Wednesday, September 28, 2016

రాడనుకున్నారు.. రాలేడనుకున్నారు..!


మ్యాచ్‌ ఎలాంటి స్థితిలో ఉన్నా.. ఒత్తిడి అతని దరి చేరదు. సెహ్వాగ్‌ లాంటి భీకర ఓపెనర్‌ విఫలమైన చోట కూడా అతను అవలీలగా భారీ స్కోర్లు చేయగలడు. స్వలాభం కోసం శతకాలు బాదాలని అతను ఎప్పుడూ కోరుకోలేదు. జట్టు కోసం అవసరమైతే సమిధలా మారి 90ల్లో ఔటైన సందర్భాలు కోకొల్లలు. అందుకేనేమో భారత్‌ చరిత్రాత్మక విజయాలు కొన్ని అతని భీకర పోరాటంతోనే సాధ్యమైనా.. సరైన గుర్తింపులేక అవి తెరవెనుకే కనుమరుగైపోయాయి. కానీ అతను పోరాటం ఆపలేదు.. ఎందుకంటే మైదానంలో పట్టుదలకు, బ్యాటింగ్‌లో తెగువకు అతను నిలువుటద్దం. ‘చివరి అవకాశం ఇవ్వండి సగర్వంగా క్రికెట్‌ను నుంచి తప్పుకొంటాం’ అంటూ జట్టులో స్థానం కోల్పోయి సీనియర్‌ క్రికెటర్లు అభ్యర్థిస్తున్న వేళ.. జట్టులో స్థానం కోసం బ్యాట్‌తోనే పోరాడతాను అంటూ ధైర్యంగా ప్రకటించి మళ్లీ టెస్టు జట్టులో తాజాగా స్థానం పొందిన ఆ క్రికెటరే గౌతమ్‌ గంభీర్‌.
2007లో పాకిస్థాన్‌తో జరిగిన తొలి ప్రపంచకప్‌ ఫైనల్లో గంభీర్‌ 75 పరుగులు చేయడంతోనే భారత్‌ భారీ స్కోరు చేయగలిగింది.. తొలి టీ20ప్రపంచకప్‌ విజేతగా అవతరించింది. 2011లో భారత్‌ 28 ఏళ్ల తర్వాత గెలిచిన వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో కూడా గంభీర్‌ భీకరంగా పోరాడి 97 పరుగులతో టీమిండియా విజయానికి బాటలు వేశాడు. ఓపెనర్‌గా వచ్చిన అతను 41.2 ఓవర్‌ వరకూ క్రీజులో నిలిచి భారత్‌ విజయం దాదాపు ఖరారైన దశలో ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో అతను శతకం చేసినట్లయితే చరిత్రలో నిలిచిపోయేవాడే కానీ.. అప్పుడు జట్టు అవసరాల మేరకు 90లో కూడా హిట్టింగ్‌ చేయడానికి మొగ్గుచూపాడు. అయితే అందరూ చివర్లో సిక్స్‌ బాదిన ధోనీ(91 నాటౌట్‌)నే ఆకాశానికి ఎత్తేశారు. దీంతో గంభీర్‌ పోరాటం కనుమరుగైపోయింది. ఇక్కడ ధోనీ పోరాటాన్ని తక్కువ చేయడం కాదు గానీ.. 275 పరుగుల లక్ష్య ఛేదనలో 31 పరుగులకే సీనియర్లు సెహ్వాగ్‌, సచిన్‌ పెవిలియన్‌ చేరిన దశలో గంభీర్‌ అసాధారణ పోరాటానికి సరైన గుర్తింపు దక్కలేదనేది గత కొంతకాలంగా అతను జట్టుకు దూరమైన తీరే చెప్తోంది..!
కెరీర్‌ సాగిందిలా..!
2003లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన గంభీర్‌ అతి తక్కువ కాలంలో నమ్మదగిన బ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు పొందాడు. కెరీర్‌లో 56 టెస్టులాడి అందులో ఒక ద్విశతకం, 9 శతకాలు, 21 అర్ధశతకాలు సాధించాడు. 147 వన్డేల్లో 11 శతకాలు, 31 అర్ధశతకాలు.. టీ20 కెరీర్‌లో 37 మ్యాచ్‌లాడి 7 అర్ధశతకాలు చేశాడు. అయితే 2014లో చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడిన గంభీర్‌ ఐపీఎల్‌లో మాత్రం తన బ్యాటింగ్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ముందుండి నడిపిస్తూ విజయవంతమైన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.


సహచరులైనా తగ్గేది లేదు..!
ఆటలో దూకుడుగా ఉండే గంభీర్‌ ప్రత్యర్థి క్రికెటర్లతోనే కాదు.. సహచర క్రికెటర్లపైనా తరచూ గొడవకు దిగడం అతని కెరీర్‌ను కొంత మసకబార్చింది. భారత టెస్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లితో 2013లో జరిగిన ఓ ఐపీఎల్‌ మ్యాచ్‌లో ప్రత్యక్షంగా గొడవకు దిగి అప్పట్లో సంచలనానికి తెరలేపగా.. వన్డే, టీ20 కెప్టెన్‌ ధోనితో గత కొంతకాలంగా ప్రచ్ఛన్న యుద్ధాన్నే నడిపిస్తున్నాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో ధోని బ్యాటింగ్‌ చేస్తుండగా టెస్టు తరహాలో ‘అటాకింగ్‌ ఫీల్డింగ్‌’ ఈ వాదనకు మరింత బలం చేకూర్చాడు గంభీర్‌. కెప్టెన్లతో ఈ స్థాయిలో విభేదాలు ఉన్న అతను ఇక భారత్‌ జట్టులోకి రావడం దాదాపు అసాధ్యంగానే క్రికెట్‌ పండితులు తేల్చేశారు. కానీ నిలకడైన అతని ఆటతీరు, భారత్‌ కోచ్‌ కుంబ్లే, సెలెక్టర్ల చొరవతో మళ్లీ అతను టీమిండియాలోకి పడిలేచిన కెరటంలా అడుగుపెట్టాడు. ‘సమర యోధుడు భగత్‌సింగ్‌ నాకు ఆదర్శం. ఆయన స్ఫూర్తితోనే చివరివరకూ పోరాడుతాను’ అంటూ జట్టులోకి ఎంపికైన అనంతరం గంభీర్‌ ప్రకటించాడు. స్వదేశంలో భారత్‌ ఇంకా 12 టెస్టులు ఆడనున్న నేపథ్యంలో వివాదాల జోలికి వెళ్లకుండా గంభీర్‌ ఆటతో అందర్నీ మెప్పిస్తాడా లేదా మళ్లీ పాత గొడవలకు ఆజ్యం పోసి కెరీర్‌ను ముగిస్తాడో మరికొద్ది రోజుల్లోనే తేలనుంది.