Monday, April 11, 2016

ఓ ఐడియా.. ముగ్గుర్ని కాపాడింది!

 అదో నిర్మానుష్య ద్వీపం. చుట్టూ నీరు తప్ప మరేమీ కనిపించదు. అలాంటి విపత్కర పరిస్థితుల్లో చిక్కుకుపోయారు ముగ్గురు యువకులు. మూడు రోజుల నిరీక్షణ తర్వాత సురక్షితంగా బయటపడ్డారు. ఒక చిన్ని ఆలోచన ఆ ముగ్గురి ప్రాణాలను కాపాడింది. ఇంతకీ ఆ ఆలోచన ఏంటీ..? అసలు ఆ ద్వీపంలో వారెలా చిక్కుకున్నారు..?
ఫెడరేటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ మైక్రోనేషియాలోని పులప్‌ ఐలాండ్‌ నుంచి ముగ్గురు యువకులు పడవలో పర్యటనకు బయలుదేరారు. అయితే దురదృష్టవశాత్తు సముద్రపు అలలకు వారి పడవ బోల్తాపడి మునిగిపోయింది. ముగ్గురూ ఈదుకుంటూ ఫనడిక్‌ అనే ద్వీపానికి చేరుకున్నారు.
ప్రాణాలకు తెగించి ఒడ్డుకైతే చేరారుగానీ.. ఆ దీవి నుంచి వారికి బయటపడే మార్గం కనిపించలేదు. ఎటు చూసినా చెట్టూచేమలు.. నీరే కనిపించింది. నిర్మానుష్యంగా ఉన్న ఆ దీవిలో మూడు రోజులు గడిపారు ఆ యువకులు. మరోవైపు పడవ మునక సమాచారమందుకున్న అమెరికా కోస్టు గార్డు సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. మూడు రోజుల తర్వాత ఆ యువకులకు ఓ ఆలోచన తట్టింది. వెంటనే.. చెట్టు కొమ్మలతో ఇసుకపై H E L P అంటూ పెద్ద పెద్ద అక్షరాలను రాశారు. అటుగా వచ్చిన జపాన్‌ ఎయిర్‌బేస్‌కు చెందిన నేవీ సిబ్బంది ఆ అక్షరాలను గుర్తించారు. వెంటనే సహాయకచర్యలు చేపట్టి.. ఆ యువకులను రక్షించారు. వారు సమయస్ఫూర్తితో హెల్ప్‌ అని రాయడం, లైఫ్‌ జాకెట్లతో అక్కడే నిలబడి వుండడం.. వల్లే మా సహాయం అందుకుని ప్రాణాలతో బయటపడగలిగారు... అని చెప్పారు అధికారులు.

కోహ్లితో గొడవపడ్డా.. కానీ కలిసి ఆడతా..!


భారత్‌ స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ విరాట్‌ కోహ్లితో గతంలో ఎన్నోసార్లు మైదానంలో గొడవపడ్డాను. కానీ అతని కెప్టెన్సీలోనే ఇప్పుడు ఆడాల్సి వస్తోందని.. ఇలాంటి వింతలు ఐపీఎల్‌ లాంటి దేశవాళీ టోర్నీలోనే సాధ్యమవుతాయని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ షేన్‌ వాట్సన్‌ అభిప్రాయపడ్డాడు.
ఐపీఎల్‌-9 వేలంలో వాట్సన్‌ను రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఫ్రాంఛైజీ సీజన్‌లోనే అత్యధిక ధర రూ.9.5 కోట్లకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు మంగళవారం తొలి మ్యాచ్‌ ఆడనుంది. ఈ నేపథ్యంలో బెంగళూరు కెప్టెన్‌ కోహ్లి గురించి వాట్సన్‌ మాట్లాడుతూ ‘ఇలా కోహ్లితో కలిసి ఆడతానని అసలు వూహించలేదు.. ఓ క్రికెటర్‌గా అతణ్ని ఎక్కువగా గౌరవిస్తా’ అని అన్నాడు.

 అలానే జట్టులో ఉన్న వెస్టిండీస్‌ విధ్వసంక ఓపెనర్‌ క్రిస్‌గేల్‌తో 2009లో జరిగిన గొడవపై కూడా వాట్సన్‌ స్పందించాడు. ఆ గొడవ అనంతరం క్రిస్‌గేల్‌ ఓ ఇంటర్వ్యూలో ‘వాట్సన్‌ చూడ్డానికి గంభీరంగా ఉన్నా చాలా సున్నితమైన వ్యక్తి’ అంటూ వ్యాఖ్యానించాడని గుర్తు చేశాడు. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వాట్సన్‌ జట్టు అవసరార్థం తాను ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని వివరించాడు. కోహ్లి, క్రిస్‌గేల్‌, డివిలియర్స్‌ లాంటి హిట్టర్లు ఉన్నప్పటికీ ఇంతవరకూ ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఒక్కసారి కూడా విజేతగా నిలవలేదు. మరి టీ20ల్లో అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా పేరొందిన వాట్సన్‌ రాకతోనైనా ఈ సీజన్‌లో బెంగళూరు విజేతగా నిలుస్తుందేమో చూడాలి..! 

నాలో చాలా మార్పు వచ్చింది

 బాలీవుడ్‌లో ‘ఏక్‌ విలన్‌’.. ‘బ్రదర్స్‌’ వంటి చిత్రాలతో సిద్ధార్థ్‌ మల్హోత్రా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ ఏడాది ‘కపూర్‌ అండ్‌ సన్స్‌’ చిత్రంతో బాక్సాఫీస్‌ వద్ద ఫర్వాలేదనిపించాడు. అయినా.. ఆ సినిమా నటన పరంగా తన ప్రవర్తనను మార్చేసిందని చెబుతున్నాడు.
‘కపూర్‌ అండ్‌ సన్స్‌’ సినిమాతో పని పట్ల నా ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. నాలో ఎంతో మార్పొచ్చింది. తొలినాళ్లలో చేసిన కొన్ని సినిమాలు ఎప్పుడూ కొత్తగా అనిపించేవి. అందులో బాగా చేస్తున్నానా? లేదా? అని నన్ను నేనే ప్రశ్నించుకునేవాడిని. కానీ ఈ చిత్రంలోని పాత్రకు నా నిజ జీవితానికి చాలా సారూప్యత ఉంది’’ అని అన్నాడు సిద్ధార్థ్‌.
అంతేకాదు.. ‘‘నేను పనిచేసిన ఇతర దర్శకులందరితో కంటే.. ఈ సినిమాలో శకున్‌తో కలిసి పని చేయటం కొత్త అనుభూతిని కలిగించింది. సెట్‌లో ఉన్నప్పుడు ఆ పాత్రలో నువ్వే కనపడాలి అని చెబుతుండేవాడు’’ అని దర్శకుడ్ని పొగిడేశాడు సిద్ధార్ధ్‌.