Saturday, February 12, 2011

హర్భజన్‌ సింగ్‌కు గాయం?

భారత్‌ అభిమానులకు మరో దుర్వార్త. ఏస్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తుండగా గాయపడినట్లు తెలుస్తోంది. స్థానిక చిన్నస్వామి స్టేడియంలో గురువారం నాడు ప్రాక్టీస్‌ చేస్తుండగా భజ్జీకి గాయం తగిలినట్లు ధృవీకరించని వార్తలు సూచిస్తున్నాయి. అందువల్లనే అతడు శుక్ర, శనివారాల్లో ప్రాక్టీస్‌కు హాజరుకాలేదని అనధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నెల19న ప్రపంచకప్‌ ప్రారంభం కానున్న తరుణంలో భారత్‌ ప్రధాన స్పిన్నర్‌ హర్భజన్‌ గాయ పడటం భారత జట్టుకు దెబ్బగానే చెప్పాలి. అయితే భజ్జీ గాయం స్వరూపం తెలియలేదు. అతడు ఈ నెల 19న బంగ్లాదేశ్‌తో జరగనున్న తొలి మ్యాచ్‌లో ఆడుతాడా, లేదా అన్న విషయం ఇంకా తెలియలేదు. మూడో రోజు ప్రాక్టీస్‌కు భజ్జీ డుమ్మా కొట్టడం ఆశ్చర్యం కలిగించింది. అయితే ప్రాక్టీస్‌ హౌటల్‌ రూంలో విశ్రాంతి తీసుకున్నట్లు భారత జట్టు వర్గాలు పేర్కొన్నాయి. ఇటీవలికాలంలో భారత జట్టు సాధించిన విజయాల్లో కీలకపాత్ర పోషించిన మీడియం పేసర్‌ ప్రవీణ్‌ కుమార్‌ మోచేతి గాయం నుండి పూర్తిగా కోలుకోకపోవడంతో ఈ వరల్డ్‌కప్‌కు దూరమయ్యాడు. ప్రవీణ్‌ అందుబాటులో లేకపోవడం భారత జట్టుకు ఇబ్బంది కలిగించే అంశమేనని ధోనీ పేర్కొన్నాడు. అతడి స్థానంలో శ్రీశాంత్‌ జట్టులోకి వచ్చాడు.

నేడే 'డమరుకం' ప్రారంభం

 అక్కినేని నాగార్జున నటిస్తోన్న సోషియో ఫాంటసీ చిత్రం 'డమరుకం' ప్రారంభోత్సవం లాంఛనంగా శనివారంనాడు జరిగింది. అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఈ కార్యక్రమానికి రామానాయుడు, అక్కినేని నాగేశ్వరరావుతోపాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఆర్‌.ఆర్‌.మూవీమేకర్స్‌ పతాకంపై వెంకట్‌ నిర్మిస్తున్నారు. శ్రీనివాసరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రం గురించి నాగార్జున మాట్లాడుతూ...'సోషియోఫాంటసీ చేయాలనే చిన్నకోరిక ఉండేది. అది 'డమరుకం'తో తీరింది. రెండువేల సంవత్సరాలనాటి కథ. నేటికి ట్రావెల్‌ అవుతూ సాగుతుంది. ఇందులో నాలుగు గెటప్స్‌ ఉన్నాయి. 'హలోబ్రదర్‌'లో చేసిన మాస్‌ రోల్‌ ఇందులో చేస్తున్నా. ఏప్రిల్‌లో షూటింగ్‌లో పాల్గొంటా' అని చెప్పారు.
శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ...'కొత్తదననాన్ని ప్రోత్సహించే హీరోల్లో నాగార్జున ముందుంటారు. గీతాంజలి, శివ, హలోబ్రదర్‌, అన్నమయ్య వంటి ఆ కోవలోనే వచ్చాయి. కామెడీ చిత్రాలు తీసే నేను, ఆర్‌.ఆర్‌.మూవీమేకర్స్‌లో అందులోనూ నాగార్జునతో చేయడం మర్చిపోలేని విధంగా ఉంది. దేవీశ్రీప్రసాద్‌ కథ చెప్పగానే వెంటనే అంగీకరించారు. త్వరలో రికార్డింగ్‌ కార్యక్రమాలు ప్రారంభంకానున్నాయి' అని అన్నారు.
దేవీశ్రీప్రసాద్‌ మాట్లాడుతూ...'నాగార్జునతో నాకిది నాలగవ సినిమా. సంగీతానికి అవకాశముంది. మరో సెస్సేషనల్‌ హిట్‌ అయ్యేలా కృషిచేస్తా'నని పేర్కొన్నారు.