమించుకున్న వారందరూ పెళ్లి పీటలెక్కడం లేదని, సామాజిక పరమైన అంశాలు, తల్లిదండ్రుల వ్యతిరేకత వంటి అంశాలు కొందరి విషయంలో ఆటంకంగా మారుతున్నాయన్నారు. ప్రేమలో పడడంలానే ప్రేమలో విఫలం అవడం సాధారణ విషయమేనన్నారు. ప్రేమలో పడ్డా కూడా మనం ఏమిటన్నది మరచిపోకూడదని, మన వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదని అన్నారు. మన ప్రాధాన్యతను ప్రేమ తగ్గించకూడదన్నారు. ప్రేమించిన వ్యక్తే జీవితం అనే స్థాయికి వెళ్లరాదని... ఒక వేళ ప్రేమలో విఫలమైనా అందుకు బాధ పడకూడదన్నారు. దాని నుంచీ వెంటనే బయటపడగలం అన్నారు. తాను ఇప్పటి వరకూ ఎవరినీ ప్రేమించలేదన్నారు.

పెళ్లికి కూడా ఇంకా చాలా సమయం ఉంది అని అంటున్న కాజల్‌అగర్వాల్ నటిగా కోలీవుడ్‌లో బిజీ అవుతున్నారు. ప్రస్తుతం జీవా సరసన క వలైవేండామ్ చిత్రంలోనూ విక్రమ్‌కు జంటగా గరుడా చిత్రంలోనూ నటిస్తున్నారు. తాజా సమాచారం ఏమిటంటే అజిత్ 57వ చిత్రంలో నటించే అవకాశం ఈ బ్యూటీకి వచ్చిందనీ. ఇటీవల పూజా కార్యక్రమాలను జరుపుకున్న అజిత్ చిత్రంలో అనుష్క కథానాయకి అన్న ప్రచారం చాలా కాలంగా జరుగుతోంది. మరి ఆమె పాత్రలో కాజల్ నటిస్తారా? లేక ఇందులో మరో నాయకి పాత్రను పోషించనున్నారా? అన్న క్లారిటీ త్వరలోనే రావచ్చు. మరో విషయం ఏమిటంటే అజిత్‌తో కాజల్ ఎన్నై అరిందాల్ చిత్రంలోనే రొమాన్స్ చేయాల్సింది. అయితే అప్పట్లో ఆ అవకాశం చివరిలో అనుష్కను వరించింది.

Thursday, July 7, 2016

అందరికీ ఓకె చెప్పేస్తున్నాడు

బ్రహ్మోత్సవం సినిమాతో నిరాశపరిచిన మహేష్ బాబు తన నెక్ట్స్ సినిమాతో అభిమానులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. ఈ మధ్య ఎక్కువగా ఫ్యామిలీ డ్రామాల మీద దృష్టి పెట్టిన సూపర్ స్టార్, ఇప్పుడు రూట్ మార్చి ఓ పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ ను సిద్ధం చేస్తున్నాడు. తమిళ దర్శకుడు మురుగదాస్ డైరెక్షన్ లో మెసేజ్ ఓరియంటెండ్ కమర్షియల్ యాక్షన్ డ్రామాను రెడీ చేస్తున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెలాఖరున సెట్స్ మీదకు వెళ్లనుంది.

మురుగదాస్ సినిమా ఇంకా మొదలు కాకముందే ఇతర దర్శకులకు కూడా కమిట్మెంట్స్ ఇచ్చేస్తున్నాడు. ఇప్పటికే బ్రహ్మోత్సవం నిర్మాతలైన పీవీపీ సంస్థ కోసం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించాడు. తనకు పోకిరి బిజినెస్ మేన్ లాంటి సూపర్ హిట్స్ అందించిన పూరి జగన్నాథ్ దర్శకత్వంలో జనగణమన సినిమా చేయనున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కూడా మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. ఇక దర్శకధీరుడు రాజమౌళికి కూడా చాలా రోజుల క్రితమే సినిమా చేస్తానని మాట ఇచ్చాడు రాజకుమారుడు. మరి ఇన్ని సినిమాలు లైన్లో పెట్టిన మహేష్ బాబు, ఇవన్నీ ఎప్పటికీ పూర్తి చేస్తాడో.7

Tuesday, July 5, 2016

గోవింద గోవింద

కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో నటించే అవకాశం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసే కథానాయికలు చాలామందే. తమ అందాన్ని రెట్టింపు చేసి చూపెట్టే మాయాజాలం దర్శకేంద్రుడి చేతిలో ఉందని కథానాయికలు నమ్ముతుంటారు. అలాంటి కె.రాఘవేంద్రరావే ఎప్పట్నుంచో ఓ కథానాయికతో పనిచేయాలని ఎదురు చూస్తున్నారట. ఆమె ఎవరో కాదు... అనుష్క. కాస్త ఆలస్యమైనా అనుష్కతో కలిసి పనిచేసే అవకాశం లభించిందని ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు కె.రాఘవేంద్రరావు. ఆయన దర్శకత్వంలో నాగార్జున ప్రధాన పాత్రధారిగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఓం నమో వెంకటేశాయ’. ఇందులో ఓ కీలక పాత్ర కోసం అనుష్కని ఎంపిక చేసుకొన్నారు. అలాగని అనుష్క నాగార్జునకి జంటగా నటించడం లేదు. ఇందులో ఆమెది ఓ భక్తురాలి పాత్ర అని కె.రాఘవేంద్రరావు స్పష్టం చేశారు. ఆమె కెరీర్‌లో ఇలాంటి పాత్ర చేయడం ఇదే తొలిసారి. ‘‘ఏ పాత్రనైనా చేయగలిగే అద్భుతమైన నటి అనుష్క. ‘అరుంధతి’, ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ చిత్రాల్లో తన పాత్రలకి తగ్గట్టుగా ఒదిగిపోయింది. తనదైన నటనతో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. భక్తురాలిగా మా సినిమాలో అనుష్క నటనని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది’’ని ట్వీట్‌ చేశారు కె.రాఘవేంద్రరావు.

ఆ ఫోటోలను నెట్ లో పెడతానంటూ...

ల్లూరు క్రైం: ‘నీ అర్ధనగ్న ఫొటోలు నా వద్ద ఉన్నాయి.. చెప్పినట్లు వినకుంటే ఫొటోలు నెట్‌లో పెడతా’..అంటూ బెదిరించి బాలికపై ఓ వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అతని వేధింపులు తాళలేని బాధితురాలు నిద్రమాత్రలు మింగింది. ఈ సంఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. నెల్లూరులోని నీలగిరి సంఘానికి చెందిన ఓ బాలిక పాలిటెక్నిక్ డిప్లొమో సెకండియర్ చదువుతోంది. ఆమె ఇంటి ముందు నివాసం ఉండే ఉడతా సురేష్‌కు భార్య, ఎనిమిదేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. అతడు బాలికను ప్రేమిస్తున్నానంటూ కొన్ని నెలలుగా వెంటపడుతున్నాడు. బాధితురాలు తన తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు ఒకటో పట్టణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో సురేష్ కుటుంబసభ్యుల హామీ మేరకు కేసు ఉపసంహరించుకొన్నారు. అయినా, అతని ప్రవర్తనలో మార్పురాలేదు. బాలిక కళాశాలకు వెళుతుండగా వెంటబడేవాడు.

ఆమెకు అసభ్యకరమైన మెసేజ్‌లు పెట్టడంతో పాటు, ఆమె అర్ధ నగ్న ఫొటోలు తన వద్ద ఉన్నాయని.. వాటిని నెట్‌లో పెడతానని బాలికను బెదిరిస్తున్నాడు. తాను చెప్పినట్లు వినాలని బెదిరించి తన షాపునకు తీసుకెళ్లి పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే ఆమెను, ఆమె తల్లిదండ్రులను చంపుతానని బెదిరించాడు. దీంతో బాలిక అతని వికృత చేష్టలను మౌనంగా భరిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో బాలిక గర్భవతి కాగా అబార్షన్ పిల్స్ మింగించాడు. ఈ క్రమంలో ఈ నెల మూడోతేదీ సాయంత్రం నిద్రమాత్రలు మింగింది. అపస్మారక స్థితిలో ఉన్న బాలికను బాధిత కుటుంబసభ్యులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి ఆమె ఆస్పత్రిలో చికిత్స పొంది మంగళవారం తల్లిదండ్రుల సాయంతో నాలుగో నగర పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇన్‌స్పెక్టర్ సీహెచ్ సీతారామయ్య నిందితుడిపై లైంగికదాడి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

విలన్ గా మారుతున్న మరో హీరో

స్టార్ డైరెక్టర్ ఇవివి సత్యనారాయణ వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన హీరో ఆర్యన్ రాజేష్. కెరీర్ స్టార్టింగ్ లో కాస్త ఫరవాలేదనిపించినా.. తరువాత వరుస ఫ్లాప్ లతో నిరాశపరిచాడు. తరువాత వ్యాపారాలతో బిజీగా కావటంతో సినీరంగానికి పూర్తిగా దూరమయ్యాడు. అదే సమయంలో ఆర్యన్ తమ్ముడు అల్లరి నరేష్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకొని 50పైగా సినిమాలు చేసి సత్తా చాటాడు.

సినీ నిర్మాణంతో పాటు ఇతర వ్యాపారాల్లోనూ బిజీగా ఉన్న ఆర్యన్ రాజేష్ కు నటనమీద ఆసక్తితగ్గలేదు. అందుకే త్వరలో రీ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు. అయితే టాలీవుడ్ హీరోల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో ప్రస్తుతం ప్రతినాయక పాత్రలకు మంచి డిమాండ్ ఏర్పడింది. అందుకే త్వరలో విలన్ గా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు రాజేష్. ఎక్కువగా లవర్ బాయ్ తరహా సినిమాలు చేసిన రాజేష్, విలన్ గా ఎంట్రీ ఇస్తే, అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.