Saturday, November 21, 2015

సినిమా రివ్యూ: చీకటి రాజ్యం


రేటింగ్‌: 2.75/5


               ఫ్రెంచ్‌ సినిమా 'స్లీప్‌లెస్‌ నైట్‌'కి అధికారిక రీమేక్‌ అయిన 'చీకటి రాజ్యం' సగటు ఇండియన్‌ మసాలా చిత్రాల మూస పోకడలన్నిటికీ భిన్నంగా తెరకెక్కింది. హాలీవుడ్‌ లేదా ప్రపంచ భాషల్లో ఏ సినిమాల్లో చూసినా హీరో గ్లోరిఫికేషన్‌ అనేది యాక్షన్‌ సినిమాల్లో తప్ప మిగతా వాటిలో ఉండదు. కానీ మనకి ప్రతి సినిమాలోను కథానాయకుడినే హైలైట్‌ చేస్తుండాలి. 'చీకటి రాజ్యం' ఎలాంటి 'నేల విడిచి సాము' చేయని ఒక మామూలు థ్రిల్లర్‌. కథాపరంగానే పాత్రలన్నీ కనిపిస్తుంటాయి తప్ప ఒకరు హీరో, ఒకరు హీరోయిన్‌, వీళ్లకో పాట, వీళ్లకిక్కడ కామెడీ అంటూ కొలతలేమీ ఉండవు.
               రొటీన్‌ పోకడలేం లేకపోవడం వల్ల 'చీకటి రాజ్యం' ఫ్రెష్‌ అనుభూతినిస్తుంది. స్టోరీగా చెప్పుకుంటే చాలా సింపుల్‌ పాయింట్‌. కొకైన్‌ బ్యాగ్‌ స్వాధీనం చేసుకున్న అండర్‌ కవర్‌ పోలీస్‌ (కమల్‌) కొడుకుని విలన్‌ (ప్రకాష్‌రాజ్‌) కిడ్నాప్‌ చేస్తాడు. బ్యాగ్‌ ఇస్తే పిల్లాడ్ని ఇస్తా అని డీల్‌ మాట్లాడితే ఆ బ్యాగ్‌ పట్టుకుని వెళ్లిన పోలీస్‌ తమ డిపార్ట్‌మెంట్‌ వాళ్లకే (త్రిష, కిషోర్‌) క్రిమినల్‌గా కనిపిస్తాడు. విలన్‌ ఉన్న పబ్‌లోకి వెళ్లి బ్యాగ్‌ని బాత్రూమ్‌లో దాచి కొడుకు క్షేమం తెలుసుకుని బ్యాగ్‌ ఇచ్చేద్దామని వస్తే అక్కడ అది ఉండదు. తన వెనకపడ్డ పోలీసులు అది తీసేస్తారు. ఆ బ్యాగ్‌ ఇవ్వకపోతే కొడుకుని సేఫ్‌గా తీసుకెళ్లడం కష్టమైన పరిస్థితుల్లో ఆ పోలీస్‌ ఏం చేస్తాడు? రాత్రి గడిచేలోగా కొడుకుని ఎలా కాపాడుకుంటాడు?
                           కథ మొత్తం ఇరవై నాలుగు గంటల్లో నడుస్తుంది. దాదాపుగా ఒక నైట్‌ క్లబ్‌లోనే సినిమా అంతా సాగుతుంది. కొడుకుని కాపాడుకునే ప్రయత్నంలో తండ్రి, క్రిమినల్‌ కాప్‌ని పట్టుకోవాలనే లేడీ పోలీస్‌, కొకైన్‌ బ్యాగ్‌ కోసం చూసే డాన్‌, అతడినుంచి కొకైన్‌ ఆశిస్తున్న మరో క్రిమినల్‌ (సంపత్‌ రాజ్‌), తండ్రి కోసం ఎదురు చూస్తూ ఒక కిడ్నాపర్‌తో కాలక్షేపం చేసే కొడుకు, బాయ్‌ఫ్రెండ్‌తో పబ్‌కొచ్చి అతని నిజ స్వరూపం తెలిసి కాపాడిన పోలీస్‌ వెంట తిరిగే నర్స్‌ (మధు షాలిని)... ఇలా వివిధ క్యారెక్టర్స్‌ అన్నీ ఆ నైట్‌ క్లబ్‌లో చేరితే తెల్లారేలోగా కథ కంచికెలా చేరుతుందనేదే 'చీకటి రాజ్యం'. కిడ్నాప్‌, కొకైన్‌, క్లబ్‌, పోలీస్‌.. ఇలా అన్నీ ఒక బిగి సడలని థ్రిల్లర్‌కి కావాల్సిన లక్షణాలే ఉన్నాయి. కానీ 'చీకటి రాజ్యం' మాత్రం ఆద్యంతం చప్పగా సాగిపోతుంది. 


ప్రథమార్థం వరకు ఎలాంటి థ్రిల్స్‌ లేకుండా మామూలుగా వెళ్లిపోయినా ద్వితీయార్ధంలో అయినా కథనంలో ట్విస్టులు, ఎడ్జ్‌ ఆఫ్‌ ది సీట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌లాంటివి కోరుకుంటాం. కానీ 'చీకటి రాజ్యం' ద్వితీయార్ధం కూడా ఏ విధమైన ఎక్సయిట్‌మెంట్‌ లేకుండా అలా ఫ్లాట్‌గా వెళ్లిపోతుంది. క్రిమినల్‌ చేతిలో కొడుకు కిడ్నాప్‌ అయి ఉన్నాడు, తండ్రి కీలకమైన కొకైన్‌ బ్యాగ్‌ పోగొట్టుకున్నాడంటే ఉత్కంఠ పుట్టించే అవకాశమున్న సరంజామా ఉన్నా కానీ ఎంతసేపు ఒకరికి కనిపించకుండా ఒకరు తప్పించుకు తిరగడమే సరిపోయింది. కొకైన్‌ బ్యాగ్‌ మిస్‌ అయినప్పుడు దానికి బదులుగా మైదా పిండి ప్యాకెట్లు పట్టుకెళ్లి ఇవ్వడం, ఆ బ్యాగ్‌ చుట్టూ నడిపిన పాటి కాస్త డ్రామా అయినా మళ్లీ ఎక్కడా లేకపోయింది. అంతో ఇంతో బాగున్న అంశం ఏదైనా ఉంటే కమల్‌హాసన్‌, త్రిషల ఫైట్‌ సీన్‌. హీరో హీరోయిన్లు సీరియస్‌గా ఫైట్‌ చేసుకోవడం తరచుగా చూసే సన్నివేశం కాదుగా. 
               ఫైట్ల చిత్రీకరణ మాత్రం బాగా చేసారు. నిజంగా ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటే ఎలా ఉంటుందో అలానే అనిపిస్తుంది తప్ప ఎక్కడా సినిమాటిక్‌ ఫీల్‌ ఉండదు. షర్టు నలగకుండా కొట్టేసే హీరో కనిపించడు. ఒకడ్ని కొట్టి చెయ్యి నొప్పెడితే ఆ బాధని భరిస్తున్న సంగతి చూపెడతాడు. సహజత్వానికి దగ్గరగా ఉందనేది ప్లస్‌ పాయింటే కానీ ఆకట్టుకునే కథనం లేకపోవడంతో ఇది వెండితెరపై వీక్షించే సినిమాలా అనిపించలేదు. ఏదో సరదాగా డివిడిలో కాలక్షేపం చేయడానికి పనికొచ్చే బాపతు సినిమా అన్నమాట. తన ప్రతి సినిమాలోను హాస్యం జోడించే ప్రయత్నం చేసే కమల్‌ ఇందులో కూడా అక్కడక్కడా కామెడీని ఇరికించారు కానీ సీరియస్‌ సెటప్‌ మధ్య అదంతగా పేలలేదు. 
                         కమల్‌లోని నటుడ్ని పరీక్షించేంత సీన్‌ ఉన్న క్యారెక్టర్‌ కాదు. ఆయన చాలా ఈజీగా చేసుకుపోయాడు. త్రిష మేకప్‌ లేకుండా పోలీస్‌ పాత్రలో సహజంగా కనిపించింది. పదేళ్లుగా హీరోల వెంట చెట్లు, పుట్టలు తిరుగుతోన్న ఆమెకిది కొత్త ఎక్స్‌పీరియన్సే. మధు షాలిని కేవలం కమల్‌కి ముద్దులు పెట్టడానికి ఉన్నట్టుగా అనిపిస్తుంది. ప్రకాష్‌రాజ్‌కి కూడా చాలా సాధారణ క్యారెక్టర్‌. సంపత్‌ రాజ్‌ ఫర్వాలేదు. సాంకేతికంగా ఈ చిత్రం ఉన్నతంగా ఉంది.
                       లొకేషన్స్‌ ఎక్కువ లేని ఈ సినిమాలో సినిమాటోగ్రాఫర్‌ ప్రతిభ బాగా కనిపిస్తుంది. జిబ్రాన్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ బ్రహ్మాండంగా ఉంది. దర్శకుడు ఉన్న కథని బాగానే తెరకెక్కించాడు కానీ ఉత్కంఠభరిత సన్నివేశాలని జోడించగలిగి ఉంటే 'చీకటి రాజ్యం' మంచి ప్రయత్నంగానే కాక బాక్సాఫీస్‌ వద్ద విజయాన్ని కూడా దక్కించుకునేది. రొటీన్‌ సినిమాలతో విసిగిపోయిన వారికి కాస్త రిలీఫ్‌ అయితే ఇస్తుంది కానీ ఒక మంచి సినిమా చూసిన అనుభూతిని మాత్రం అందించలేకపోయింది.

Friday, November 20, 2015

సినిమా రివ్యూ: కుమారి 21ఎఫ్‌

రేటింగ్‌: 3/5

 


                    సుకుమార్‌ సినిమాల్లో ఎప్పుడూ రొటీన్‌కి భిన్నమైన ఆలోచనలే కనిపిస్తుంటాయి తప్ప రెగ్యులర్‌ కథలు కానరావు. ఏదైనా కొత్తగా ఉండాలని తపన పడే సుకుమార్‌ తనే నిర్మాతగా మారి ఒక సినిమా తీసాడంటే తప్పకుండా అందులో వైవిధ్యం ఒక పిసరంత ఎక్కువే ఉంటుందని అనుకుంటాం. 'కుమారి 21ఎఫ్‌'లో సుకుమార్‌ నుంచి మనం ఊహించే దానికంటే కాస్త ఎక్కువ సంచలనం, కాస్త ఎక్కువ ఆశ్చర్యం, కాస్త ఎక్కువ వైవిధ్యం ఉన్నాయి. ఇది సగటు తెలుగు సినిమా కాదు. సగటు సోకాల్డ్‌ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ అసలే కాదు. బోల్డ్‌ సినిమా. బోల్డ్‌ అంటే అలాంటిలాంటి బోల్డ్‌ కాదు... పలక తీసుకుని అదే పనిగా ఒకే అక్షరాన్ని దిద్దీ, దిద్దీ బలపం అరిగిపోతే వచ్చేటంత బోల్డ్‌ సినిమా! 
              
     ప్రేమలో పడ్డ టీనేజ్‌ అబ్బాయిలు కొందరు తమ ప్రేయసి తనతోనే ముందుగా ప్రేమలో పడిందా లేక ముందే ఏవైనా అనుభవాలున్నాయా అనే సంఘర్షణకి గురవుతారు. ఆ సంఘర్షణనే సుకుమార్‌ కథావస్తువుగా ఎంచుకున్నాడు. ఒక అమ్మాయి వేషధారణ, సామాజిక పరమైన నడవడికని బట్టి 'క్యారెక్టర్‌'ని తూకమేసే చదువుకున్న బడుద్దాయిలు మనకి అడుగడుగునా కనిపిస్తారు. ఇలాంటి సెన్సిటివ్‌ ఇష్యూని సుకుమార్‌ కథగా మలిచాడు. అబ్బాయిలతో ఫ్రెండ్‌ అంటూ చనువుగా తిరిగేసి, ఎంత రాత్రయినా ఎలాంటి బెరుకు లేకుండా వెళ్లేసి వచ్చేసే కుమారి (హెబా పటేల్‌) ఒక మామూలు కుర్రాడు సిద్ధుని (రాజ్‌) ప్రేమిస్తున్నానంటుంది. అతనికీ ఆమె నచ్చుతుంది. కానీ ఆమె తననే ప్రేమిస్తుందా లేక తాను ప్రేమిస్తున్నానని చెప్పుకు తిరిగే చాలా మందిలో తానూ ఒకడా? తనకున్న సందేహాలు చాలవన్నట్టు ఆమె బిహేవియర్‌ దృష్ట్యా కుమారి 'కన్య' కాదని సర్టిఫై చేసేస్తారు స్నేహితులు. తప్పని పరిస్థితుల్లో ఆమె క్యారెక్టర్‌కి టెస్ట్‌ పెట్టాలని చూస్తాడు. నన్ను ప్రేమించేంత పరిపక్వత నీలో వచ్చినప్పుడు చూద్దామంటూ సిద్ధూని కడిగేస్తుంది. కుమారికి తనకి తెలియని గతం ఒకటుందని తర్వాత తెలుస్తుంది. ఇంతకాలం తనని మోసం చేసిందని సిద్ధు ఊగిపోతాడు. అతను రియలైజ్‌ అయ్యేలోగా ఒక అనర్ధం జరిగిపోతుంది. కానీ కుమారి కోరుకున్న పరిపక్వతని మించి మెచ్యూరిటీ చూపిస్తాడు.
 కొన్ని కథలు ఊహలోకి వస్తేనే 'చూస్తారా లేదా' అనే సందేహం దాటి ముందుకు కదలవు. కానీ సుకుమార్‌ అలాంటి ఒక కథని ఊహించాడు, రాసాడు, తనే నిర్మాతగా మారి తెరకెక్కించాడు కూడా! 'కుమారి' చిత్రానికి రచయితగా సుకుమార్‌ తన మెచ్యూరిటీ లెవల్స్‌ చూపించాడు. ఇందులో హీరో ఒక మాదిరి లోయర్‌ మిడిల్‌ క్లాస్‌ కాలనీలో ఉంటాడు. కనీస అవసరాలు కూడా సరిగా లేని ఆ కాలనీలో పెరిగిన కుర్రాళ్లు చాలా ఈజీగా క్రైమ్‌కి అలవాటు పడతారనేది చెప్పకనే చెప్తాడు. ఏటీమ్‌ల వద్ద దొంగతనాలకి పాల్పడే స్నేహితుల బృందంతో కలిసి తిరిగే హీరో వారి దగ్గర్నుంచి షేర్‌ కూడా తీసుకుంటూ ఉంటాడు. తను చేసేదీ, తిరిగేదీ అంతా తప్పే అయినా కానీ తనని ప్రేమించే అమ్మాయి మాత్రం పర్‌ఫెక్ట్‌గా ఉండాలనుకుంటాడు.

            కుమారి అయితే తనకి ఎంత 'రేటు' పలుకుతుందో హీరోనే అడుగుతుంది. అతనితో కలిసి చాలా క్యాజువల్‌గా మందు కొడుతుంది. అంతే క్యాజువల్‌గా పెదాలపై ముద్దులు కూడా పెట్టేస్తుంది. తనని ప్రేమించడం వల్లే ఇదంతా చేస్తుందని అనుకునేంత మెచ్యూరిటీ హీరోకి లేకపోవడం వల్ల క్యారెక్టర్‌లెస్‌ అనేసుకుని పొరపడతాడు. ఆమె ప్రవర్తన, వేషధారణ అతని అనుమానాలకి ఆజ్యం పోస్తాయి. కానీ సరిగ్గా గమనిస్తే కుమారి ఎక్కడా హీరోతో తప్ప ఎవరితోను చనువుగా మూవ్‌ అవదు. ఎవరి దగ్గర లూజ్‌గా మాట్లాడదు. పక్షవాతంతో కుర్చీలో పడి ఉన్న తాతతో జోక్‌లు వేస్తుందీ, హీరో దగ్గర ఫిల్టర్‌ లేకుండా మాట్లాడేస్తుంది తప్ప మిగిలిన ఎవరి దగ్గరా 'లూజ్‌'గా బిహేవ్‌ చేయదు. ఆర్టిస్ట్‌ ఒక బొమ్మ గీస్తున్నప్పుడు దానిని స్టార్టింగ్‌లో చూస్తే ఏవో పిచ్చిగీతల్లా అనిపిస్తాయి. బొమ్మ పూర్తయితే తప్ప దాని అసలు అందం ఏంటనేది తెలీదు. కుమారి క్యారెక్టర్‌ స్కెచ్‌ని ఒక ఆర్టిస్ట్‌ మాదిరిగా తీర్చిదిద్దాడు సుకుమార్‌. ఆ పాత్ర ఏంటనేది పరిపూర్ణంగా తెలిసాక కానీ ఆమె ఏంటనేది అర్థం కాదు. అయితే హీరోతో పాటు ప్రేక్షకులకి కూడా 'కుమారి'ని 'లవ్‌ చేయాలా వద్దా' అనే అనుమానాన్ని అలాగే ఉంచాలని ఆమెతో గీత దాటించి మాట్లాడించడం, ప్రవర్తించడం చేయించారు. కుమారి ఏంటనేది హీరోతో పాటే చూసేవాళ్లకీ ఒక్కసారే క్లారిటీ వస్తుంది.
            ఇలాంటి కథకి ఎలాంటి క్లయిమాక్స్‌ అయితే పర్‌ఫెక్ట్‌ అనిపిస్తుందో అదే ముగింపునిచ్చాడు సుకుమార్‌. ఈ విషయంలో మెజారిటీ ప్రేక్షకుల ఆమోదం ఉంటుందా లేదా అనేది ఆలోచించకుండా కథౌచిత్యానికే ప్రాధాన్యమిచ్చి తాను మిగిలిన వారి కంటే చాలా భిన్నమని మరోసారి చాటుకున్నాడు. హీరో పేరెంట్స్‌ త్రెడ్‌ ద్వారా హీరోకి రియలైజేషన్‌ వచ్చే సీన్‌ని సృష్టించి 'కుమారి'కి సుకుమార్‌ ఇచ్చిన రైటర్‌ 'టచ్‌' సూపర్బ్‌ అనిపిస్తుంది. అలాగే హీరోయిన్‌ కోరుకునే మెచ్యూరిటీకి మించిన మెచ్యూరిటీని హీరో చూపించడమనే థాట్‌కి సుకుమార్‌ హేట్సాఫ్‌ చెప్పాలి. అందరికీ ఆమోదయోగ్యం కాని దానిని ఆమోదించేలా చేయడంలోనే ఒక రచయిత గొప్పతనం దాగి ఉంటుంది. తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న ఉత్తమోత్తమ రచయితల్లో సుకుమార్‌కి సముచిత స్థానం ఇస్తుంది కుమారి. ఈ కథని ఇంకాస్త అండర్‌ ప్లే చేస్తూ ఇంకా ఎక్కువ మందికి రీచ్‌ అయ్యేలా చెప్పి ఉండొచ్చు. 'అడల్ట్‌ సినిమా' ముద్ర పడకుండా కనీసం 'పీజీ (యు/ఏ)' స్థాయి కంటెంట్‌తో అయినా సరిపెట్టి ఉండొచ్చు. అయితే ఫక్తు అడల్ట్‌ సినిమా మాదిరిగానే డీల్‌ చేయడం వల్ల కుమారి మెజారిటీ ఆడియన్స్‌కి రీచ్‌ కాకపోవచ్చు.
                     రాజ్‌ తరుణ్‌ తన పాత్రకి అతికినట్టు సరిపోయాడు. ఆ పాత్రకి కావాల్సిన భావోద్వేగాలని చాలా అలవోకగా పలికించేసి తన ప్రతిభ చాటుకున్నాడు. హెబా పటేల్‌కి అలవాటు పడడానికి కాస్త టైమ్‌ పడుతుంది. ఒక్కసారి అలవాటయ్యాక ఆమె బాగానే అనిపిస్తుంది. నోయల్‌ నటన ఆకట్టుకుంటుంది. హేమ తను చేసే పాత్రలకి భిన్నమైన సాత్విక పాత్రలో కొత్తగా కనిపిస్తుంది. హీరో స్నేహితుల బృందంలో సుదర్శన్‌ తన మార్కు యాస డైలాగులతో నవ్విస్తాడు. దేవిశ్రీప్రసాద్‌ పాటలు బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌, ప్రత్యేకించి ఆ వయొలిన్‌ థీమ్‌ విశేషంగా మెప్పిస్తుంది. రత్నవేలు సినిమాటోగ్రఫీతో ఈ చిత్రం చాలా క్వాలిటీగా అనిపిస్తుంది. దర్శకుడు సూర్య ప్రతాప్‌ కథలోని సోల్‌ని క్యారీ చేయగలిగాడు. ప్రతాప్‌ బాగానే హ్యాండిల్‌ చేసినా కానీ ఇది సుకుమార్‌ తీసి వుంటే ఇంకెలా ఉండేదో అనే ఆలోచన అయితే రాకపోదు.
 

Thursday, November 19, 2015

లాలు తనయుడికి డిప్యూటీ సీఎం పదవి?


ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ కు బిహార్ ఉప ముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశాలున్నాయి. ఆర్జేడీ శాసనసభ పక్ష నాయకుడిగా తేజస్వి యాదవ్ ను నియమించవచ్చని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. శుక్రవారం బిహార్ ముఖమంత్రిగా జేడీయూ నేత నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ ప్రముఖులు హాజరవుతున్నారు. నితీశ్ కేబినెట్ లో లాలు కుమారులు తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్ లకు బెర్తులు దక్కనున్నట్టు సమాచారం. లాలు చిన్న కొడుకు తేజస్వి కి డిప్యూటీ సీఎం పదవి దక్కే చాన్స్ ఉంది.


లాలు ఈ విషయంపై నితీష్ తో చర్చించినట్టు ఆర్జేడీ వర్గాలు వెల్లడించాయి. లాలు కొడుకులు తాజా ఎన్నికల్లో తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కాగా లాలు ఎన్నికల్లో పోటీ చేయలేదు. బిహార్ ఎన్నికల్లో మహాకూటమి పార్టీలు జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ లు ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆర్జేడీ 80, జేడీయూ 71, కాంగ్రెస్ 27 సీట్లు గెల్చుకున్నాయి.

పోస్టర్ అదిరింది...



ధనుష్‌, సమంత జంటగా నటిస్తున్న తమిళ చిత్రం 'తంగ మగన్‌' చిత్ర పోస్టర్లు గురువారం విడుదల చేశారు. ధనుష్‌ స్వీయ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అమీజాక్సన్‌ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రేమ, పెళ్లి... పెళ్లి తర్వాత ప్రేమ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పోస్టర్లు ఆసక్తిని కలిగిస్తున్నాయి. అమీ జాక్సన్ మోడ్రన్ లుక్ లో ఉండగా, సమంత కొత్తగా పెళ్లైన యువతిగా కనిపిస్తూ అభిమానులకు సినిమా మీద అంచనాలను పెంచుతున్నారు. ఈ సినిమా ఆడియోను ఈ నెల 27న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది.

Wednesday, November 18, 2015

రోడ్లపై షికార్లు కొట్టిన బజ్జీ దంపతులు


 కొత్తగా పెళ్ల్లె ప్రముఖ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ తన భార్య గీతా బస్రాతో కలిసి రోడ్లపై షికార్లు కొట్టాడు. అయితే ఇందులో చిన్న తిరకాసు ఉందండోరు అది ఎంటో తెలిస్తే మీరు ఆశ్చర్యాని కి గురవ్వక తప్పదు. వారిద్దరూ ఫికార్టు కొట్టింది ఓ ద్విచక్ర వాహనంపై ఇంతకీ ఆ వాహనాన్ని నడిపింది ఎవరో తెలుసా... బజ్జీ సతీమణి గీతా బస్రా. వీరిద్దరూ షికార్లు కొడుతున్న సమయంలో తీసుకఁన్న కొన్ని ఫోటోలను ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో పంచుకఁన్న బజ్జీ.

'శ్రీమంతుడు' సైకిల్‌ను విజేతకు అందించిన సూపర్‌స్టార్‌ మహేష్‌


సూపర్‌ డూపర్‌ హిట్‌ మూవీ 'శ్రీమంతుడు'. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో రిలీజ్‌ అయిన ఈ చిత్రం రికార్డు కలెక్షన్లతో బిగ్గెస్ట్‌ గ్రాసర్‌గా ఈ చిత్రం నిలిచిన విషయం తెలిసిందే.  ఈ చిత్రంలో సూపర్‌స్టార్‌ మహేష్‌ ఉపయోగించిన సైకిల్‌కి సంబంధించి జరిగిన కాంటెస్ట్‌లో విజేతను ఇటీవల డ్రా ద్వారా మహేష్‌ ఎంపిక చేశారు. కరీంనగర్‌కు చెందిన జి.నాగేందర్‌ రెడ్డి 'శ్రీమంతుడు' సైకిల్‌ విజేతగా నిలిచారు. విజేత జి.నాగేందర్‌ రెడ్డికి సూపర్‌స్టార్‌ మహేష్‌ చేతుల మీదుగా 'శ్రీమంతుడు' సైకిల్‌ను ప్రదానం చేశారు.

Tuesday, November 17, 2015

సునీల్ కోసం కథ రాశా!



‘‘సుకుమార్ ితీసే చిత్రాలన్నీ వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. అందుకే ఆయన ఈ కథ చెప్పగానే వెంటనే ఒప్పుకున్నా’’ అని హీరో రాజ్ తరుణ్ అన్నారు. సుకుమార్ నిర్మాతగా మారి స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించిన చిత్రం ‘కుమారి 21 ఎఫ్’. సూర్యప్రతాప్ దర్శకత్వంలో విజయ్‌ప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ 20న విడుదల కానుంది.


హీరో సునీల్ నాకు మంచి ఫ్రెండ్.  అప్పుడప్పుడూ ఆయనను  కలుస్తుంటాను. అప్పుడు తన కోసం ఓ కథ సిద్ధం చేయమన్నారు. సరదాగా కథ రాశాను గానీ దాన్ని తెరకెక్కించాలనే ఆలోచన లేదు. ఇప్పట్లో దర్శకత్వం గురించి ఆలోచించను. ఖాళీ దొరికినప్పుడల్లా కథలు రాసుకుంటుంటాను

ఐటెం సాంగ్స్‌ ఓకే చెప్పిన స్టార్‌ హీరోయిన్‌


టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్స్‌ ఐటెం సాంగ్స్‌ చేయడం మొదలు పెట్టారు. ఇప్పటికే శృతిహాసన్‌ ' ఆగడు' చిత్రంలో తమన్నా ' అల్లుడు శీను' చిత్రంలో ఐటెం సాంగ్స్‌ చేశారు. అదే బాటలో మరో స్టార్‌ హీరోయిన్‌ ఐటెం సాంగ్స్‌ చేయడానికి ముందుకు వస్తున్నారు. తాజాగా కాజల్‌ సైతం ఐటెం సాంగ్‌పై మక్కువ చూపుతున్నట్లుగా తెలుస్తోంది.