వివాదాస్పద నటుడు, బిగ్‌బాస్ మాజీ పోటీదారు
అర్మాన్ కోహ్లిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. అతని గర్ల్ ఫ్రెండ్,
ఫ్యాషన్ స్టెలిస్ట్ నీరూ రాంధవాను దారుణంగా కొట్టి, హింసించిన కేసుల్లో
ముంబైలో పోలీసులు అర్మాన్ కోహ్లిని అదుపులోకి తీసుకున్నారు. గత వారమే
శాంతాక్రజ్ పోలీసు స్టేషన్‌లో ఇతనిపై కేసు నమోదైంది.
స్టెలిస్ట్ నీరూ, నటుడు అర్మాన్ కోహ్లి మూడేళ్లుగా
సహజీవనం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య ఆర్థిక సంబంధమైన
విషయాల్లో తరచూ గొడవ జరుగుతూ వస్తోంది. ఈ గొడవ జూన్ 3 మరింత తారాస్థాయికి
చేరింది. గొడప పడే క్రమంలో ఉన్మాదిలా మారిన కోహ్లి.. నీరూను బలంగా
నెట్టేయడంతో ఆమె మెట్లపైనుంచి దొర్లుకుంటూ కిందపడిపోయిందని రిపోర్టులు
పేర్కొన్నాయి. అంతటితో ఆగకుండా ఆమె జుట్టుపట్టుకుని తలను నేలకేసి గట్టిగా
బాదాడని, తీవ్రంగా గాయపడ్డ ఆమె.. తనను ఆస్పత్రికి తీసుకెళ్లాలని ఎంత
వేడుకున్నా అతను వినలేదని తెలిసింది.
కోహ్లి చేతిలో చావుదెబ్బలు తిన్న చాలా సేపటి తర్వాత
అతికష్టం మీద ఆస్పత్రికి వెళ్లగలిగిన బాధితురాలు.. చివరికి పోలీసులను
ఆశ్రయించింది. అప్పటికే కోహ్లి అజ్ఞాతంలోకి పారిపోయాడు. ఐపీసీ 323, 326,
504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం ముమ్మరంగా
పోలీసులు గాలించి, ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. తనను కోహ్లి, బయట
తిరగనీయకుండా చేస్తానన్నడని నీరూ తన ఫిర్యాదులో పేర్కొంది. అతను ఎలాంటి
వాడో ప్రతి ఒక్కరికీ తెలుసని, ఎవరికీ తాను బయటపడనని పేర్కొంది.