Wednesday, March 14, 2012

ముచ్చటగా మూడు...


neelimaపవన్‌కల్యాణ్‌తో ఇటీవలే ‘పంజా’ చిత్రాన్ని నిర్మించిన సంఘమిత్ర ఆర్ట్స్ సంస్థ త్వరలో మూడు చిత్రాల నిర్మాణానికి పూనుకుంటోంది. కొత్త రచయితలను ప్రోత్సహించాలనే ఉద్ధేశ్యంతో ఇటీవలే ఈ సంస్థ కొత్త కథలకు స్వాగతం పలుకుతూ కాంటెస్ట్‌ను నిర్వహించింది. దీనికి రచయితల నుంచి మంచి స్పందన లభించిందని ,మొత్తం వేయికిపైగా కథల్లోంచి మూడు కథల్ని ఎంపికచేసుకున్నామని నిర్మాతలు నీలిమా తిరుమలశెట్టి, నగేష్ ముంతా తెలిపారు.
త్వరలో నిర్మించబోయే మూడు చిత్రాల విశేషాలను వారు తెలియజేస్తూ ‘అత్యద్భుతమైన మూడు కథల్ని ఎంపిక చేశాం. ‘అలియాస్ జానకి’ చిత్రానికి టెన్త్‌క్లాస్ చిత్రానికి దర్శకత్వం వహించిన చందు దర్శకత్వం వహిస్తాడు. ప్రేమకథా చిత్రమిది. చక్కటి సందేశం వుంటుంది. ‘ఏ శ్యామ్ గోపాల్ వర్మ ఫిలిం’ అనే చిత్రాన్ని ఐటీ రంగానికి చెందిన రాకేష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తాడు. కామెడీ థ్రిల్లర్‌గా ఈ చిత్రం వుంటుంది. ‘అరే...అరెరే..’ అనే టైటిల్‌తో రానున్న చిత్రాన్ని శేఖర్ కమ్ముల దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేసిన శశికిరణ్ టిక్కా దర్శకత్వం వహిస్తాడు. ఏప్రిల్ నెల నుంచి ప్రతి నెలా ఓ చిత్రాన్ని ప్రారంభిస్తాం. ఈ మూడు చిత్రాలకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో తెలియజేస్తాం. చిత్రాల ప్రారంభోత్సవ తేదీలను త్వరలో ప్రకటిస్తాం’ అన్నారు.