Thursday, February 9, 2017

రివ్యూ: ఎస్‌3 (యముడు 3)


కథేంటంటే?: సింగం సిరీస్‌ తొలి భాగం ‘సింగం’ పల్లెటూరి నేపథ్యంలో సినిమా సాగుతుంది. తర్వాత భాగం ‘సింగం 2’ సింగం (సూర్య) పట్టణానికి వస్తాడు. మూడో భాగం ‘సింగం 3’లో పట్టణం నుంచి ఆస్ట్రేలియా వెళ్తాడు. ఒక పోలీసు కమిషనర్‌ హత్యకు సంబంధించిన విచారణ చుట్టూ సాగే కథ ఇది. నిజాయతీ గల పోలీసు అధికారి సిడ్నీలో ఇండియన్‌ పోలీసు పవర్‌ ఎలా చూపించాడన్నది కథ. కథలో కావ్య (అనుష్క).. విద్య (శ్రుతిహాసన్‌)ల మధ్య ఉన్న సంబంధం ఏంటి అన్నది కూడా ఆసక్తికరంగా ఉంటుంది.
ఎలా ఉందంటే?: ఈ సినిమా కేవలం యాక్షన్‌ ప్రియుల్ని దృష్టిలో ఉంచుకునే తీర్చిదిద్దారు దర్శకుడు హరి. అందుకు సంబంధించిన సన్నివేశాలు మాస్‌ను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. సూర్య పవర్‌ఫుల్‌ డైలాగ్‌లు.. మేనరిజం.. ఫైట్లపై దర్శకుడు దృష్టి పెట్టారు. తొలి భాగం నిదానంగా సాగుతుంది. అనవసరంగా ఇరికించిన కామెడీ సన్నివేశాలు కాస్త ఇబ్బంది పెడతాయి. అనుష్క.. సూర్యల మధ్య నడిపించిన ట్రాక్‌ కూడా కథలో ఇమడనట్లుగా ఉందనిపిస్తుంది.
విశ్రాంతికి 20 నిమిషాల ముందు నుంచి థ్రిల్‌ కలిగించే సన్నివేశాలు మొదలవుతాయి. దాంతో ప్రేక్షకుడికి ఆసక్తి మొదలవుతుంది. ఆ నేపథ్యంలో వచ్చే పోరాట ఘట్టాలు అలరిస్తాయి. ద్వితీయార్ధం ప్రారంభంలో సన్నివేశాల్ని పరుగులు పెట్టించాడు దర్శకుడు. సిడ్నీ నేపథ్యంలో సాగిన యాక్షన్‌ ఘట్టాలు ఆకట్టుకుంటాయి. ఛేజింగ్‌లు.. సూర్య చేసిన ఫైట్లు.. పోలీసు పవర్‌ను చూపించిన డైలాగ్‌లు ఇవన్నీ కలిసి ఓ యాక్షన్‌ ప్యాకేజీలా దర్శకుడు చూపించాడు.
 ఆస్ట్రేలియాలో జరిగే సన్నివేశాలు సినిమా స్థాయిని పెంచేలా ఉన్నాయి. మొత్తంగా చూస్తే ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం పట్టుగా సాగింది. కాకపోతే దర్శకుడు తొలి రెండు భాగాల్లో చూపించిన చాకచక్యం ఈ సినిమాలో చూపించలేకపోయాడు. కథ బలహీనంగా ఉండటం.. హీరో పాత్రపై తప్ప మరే పాత్రపైనా దృష్టి పెట్టకపోవడం నిరాశకు గురి చేస్తాయి. ‘వైఫై..’ పాట కోసం మాత్రమే శ్రుతిహాసన్‌ను తీసుకున్నారా.. అనిపిస్తుంది. పతాక సన్నివేశాలు మామూలుగా సాగాయి.
 
ఎవరెలా చేశారంటే: సూర్య కోసమే ఈ సినిమా తీశారా.. అనేలా ఉంది. మరోసారి శక్తిమంతమైన పోలీసు పాత్రలో సూర్య రాణించారు. సూర్య గెటప్‌.. తను చేసిన పోరాట దృశ్యాలు ఆకట్టుకుంటాయి. అనుష్క మరీ లావుగా కనిపించింది. ఈ విషయంలో తాను జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఆమె పాత్రకు అంత ప్రాముఖ్యత లేదు. శ్రుతిహాసన్‌ది కేవలం గ్లామర్‌ పాత్ర మాత్రమే. విలన్‌ పాత్రల్ని పోషించిన వారిని దర్శకుడు స్టైలిష్‌గా చూపించాడు. రాధిక నటన ఆకట్టుకుంటుంది.
చివరగా.. యాక్షన్‌ ప్రియులకు ‘ఎస్‌’3