Saturday, January 7, 2017

‘దృశ్యం’ చూసి హత్య చేశారు..!

బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియ నటించిన క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘దృశ్యం’ చిత్రాన్ని చూసి ప్రేరణ పొంది తండ్రీకొడుకులు ఓ వడ్డీ వ్యాపారిని హతమార్చారు. ఆ చిత్రంలో హత్య చేసిన తర్వాత పోలీసులకు దొరక్కుండా ఆధారాలు నాశనం చెయ్యాలని ప్రయత్నించారు.. కానీ వారి ప్రయత్నం బెడిసికొట్టి పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. అసలేం జరిగిందంటే..
మహారాష్ట్రలోని కుదల్‌క్వాడి ప్రాంతానికి చెందిన సమిద్దుల్లాహ్‌ మనియార్‌, మెహబూబ్‌ మనియార్‌ తరచూ శ్రీరాం శివాజీ వాలేకర్‌ అనే వ్యక్తి దగ్గర రూ.5లక్షలు అప్పు చేశారు. అలా ప్రతి చిన్నదానికి అప్పులు చేస్తున్నారే కానీ వాటిని తీర్చడం లేదు. అప్పు తీర్చాల్సిందిగా వాలేకర్‌ వారిని హెచ్చరించడంతో ఆ తండ్రీకొడుకులు ఆయన్ని హతమార్చాలని భావించారు. అందుకోసం పక్కాగా ప్రణాళిక వేసుకున్నారు. చిక్లి ప్రాంతంలో ఓ ఫ్లాట్‌లో మనియార్‌, ఆయన కొడుకు మెహబూబ్‌ అద్దెకు ఉంటున్నారు. ఒకరోజు డబ్బులిస్తాం రమ్మని వాలేకర్‌ను పిలిచి తండ్రీకొడుకులిద్దరూ కలిసి హత్యచేశారు. ఎవరికీ తెలియకుండా ఉండేందుకు వాలేకర్‌ మృతదేహాన్ని నలుపురంగు ప్లాస్టిక్‌ సంచిలో కట్టేసి పెట్టి అక్కడి నుంచి ఉడాయించారు.
గతేడాది సెప్టెంబరు 28న వాలేకర్‌ కనిపించకుండా పోయినట్లు అతని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. వాలేకర్‌ కాల్‌ రికార్డులను పరిశీలించగా ఎక్కువసార్లు మనియార్‌ ఫోన్‌ నుంచి కాల్స్‌ ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో వారిని పట్టుకొని విచారించగా అసలు విషయం బయటపెట్టారు. మృతదేహాన్ని ఉంచిన ప్రదేశాన్ని పోలీసులకు తెలియజేయడంతో శుక్రవారం వాలేకర్‌ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.