Tuesday, December 27, 2016

‘హుష్‌’.. అది నిజం కాదు!

నయనతార ముఖ్య తారగా చక్రి తోలేటి దర్శకత్వంలో సంగీత దర్శకుడు యువన్‌శంకర్‌ రాజా నిర్మించనున్న సినిమా ‘కొలై ఉదిర్‌ కాలమ్‌’. త్వరలో చిత్రీకరణ ప్రారంభించనున్నారు. సెట్స్‌ మీదకు వెళ్లడానికి ముందే ఈ సినిమా వార్తల్లో నిలిచింది. కమల్‌హాసన్‌ ‘ఈనాడు’, అజిత్‌ ‘బిల్లా–2’ సినిమాల తర్వాత చక్రి తోలేటి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాని ‘రెడ్‌ ఎపిక్‌–డబ్ల్యూ’ అడ్వాన్స్‌ టెక్నాలజీ కెమేరాతో 8కె రిజల్యూషన్‌లో షూట్‌ చేయనున్నారు. ‘‘8కె రిజల్యూషన్‌లో షూటింగ్‌ చేయనున్న తొలి భారతీయ చిత్రాల్లో మా ‘కొలై ఉదిర్‌ కాలమ్‌’ ఒకటి’’ అన్నారు దర్శకుడు చక్రి తోలేటి. ఈ సినిమా హాలీవుడ్‌ మూవీకి రీమేక్‌ అని వార్తలొచ్చాయి. వాటిపై స్పందిస్తూ.. ‘‘అమెరికన్‌ హారర్‌ థ్రిల్లర్‌ ‘హుష్‌’కు రీమేక్‌ కాదిది. అందులో ఓ పాత్ర స్ఫూర్తితో సరికొత్త కథ రాసుకున్నాం’’ అన్నారాయన

పబ్లిసిటీ కోసమే అలా చేశారు

  గ్లోబల్‌స్టార్‌ ప్రియాంక చోప్రా నటించిన తొలి హాలీవుడ్‌ చిత్రం ‘బేవాచ్‌’. ఇందులో ప్రియాంక విలన్‌గా కీలక పాత్రలో నటిస్తోంది. ఇటీవల ఈ చిత్ర ట్రైలర్‌ విడుదలైంది. దేశీగర్ల్‌ ప్రియాంక ట్రైలర్‌లో ఎలా కన్పించబోతోందోనని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూశారు కానీ వారి ఆశ అడియాసైంది. ఎందుకంటే ట్రైలర్‌లో ప్రియాంక అర సెకనుకు మించి కన్పించలేదు. దాంతో అసలు ప్రియాంక సినిమాలో ఉందా.. లేదా.. అతిథిగా అలా వచ్చి వెళ్లిపోతుందా.. అంటూ అభిమానులు సోషల్‌మీడియాలో కామెంట్స్‌ చేశారు.
ఈ విషయమై ప్రియాంక తల్లి మధు చోప్రా స్పందిస్తూ.. ఇదంతా చిత్రబృందం పబ్లిసిటీ కోసం చేసిందేనని సినిమాలోని బెస్ట్‌ పార్ట్‌ను ముందే చూపించేస్తే అంత పబ్లిసిటీ ఉండదని వారు ఇలా చేశారని పేర్కొన్నారు. సినిమాలో ప్రియాంకదే బెస్ట్‌ పార్ట్‌ అని మధు అన్నారు. ఇంతకుముందు తన కుమార్తెపై వచ్చే నెగెటివ్‌ వార్తల గురించి ఎక్కువగా టెన్షన్‌ పడేదాన్నని, ఇప్పుడు అసలు పట్టించుకోవడంలేదని, ఎందుకంటే ప్రియాంక గురించి తల్లిగా తనకే బాగా తెలుసన్నారు. ప్రియాంకపై ఎవరైనా తప్పుగా రాసినా నమ్మనని, ఆమె చాలా నిజాయతీగా ఉంటుందని చెప్పారు. అలా అని ప్రియాంక ఏ విషయంలోనూ పొరపాటు చేయదని తాను అనడంలేదు కానీ, తప్పు మాత్రం చేయదని కుమార్తెను వెనకేసుకొచ్చారు మధు. సేథ్‌ గోర్డాన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కాబోతోంది. ప్రియాంక క్రిస్మస్‌ సందర్భంగా ఇండియాకి వచ్చింది. కొద్దిరోజులు కుటుంబంతో గడిపి తిరిగి అమెరికా వెళ్లిపోతుంది.