Tuesday, April 10, 2018

పాన్‌ కార్డులో కొత్త ఆప్షన్‌

ఆధార్‌-పాన్‌ అనుసంధానంలో ట్రాన్స్‌జెండర్లు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం లభించింది. పాన్‌ కార్డులో థర్డ్‌జెండర్‌ ఆప్షన్‌  కల్పిస్తూ ..ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (సిబిడిటి)  సోమవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆదాయపు పన్ను శాఖ జారీ చేసే పాన్‌కార్డు దరఖాస్తులో ట్రాన్స్‌జెండర్లను ప్రత్యేక కేటగిరీగా గుర్తించిన కేంద్రం వారికోసం ఈ  ప్రత్యేక ఆప్షన్‌ను కేటాయించింది.
స్త్రీ, పురుషుల మాదిరిగా ట్రాన్స్‌జెండర్లకు ఓ ఆప్షన్‌ను కేటాయిస్తూ ఆదాయ పన్ను శాఖ నిబంధనలను ప్రభుత్వం సవరించింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను సీబీడీటీ సోమవారం విడుదల చేసింది. పాన్ కోసం దరఖాస్తు చేసే ట్రాన్స్‌జెండర్ల కోసం దరఖాస్తు ఫారంలో ప్రత్యేకంగా ఓ టిక్ బాక్స్‌ను ఏర్పాటు చేశారు.
కాగా ఇన్ని రోజుల ఆధార్‌-పాన్‌ అనుసంధానంలో హిజ్రాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనికి కారణం ఆధార్‌ కార్డులో జెండర్‌ ఎంపికలో ఆడ, మగతోపాటు హిజ్రాలకు ప్రత్యేకంగా థర్డజెండర్‌ ఆప్షన్‌ ఉన్నప్పటికీ పాన్‌ కార్డు దరఖాస్తులో ఆ వెసులుబాటు లేకపోవడమే. ఆధార్‌కార్డుల్లో థర్డ్‌ జెండర్‌ అనీ, పాన్‌కార్డుల్లో మాత్రం పురుషుడు/మహిళ అని ఉండటంతో హిజ్రాలు తమ ఆధార్‌ నంబర్లను పాన్‌కు అనుసంధానించుకోలేక ఇబ్బందులకు గురయ్యారు.ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో హిజ్రాలకు పాన్‌ కార్డుల ధరఖాస్తుకు, ఆధార్‌తో అనుసంధానికి సంబంధించిన సమస్యలు తొలగిపోయాయి.

Friday, April 6, 2018

ఐపీఎల్‌ టోర్నీ శనివారమే ప్రారంభం


అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ఐపీఎల్‌ మెగా టోర్నీ ఈ శనివారమే ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో నిర్వాహకులు ఏర్పాట్లలో బిజీ అయ్యారు. మరోపక్క ఆటగాళ్లు సైతం వరుస ప్రాక్టీస్‌ సెషన్స్‌లో పాల్గొంటూ తీరిక లేకుండా గడుపుతున్నారు.
ఈ ఏడాది ఐపీఎల్‌ ప్రారంభ వేడుకలకు అన్ని జట్ల కెప్టెన్లు హాజరు కాని సంగతి తెలిసిందే. కొన్ని కారణాల వల్ల ముంబయి ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ సారథులు రోహిత్‌ శర్మ, మహేంద్ర సింగ్‌ ధోనీ మినహా మిగతావారెవరూ ఆరంభ వేడుకల్లో పాల్గొనడం లేదని టోర్నీ నిర్వాహకులు తెలిపారు. ఐతే, ఈ ఏడాది ఒకే వేదికపై అన్ని జట్ల కెప్టెన్లను చూడలేకపోతున్నాం అని అభిమానులు నిరుత్సాహ పడిపోయారు. తాజాగా నిర్వాహకులు ఐపీఎల్‌ ట్రోఫీతో ఎనిమిది జట్ల సారథులతో ఫొటో షూట్‌ నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఐపీఎల్‌ ట్విటర్‌ పేజీ ద్వారా పంచుకున్నారు.
ట్రోఫీతో అన్ని జట్ల కెప్టెన్లను ఒకేసారి చూడటంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. ‘ఈ సీజన్‌లో ఇలా అన్ని జట్ల కెప్టెన్లనూ ఒకే వేదికపై చూస్తామనుకోలేదు, చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ తిరిగి ఐపీఎల్‌లో ఆడటం ఎంతో ఆనందంగా ఉంది’ అని నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు.

Thursday, April 5, 2018

పొద్దున్నే ఐదున్నరకు సెహ్వాగ్‌ తలుపు కొట్టాడు

 తర్వాత పిలిచి మాట్లాడతా అన్నాను: గంగూలీ
  ‘శ్రీలంకతో ఫైనల్‌ ఓడిపోయిన మరుసటి రోజు ఉదయం 5.30 గంటలకు వీరేంద్ర సెహ్వాగ్‌ నాతో మాట్లాడేందుకు వచ్చాడు. నిద్రమత్తులో లేచి తలుపు తీశాను. ఇప్పుడు కాదు తర్వాత మాట్లాడతాను అని చెప్పాను’ అని గంగూలీ తన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో సౌరభ్‌ గంగూలీ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘2001లో ముక్కోణపు సిరీస్‌ కోసం శ్రీలంక పర్యటనకు వెళ్లాం. శ్రీలంకతో జరిగిన ఫైనల్లో 121 పరుగుల తేడాతో భారత్‌ ఓడిపోయింది. అనవసరపు షాట్‌కు యత్నించిన సెహ్వాగ్‌ రనౌట్‌ రూపంలో వెనుదిరిగాడు. ఆ తర్వాతి రోజు ఉదయం 5.30 గంటల సమయంలో నా గది తలుపు మోగింది. తిరిగి భారత్‌ వెళ్లే క్రమంలో ఎయిర్‌పోర్టుకు వెళ్లే ముందు నన్ను కలవాలని వచ్చాడు. కానీ, నాకు ఏమో అంత పొద్దున్నే సెహ్వాగ్‌తో మాట్లాడే మూడ్‌ లేదు. దీంతో తర్వాత పిలిచి మాట్లాడతా అని చెప్పాను. ముందు రోజు ఫైనల్లో తాను ఆడిన విధానం పట్ల కెప్టెన్‌ సంతృప్తిగా లేడు.. ఏమనుకుంటున్నాడో తెలుసుకోవాలని వచ్చాడు. కానీ, నేను మాట్లాడలేదు’ అని గంగూలీ అప్పటి సంగతిని గుర్తు చేసుకుని చెప్పాడు.
ఈ ఏడాది ఐపీఎల్‌లో సెహ్వాగ్‌ కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌కు మెంటార్‌గా బాధ్యతలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. శనివారం ఐపీఎల్‌ మెగా టోర్నీ ప్రారంభంకానుంది. 

Monday, April 2, 2018

సినిమాలు లేకపోయినా... ఆమె హవా తగ్గలేదు!

 లోకనాయకుడు, నటుడు కమల్‌ హాసన్‌ కూతురిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది నటి శ్రుతీహాసన్. అయితే కొంతకాలం నుంచి సినిమాలకు దూరంగా ఉంటోంది ఈ భామ. తన బాయ్‌ఫ్రెండ్ మైఖేల్‌ కోర్స్‌లేతో షికార్లు చేస్తూ బిజీ బిజీగా ఉంది. ఈ జంట త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని వదంతులు ప్రచారంలో ఉన్నాయి.
ఏడాది నుంచి శ్రుతి ఏ సినిమా చేయకపోయినా... తెరపై అభిమానులకు కనిపించకపోయినా. ట్వీటర్‌లో మాత్రం ఆమె హవా కొనసాగిస్తోంది. భారీ సంఖ్యలో అభిమానులు ఆమెను ఫాలో అవుతున్నారు. రజనీకాంత్, కమల్‌ హాసన్, మోహన్‌లాల్‌ వంటి స్టార్లను వెనక్కి నెట్టి ముందు వరుసలో నిలిచింది శ్రుతి. ఏడు మిలియన్ల మంది అభిమానులు ట్వీటర్‌లో ఈ నటిని ఫాలో అవుతున్నారు. సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చినా.. ఆమె హవా మాత్రం తగ్గలేదంటున్నారు నెటిజన్లు. నటి సమంత, శ్రుతికి కాస్త దగ్గర్లో ఉంది. సమంతను ట్వీటర్‌లో 6.53 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.