2014లో రిలీజ్ అయి ఘనవిజయం సాధించిన చంద్రకళ (అరణ్మనై) సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన మరో హార్రర్ కామెడీ చిత్రం అరణ్మనై 2. ఈ చిత్రాన్ని 'కళావతి' పేరుతో తెలుగులో అనువాదం చేసి రిలీజ్ చేశారు. సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ ఫుల్ జానర్ గా పేరున్న హార్రర్ కామెడీ లో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా సిద్దార్థ్, త్రిష లాంటి స్టార్ లు కూడా యాడ్ అవ్వడం సినిమా మీద అంచనాలను పెంచేసింది. మరి 'చంద్రకళ'కు సీక్వెల్ గా తెరకెక్కిన 'కళావతి' తెలుగు ఆడియన్స్ ను ఏ మేరకు భయపెట్టింది..?
కథ
ఓ జమీందార్ బంగ్లా చుట్టూ తిరుగుతోంది కళావతి కథ. ఆ బంగ్లాలో ఉన్న దెయ్యం అక్కడికి వచ్చే వారిని వెంటాడుతూ భయపెడుతూ ఉంటుంది. ఆ దెయ్యం మూలంగానే జమీందార్ కోమాలోకి వెళతాడు. అతని పెద్ద కొడుకుపై కూడా దెయ్యం దాడి చేస్తోంది. ఆ సమయంలో అక్కడ ఉన్న అతీంద్రియ శక్తుల పని పట్టాలనుకుంటాడు జమీందార్ చిన్న కొడుకు (సిద్దార్థ్), అందుకు అతనికి కాబోయే భార్య (త్రిష) సాయం చేస్తుంది. ఈ పోరాటంలో బంగ్లాలో ఉన్న దెయ్యం చనిపోయిన తన చెల్లెలు కళ(హాన్సిక) అని తెలుసుకుంటాడు సిద్దార్థ్. అసలు కళ దెయ్యంగా ఎలా మారింది..? చివరకు సిద్దార్థ్ కళకు ఎలా విముక్తి కలిగించాడు అన్నదే మిగతా కథ.
నటీనటులు
తొలిసారిగా హర్రర్ జానర్ లో నటించిన సిద్దార్థ్ ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా చాలా రోజులుగా సరైన హిట్ లేని సిద్దూకి ఈ సినిమా మంచి పేరు తీసుకువచ్చింది. త్రిష నటనతో పాటు గ్లామర్ షోతోనూ ఆకట్టుకుంది. ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్ బీచ్ సాంగ్ తో కమర్షియల్ కంటెంట్ ను యాడ్ చేసింది. చంద్రకళ సినిమాలో కనిపించిన తరహా పాత్రలో హన్సిక మరోసారి మెప్పించింది. ముఖ్యంగా చెల్లెలుగా, తరువాత దెయ్యంగా కూడా అద్భుతంగా నటించింది. కోవై సరళ, సూరిల కామెడీ టైమింగ్ బాగుంది.
సాంకేతిక నిపుణులు
చంద్రకళ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు సుందర్.సి మరోసారి అదే ఫామ్ చూపించాడు. ముఖ్యంగా తొలి భాగం విజయం సాధించటంతో తన మీద ఏర్పడ్డ అంచనాలను అందుకునే స్థాయి సినిమాను తెరకెక్కించటంలో విజయం సాధించాడు. హిప్ హాప్ తమీజా సంగీతంతో సినిమా స్థాయిని పెంచాడు. పాటలు పెద్దగా ఆకట్టుకోకపోయినా నేపథ్య సంగీతం బాగా కుదిరింది. ఆర్ట్ వర్క్, సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ బాగున్నాయి.
ఓవరాల్ గా కళావతి, సౌత్ సిల్వర్ స్క్రీన్ పై హర్రర్ కామెడీలకు తిరుగులేదని ప్రూవ్ చేసిన సక్సెస్ ఫుల్ సినిమా