Wednesday, September 25, 2019

వేణు మాధవ్‌ కన్నుమూత


టాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ హాస్యనటుడు వేణు మాధవ్‌ కన్నుమూశారు. సికింద్రాబాద్‌ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం మధ్యాహ్నం మృతి చెందారు. తెలుగు చిత్రసీమలో కమెడియన్‌గా తనదైన ముద్రను వేసుకున్న వేణు మాధవ్‌ గత కొంతకాలంగా కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ నెల 7వ తేదీన ఆయనను చికిత్స నిమిత్తం కుటుంబసభ్యులు యశోదా ఆస్పత్రిలో చేర్చారు.  అయితే వేణు మాధవ్‌ చనిపోయారంటూ సోషల్‌ మీడియాలో నిన్నటి నుంచే వార్తలు హల్‌చల్‌ చేశాయి. అయితే వాటిని కుటుంబసభ్యులు ఖండించారు. ఈ నేపథ్యంలో ఇవాళ మధ‍్యాహ్నం ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు, ఆస్పత్రి వైద్యులు అధికారికంగా నిర్థారించారు. వేణు మాధవ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు. కాగా కొద్ది నెలల క్రితం వేణు మాధవ్‌ సోదరుడు విక్రమ్‌ బాబు గుండెపోటుతో మృతి చెందారు.

Tuesday, September 24, 2019

హాస్య నటుడు వేణు మాధవ్‌కు తీవ్ర అనారోగ్యం

  ప్రముఖ హాస్య నటుడు వేణు మాధవ్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. తెలుగు చిత్రసీమలో కమెడియన్‌గా తనదైన ముద్రను వేసుకున్న వేణు మాధవ్‌ గత కొంతకాలంగా కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవల సమస్య తీవ్రం కావడంతో సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చేరారు. కిడ్నీ సమస్యలు కూడా తలెత్తడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్ సాయంతో చికిత్స అందిస్తున్నామని హాస్పిటల్‌ వైద్యులు తెలిపారు.

Tuesday, September 3, 2019

టీ-20లకు మిథాలీ గుడ్ బై


 
భారత మహిళా జట్టు సీనియర్ క్రికెటర్ మిథాలీ రాజ్ టీ-20 ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పింది. భారత టీ-20 జట్టుకు తొలి కెప్టెన్‌గా 2006లో బాధ్యతలు స్వీకరించిన మిథాలీ ఇప్పటివరకు 89 మ్యాచ్‌లు ఆడింది. మొత్తం 2364 పరుగులు చేసి టీ-20ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత క్రీడాకారిణిగా నిలిచింది. అలాగే 2012, 14, 16 ప్రపంచకప్‌ల్లో జట్టుకు నాయకత్వం వహించింది. `2006 నుంచి భారత్ తరఫున టీ-20లు ఆడుతున్నాను. ఇప్పుడు టీ-20లకు రిటైర్మెంట్ ప్రకటించి 2021లో జరుగనున్న వన్డే ప్రపంచకప్‌పై దృష్టి సారించాలనుకుంటున్నాను. ఇప్పటివరకు నాకు అండగా నిలిచిన బీసీసీఐకు ధన్యవాదాలు` అని మిథాలీ పేర్కొంది.