Monday, October 19, 2015

సెహ్వాగ్ వీడ్కోలు?

ఎంత కొట్టామన్నది కాదు, ఎంత వేగంతో కొట్టామన్నది ముఖ్యం... సెహ్వాగ్‌కు మాత్రమే సరిపోయే డైలాగ్ ఇది.
సిక్సర్‌తో ట్రిపుల్ సెంచరీని అందుకోవడం ఎలా ఉంటుంది... వీరూకి మాత్రమే తెలిసిన మజా.
టెస్టు ఓపెనర్ అంటే వికెట్ కాపాడుకోవడం కాదు...
వీర విధ్వంసం సృష్టించడం ఎలాగో సెహ్వాగ్ మాత్రమే చూపించిన విద్య.\

 ఒకటా, రెండా ఎన్నో అద్భుతాలు వీరేంద్ర సెహ్వాగ్ బ్యాటింగ్ నుంచి జాలువారాయి. సచిన్ అంతటివాడిని కావాలని క్రికెట్‌లోకి వచ్చిన సెహ్వాగ్ ఒక దశలో మాస్టర్‌నే మించిపోయాడు. దూకుడు అంటూ ఇప్పుడు కొందరు వల్లె వేయవచ్చు గాక... కానీ అసలు దూకుడు ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా మైదానంలో నేర్పించిన ఘనత సెహ్వాగ్‌దే. అతను క్రీజ్‌లో ఉన్నంతసేపు ఎంతటి భారీ లక్ష్యమైనా చిన్నదిగానే కనిపిస్తుంది. బ్యాటింగ్ చేసేటప్పుడు ఆ బంతిని బౌండరీ దాటించడంపైనే దృష్టి పెట్టే ఈ ‘నజఫ్‌గఢ్ నవాబ్’కు ఫుట్‌వర్క్, సాంప్రదాయ షాట్లు లాంటివి పట్టవు.
ఎవరైనా దానిని గుర్తు చేసినా అతను పట్టించుకోడు! తక్కువ శ్రమ-ఎక్కువ ఫలితం అనే సిద్ధాంతంతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించే శైలి అతడిని స్టార్‌ను చేసింది. భారత్‌కు అరుదైన, అనూహ్య విజయాలు అందించింది. సాధారణంగా టెస్టుల్లో ఒక రోజు ఆటంతా ఆడితే జట్టు మొత్తం చేయగలిగే స్కోరు 284. కానీ సెహ్వాగ్ ఒక్కడే దీనిని ఒక్కరోజులో కొట్టి పడేశాడు.

భారత్ టెస్టుల్లోకి వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా ఏ బ్యాట్స్‌మన్‌కూ అందని ‘ట్రిపుల్ సెంచరీ’ అతను పాకిస్తాన్ గడ్డపై సాధించిన రోజున గర్వించని భారతీయుడు లేడు. మరో నాలుగేళ్లకు మరో ‘ట్రిపుల్’ను బాది ఎవరికీ అందని ఎత్తులో నిలిచిన అతను వన్డేల్లోనూ ‘డబుల్’తో తన విలువను చూపించాడు. టెస్టుల్లో ఊహించడానికే సాధ్యం కాని 82 స్ట్రయిక్‌రేట్ అతనికే చెల్లింది.


అంతర్జాతీయ క్రికెటర్‌గా సెహ్వాగ్‌ది మహోజ్వల కెరీర్! 12 ఏండ్ల కెరీర్‌లో 104 టెస్టుల్లో 49.34 సగటుతో 8586 పరుగులు చేసిన వీరూ 23 సెంచరీలు, 32 అర్ధ సెంచరీలు కొట్టాడు. అలాగే 251 వన్డేల్లో 35.05 సగటుతో 8273 పరుగులు చేశాడు. ఇందులో 15 అర్ధ సెంచరీలు, 38 అర్ధ సెంచరీలున్నాయి. టెస్టుల్లో సెహ్వాగ్ రెండు ట్రిపుల్ సెంచరీలు కొట్టాడు. భారత తరపున ట్రిపుల్ సెంచరీ సాధించిన మొదటి ఆటగాడు సెహ్వాగే. అత్యంత వేగంగా త్రిశతకం సాధించిన ఘనత (278 బంతుల్లో) కూడా సెహ్వాగ్‌దే! వన్డేల్లో సచిన్ తర్వాత డబుల్ సెంచరీ సాధించిన రెండో బ్యాట్స్‌మన్ సెహ్వాగే!  

హాస్య నటుడు కళ్లు చిదంబరం కన్నుమూత

  ప్రముఖ హాస్య నటుడు కళ్లు చిదంబరం(70) కన్నుమూశారు. గత కొంతకాలంగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న ఆయన విశాఖ పట్నం కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కొల్లూరు చిదంబరం ఆయన అసలు పేరు, 1989లో ఆయన నటించిన కళ్లు చిత్రంతో ఆయనకు కళ్లు చిదంబరంగా పేరు వచ్చింది. ఆయన స్వస్థలం విశాఖపట్నం జిల్లా అక్కయ్యపాలెం. కళ్లు సినిమాలో నటనకు నందు పురస్కారం అందుకున్నారు.300లకు పైగా సినిమాల్లో ఆయన నటించారు. విశాఖపట్నం పోర్టులో చిదంబరం ఉద్యోగిగా పనిచేశారు. కళ్లు, కొండవీటి దొంగ, చంటి, గోవిందగోవిందా, అమ్మోరు, మనీ, ఎదురులేని మనిషి, మృగరాజు, శ్వేతనాగు, గ్లామర్, సివంగి, గంగపుత్రులు, కాలచక్రం, తొలిపాట, మైత్రి, ప్రేమకు సై సహా పలు చిత్రాల్లో నటించారు.