Thursday, September 8, 2016

ఇంకొక్కడు :రివ్యూ

            విక్రమ్‌ సినిమాలెప్పుడూ కొత్తగా ఉంటాయి. జయాపజయాల్ని పక్కన పెడితే... ఏదో ఓ కోణంలో కొత్తదనం చూపించడానికి ప్రయత్నిస్తుంటాడు. నటుడిగా తనలోని భిన్నకోణాన్ని ఎప్పటికప్పుడు ఆవిష్కరిస్తూనే ఉంటాడు. అందుకే ‘అపరిచితుడు’ తర్వాత విక్రమ్‌కి సరైన విజ‌యాల్లేక‌పోయినా.. అతని సినిమా అంటే ప్రత్యేక ఆసక్తి చూపిస్తుంటారు. ఈసారీ ‘ఇంకొక్కడు’పై అలాంటి ఆశ‌లూ, అంచనాలూ కలిగాయి. మరి.. విక్రమ్‌ ఈసారైనా తన స్థాయికి తగిన సినిమా చేశాడా? ఇంతకీ ఈ ‘ఇంకొక్కడు’ ఎవరు?
కథేంటంటే..:మలేసియాలో భారత దౌత్య కార్యాలయంపై దాడి జరుగుతుంది. ఎనభై ఏళ్ల ముసలాడు అక్కడివాళ్లందరినీ చితగ్గొట్టి కొంతమందిని చంపేస్తాడు. సీసీ కెమెరాల్లో చూస్తే ఆ వృద్ధుడు ఓ ఉత్ప్రేరకం ప్రభావంతో అంత శక్తివంతుడయ్యాడన్న విషయం అర్థమవుతుంది. ఆ మందు పేరు.. ‘స్పీడ్‌’. ఇన్‌హేల‌ర్‌‌ రూపంలో ఉండే ఆ మందు పీలిస్తే... క్షణాల్లో ఓ వ్యక్తి పది రెట్ల బలవంతుడవుతాడు. అయితే ఆ ప్రభావం 5 నిమిషాలే ఉంటుంది. ఈ స్పీడ్‌ అరాచక శక్తుల చేతుల్లోకెళితే చాలా ప్రమాదం. అందుకే ఈ కేసుని ఛేదించడానికి ఇండియా నుంచి అఖిల్‌ (విక్రమ్‌) వెళ్తాడు. తనో రా ఏజెంట్‌. నాలుగేళ్ల క్రితం మలేసియాలోనే తన భార్య (నయనతార)ని కోల్పోతాడు. దానికీ, ఇప్పుడు స్పీడ్‌ ఉపద్రవానికీ కారణం.. ఒక్కడే. తనే లవ్‌ (విక్రమ్‌). అఖిల్‌ భార్య ఎందుకు చనిపోయింది? మలేసియా వెళ్లిన అఖిల్‌ ఏం చేశాడు? అనేదే.. ‘ఇంకొక్కడు’ కథ.
ఎలా ఉందంటే..: ఇదో సైంటిఫిక్‌ థ్రిల్లర్‌. ప్రారంభ సన్నివేశాలు ఆసక్తిగానే సాగుతాయి. అండర్‌ కవర్‌ ఆపరేషన్‌ కోసం అఖిల్‌ మలేసియా వెళ్లడం.. అక్కడ ఒక్కొక్క ఆధారం సంపాదించడం అంతా బాగుంది. లవ్‌ పాత్ర రాక.. ఈ కథకు కీలకమైన మలుపు. అక్కడి నుంచి అఖిల్‌ - లవ్‌ల మధ్య పోరాటం కూడా కీలకమే. అయితే ఈ కీలకమైన భాగాన్ని దర్శకుడు ఆనంద్‌ శంకర్‌ సరిగ్గా డీల్‌ చేయలేదేమో అనిపిస్తుంది. ఈ సినిమా అంతా.. ‘స్పీడ్‌’ మందు చుట్టూనే తిరుగుతుంది. దాని వల్ల కలిగే నష్టాలేంటి? అనే విషయాన్ని తెరపై సరిగ్గా చూపించలేదు. దాంతో.. తెరపై హీరో చేసే విన్యాసాలకు ప్రేక్షకుడు సరిగ్గా కనెక్ట్‌ అవ్వడు. సెకండాఫ్‌లో స్క్రీన్‌ప్లే కూడా గ్రిప్పింగ్‌గా లేదు. ఐదు నిమిషాలకు ఓసారి ఎవరో ఒకరు స్పీడ్‌ మందు తీసుకోవడం, దాని చుట్టూ సన్నివేశాల్ని అల్లడం.. దీనికే సరిపోయిందంతా. నిత్యమేనన్‌ పాత్రని సరిగ్గా వాడుకోలేదు. నయనతార చుట్టూ అల్లిన కథ కూడా క‌న్విన్సింగ్‌గా లేదు. వినోదం లేకపోవడం ఈ సినిమా ప్రధాన లోపం. పాటలు  బోర్‌ కొట్టిస్తాయి. పతాక సన్నివేశాలు కాస్త ఉపశమనం కలిగిస్తాయంతే. 
ఎవరెలా చేశారంటే..: విక్రమ్‌ తన శక్తివంచన లేకుండా సినిమాని కాపాడే ప్రయత్నం చేశాడు. అఖిల్‌, లవ్‌ రెండు పాత్రల్లోనూ వైవిధ్యం చూపించాడు. అయితే లవ్‌ పాత్రకే ఎక్కువ మార్కులు పడతాయి. లవ్‌ పాత్రలో విక్రమ్‌ గెటప్‌, బాడీ లాంగ్వేజ్‌ బాగున్నాయి. నయనది కూడా సీరియస్‌గా కనిపించే పాత్రే. నాజర్‌ కాసేపే కనిపిస్తాడు. మిగిలినవాళ్లవన్నీ మనకు తెలియని మొహాలే. సాంకేతికంగా కెమెరా పనితనం బాగుంది. మలేసియా అందాల్ని బాగా చూపించారు. హారీశ్‌ పాటల్లో కొత్తదనం లేదు. పాటలు ఈ సినిమాకి అడ్డు తగిలాయి.
చివరిగా: ఇంకొక్కడు ‘స్పీడ్‌’ తగ్గింది