Sunday, November 1, 2015

సానియా అదరహో...

  భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా డబ్ల్యూటీఏ టూర్‌లో తన సత్తా చాటింది. మహిళల సింగిల్స్ ప్రపంచ మాజీ నంబర్ వన్ క్రీడాకారిణి మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)తో కలిసి డబ్ల్యూటీఏ టూర్ ఫైనల్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో సానియా జోడీ 6-0, 6-3 తేడాతో 8వ సీడ్ ముగురుజ్జా-సూరేజ్ సవరో (స్పెయిన్) జంటపై విజయం సాధించింది. దీంతో ఈ జోడీ సాధించిన టైటిల్స్ సంఖ్య 9కి చేరింది. వీరి ఖాతాలో వరుసగా 22వ విజయం వచ్చి చేరింది. సానియా మీర్జాకు తన కెరీర్‌లో ఇది 32వ డబుల్స్ టైటిల్. హింగిస్‌కు 50వ డబుల్స్ టైటిల్.

Saturday, October 31, 2015

డ్రా ముగిసిన ప్రాక్టీస్ మ్యాచ్



 దక్షిణాఫ్రికా-బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్ల మధ్య ఇక్కడ బ్రబౌర్న్ స్టేడియంలో జరిగిన రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ డ్రా ముగిసింది. ఇరు జట్లు ప్రాక్టీస్ లో ఆకట్టుకున్నా రెండు రోజులే  కావడంతో ఫలితం తేలలేదు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 296 పరుగులకు ఆలౌట్ కాగా, దక్షిణాఫ్రికా 302 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా 46/2 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ ను కొనసాగించింది. 57 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును డివిలియర్స్(112) శతకం సాధించి ఆదుకున్నాడు. డివిలియర్స్ కు తోడుగా వికెట్ కీపర్ డేన్ విలాస్ (54)  రాణించడంతో దక్షిణాఫ్రికా గౌరవప్రదమైన స్కోరును సాధించింది. బోర్డు ప్రెసిడెంట్ ఆటగాళ్లలో శార్దూల్ థాకూర్  నాలుగు వికెట్లు సాధించగా, కులదీప్ యాదవ్, జయంత్ యాదవ్ లకు తలో రెండు వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన బోర్డు ప్రెసిడెంట్ జట్టు మ్యాచ్ ముగిసే సమయానికి 30 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 90 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. తొలి ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీ చేసిన కేఎల్ రాహుల్.. మరోసారి ఆకట్టుకున్నాడు. 90 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 43 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అతనికి జతగా చటేశ్వర పూజారా(49 నాటౌట్) ఆకట్టుకున్నాడు.

మరో టైటిల్ కు అడుగు దూరంలో...


 వరుస విజయాలతో దూసుకుపోతున్న సానియా మీర్జా(భారత్)- మార్టినా హింగిస్(స్విట్జర్లాండ్) జోడీ మరో టైటిల్ కు ఒక్క అడుగు దూరంలో నిలిచింది. డబ్యూటీఏ ఫైనల్స్ టోర్నీలో భాగంగా శనివారం జరిగిన సెమీ ఫైనల్లో సానియా జంట  6-4, 6-2 తేడాతో హావో చింగ్ చాన్-యుంగ్ జాన్ చాన్ (చైనీస్ తైపీ) పై విజయం సాధించి ఫైనల్స్ కు చేరింది. తొలి సెట్ లో కాస్త పోరాడిన సానియా ద్వయం.. రెండో సెట్ ను అవలీలగా చేజిక్కించుకుని మరో టైటిల్ వేటకు సన్నద్ధమైంది. ఈ తాజా గెలుపుతో సానియా జోడి తమ వరుస విజయాల సంఖ్యను 21 కు పెంచుకుంది.  
ఎనిమిది నెలల క్రితం మార్టినా హింగిస్‌తో జతకట్టిన సానియా అద్వితీయ ఫలితాలు సాధించింది. హింగిస్‌తో కలిసి ఈ ఏడాది ఏకంగా ఎనిమిది డబుల్స్ టైటిల్స్ సాధించింది. అందులో రెండు గ్రాండ్‌స్లామ్ (వింబుల్డన్, యూఎస్ ఓపెన్) టోర్నమెంట్‌లు కూడా ఉండటం విశేషం. మరో ఒక విజయం సాధిస్తే సానియా-హింగిస్ ఖాతాలో ప్రతిష్టాత్మక డబ్ల్యూటీఏ ఫైనల్స్ టైటిల్ కూడా చేరుతుంది.

నంబర్ వన్ ర్యాంకు పదిలం

డబ్యూటీఏ ఫైనల్స్ టోర్నమెంట్  ఈ సీజన్ ముగింపు టోర్నీ కావడంతో సానియా-హింగిస్ లు మహిళల డబుల్స్ నంబర్ వన్ ర్యాంకింగ్ లో ఎటువంటి మార్పులు చోటు చేసుకోలేదు. గత ఏప్రిల్ తొలిసారి ప్రపంచ మహిళల డబుల్స్ విభాగంలో నంబర్ వన్ ర్యాంకును కైవసం చేసుకున్న సానియా..  వరుస విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకుపోతోంది. ఈ సంవత్సరపు ముగింపు ర్యాంకింగ్స్ లో హింగిస్ తో కలిసి సానియా మీర్జా తన మహిళల డబుల్స్ నంబర్ వన్ ర్యాంకును నిలబెట్టుకుంది.

Friday, October 30, 2015

త్వరలో యువరాజ్ పెళ్లి?


భారత క్రికెట్ ప్లేబోయ్‌గా పేరు తెచ్చుకున్న డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ కూడా త్వరలోనే తన బ్రహ్మచారి జీవితానికి ఫుల్‌స్టాప్ పెట్టనున్నాడా? దీపావళి రోజున వివాహ శుభవార్త చెబుతాడా? ఇప్పుడు యువీ అభిమానులంతా ఇదే విషయం చర్చించుకుంటున్నారు. ఎందుకంటే రెండు రోజుల క్రితం ఓ ఇంటివాడైన హర్భజన్ సింగ్‌తో జరిపిన ట్వీట్స్ ద్వారా యువీ తన పెళ్లిపై ఊహాగానాలకు తెర తీశాడు. ముందుగా తను భజ్జీకి శుభాకాంక్షలు తెలుపుతూ ‘ఇక ఇప్పుడు ఎలాంటి దూస్రాలు వేయకు మిత్రమా.. లైన్‌కు కట్టుబడి ఉండు’ అని సరదాగా ట్వీట్ చేశాడు. పనిలో పనిగా భజ్జీ శ్రీమతి గీతా బస్రా కూడా.. ఇక లైన్లో తర్వాత ఉన్నది మీరే అంటూ యువీకి ట్వీట్ చేసింది. దీనికి వెంటనే స్పందించిన భజ్జీ ‘నీవు కూడా లైన్‌లోకి రా.. ‘స్ట్రెయిట్’గా ఆడు.. పుల్, కట్ ఆడకు’ అని నర్మగర్భంగా స్పందించాడు. యువీ కూడా వెంటనే సమాధానమిస్తూ.. ‘యెస్.. మిస్టర్ హర్భజన్.. దీపావళి నుంచి నేరుగానే ఆడబోతున్నాను’ అని ముగించాడు. దీంతో పండుగ రోజు తన పెళ్లి గురించి ఏమైనా కబురు చెబుతాడా అని సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది.

Thursday, October 29, 2015

ఓ ఇంటి వాడైన హర్భజన్


 టీమిండియా క్రికెటర్ హర్భజన్ సింగ్ ఓ ఇంటి వాడయ్యాడు. స్నేహితురాలు గీతా బాస్రాను అతడు పెళ్లాడాడు. పంజాబ్‌లోని ఫగ్వారాలోని గురుద్వారాలో గురువారం వీరి వివాహం జరిగింది. తెలుపు రంగు షెర్వానీ, ఎరుపు టోపీ ధరించి భజ్జీ మెరిశాడు. పెళ్లికూతురు సంప్రదాయ ఎరుపు రంగు చీర ధరించింది. వీరి వివాహానికి దగ్గరి బంధువులు, సన్నిహితులు హాజరయ్యారు. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, అతడి సతీమణి అంజలి విచ్చేసి భజ్జీ-బాస్రా దంపతులను ఆశీర్వదించారు. అంతకుముందు హర్భజన్ నివాసంలో మెహందీ, సంగీత్ కార్యక్రమాలు నిర్వహించారు.  నవంబర్ 1న ఢిల్లీలో భజ్జీ-బాస్రా  వివాహ రిసెప్షన్ జరగనుంది. రిసెప్షన్ కు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యే అవకాశముంది. క్రికెటర్లు యువరాజ్ సింగ్, విరాట్ కోహ్లి, అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్, ప్రియాంక చోప్రా తదితర ప్రముఖులు రిసెప్షన్ కు రానున్నారు



Wednesday, October 28, 2015

హర్భజన్‌ పెళ్లి కొడుకైన వేళ ... చిత్రాలు



 ఐదురోజులపాటు అట్టహాసంగా జరుగనున్న క్రికెటర్ హర్భజన్ సింగ్, నటి గీతా బస్రా పెళ్లికి భారీగా సన్నాహాలు చేస్తున్నారు. శుక్రవారం వీరి పెళ్లి జరుగనుంది. దీంతోపాటు మెహిందీ, సంగీత్, రిసెప్షన్ వంటి వేడుకలను నిర్వహించనున్నారు. ఈ వేడుకల కోసం వధూవరులకు ప్రముఖ డిజైనర్ అర్చన కొచ్చర్ వస్త్రాలను రూపొందిస్తున్నారు. పెళ్లిరోజున భజ్జీ, గీత వేసుకునే దుస్తులను అత్యంత సంప్రదాయ శైలితో సరికొత్తగా రూపొందిస్తున్నట్టు ఆమె తెలిపారు.
 'గీత బాగా సంప్రదాయబద్ధంగా డిజైన్ ను కోరుకుంటున్నారు. ఆమె కోసం భారతీయ వర్క్ తో కూడిన లెహెంగా, దుపట్టా, బ్లౌజ్ సిద్ధం చేస్తున్నాం. భజ్జీ కూడా సంప్రదాయ డిజైన్ కు ప్రాధాన్యమిస్తున్నారు. పెళ్లిరోజున ఆయన భారతీయతో ఉట్టిపడే చుడిదార్ ధరించనున్నారు. మెహిందీ, పెళ్లి, రిసెప్షన్ ఇలా వివిధ వేడుకలకు వధూవరులు మెచ్చేరీతిలో డిజైన్ వస్త్రాలను రూపొందిస్తున్నాం' అని ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. ఐదురోజుల ఈ పెళ్లి వేడుకలో భాగంగా నవంబర్ 1న జరుగనున్న రిసెప్షన్ కు క్రికెటర్లు యువరాజ్ సింగ్, విరాట్ కోహ్లి, బాలీవుడ్ ప్రముఖులు హాజరుకానున్నారు.










Tuesday, October 27, 2015

మూడు దేశాల్లో భూవిలయం

పాకిస్తాన్‌లో 200 మంది, అఫ్ఘానిస్తాన్‌లో 63 మంది మృత్యువాత
 అఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్ సరిహద్దులు భారీ భూకంపంతో విలవిల్లాడాయి. హిందూకుష్ పర్వతశ్రేణుల్లో సోమవారం మధ్యాహ్నం సంభవించిన భూకంపం పాక్, అఫ్ఘాన్‌లలో పెను విధ్వంసం సృష్టించి 263 మంది ప్రాణాలను బలిగొంది. 1,300 మందికి పైగా ప్రజలను గాయాలపాల్జేసింది. పెద్దఎత్తున ఆస్తులను ధ్వంసం చేసింది. భూకంప భయంతో భారత్‌లోని కశ్మీర్‌లో ముగ్గురు చనిపోగా, ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. పలు ఉత్తర భారత రాష్ట్రాల్లో ప్రజలు ప్రాణభయంతో వణికారు. అఫ్ఘాన్ రాజధాని కాబూల్‌కు 250 కి.మీ. దూరంలోని జుర్మ్‌లో హిందూకుష్ పర్వతాల కింద 213 కిలోమీటర్ల లోతులో మధ్యాహ్నం 2.39 గంటలకు(భారత కాలమానం ప్రకారం) భూకంపం సంభవించినట్లు అమెరికన్ జియోలాజికల్ సర్వే  తెలిపింది.
అన్ని విధాలా సహకరిస్తాం: మోదీ
 ‘ఎక్కడ ఎలాంటి సాయం కావాలన్నా అందించాలని అధికారులను ఆదేశించాను. పాక్, అఫ్ఘాన్‌తో సహా అందించటానికి సిద్ధంగా ఉన్నాం. జమ్మూకశ్మీర్ సీఎం సయీద్‌తో ఫోన్‌తో మాట్లాడి పరిస్థితి తెలుసుకున్నా. అఫ్ఘాన్ అధ్యక్షుడు ఘనీ, పాక్ ప్రధాని  షరీఫ్‌లతో మాట్లాడి అవసరమైన సాయం అందిస్తామని హామీ ఇచ్చాను. అఫ్ఘాన్‌లో స్కూలు పిల్లలు చనిపోవటం నాకు చాలా ఆవేదన కలిగించింది’అని  ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.


ప్రాణభయంతో పరుగులు...
  హింద్‌కుష్ పర్వత శ్రేణుల్లో సంభవించిన భూ ప్రకంపనలు ఉత్తర, వాయవ్య భారత ప్రాంతాలన కుదిపేశాయి. మధ్యాహ్నం 2.39 గంటలకు సంభవించిన భూకంపం, జమ్మూకశ్మీర్‌తో పాటు, దేశ రాజధాని ఢిల్లీ, పంజాబ్, హరియాణా, ఉత్తరాఖండ్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ తదితర ప్రాంతాలను వణికించింది. ఆఫీసులు, ఆస్పత్రులు, సినిమాహాళ్లల్లోంచి ప్రజలు ఒక్కసారిగా భయంతో బయటకు పరుగులు తీశారు. కశ్మీర్‌లో ముగ్గురు చనిపోయారు. భూకంప వార్తలు వచ్చిన మరుక్షణమే ప్రధానిమోదీ పరిస్థితిని సమీక్షించారు.

Monday, October 26, 2015

పెళ్ళికి ఇంకా టైం ఉంది..

 'నవంబర్‌ 26న మా పెళ్ళంట. ఇది నిజంగా నవ్వు తెప్పించే వార్త. మేమింకా ముహూర్తమే పెట్టుకోలేదు. నా పెళ్ళి తేదీపై మీడియా గందరగోళం సృష్టిస్తోంద'ని అంటోంది అశిన్‌. నవంబర్‌ 26న ఢిల్లీలో అశిన్‌ పెళ్ళంటూ మీడియాలో వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని ఖరాఖండిగా చెప్పింది. అంతేకాదు 'అంగీకరించిన ప్రాజెక్టులు, కాంట్రాక్టులు ఈ ఏడాది చివరి నాటికి పూర్తవుతాయి. ఆ తర్వాతే మా పెళ్ళి జరుగుతుంది. పెళ్ళి ఎప్పుడనేది నేను, మా పెద్దలు చెప్పేవరకు మీడియావాళ్ళు ఓపిక పట్టండి' అంటూ ఘాటుగా స్పందించింది. మైక్రో మ్యాక్స్‌ సహస్థాపకుడైన రాహుల్‌శర్మను అశిన్‌ పెళ్ళి చేసుకోబోతున్న విషయం విదితమే. ఇటీవల జరిగిన అశిన్‌ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో రాహుల్‌ శర్మ ఆరుకోట్ల విలువైన డైమండ్‌ రింగ్‌ను బహూకరించారు కూడా.