Tuesday, February 2, 2016

స్త్రీలే ఎక్కువ కాలం జీవిస్తారా?

పురుషుల కన్నా స్త్రీల ఆయు: ప్రమాణం ఎక్కువని చాలా పరిశోధనల్లో తేలింది. పురుషులతో పోలిస్తే గుండె జబ్బులు, పక్షవాతం..లాంటి దీర్ఘకాలిక వ్యాధులు కూడా స్త్రీలలో తక్కువగా రావడాన్ని గమనించారు. రోగనిరోధకశక్తితో పాటు జీవనపరిమితి కూడా స్త్రీలలో ఎక్కువగా ఉండడానికి కారణమేమిటి? అనే విషయంపై జీవశాస్త్రవేత్తలు కొన్ని దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తున్నారు. కానీ ఈ విషయం అంతుచిక్కని రహస్యంగానే ఉంది. కానీ స్కాండినేషియన్‌ శాస్త్రవేత్తలు మాత్రం తమ పరిశోధనల్లో ఒక కొత్త విషయాన్ని చెప్పారు. స్త్రీ శరీర కణాల్లో వైవిధ్యభరితమైన రెండు ఎక్స్‌ క్రోమోజోములు ఉండడమే ఇందుకు కారణమని ఆ నిపుణుల బృందం పేర్కొంది.
                     ఆ రెండే కీలకం : మనిషి శరీరం సూక్ష్మమైన కణాలతో నిర్మితమైందన్న సంగతి తెలిసిందే. ప్రతి కణంలోనూ 22 జతల నిర్మాణాత్మక క్రోమోజోములు, ఒక జత లైంగిక క్రోమోజోములు ఉంటాయి. వీటిలో సగం తల్లి, సగం తండ్రి నుంచి సంక్రమిస్తాయి. అయితే వీటిలో శరీర నిర్మాణానికి దోహదపడే 22 జతల క్రోమోజోముల సంగతలా ఉంచితే, తల్లిదండ్రులిద్దరి నుంచి ఆనువంశికంగా వచ్చే లైంగిక క్రోమోజోములే జీవి లింగభేదాన్ని నిర్దేశిస్తాయి. కీలకమైన ఆ క్రోమోజోముల్నే ఎక్స్‌, వై గా పిలుస్తారు. ఇవి స్త్రీలలో ఎక్స్‌, ఎక్స్‌ సంయోగంగా, పురుషుల్లో ఎక్స్‌, వై సంయోగంగా ఉంటాయి. ఫలదీకరణ సమయంలో ఈ క్రోమోజోముల్లో జరిగే కణవిభజన, పుట్టేబిడ్డ ఆడా, మగా అనే విషయాన్ని నిర్దేశిస్తుంది. ఆయా క్రోమోజోముల మీద ఉన్న జన్యువులే కణవిభజనను ప్రభావితం చేస్తాయి. అయితే తల్లి, తండ్రి నుంచి వచ్చే వైవిధ్యభరితమైన ఆ రెండు ఎక్స్‌ క్రోమోజోములే స్త్రీలలో ఆయు:ప్రమాణం ఎక్కువగా ఉండడానికి కారణమని స్కాండినేషియన్‌ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ రెండు ఎక్స్‌ క్రోమోజోముల కారణంగా ప్రతి స్త్రీ శరీరంలోనూ స్వల్ప వైవిధ్యం ఉన్న రెండు కణరేఖలు ఏర్పడతాయి. ఈ కణరేఖలే జీవి ఆయు:ప్రమాణాన్ని పెంచడానికీ, తగ్గించడానికీ దోహదపడతాయని వారు వివరించారు. స్త్రీలలో రెండు రకాల కణరేఖలు ఏర్పడడం వల్ల జీవనాన్ని ప్రభావితం చేయగల రేఖను ఎంపిక చేసుకునే అవకాశం వాళ్ల శరీరానికి ఉంది. అలాంటి అవకాశం పురుషులకు లేదు. అందుకే పురుషులలో కన్నా స్త్రీలలో ఆయు:ప్రమాణం ఎక్కువ అని తమ ప్రయోగాల ద్వారా వారు పేర్కొన్నారు.
                     స్త్రీలలో ఉండే ఈ రెండు కణరేఖల్లో ఎదో ఒకటి మాత్రమే పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుందని డెన్మార్క్‌లోని ఓడెన్స్‌ యూనివర్సిటీకి చెందిన కారీ క్రిస్టెన్‌సెన్‌, ఓస్లోలోని ఉలెవల్‌ యూనివర్సిటీ హాస్పిటల్‌కు చెందిన కరెన్‌ హెలెన్‌ ఆర్‌స్టావిక్‌ అధ్యక్షతన పరిశోధనలు చేసిన బృందం పేర్కొంది. ఎక్స్‌ క్రోమోజోమ్‌ మీదున్న ఆండ్రోజన్‌ జన్యుకారకం ఆధారంగా ఆ రెండూ ఒకదానిలో ఒకటి కలియకుండా విడవిడిగా ఏర్పడినవేనని తేలింది.
                     ఈ పరిశోధనల కోసం వయస్సు తక్కువగా ఉన్న మహిళల కణాలను పరిశీలించారు. అందులో ఆ రెండు రేఖలు సుమారుగా 50:50 నిష్పత్తిలో విభజన చెంది ఉన్నాయని గుర్తించారు. ఆ తర్వాత వృద్ధుల శరీరంలోని కణరేఖల్ని పరిశీలించారు. వారందరిలో కూడా ఒకే కణరేఖకే ప్రాముఖ్యం ఇచ్చినట్లు కనుగొన్నారు. ఆ తర్వాత నడివయస్సు ఉన్న మహిళలో పరిశోధనలు చేశారు. మొత్తం అందరిలోనూ రెండు కణరేఖల్లో ఒకటి పూర్తిగా చర్యాగుణాన్ని అంటే డామినేట్‌ చేస్తూ కనిపించింది. అదే పురుషుల్లో అయితే ఒకే ఒక కణరేఖ ఉంటుంది. కాబట్టి వారికి ఒకే అవకాశం ఉంటుందని క్రిస్టెన్‌సెన్‌ పేర్కొన్నారు. అంతేకాదు, స్త్రీలలో రెండు కణరేఖలు ఉండడం వల్ల ఒకటి కాకపోతే రెండోది ప్రభావశీలంగా ఉండే అవకాశం ఉంటుంది. అందువల్ల వాళ్ల జీవన పరిమితి పురుషుల్లో కన్నా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆయన భావిస్తున్నారు.
                  ఈ బృందం జంతువులపై చేసిన ప్రయోగాలు కూడా ఈ విషయాన్ని బలపరుస్తున్నాయి. ఉదాహరణకు క్షీరదాలను తీసుకుంటే వాటిలో కూడా మగ జంతువుల్లో ఎక్స్‌, వై అనే లైంగిక క్రోమోజోములే ఉంటాయి. అందువల్ల వాటి ఆయు:ప్రమాణం కూడా తక్కువే. అదే పక్షుల్లో ఆడవాటిలో జెడ్‌, డబ్ల్యూ అనే రెండు వైవిధ్యభరితమైన లైంగిక క్రోమోజోములుం టాయి. మగపక్షుల్లో రెండూ జెడ్‌ క్రోమోజోములే ఉంటాయి. ఫలితంగా పక్షుల విషయంలో మగ పక్షులే ఎక్కువ జీవనపరిమితిని కలిగి ఉంటాయి. దీన్ని బట్టి ఈ లైంగిక క్రోమోజుములే జీవుల ఆయు:ప్రమాణాన్ని ప్రభావితం చేస్తున్నాయని పరిశోధకలు నిర్ధారించారు.
                      అయితే ఈ అభిప్రాయాలతో అందరూ ఏకీభవించడం లేదు. 'జీవన పరిమితి ఎంత కాలముంటుందనేది మనం లెక్కించలేం కాబట్టి ఈ విషయంతో ఏకీభవించలేం' అని జాన్‌సన్‌ పేర్కొంటున్నారు. యూనివర్సిటీ ఆఫ్‌ ఇడహౌకు చెందిన స్టీవెన్‌ ఆస్టడ్‌ కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. అదీగాక మార్స్యుపియల్స్‌లో(పిల్లల్ని సంరక్షించుకు నేందుకు పొట్ట కింద భాగంలో సంచీలాంటి నిర్మాణాన్ని కలిగి ఉండే క్షీరదజాతి) అంటే కంగారూ లాంటి జంతువుల్లో తండ్రి నుంచి సంక్రమించే ఎక్స్‌ క్రోమోజోమ్‌.. ఆడజంతువుల్లో ఎప్పుడూ క్రియాశీలంగా ఉండదు. అంటే వాటిలో ఏ ఎక్స్‌ క్రోమోజోమ్‌ మంచిది అని తేల్చడానికి అవకాశమే లేదని ఆయన పేర్కొన్నారు. కాబట్టి ఆడామగా కంగారూల్లో ఏవి ఎక్కువ కాలం జీవిస్తాయనేది తేల్చిచెప్పలేం. ఆడామగా జీవుల్లో ఆయు:ప్రమా ణాలు వివిధ జాతుల్లో వివిధ రకాలుగా ఉన్నాయని పరిశోధనలు తెలియజేస్తున్నాయని, వాటిపై వివాదాలు లేకపోలేదని మరికొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

ఆసీస్‌తో తొలివన్డేలో భారత మహిళా జట్టు ఓటమి

 ఆస్ట్రేలియా- భారత మహిళా క్రికెటజట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా కాన్‌బెర్రా వేదికగా జరిగిన తొలిమ్యాచ్‌లో భారత జట్టు ఓటమి పాలైంది. దీంతో ఆసీస్‌ 1-0తో సిరీస్‌లో పైచేయి సాధించింది. అంతకు ముందు నిర్వహించిన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్‌ 2-0తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.
తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 276 పరుగులు చేసింది. అలెక్స్‌ బ్లాక్‌వెల్‌ 114, ఎల్ల్సీ పెర్రీ 90 పరుగులతో భారీ స్కోరుకు బాటలు వేశారు. భారత బౌలర్లలో శిఖాపాండే మూడు వికెట్లు సాధించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళలు 46.5 ఓవర్లలో 175 పరుగులకే ఆలౌట్‌ అయ్యారు. హర్మన్‌ప్రీత్‌(46), జూలన్‌ గోస్వామి(25) మాత్రమే రెండండెల స్కోర్‌ చేశారు.

Monday, February 1, 2016

మా మధ్య ఉన్నది అది కాదు

సిద్ధార్థ్‌ మల్హోత్రా, ఆలియా భట్‌ల మధ్య బంధం గురించి కొంత కాలంగా బాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’తో అరంగేట్రం చేసిన వీరిద్దరూ అప్పటి నుంÍే మంచి స్నేహితులుగా మారిపోయారు. పార్టీలకు, ప్రివ్యూ షోలకు జంటగా హాజరై మీడియా దృష్టిని ఆకర్షించారు. దీంతో వీరి మధ్య స్నేహానికి మించిన బంధమేదో ఉందన్న వార్తలు బలంగా వినపడుతున్నాయి. దీని గురించి సిద్ధార్థ్‌ స్పందించాడు. ‘‘నాకు, ఆలియాకు సినిమాల్లోకి రాకముందు నుంచే పరిచయముంది. ఒకే చిత్రంతో వెండితెరకు పరిచయం కావడం వల్ల స్నేహితులుగా మారిపోయాం. అవసరమైనప్పుడు ఒకరి సినిమాలకు మరొకరం మద్దతుగా నిలుస్తుంటాం. అంతమాత్రాన మా స్నేహాన్ని వేరే ఉద్దేశంతో చూడకూడదు. అలాంటి వార్తలు నా కుటుంబాన్ని బాధించాయ’’ని చెప్పాడు సిద్ధార్థ్‌. ప్రస్తుతం వీరిద్దరూ ‘కపూర్‌ అండ్‌ సన్స్‌’లో నటిస్తున్నారు. ఆలియా అద్భుతమైన నటి అని, ‘హైవే’ చూస్తే ఆమె సత్తా అర్థమవుతుందని ప్రశంసించాడు సిద్ధార్థ్‌.

రజనీతో కలిసి చేయడం అద్భుతం!

 దక్షిణాది సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కలిసి రోబో సినిమా సీక్వెల్‌లో కలిసి నటించడం అద్భుతంగా అనిపిస్తోందని బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ అంటున్నాడు. సీక్వెల్‌లో కూడా రజనీకాంత్ సైంటిస్టుగాను, ఆయన తయారుచేసే రోబో 'చిట్టి'గాను నటిస్తుండగా, విలన్ పాత్రను అక్షయ్ కుమార్ పోషిస్తున్నారు. ఇప్పటికే తన సినీజీవితంలో అనేక ఫైట్లు చేశానని, ఇప్పుడు రజనీకాంత్ లాంటి సూపర్ హీరోతో పంచ్‌లు తినడం చాలా గొప్పగా అనిపిస్తోందని అక్షయ్ చెప్పాడు. నెగెటివ్ పాత్ర పోషించాలని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నానన్నాడు. అయితే ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా ఏమీ సిద్ధం కావడం లేదు. దానికి ఎలాంటి ట్రైనింగు తీసుకోవట్లేదని అక్షయ్ చెప్పాడు. నన్నెవరూ చూడలేదు
తాను ఇంతకుముందు రజనీకాంత్‌ను కలిసిన సందర్భాన్ని అక్షయ్ గుర్తుచేసుకున్నాడు. తాను ఆయన వద్దకు వెళ్లేసరికి 15 మంది ఆయన కోసం వేచి చూస్తున్నారని, అందరూ ఆయనవైపే చూస్తున్నారని అన్నాడు. ఆయన టీ తాగుతూ.. ప్యాంటుమీద దుమ్ము ఉంటే దులుపుకొన్నారని, అందరూ ఒక్కసారిగా ఊపిరి భారంగా పీల్చుకున్నారని చెప్పాడు. తాను కూడా తన ప్యాంటు మీద దుమ్ము ఉంటే దులుపుకొన్నానని, కానీ అయితే అక్కడ ఎవరూ తనవైపు చూడలేదని తెలిపాడు. రోబో మొదటి భాగంలో ఐశ్వర్యారాయ్ నటించగా.. సీక్వెల్‌లో మాత్రం అమీ జాక్సన్ నటిస్తోంది. అలాగే డేనీ స్థానంలో అక్షయ్ వస్తున్నాడు.

Sunday, January 31, 2016

'కళావతి' మూవీ రివ్యూ


2014లో రిలీజ్ అయి ఘనవిజయం సాధించిన చంద్రకళ (అరణ్మనై) సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన మరో హార్రర్ కామెడీ చిత్రం అరణ్మనై 2. ఈ చిత్రాన్ని 'కళావతి' పేరుతో తెలుగులో అనువాదం చేసి  రిలీజ్ చేశారు. సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ ఫుల్ జానర్ గా పేరున్న హార్రర్ కామెడీ లో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా సిద్దార్థ్, త్రిష లాంటి స్టార్ లు కూడా యాడ్ అవ్వడం సినిమా మీద అంచనాలను పెంచేసింది. మరి 'చంద్రకళ'కు సీక్వెల్ గా తెరకెక్కిన 'కళావతి' తెలుగు ఆడియన్స్ ను ఏ మేరకు భయపెట్టింది..?
కథ
ఓ జమీందార్ బంగ్లా చుట్టూ తిరుగుతోంది కళావతి కథ. ఆ బంగ్లాలో ఉన్న దెయ్యం అక్కడికి వచ్చే వారిని వెంటాడుతూ భయపెడుతూ ఉంటుంది. ఆ దెయ్యం మూలంగానే జమీందార్ కోమాలోకి వెళతాడు. అతని పెద్ద కొడుకుపై కూడా దెయ్యం దాడి చేస్తోంది. ఆ సమయంలో అక్కడ ఉన్న అతీంద్రియ శక్తుల పని పట్టాలనుకుంటాడు జమీందార్ చిన్న కొడుకు (సిద్దార్థ్), అందుకు అతనికి కాబోయే భార్య (త్రిష) సాయం చేస్తుంది. ఈ పోరాటంలో బంగ్లాలో ఉన్న దెయ్యం చనిపోయిన తన చెల్లెలు కళ(హాన్సిక) అని తెలుసుకుంటాడు సిద్దార్థ్. అసలు కళ దెయ్యంగా ఎలా మారింది..? చివరకు సిద్దార్థ్ కళకు ఎలా విముక్తి కలిగించాడు అన్నదే మిగతా కథ.



నటీనటులు
తొలిసారిగా హర్రర్ జానర్ లో నటించిన సిద్దార్థ్ ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా చాలా రోజులుగా సరైన హిట్ లేని సిద్దూకి ఈ సినిమా మంచి పేరు తీసుకువచ్చింది. త్రిష నటనతో పాటు గ్లామర్ షోతోనూ ఆకట్టుకుంది. ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్ బీచ్ సాంగ్ తో కమర్షియల్ కంటెంట్ ను యాడ్ చేసింది. చంద్రకళ సినిమాలో కనిపించిన తరహా పాత్రలో హన్సిక మరోసారి మెప్పించింది. ముఖ్యంగా చెల్లెలుగా, తరువాత దెయ్యంగా కూడా అద్భుతంగా నటించింది. కోవై సరళ, సూరిల కామెడీ టైమింగ్ బాగుంది.

సాంకేతిక నిపుణులు
చంద్రకళ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు సుందర్.సి మరోసారి అదే ఫామ్ చూపించాడు. ముఖ్యంగా తొలి భాగం విజయం సాధించటంతో తన మీద ఏర్పడ్డ అంచనాలను అందుకునే స్థాయి సినిమాను తెరకెక్కించటంలో విజయం సాధించాడు. హిప్ హాప్ తమీజా సంగీతంతో సినిమా స్థాయిని పెంచాడు. పాటలు పెద్దగా ఆకట్టుకోకపోయినా నేపథ్య సంగీతం బాగా కుదిరింది. ఆర్ట్ వర్క్, సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ బాగున్నాయి.

ఓవరాల్ గా కళావతి, సౌత్ సిల్వర్ స్క్రీన్ పై హర్రర్ కామెడీలకు తిరుగులేదని ప్రూవ్ చేసిన సక్సెస్ ఫుల్ సినిమా

కంగారూలను క్లీన్‌స్వీప్‌ చేసేశారు


ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరిగిన ఉత్కంఠ చివరి టీ20 మ్యాచ్‌లో భారత్‌ 7 వికెట్ల తేడాతో విజయం సాధించి మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-0తో కంగారూలను క్లీన్‌స్వీప్‌ చేసేసింది. 198 పరుగుల ఛేదనకు దిగిన టీమిండియా విజయానికి చివరి ఓవర్‌లో 17 పరుగులు అవసరం అయ్యాయి. హిట్టర్‌ యువరాజ్‌ సింగ్‌ (15 నాటౌట్‌: 12 బంతుల్లో 1×4, 1×6) వరుసగా తొలి రెండు బంతుల్ని ఫోర్‌, సిక్స్‌గా బాది మ్యాచ్‌ను మలుపుతిప్పగా.. సురేశ్‌ రైనా (49 నాటౌట్‌: 25 బంతుల్లో 6×4, 1×6) చివరి బంతిని బౌండరీకి తరలించి భారత్‌ను విజయ సంబరాల్లో ముంచెత్తాడు. టాప్‌ఆర్డర్‌లో రోహిత్‌ శర్మ (52), శిఖర్‌ ధావన్‌ (26), విరాట్‌ కోహ్లి (50) సమయోచిత బ్యాటింగ్‌తో ఆకట్టుకోవడంతో భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 200/3తో లక్ష్యాన్ని ఛేదించగలిగింది.
 వాట్సన్‌ అజేయ శతకం వృథా
టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ ఎంచుకుంది. గాయపడిన అరోన్‌ ఫించ్‌ స్థానంలో ఆసీస్‌ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించిన వాట్సన్‌ (124 నాటౌట్‌: 71 బంతుల్లో 10×4, 6×6) భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగి శతకంతో చెలరేగాడు. మరో ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖాజా (14), షాన్‌ మార్ష్‌ (9), మాక్స్‌వెల్‌ (3) తక్కువ పరుగులకే వరుసగా పెవిలియన్‌ చేరుతున్నా.. వాట్సన్‌ ఎక్కడా జోరు తగ్గించకపోగా.. మరింత దూకుడుగా ఆడాడు. షాన్‌ మార్ష్‌తో కలిసి రెండో వికెట్‌కి 53 పరుగులు జతచేసిన షేన్‌ వాట్సన్‌.. నాలుగో వికెట్‌కి ట్రావీస్‌ హెడ్‌(26)తో కలిసి 7.5 ఓవర్లలోనే ఏకంగా 93 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. దీంతో ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 197 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది. భారత్‌ బౌలర్లలో ఆశిష్‌ నెహ్రా, అశ్విన్‌, జడేజా, యువరాజ్‌, బుమ్రా తలో వికెట్‌ తీశారు.

Saturday, January 30, 2016

హిట్ వచ్చింది... పారితోషికం పెంచేసింది

 విజయం చాలా పనులు చేస్తుంది. సంతోషాన్ని కలిగిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అవకాశాలను పెంచుతుంది. ముఖ్యంగా పారితోషికాన్ని రెట్టింపు చేస్తుంది. ఎవరు కాదన్నా అవునన్నా ఇది నిజం. ఇక నటి కీర్తి సురేష్ ఇందుకు అతీతం కాదు. ఇదు ఎన్న మైకం చిత్రంతో కోలీవుడ్‌లోకి రంగ ప్రవేశం చేసిన ఈ బ్యూటీ సీనియర్ నటి మేనక సురేష్ వారసురాలన్న విషయం తెలిసిందే. మాలీవుడ్‌లో కొన్ని చిత్రాలు చేసిన కీర్తిసురేష్‌పై పొరుగు రాష్ట్రాల చిత్ర దర్శక నిర్మాతల దృష్టి పడింది. ఫలితంగా ఈ వర్ధమాన తారకు తమిళం, తెలుగు భాషలలో విజయం వరించింది.

  తెలుగులో రామ్‌తో నటించిన నేను శైలజ చిత్రం కీర్తిసురేష్ విజయానికి పునాది వేసింది. తమిళంలో శివకార్తికేయన్‌తో నటించిన రజనీమురుగన్ చిత్రం దాన్ని కొనసాగించింది. దీంతో కీర్తి తన పారితోషికాన్ని ఒక్కసారిగా పెంచేశారనే ప్రచారం కోలీవుడ్‌లో జోరందుకుంది. అయితే ఈ ప్రచారాన్ని కీర్తి కొట్టి పారేస్తున్నారు. తనేమంటున్నారో చూద్దాం. నేను నటించిన తెలుగు చిత్రం నేను శైలజ తమిళంలో శివకార్తికేయన్‌తో నటించిన రజనీమురుగన్ చిత్రం విజయం సాధించడం సంతోషంగా ఉంది. దీంతో పాటు నా బాధ్యత పెరిగింది.

 సాధారణంగా చిత్ర జయాపజయాలు మన చేతుల్లో ఉండవు. అయితే మా అమ్మ మేనక నటి అవడంతో నాకు మార్గదర్శిగా ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఇక తమిళంలో బాబీసింహాతో నటిస్తున్న పాంబు సండై, ధనుష్ సరసన నటిస్తున్న చిత్రం షూటింగ్ పూర్తి అయ్యాయి. ప్రస్తుతం శివకార్తికేయన్ సరసనే మరో చిత్రం చేస్తున్నారు. అదే విధంగా నేను పారితోషికం పెంచేశాననే ప్రచారంలో నిజం లేదని కీర్తిసురేష్ స్పష్టం చేశారు.

ఫేస్ బుక్ లో కొత్త షేర్ ఆప్షన్..!

 సామాజిక మీడియా దిగ్గజం ఫేస్ బుక్.. యూజర్లకు మరో కొత్త అవకాశం కల్పిస్తోంది. వినియోగదారుల కోసం తమ ఈవెంట్స్ పేజీలో సరికొత్త ఫీచర్ ను ప్రవేశ పెడుతోంది. అందులో చేరినవారు.. తమ రైడ్స్ (సవారీ) ను పంచుకునే వీలు కల్పిస్తోంది. రైడ్ షేరింగ్ కాన్సెప్ట్ తో ఇప్పటికే ఎన్నో ప్లాట్ ఫామ్స్ ఉన్నా, ఫేస్ బుక్ కూడా తమ ఈవెంట్ పేజీలో ఈ ఆప్షన్ కు శ్రీకారం చుడుతోంది. ఈ అవకాశంతో ఒకే దారిలో వెళ్లేవారు ఫేస్ బుక్ ద్వారా క్యాబ్ రైడ్ షేర్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది.
ఫేస్ బుక్ పేటెంట్ అప్లికేషన్.. తమ్ ఈవెంట్ పేజీ స్టోర్ లో మరిన్ని ఆసక్తికరమైన ప్రణాళికలు చేపట్టనున్నట్లు సూచిస్తోంది. ఈవెంట్ పేజీలోని రైడ్ షేరింగ్ సెంటర్ ను రెట్టింపు చేయనున్నట్లు చెబుతోంది. ఈ అవకాశాన్ని వినియోగించుకొనేందుకు వీలుగా ఫేస్ బుక్ ఈవెంట్ పేజీలో ప్రధానంగా  'గోయింగ్' అనే ఫీచర్ ను ఏర్పాటు చేసింది. దీనికి రెండు ఉప జాబితాలనూ జోడించింది. 'గోయింగ్ అండ్ డ్రైవింగ్' 'గోయింగ్ బట్ నాట్ డ్రైవింగ్'  పేరుతో ఉన్న ఈ ఆప్షన్లను వినియోగించుకొని యూజర్లు రైడ్ షేర్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఇప్పటికే కొన్ని దేశాల్లో అమల్లో ఉన్న మొత్తం మూడు ఆప్షన్లలో గోయింగ్, నాట్ గోయింగ్ ఆప్షన్లపై జనం ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రయాణికులు తమ ఆసక్తికి అనుగుణంగా  రైడ్స్ ను షేర్ చేసుకునేందుకు ఫేస్ బుక్ వీలుకల్పిస్తోంది. క్రిస్మస్ సందర్భంగా పరిచయం చేసిన ఈ కొత్త అవకాశాన్ని అమెరికాలో ఫేస్ బుక్ వినియోగదారులు ఇప్పటికే మెసెంజర్ ద్వారా వినియోగిస్తున్నారు. మెసెంజర్ లో ముందుగా తమ స్నేహితులతో చాట్ చేసి,  క్యాబ్ ను బుక్ చేసుకోవడం ద్వారా ఈ కొత్త ప్రయత్నాన్ని వాడకంలోకి తెచ్చారు.