Tuesday, April 12, 2016

అనుష్కతో బ్రేకప్ ను ఇలా చెప్పాడా?

 టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇటీవల సోషల్ మీడియాలో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కంటే పాపులర్ అయ్యాడు. టి-20 ప్రపంచ కప్ లో విరాట్ బ్యాటింగ్ మెరుపులను నెటిజన్లు తెగ ప్రశంసించారు. ఇక సోషల్ మీడియాలో విరాట్ ఆటతీరుతో పాటు అతని ప్రేమాయణం కూడా హాట్ టాపిక్ గా మారింది.
బాలీవుడ్ ముద్దుగుమ్మ అనుష్క శర్మతో రెండున్నరేళ్ల బంధాన్ని టి-20 ప్రపంచ కప్ నకు ముందు విరాట్ తెగదెంపులు చేసుకున్నాడు. కోహ్లీ చేసిన పెళ్లి ప్రతిపాదనను అనుష్క ఒప్పుకోకపోవడం వల్లే వీరి బంధం తెగిపోయిందని వదంతులు షికారు చేశాయి. విరాట్ ఆడుతుంటే స్టేడియంలోని గ్యాలరీలో సందడి చేసే అనుష్క టి-20 ప్రపంచ కప్ సందర్భంగా ఎక్కడా కనిపించలేదు. అయితే గతవారం ఇద్దరూ కలసి మళ్లీ  కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోయారు.  గత బుధవారం ముంబై బాంద్రాలోని రాయల్టీ క్లబ్‌లో ఈ ఇద్దరూ కలిసి డిన్నర్‌ చేశారు. దీంతో వీరి ప్రేమ మళ్లీ చిగురించిందంటూ బాలీవుడ్ లో ఊహాగానాలు మొదలయ్యాయి.

కాగా ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విరాట్ కొత్త ఫొటో బాగా పాపులరయింది. ఆ ఫొటోలో విరాట్ టీ షర్ట్ వేసుకున్నాడు. దానిపై 'వు వర్ ఆన్ ఏ బ్రేక్' అని రాసి ఉంది. అనుష్కతో బంధాన్ని తెగదెంపులు చేసుకున్నట్టు ఇలా టీ షర్ట్ ద్వారా వెల్లడించాడా అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పోస్ట్ చేశారు. ఇంతకీ అనుష్కతో బంధాన్ని బ్రేకప్ చేసుకున్నాడా? లేక మళ్లీ కలసిపోయారా అన్నది కోహ్లీకే తెలియాలి!

Monday, April 11, 2016

ఓ ఐడియా.. ముగ్గుర్ని కాపాడింది!

 అదో నిర్మానుష్య ద్వీపం. చుట్టూ నీరు తప్ప మరేమీ కనిపించదు. అలాంటి విపత్కర పరిస్థితుల్లో చిక్కుకుపోయారు ముగ్గురు యువకులు. మూడు రోజుల నిరీక్షణ తర్వాత సురక్షితంగా బయటపడ్డారు. ఒక చిన్ని ఆలోచన ఆ ముగ్గురి ప్రాణాలను కాపాడింది. ఇంతకీ ఆ ఆలోచన ఏంటీ..? అసలు ఆ ద్వీపంలో వారెలా చిక్కుకున్నారు..?
ఫెడరేటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ మైక్రోనేషియాలోని పులప్‌ ఐలాండ్‌ నుంచి ముగ్గురు యువకులు పడవలో పర్యటనకు బయలుదేరారు. అయితే దురదృష్టవశాత్తు సముద్రపు అలలకు వారి పడవ బోల్తాపడి మునిగిపోయింది. ముగ్గురూ ఈదుకుంటూ ఫనడిక్‌ అనే ద్వీపానికి చేరుకున్నారు.
ప్రాణాలకు తెగించి ఒడ్డుకైతే చేరారుగానీ.. ఆ దీవి నుంచి వారికి బయటపడే మార్గం కనిపించలేదు. ఎటు చూసినా చెట్టూచేమలు.. నీరే కనిపించింది. నిర్మానుష్యంగా ఉన్న ఆ దీవిలో మూడు రోజులు గడిపారు ఆ యువకులు. మరోవైపు పడవ మునక సమాచారమందుకున్న అమెరికా కోస్టు గార్డు సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. మూడు రోజుల తర్వాత ఆ యువకులకు ఓ ఆలోచన తట్టింది. వెంటనే.. చెట్టు కొమ్మలతో ఇసుకపై H E L P అంటూ పెద్ద పెద్ద అక్షరాలను రాశారు. అటుగా వచ్చిన జపాన్‌ ఎయిర్‌బేస్‌కు చెందిన నేవీ సిబ్బంది ఆ అక్షరాలను గుర్తించారు. వెంటనే సహాయకచర్యలు చేపట్టి.. ఆ యువకులను రక్షించారు. వారు సమయస్ఫూర్తితో హెల్ప్‌ అని రాయడం, లైఫ్‌ జాకెట్లతో అక్కడే నిలబడి వుండడం.. వల్లే మా సహాయం అందుకుని ప్రాణాలతో బయటపడగలిగారు... అని చెప్పారు అధికారులు.

కోహ్లితో గొడవపడ్డా.. కానీ కలిసి ఆడతా..!


భారత్‌ స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ విరాట్‌ కోహ్లితో గతంలో ఎన్నోసార్లు మైదానంలో గొడవపడ్డాను. కానీ అతని కెప్టెన్సీలోనే ఇప్పుడు ఆడాల్సి వస్తోందని.. ఇలాంటి వింతలు ఐపీఎల్‌ లాంటి దేశవాళీ టోర్నీలోనే సాధ్యమవుతాయని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ షేన్‌ వాట్సన్‌ అభిప్రాయపడ్డాడు.
ఐపీఎల్‌-9 వేలంలో వాట్సన్‌ను రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఫ్రాంఛైజీ సీజన్‌లోనే అత్యధిక ధర రూ.9.5 కోట్లకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు మంగళవారం తొలి మ్యాచ్‌ ఆడనుంది. ఈ నేపథ్యంలో బెంగళూరు కెప్టెన్‌ కోహ్లి గురించి వాట్సన్‌ మాట్లాడుతూ ‘ఇలా కోహ్లితో కలిసి ఆడతానని అసలు వూహించలేదు.. ఓ క్రికెటర్‌గా అతణ్ని ఎక్కువగా గౌరవిస్తా’ అని అన్నాడు.

 అలానే జట్టులో ఉన్న వెస్టిండీస్‌ విధ్వసంక ఓపెనర్‌ క్రిస్‌గేల్‌తో 2009లో జరిగిన గొడవపై కూడా వాట్సన్‌ స్పందించాడు. ఆ గొడవ అనంతరం క్రిస్‌గేల్‌ ఓ ఇంటర్వ్యూలో ‘వాట్సన్‌ చూడ్డానికి గంభీరంగా ఉన్నా చాలా సున్నితమైన వ్యక్తి’ అంటూ వ్యాఖ్యానించాడని గుర్తు చేశాడు. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వాట్సన్‌ జట్టు అవసరార్థం తాను ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని వివరించాడు. కోహ్లి, క్రిస్‌గేల్‌, డివిలియర్స్‌ లాంటి హిట్టర్లు ఉన్నప్పటికీ ఇంతవరకూ ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఒక్కసారి కూడా విజేతగా నిలవలేదు. మరి టీ20ల్లో అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా పేరొందిన వాట్సన్‌ రాకతోనైనా ఈ సీజన్‌లో బెంగళూరు విజేతగా నిలుస్తుందేమో చూడాలి..! 

నాలో చాలా మార్పు వచ్చింది

 బాలీవుడ్‌లో ‘ఏక్‌ విలన్‌’.. ‘బ్రదర్స్‌’ వంటి చిత్రాలతో సిద్ధార్థ్‌ మల్హోత్రా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ ఏడాది ‘కపూర్‌ అండ్‌ సన్స్‌’ చిత్రంతో బాక్సాఫీస్‌ వద్ద ఫర్వాలేదనిపించాడు. అయినా.. ఆ సినిమా నటన పరంగా తన ప్రవర్తనను మార్చేసిందని చెబుతున్నాడు.
‘కపూర్‌ అండ్‌ సన్స్‌’ సినిమాతో పని పట్ల నా ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. నాలో ఎంతో మార్పొచ్చింది. తొలినాళ్లలో చేసిన కొన్ని సినిమాలు ఎప్పుడూ కొత్తగా అనిపించేవి. అందులో బాగా చేస్తున్నానా? లేదా? అని నన్ను నేనే ప్రశ్నించుకునేవాడిని. కానీ ఈ చిత్రంలోని పాత్రకు నా నిజ జీవితానికి చాలా సారూప్యత ఉంది’’ అని అన్నాడు సిద్ధార్థ్‌.
అంతేకాదు.. ‘‘నేను పనిచేసిన ఇతర దర్శకులందరితో కంటే.. ఈ సినిమాలో శకున్‌తో కలిసి పని చేయటం కొత్త అనుభూతిని కలిగించింది. సెట్‌లో ఉన్నప్పుడు ఆ పాత్రలో నువ్వే కనపడాలి అని చెబుతుండేవాడు’’ అని దర్శకుడ్ని పొగిడేశాడు సిద్ధార్ధ్‌.

Sunday, April 10, 2016

బ్రహ్మచారిగా ఉందామనుకొన్నా.. ఇన్ని పెళ్లిళ్లు చేసుకోవాల్సి వచ్చింది!

పవన్‌ కల్యాణ్‌... ‘అభిమానం’ అనే పదాన్ని ‘భక్తి’ స్థాయికి తీసుకెళ్లిన కథానాయకుడు.
తన ఆలోచనల్ని ‘ఇజం’గా మార్చిన భావకుడు. హీరోయిజానికి కొత్త ఉత్సాహాన్ని ఇంజెక్ట్‌ చేసిన నటుడు. ఆయనకు సమాజం అంటే ప్రేమ. పుస్తకాలంటే పిచ్చి. చదివింది ఆచరిస్తాడు. ఆచరించేదే చెప్తాడు. పవన్‌లో ఆ నిజాయతే అభిమానులకు నచ్చుతుంది. పవన్‌ కనిపిస్తే..
పవన్‌ మాట్లాడితే.. అంత ఉత్సాహంగా వూగిపోవడానికి కారణం అదే. ఓవైపు కథానాయకుడిగా, మరోవైపు నాయకుడిగా పవన్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఆయన నటించిన ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వసూళ్లలో గత రికార్డుల్ని తిరగరాస్తోంది. ఈ సందర్భంగా పవన్‌తో సంభాషించింది ‘ఈనాడు సినిమా’. అటు రాజకీయాల గురించీ, ఇటు సినిమాల గురించీ, తన వ్యక్తిత్వం గురించీ పవన్‌ కల్యాణ్‌ ఇలా చెప్పుకొచ్చారు.


వాడికి నేనంటే కోపం
‘‘అకీరాకు నేనంటే చాలా ఇష్టం. వాడు సినిమా వాతావరణానికి దూరంగా ఉంటున్నాడన్న సంతోషంగా ఉన్నా నా దగ్గర లేడనే బాధగా ఉంది. వాడికీ ఆ బాధ ఉంది. అందుకే వాడికి నాపై కోపం. నా స్టార్‌ స్టేటస్‌, ఇమేజ్‌కు అకీరా దూరంగా ఉండటం మంచిదే. భవిష్యత్తులో తను ఏం చేస్తాడన్నది తన ఇష్టాయిష్టాల్నిబట్టే ఉంటుంది’’ ..........http://www.eenadu.net/telugumovies/cinemanews.aspx?item=cinema&no=6

ఐపీఎల్ -9లో మరో వివాదం

స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు, రెండు దిగ్గజ జట్లపై వేటు, లలిత్ గేట్.. ఇలా అనేక అవరోధాలను దాటుకుంటూ ప్రారంభమైన ఐపీఎల్ 9వ సీజన్ లో మరో వివాదం చెలరేగింది. ఇప్పటికే మహారాష్ట్రలో మ్యాచ్ లు నిర్వహించే అంశం కోర్టుదాకా వెళ్లింది. తాజాగా ప్రఖ్యాత కామెంటేటర్ హర్షా భోగ్లేపై బీసీసీఐ అనూహ్యరీతిలో వేటువేసింది. హర్షా భోగ్లే కామెంటేటింగ్ కాంట్రాక్టును బోర్డు ఉన్నపళంగా రద్దుచేసింది. టీ20 వరల్డ్ కప్ సందర్భంగా కామెంటేటర్లపై.. ప్రధానంగా హర్షా భోగ్లేను ఉద్దేశిస్తూ బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కామెంట్లుకూడా వేటుకు బలమైన కారణమని తెలుస్తున్నది.
సోషల్ మీడియా ద్వారా కామెంటేటర్ల పనితీరుపై ఎప్పటికప్పుడు అంచనాలను సేకరిస్తోన్న బీసీసీఐ.. అదే సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొన్న కారణంగా హర్షా భోగ్లేపై వేటు వేసినట్లు ఓ అధికారి చెప్పారు. కామెంట్రీపై ఆటగాళ్ల నుంచి కూడా ఫీడ్ బ్యాక్ తీసుకున్నామని, అన్నీ పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 9వ సీజన్ ప్రారంభమైన రోజే హర్షాను కామెంటేటర్ల ప్యానెల్ నుంచి తొలగిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. హర్షా కూడా తాను ఇకపై ఐపీఎల్ కు అందుబాటులో ఉండబోనంటూ ట్వీట్ చేశారు.


వరల్డ్ కప్ లో ఇండియా, బంగ్లాదేశ్ ల మధ్య జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్ లో ఇండియన్ కామెంటేటర్లు ప్రత్యర్థి జట్టుకు అనుకూలంగా మాట్లాడటంపై సోషల్ మీడియాలో విమర్శలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఆ కామెంట్లు తాను చేసినవే కావడంతో మ్యాచ్ అనంతరం హర్షా భోగ్లే తనను తాను సమర్థించుకున్నారు. ఇదేకాకుండా న్యూజిలాండ్ తో నాగపూర్ లో జరిగిన ప్రారంభమ్యాచ్ లోనూ విదర్భ క్రికెట్ అసోసియేషన్ అధికారులతో గొడవపడ్డారట హర్షా భోగ్లే. రెండు భాషల్లో (ఇంగ్లీష్, హిందీల్లో) కామెంట్రీ చెప్పేందుకు అస్తమానం అటూఇటూ తిరుగుతోన్న హర్షాను 'ఇది వీఐపీ లాంజ్ మీరు నిమిషానికోసారి అలా తిరిగితే కుదరదు'అని చెప్పారట. దీనికి హర్షా సదరు అధికారులపై చిందులేశారట. అన్ని కారణాలను బేరిజు వేసుకున్న తర్వాత హర్షాకు షాక్ ఇవ్వాల్సిందేనని ఫిక్సైన బీసీసీఐ ఆయనపై వేటు వేసింది. ఐపీఎల్ ప్రసార హక్కులు సోని-ఈఎస్ పీఎన్ చానెల్ వి కాబట్టి వారు పట్టుబట్టి హర్షాభోగ్లేను కొనసాగిస్తారా, లేక బీసీసీఐ నిర్ణయానికి సరేనంటారా చూడాలి. శని, ఆదివారాలనాటి మ్యాచ్ లకైతే భోగ్లే అందుబాటులోలేరు. 90వ దశకం నుంచి క్రికెట్ కామెంటేటర్ గా కొనసాగుతున్న హర్షా భోగ్లే ఐపీఎల్ ప్రారంభం(2008) నుంచి ఆ టోర్నీకి వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

Saturday, April 9, 2016

తమన్నాకు మరో బంపర్ ఆఫర్!

 బాహుబలి సినిమాతో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న మిల్క్ బ్యూటీ తమన్నా భాటియాకు మరో బంపర్ ఛాన్స్ వచ్చింది. బాలీవుడ్ సినిమా బాజీరావ్ మస్తానీ ఘన విజయంతో జోరుమీదున్న రణ్ వీర్ సింగ్ కు జోడీగా తమన్నా నటించనున్నట్టు బాలీవుడ్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. దిల్ వాలే సినిమాతో సూపర్ సక్సెస్ ను అందుకున్న రోహిత్ శెట్టి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు.  రణవీర్, రోహిత్  కలిసి నిర్మించనున్నారని సమాచారం. దీనిపై దిల్ వాలే డెరెక్టర్ ను  ప్రశ్నించగా వేచి ఉండండి. కాలమే సమాధానం చెబుతుందని బదులిచ్చాడు.

హీరోగా స్టార్ క్రికెటర్ తనయుడు

  ఫిలిం ఇండస్ట్రీలో వారసుల హవా బాగా కనిపిస్తోంది. ముఖ్యంగా గ్లామర్ ఇండస్ట్రీ కావటంతో ఈ రంగంలోని వారందరూ తమ వారసులను సినిమాల్లోనే నటించేలా ప్రోత్సహిస్తుంటారు. అయితే ఇప్పుడు ఇతర రంగాల వారు కూడా సినీ రంగం మీద దృష్టి పెడుతున్నారు. రాజకీయ, వ్యాపార రంగాల నుంచి చాలా మంది సినీ రంగంలోకి అడుగుపెడుతున్నారు. అదే బాటలో ఓ స్టార్ క్రికెటర్ కొడుకు టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు.
 
ప్రముఖ క్రికెటర్, ఇండియన్ క్రికెట్ టీం మాజీ కెప్టెన్ అజారుద్దీన్ కొడుకు అబ్బాస్(అసదుద్దీన్) త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. తెలుగులో 'నాకు ఓ లవ్వరుంది', 'దక్షిణ మధ్య భారత జట్టు' సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన కె సురేష్ బాబు ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని భారీగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.