Thursday, June 9, 2016

ఒక ప్రశ్న... ముగ్గురి పోరాటం



చర్చి ఫాదర్‌ విముక్తి కోసం ప్రయత్నిస్తున్నాడు...
ఓ పోలీసు అధికారిణి న్యాయం కోసం చూస్తోంది...
ఓ తాత నిజం కోసం ఎదురుచూస్తున్నాడు...
ఈ ముగ్గురు కలసి ఒకే విషయమై పోరాటం చేస్తున్నారు. ఎనిమిదేళ్లుగా వేధిస్తోన్న ఓ నిజాన్ని తెలుసుకోవడానికి కృషి చేస్తున్నారు. ఆ పోరాటం ఎవరిపై.. ఏ విషయంలో... ఎందుకు... అనే విషయాలు తెలియాలంటే ‘తీన్‌’ చూడాల్సిందే. అమితాబ్‌ బచ్చన్‌, విద్యా బాలన్‌, నవాజుద్దీన్‌ సిద్ధిఖీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రమిది. రిబుదాస్‌ గుప్తా దర్శకుడు. ఈ రోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది.
‘‘పాప గురించి ఏమైనా తెలిసిందా’’
- తన కళ్ల ముందే కిడ్నాపైన మనవరాలి కోసం తాత జాన్‌ బిశ్వాస్‌ ప్రశ్న!
‘‘ఎనిమిదేళ్లుగా ఇదే ప్రశ్న అడుగుతున్నారు...’’
- ఇదీ పోలీసు అధికారిణి సరితా సర్కార్‌ సమాధానం!
‘‘అంతకుమించి నా దగ్గర ఇంకో ప్రశ్న లేదు...’’ కన్నీళ్లు తుడుచుకుంటూ జాన్‌ బిశ్వాస్‌ స్టేషన్‌ నుంచి బయటికొచ్చేస్తాడు.
ఇది పోలీసు స్టేషన్‌లో జరిగే ప్రధాన సన్నివేశం. పోలీసు స్టేషన్‌కు వచ్చేముందు జాన్‌ బిశ్వాస్‌ (అమితాబ్‌ బచ్చన్‌) ఓ టేపు రికార్డర్‌లో ఓ చిన్న పిల్ల మాటలు, ఏడుపు విని వస్తాడు. ఈ రోజే కాదు గత ఎనిమిదేళ్లుగా ఇంతే. స్టేషన్‌ నుంచి తిన్నగా ఇంటికి వెళ్లకుండా రాత్రి వరకు వూరంతా ఓ పాప ఫొటో పట్టుకొని వెతుకుతూ ఉంటాడు. ఓ రోజు ఇలా పోలీసు స్టేషన్‌కు వెళ్తుంటే జాన్‌ కళ్లముందే ఓ చిన్న పిల్లాడు అపహరణకు గురవుతాడు. దీంతో సరితా సర్కార్‌ (విద్యా బాలన్‌) నేతృత్వంలో పోలీసు బృందం గాలింపు ముమ్మరం చేస్తుంది. గతంలో పోలీసుగా పని చేసి ప్రస్తుతం చర్చి ఫాదర్‌గా ఉంటున్న మార్టిన్‌ దాస్‌ (నవాజుద్దీన్‌ సిద్ధిఖీ) సహాయం తీసుకుంటారు. అడ్డంకులు దాటి ఆ ముగ్గురు ఈ మిస్టరీ చేధించారా? అనేదే కథ. దక్షిణ కొరియాలో విజయవంతమైన ‘మాంటేజ్‌’కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. అమితాబ్‌ బచ్చన్‌ నటన ఈ చిత్రానికి ప్రధానాకర్షణ.

హీరోయిన్‌ని ఇంట్లో నుంచి గెంటేశారు

మోడల్‌, బాలీవుడ్‌ నటి అలీసా ఖాన్‌ పరిస్థితి ఏమీ బాగోలేదు. ప్రస్తుతం బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్‌ హష్మికిజంటగా అలీసా ఓ చిత్రంలో నడుస్తోంది. రాత్రి వేళ్లల్లో ఇంట్లో ఉండాల్సిన అలీసా దిల్లీ వీధుల్లో ఒంటరిగా తిరుగుతుండడం మీడియా గమనించి ఏం జరిగిందని ఆరా తీశారు. తన మాజీ ప్రియుడు అసభ్యకర వీడియోలన్నీ తీసి బెదిరిస్తుండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశానని ఈ విషయం తెలిసి తల్లి, సోదరుడు తనని ఇంట్లో నుంచి గెంటేశాడని అలీసా మీడియాకి తెలిపింది. ఎటూ వెళ్లలేక గుళ్లలో, స్నేహితుల ఇళ్లలో తల దాచుకుంటున్నానని అలీసా తెలిపింది. పోలీసులు విషయం తెలుసుకుని అలీసా తల్లిదండ్రులతో మాట్లాడేందుకు యత్నిస్తున్నారు.

కోహ్లీ విషయం అడగ్గానే.. యువీకి కోపమొచ్చింది


టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫౌండేషన్, మరో ఛారిటీ సంస్థ స్మైల్ ఫౌండేషన్ కలసి ముంబైలో శుక్రవారం రాత్రి నిర్వహించిన  ఛారిటీ కార్యక్రమంలో కోహ్లీ, డాషింగ్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్, యువ ఆటగాడు హార్దిక్ పాండ్యా స్టెప్పులతో అదరగొట్టారు. ఈ కార్యక్రమంలో టీమిండియా టి-20, వన్డే కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ, కె.ఎల్ రాహుల్, అజింక్యా రహానేతో పాటు ఆకాశ్ అంబానీ, గౌతమ్ సింఘానియా, నికిల్ చతుర్వేది, దిగ్విజయ్ సిన్హ్ కతివాడా తదితర ప్రముఖులు పాల్గొన్నారు. క్రికెటర్లు చిన్నారులతో ఫొటోలు దిగి సందడి చేశారు.

ఇంతవరకు బాగానే ఉన్నా ఈ కార్యక్రమానికి ముందు అనూహ్య సంఘటన జరిగింది. మీడియా ప్రతినిధులు ఊహించని ప్రశ్న అడిగే సరికి యువరాజ్ సింగ్ శాంతం కోల్పోయాడు. ఒక్కసారిగా యువీకి ఒకింత కోపం వచ్చింది. యువీ సహనం కోల్పోయేలా చేసిన ఆ ప్రశ్న ఏంటంటే.. అన్ని ఫార్మాట్లకు టీమిండియా కెప్టెన్ గా విరాట్ కోహ్లీని నియమించే అవకాశం గురించి మీడియా ప్రతినిధులు అడిగారు. 'ఈ ఈవెంట్ గురించి మాట్లాడేందుకు ఇక్కడి వచ్చా. క్రికెట్ గురించి మాట్లాడేందుకు కాదు. ఓకే..? థ్యాంక్యూ' అంటూ మీడియా ప్రతినిధులకు మరో ప్రశ్న అడిగే అవకాశం ఇవ్వకుండా యువీ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాగా యువీ ఈ విషయాన్ని మనసులో పెట్టుకోకుండా ఈవెంట్ లో అందరితో కలసి హుషారుగా పాల్గొన్నాడు.