Monday, December 12, 2011

జీవితంలో ఎలాంటి లక్షాలు పెట్టుకోలేదు


venkatesh talangana patrika telangana culture telangana politics telangana cinemaవెంక ముచ్చటిస్తే ఆయన మాటల్లో సినిమా సంగతులకంటే ఆధ్యాత్మిక విషయాలే ఎక్కువ చర్చకు వస్తాయి. ఆయన మాట్లాడే ప్రతి మాటలో జీవితం తాలూకు తాత్విక చింతన తొంగిచూస్తుంది. జయాపజయాలకు అతీతంగా సినిమాని ప్రేమిస్తారాయన. విలక్షణ పాత్రలతో తెలుగు సినిమాలో కుటుంబ చిత్రాల కథానాయకుడిగా తిరుగులేని స్థానాన్ని సొంతం చేసుకున్నారు వెంక ‘మనం చేసే పనిని నిజాయితీగా చేయాలి. ఫలితం ఎలా వున్నా స్వీకరించాలి’ అన్నది ఆయన నమ్మిన ఫిలాసఫీ. తాజాగా ఆయన ‘బాడీగార్డ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బెల్లంకొండ సురేష్ నిర్మించిన ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకుడు. త్రిష కథానాయికగా నటిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురాబోతోంది. నేడు వెంక జన్మదినం. ఈ సందర్భంగా ఆయన చెప్పిన సంగతులివి...

ఈ పుట్టిన రోజుకు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు?
పుట్టిన రోజు సందర్భంగా నిర్ణయాలు తీసుకునే అలవాటు లేదు. అయితే ఈ మధ్యే మూడు వారాల పాటు కాశీలోని నందిదేవా ఆలయాన్ని, బుద్దుడు సంచరించిన సారనాథ్ ప్రాంతాన్ని, ఆయన సమాధి అయిన ప్రదేశాల్ని సందర్శించి వచ్చాను. ఈ యాత్రలో చాలా విషయాలు తెలుసుకున్నాను. మనిషి వేటిని వదులుకున్నా ఫర్వాలేదు కానీ ఆధ్యాత్మిక విషయాల్ని నిరంతరం నేర్చుకోవాలన్నది నా ఫిలాసఫీ.

‘బాడీగార్డ్’ సినిమా విశేషాలేమిటి?
ఇంట్రడక్షన్ పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. యాక్షన్‌తో పాటు సినిమాలో మంచి సెంటిమెంట్ వుంటుంది. చివరి ముఫ్పై నిమిషాల ఫ్యామిలీ డ్రామా ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. స్క్రీన్‌ప్లే కూడా కొత్త తరహాలో వుంటుంది. నా శైలి వినోదం కూడా వుంటుంది.
‘బాడీగార్డ్’ మలయాళ, తమిళ, హిందీ భాషల్లో విజయం సాధించింది. కథాంశం అందరికీ తెలిసిందే!..

ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పిస్తుందని అనుకుంటున్నారు?
మూడు భాషల్లో హిట్ అయినా తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్ల్లు సినిమా స్క్రిప్ట్‌లో మార్పులు చేశాం. ముఖ్యంగా లవ్‌స్టోరీ కొత్తగా వుండేలా తీర్చిదిద్దాం. అదీగాక చాలా కాలం విరామం తర్వాత నేను ఈ సినిమాలో మంచి యాక్షన్ ఎపిసోడ్స్ చేశాను. సంగీతపరంగా కూడా మిగతా మూడు భాషల కంటే తెలుగులో పాటలు బాగా వచ్చాయి. సంగీత దర్శకుడు థమన్ పాటల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఈ అంశాలన్నీ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తాయి.

‘నాగవల్లి’ తర్వాత బెల్లంకొండ సురేష్‌తో రెండో సినిమా చేస్తున్నారు. మేకింగ్ పరంగా సినిమా ఎలా వుంటుంది?
ఉన్నత నిర్మాణ విలువలతో ‘బాడీగార్డ్’ తెరకెక్కింది. ఈ సినిమాలోని కొన్ని లొకేషన్స్ చాలా కొత్తగా వున్నాయి. ఈ మధ్యకాలంలో ఏ సినిమాలో అలాంటి లొకేషన్స్ చూసి వుండరు.

సల్మాన్‌ఖాన్ హిందీ ‘బాడీగార్డ్’ చిత్రంలో షర్ట్ విప్పేస్తాడు. మీరు కూడా ఈ సినిమాలో అలాంటి ప్రయత్నం ఏమైనా చేశారా?
మనకంత సీన్‌లేదు... షర్ట్ విప్పడం లాంటి సన్నివేశాలేం వుండవు. నా కెరీర్‌లో ఇంతవరకూ షర్ట్ విప్పి నటించలేదు. ఇప్పుడు కొత్తగా విప్పితే బాగుండదు.

మహేష్‌బాబుతో కలసి చేస్తోన్న ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ కథలో మిమ్మల్ని ఆకట్టుకున్న అంశాలేమిటి?
ఈ కథలో మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ వున్నాయి. మహేష్, నేను అన్నదమ్ముల్లుగా నటిస్తున్నాం. ఇద్దరు అన్నదమ్ములు జీవితంలో ఎదుర్కొన్న ఒడిదొడుకులు, ఒకరికొకరు ప్రాణంగా సాగే వారి జీవిత ప్రయాణమే ఈ చిత్రం.
మహేష్‌బాబుతో మీకున్న అనుబంధం ఎలాంటిది?
హీరోగా ఆయనకంటూ ప్రత్యేకమైన సై్టల్ వుంది. తెలుగు సినిమా హీరోలందరిలో అందగాడు. మహేష్‌బాబు మంచి కామెడీని పండిస్తాడు. ఆయన కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా కోసం మేమిద్దరం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం.

మల్టీస్టారర్ సినిమాలపై మీ అభివూపాయమేమిటి?
హిందీలో ఎక్కువగా మల్టీస్టారర్ సినిమాలు వస్తున్నాయి. తెలుగులో కూడా అందరూ మల్టీస్టారర్ సినిమాలు చేయాలి. మల్టీస్టారర్ సినిమాల వల్ల మంచి కథలు వస్తాయి. పరిక్షిశమ కూడా బాగుంటుంది.

మీ డ్రీమ్ ప్రాజెక్ట్ వివేకానందను ఎప్పుడు ప్రారంభించబోతున్నారు?
స్క్రిప్ట్ సిద్ధమవుతోంది. బాలీవుడ్ దర్శకుడు మణిశంకర్ దర్శకత్వం వహిస్తాడు. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో షూటింగ్ ప్రారంభమవుతుంది. వివేకానందుని తాత్విక చింతన, ఫిలాసఫీని నేను బాగా ఇష్టపడతాను. వివేకానందుడు సామాన్యమైన వ్యక్తి కాదు. ఆయన ప్రవచనాలు మనల్ని జాగృత పరుస్తాయి. ఆయన జీవిత చరిత్ర నేటి యువతరానికి స్ఫూర్తిదాయకంగా వుంటుంది. వివేకానందుడు చెప్పినట్లు... మనలో ఏమైనా అశాంతి, బాధ వుంటే ఓ గదిలోకి వెళ్లి తలుపులు మూసుకొని బిగ్గరగా ఏడవండి...అలా చేయడం ద్వారా మీ మనసు కుదుటపడుతుంది. ఎందుకంటే నిరంతరం వేదనలతో మనం ఈ అందమైన ప్రపంచాన్ని కలుషితం చేస్తున్నాం.

మీరు అలవర్చుకున్న ఆధ్యాత్మిక ధోరణి ఎలాంటి అనుభవాలనిస్తోంది?
ప్రతి ఒక్కరికీ ఆధ్యాత్మికత అవసరమని నా అభివూపాయం. బుద్దుడినే తీసుకోండి..ఆయన మనలాంటి సాధారణ మనిషి. మనుషుల్లో మహాత్ముడు ఎందుకయ్యాడు? కోట్ల మందిని ఎలా ప్రభావితం చేయగలిగాడు? అనే విషయాల్ని అందరూ ఆలోచించుకోవాలి. ఆధ్యాత్మిక సాధన చేస్తే అందరూ బుద్దుడి అంతటి స్థాయికి చేరుకోవచ్చని నా నమ్మకం.

జయాపజయాల్ని మీరెలా స్వీకరిస్తారు?
నిజాయితీగా మానవ ప్రయత్నం చేయాలి. ఫలితం గురించి ఆలోచించకూడదు. ప్రయత్నం చేయడం వరకే మన పని. అలాగే నేను జీవితంలో ఎలాంటి లక్ష్యాల్ని పెట్టుకోను. ఎందుకంటే లక్ష్యాల్ని నిర్ధేశించుకోవడం వల్ల అనవసర ఆందోళనలు వెంటాడుతాయి.

మీ తనయుడు అర్జున్‌ని వెండితెరకు ఎప్పుడు పరిచయం చేస్తారు?
జాకీచాన్ ‘కరాటే కిడ్’ సినిమా అంటే వాడికి చాలా ఇష్టం. ఆ సినిమా చూసి నన్ను జాకీచాన్‌లా నటించమంటున్నాడు. వాడు నా శిష్యుడిగా నటిస్తాడట. అయితే అర్జున్ ఇప్పుడు మూడో తరగతి చదువుతున్నాడు. సినిమాల్లో రావడానికి చాలా టైముంది.

రానా కెరీర్ ఎలా వుందని భావిస్తున్నారు?
రానాకు చిన్నప్పటి నుంచి సినిమా అంటే పాషన్. నా కన్నా ఎక్కువగా సినిమాని ప్రేమిస్తాడు. ఎప్పుడు సినిమాల గురించే మాట్లాడుతాడు. తెలుగు సినిమాలతో పాటు బాలీవుడ్‌పై కూడా దృష్టి పెడుతున్నాడు. ఏ విషయంలోనైనా రానా కొత్తగా ఆలోచిస్తాడు.

అగ్రహీరోలందరూ ఎక్కువ సినిమాలు చేయడానికి సిద్ధమయ్యారు. మీరు కూడా వచ్చే ఏడాది మూడు సినిమాలు చేయబోతున్నారు. మారుతున్న ఈ ధోరణిపై మీరెమంటారు?
ఇలా ఎప్పటినుంచో అగ్రహీరోలందరూ సంవత్సరానికి మూడు, నాలుగు సినిమాలు చేసి వుంటే ఇండస్ట్రీ ఎప్పుడో సెట్ అయ్యేది. ఈ పరిణామం పరిక్షిశమకు చాలా మంచిది. అదే సమయంలో బడ్జెట్ కంట్రోల్‌పై కూడా హీరోలు దృష్టి పెట్టాలి.

పౌరాణిక సినిమాలు చేసే ఆలోచన వుందా?
ఇప్పటి వరకు పౌరాణిక సినిమాలు చేద్దామని నన్నెవరూ సంప్రదించలేదు. ఎవరైనా నన్ను మంచి స్క్రిప్ట్‌తో ముందుకొస్తే చేయడానికి ఇబ్బందేమిలేదు.

మీ తదుపరి చిత్రం?
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెటు’్ట తర్వాత మోహర్ రమేష్ దర్శకత్వంలో ఓ చిత్రం వుంటుంది. ఫుల్‌పూంగ్త్ యాక్షన్ చిత్రమది. ఎప్పటి నుంచే సై్టలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చేద్దామనుకుంటున్నాను. అలాంటి స్క్రిప్ట్‌తో ముందుకొచ్చాడు దర్శకుడు మోహర్ రమేష్.

నేడు రజనీకాంత్‌ పుట్టిన రోజు


 దక్షిణాది సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఈరోజు తన 62వ పుట్టిన రోజు జరుపుకోనున్నారు. పసి వయస్సు నుంచే ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న శివాజీరావ్‌గైక్వాడ్‌ స్వయం కృషితో రజనీకాంత్‌గా ఎదిగిన వైనం ఓ సినిమానే తలపిస్తుంటుందని సినీ విమర్శకులే అంటుంటారు. ఆయన జీవితం ఆధారంగా సినిమా తీస్తే, ఓ విజయవంతమైన సినిమాగా సినీ చరిత్రలో నిలిచిపోతుందని వారు అభిప్రాయపడుతుంటారు. ఐదేళ్ల వయస్సులోనే తల్లిని పొగొట్టుకున్న రజనీకాంత్‌ కడుపు నింపుకునేందుకు అనేక కష్టాలు పడ్డాడు. గవర్నమెంట్‌ స్కూల్‌లో కన్నడ మాధ్యంలో చదువుకున్నారు. అనంతరం జీవన సమరం చేశాడు. చివరకు మూటలు మోసే కూలీగా అవతారమెత్తారు. అనంతరం బస్సు కండక్టర్‌గా ఉద్యోగం కూడా చేశారు. రజనీకాంత్‌కు నాటకాలంటే పిచ్చి అభిమానం. ఎన్నో నాటకాల్లో నటించారు. సన్నిహితుల ప్రోత్సహంతో మద్రాస్‌ ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌లో చేరారు. బాలచందర్‌ దృష్టిలో పడడంతో ఆయన దశ తిరిగింది. బాలచందర్‌ దర్శకత్వంలో వచ్చిన ాఅపూర్వ రాగంగల్‌్ణ సినిమాలో నటించారు. 1975లో వచ్చిన ఈ సినిమాకు రాష్ట్ర, జాతీయస్థాయిలో ఉత్తమ చిత్రంగా అవార్డు రావడంతో శివాజీరావుగైక్వాడ్‌కు మంచి పేరు వచ్చింది. శివాజీరావుగైక్వాడ్‌ నుంచి రాజనీకాంత్‌గా పేరు మార్చింది బాలచందరే. ఎన్నో విజయవంతమైన చిత్రాలు చేస్తూ తనదైన స్టైల్‌తో దక్షిణాదిలో దూసుకెళ్లారు రజనీకాంత్‌. ఆయన స్టైల్‌ అభిమానులను ఇప్పటికీ అలరిస్తుంది. విదేశాల్లో రజనీకాంత్‌కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. రష్యన్లకు రాజ్‌కపూర్‌ అంటే ఎంతో ఇష్టం. అలానే జపనీస్‌కు రజనీ అంతే ఇష్టంగా మారారు. రజనీకాంత్‌ ప్రతి చిత్రం జపాన్‌లో విడుదల కావాల్సిందే. అతిసామాన్యంగా ఉంటూ అందరికీ ఆయన ఆదర్శనీయంగా కనిపిస్తారు. ఆయన ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఎదిగారని, మరిన్ని ఉన్నతశిఖరాలు అధిరోహించాలని ఆయన అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.