Thursday, December 17, 2015

రివ్యూ: లోఫర్‌

రేటింగ్‌: 2.5/5 


కథేంటంటే: కృష్ణ (పోసాని కృష్ణమురళి) పక్కా లోఫర్‌. భార్య లక్ష్మమ్మ (రేవతి)తో గొడవ పడి ఇంటి నుంచి వచ్చేస్తాడు. వస్తూ.. వస్తూ ఉయ్యాల్లోని నెలల పసికందు రాజా (వరుణ్‌తేజ్‌)ని ఎత్తుకు వచ్చేస్తాడు. ‘నీ చిన్నప్పుడే అమ్మ పచ్చ కామెర్లొచ్చి చచ్చిపోయింది’ అంటూ నమ్మిస్తాడు. రాజా కూడా దొంగగా మారి జోథ్‌పూర్‌లో సెటిల్‌ అవుతాడు.
         తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తుండటంతో ఇంట్లోంచి పారిపోయి జోథ్‌పూర్‌ వస్తుంది పారిజాతం (దిశాపటాని). ఆమెను చూసి ప్రేమిస్తాడు రాజా. పారిజాతం ఎవరో కాదు.. స్వయానా తన మామ (ముఖేష్‌రుషి) కూతురేనని తెలుసుకుంటాడు. అంతేకాదు.. తన అమ్మ బతికే ఉందన్న నిజం పారిజాతం ద్వారా తెలుసుకొంటాడు రాజా. అయితే ఈలోగా పారిజాతాన్ని ఇంట్లోవాళ్లు విశాఖపట్నం తీసుకెళ్లిపోయి బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తారు. మరి.. పారిజాతాన్ని రాజా ఎలా కాపాడాడు? తన తల్లికి ఎలా దగ్గరయ్యాడు? అన్నది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.



ఎలా ఉందంటే: తనకు అలవాటైన కథకు.. ‘అమ్మ’ సెంటిమెంట్‌ అద్దాడు. అదే.. తనను ఆదుకుంటుందని పూరి నమ్మినట్లు కనిపిస్తుంది. కొడుకు దూరమైన బాధలో తల్లి. కళ్ల ఎదుటే అమ్మ ఉన్నా.. ‘నేను నీ కొడుకుని’ అని చెప్పుకోలేని బిడ్డ. వీరి మధ్య భావోద్వేగాలను పూరి పండించాడు. తండ్రిగా పోసాని పాత్రని రాసుకున్న తీరు.. వినోదాన్ని పండిస్తుంది. తండ్రీ కొడుకుల మధ్య నడిచిన ఓ రకమైన కెమిస్ట్రీ ఈ సినిమాకి బలం.
దీనికి తోడు పూరి శైలి హీరోయిజం.. అతని టేకింగ్‌.. పోరాట దృశ్యాల్ని తెరకెక్కించిన పద్ధతి.. ఇవన్నీ ‘లోఫర్‌’కి కాస్తంత మెరుగ్గా ఉండేలా చేశాయి. సున్నితమైన ఈ కథని.. మరికాస్త పద్ధతిగా తెరకెక్కిస్తే మరింతగా ఆకట్టుకునేదేమో? అరుపులు.. కేకలు.. ఏమాత్రం మానవత్వం లేని విలన్‌ ముఠాల మధ్య అమ్మ సెంటిమెంట్‌ నలిగిపోయింది.
కడుపున పుట్టిన బిడ్డే తల్లిని కిరాతకంగా చంపుతుంటే.. ఆ మారణ కాండని చూసే మరో కొడుకు పైశాచికత్వం లాంటి సన్నివేశాలు ఇబ్బంది కలిగించేవే. సినిమాలో విలనిజం.. రక్తపాతం కాస్తంత తగ్గిస్తే బాగుండేదన్న అభిప్రాయం కలుగుతుంది. అలీ.. బ్రహ్మానందం ట్రాక్‌ ఆకట్టుకుంటుంది. 

ఎవరేం చేశారంటే: తొలి రెండు చిత్రాల్లో క్లాస్‌గా కనిపించిన వరుణ్‌తేజ్‌ తొలిసారి మాస్‌ పాత్ర పోషించాడు. ఇలాంటి తరహా పాత్రల్లోనూ తాను రాణించగలనని నిరూపించుకున్నాడు. ఎమోషన్‌ సన్నివేశాల్లో వరుణ్‌ నటన బాగుంది. ఫైట్స్‌ చాలా ఈజ్‌తో చేశాడు. దిశాపటాని అందంగా కనిపించింది. ఆమె పాత్ర పరిధి అంతంతే. రేవతికి ఎక్కువ మార్కులు పడతాయి. తన అనుభవాన్నంతా రంగరించి నటించింది. ఇక పోసాని కృష్ణమురళి.. ఈ కథని వెన్నుదన్నుగా నిలిచాడు.

 
సాంకేతికంగా..: సునీల్‌ సంగీతంలో ప్రతి పాటా ఒకేలా వినిపించింది. ‘సువ్వి సువ్వాలమ్మా’ పాట మాత్రం ఆకట్టుకొంది. నేపథ్య సంగీతంలో హోరు ఎక్కువైంది. సెంటిమెంట్‌ పరమైన సన్నివేశాలు పూరి బాగా తీశాడు. పెప్పర్‌ స్ప్రే డైలాగ్‌ పేలుతుంది.  

చివరిగా.. కాస్త సెంటిమెంట్‌.. మరికాస్త హింస కలిపితే.. ‘లోఫర్‌’
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఈ సమీక్ష సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.