Sunday, May 28, 2017

ఆ నటి చనిపోలేదు

  ప్రముఖ బుల్లితెర నటి శ్వేతా తివారి చనిపోయారంటూ శనివారం సోషల్‌మీడియాలో పుకార్లు రావడం చర్చనీయాంశంగా మారింది. శ్వేతా స్నేహితురాలు, ప్రముఖ నటి సాక్షి తన్వర్‌.. తన ట్విటర్‌ ఖాతాలో స్నేహితురాల్ని కోల్పోయినందుకు బాధగా ఉంటంటూ ట్వీట్‌ చేశారు.
దాంతో చనిపోయింది శ్వేతా తివారి అనుకుని ప్రముఖులంతా సోషల్‌మీడియాలో ఆమెకు నివాళులు అర్పించడం మొదలుపెట్టారు. మరికొందరైతే శ్వేతా భర్త అభినవ్‌కి ఫోన్లు చేసి సంతాపం తెలిపారు. దాంతో షాకైన అభినవ్‌.. షూటింగ్‌ మధ్యలో ఆపేసి వెంటనే ఇంటికి వెళ్లాడు. ఈ విషయం తెలిసి శ్వేత తెగ నవ్వుకుందని.. ఇలాంటి పుకార్లు సృష్టించద్దు అంటూ అభినవ్‌ మీడియా ద్వారా వేడుకున్నాడు.
అయితే ఇలాంటి వార్తలు తాను పట్టించుకోనని మూడుసార్లు తనని ఇలాగే చంపేశారని శ్వేత తెలిపారు. ఓ రకంగా ఇలాంటి వార్తలకు అలవాటు పడిపోయినట్లు పేర్కొన్నారు. ఇలాంటి పుకార్లు రావడం ఇది తొలిసారి కాదు. ఇంతకుముందు బాలీవుడ్‌ ప్రముఖులు కాదర్‌ ఖాన్‌, ఫరీదా జలాల్‌, దిలీప్‌ కుమార్‌ చనిపోయినట్లు సోషల్‌మీడియాలో తప్పుడు వార్తలు హల్‌చల్‌ చేశాయి.

Thursday, April 27, 2017

నాలుగేళ్ల తర్వాత ఐపీఎల్‌లోకి...!

 వెస్టిండీస్‌ క్రికెటర్‌ మార్లోన్‌ శామ్యూల్స్‌ నాలుగేళ్ల తర్వాత ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో అడుగుపెడుతున్నాడు. దిల్లీ డేర్‌డెవిల్స్‌ యాజమాన్యం అతడితో ఒప్పందం కుదుర్చుకొంది. కుడిచేతి చూపుడు వేలి గాయంతో ఐపీఎల్‌ పదికి దూరమైన డికాక్‌ స్థానంలో శామ్యూల్స్‌ను తీసుకొంది. ఈ వెటరన్‌ క్రికెటర్‌ 71 టెస్టులు, 187 వన్డేలు, 55 టీ20ల్లో వెస్టిండీస్‌ తరఫున ఆడాడు. ఈ ఏడాది ఐపీఎల్‌ వేలంలో రూ.కోటి కనీస ధరతో వచ్చిన శామ్యూల్‌ను ఎవరూ కొనగోలు చేయలేదు. చివరి సారిగా 2013లో పుణె వారియర్స్‌ తరఫున ఐపీఎల్‌ ఆడాడు.

Wednesday, April 26, 2017

ఆ రోజు త్వరలోనే వస్తుంది!

 ఆ రోజు త్వరలోనే వస్తుంది అని నమ్మకంగా చెబుతోంది నటి కీర్తీసురేశ్‌. తంతే గారెల బుట్టలో పడ్డ చందాన మాలీవుడ్‌ నుంచి కోలీవుడ్‌ వచ్చి పడ్డ నటి కీర్తీసురేశ్‌. పరిచయమైన కొద్ది రోజుల్లోనే ఇళయదళపతి విజయ్, ధనుష్‌ వంటి స్టార్‌ హీరోలతో నటించేసి తన మార్కెట్‌ను అమాంతం పెంచేసుకుంది. అంతేకాదు టాలీవుడ్‌లోనూ నటించిన రెండు చిత్రాలు విజయాన్ని చవిచూడడంతో అక్కడ యమ క్రేజ్‌ సంపాదించుకుంది. తాజాగా సూర్యతో తానాసేర్న్‌దకూటం చిత్రంలో రొమాన్స్‌ చేస్తున్న కీర్తీసురేశ్‌ త్వరలో మహానటి సావిత్రి జీవిత చరిత్రతో ద్విభాషా చిత్రంగా తెరకెక్కనున్న నడిగై తిలగైయార్‌(తెలుగులో మహానది)లో సావిత్రి పాత్రలో నటించడానికి రెడీ అవుతోంది.

ఇందులో మరో క్రేజీ నటి సమంత కూడా నటించనున్నారు. ఈమె పాత్రికేయురాలిగా నటించనున్నట్లు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. కీర్తీసురేశ్‌ తెలుగులో పవన్‌కల్యాణ్‌కు జంటగా నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న కీర్తీ నటిగా ఇంత త్వరగా ఈ స్థాయికి చేరుకుంటానని ఊహించలేదని పేర్కొంది.

 భైరవా చిత్రంలో విజయ్‌తో జత కట్టానంది. ఆయనతో నటించిన అనుభవం గురించి తాను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదంది. అదే విధంగా ప్రస్తుతం మరో స్టార్‌ హీరో సూర్యతో కలిసి తానా సేర్న్‌దకూటం చిత్రంలో నటిస్తున్నానని చెప్పింది. ఇక మరో స్టార్‌ నటుడు అజిత్‌తో ఎప్పుడు రొమాన్స్‌ చేస్తారని అభిమానులు అడుగుతున్నారని, ఆ అవకాశం త్వరలోనే వస్తుందని నటి కీర్తీసురేశ్‌ చెప్పింది.

అంటే అజిత్‌ తదుపరి చిత్రంలో నాయకి ఈ అమ్మడేనా? అలాంటి చర్చలు జరుగుతున్నాయా? అన్న ప్రశ్నలకు సమాధానం త్వరలో వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే తదుపరి విశాల్‌తో సండైకోళి 2 చిత్రంలో నటించనున్నట్లు కీర్తీ పేర్కొంది. మొత్తం మీద కోలీవుడ్, టాలీవుడ్‌లో ఈ ముద్దుగుమ్మ స్టార్‌ హీరోలతో నటిస్తూ పుల్‌ జోష్‌లో ఉందన్నమాట.

Monday, April 24, 2017

కాఫీ ఇస్తానంటే పారిపోతాడు..

 తన చేత్తో కాఫీ పెట్టిస్తానంటే సూర్య అక్కడి నుంచి పరుగు తీసేవారని నటి జ్యోతిక అన్నారు. ఆమె, శరణ్య, వూర్వశి, భానుప్రియ కీలక పాత్రల్లో నటిస్తున్న ‘మగాలిర్‌ మట్టం’ చిత్రం పాటల విడుదల కార్యక్రమాన్ని సోమవారం ఉదయం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సూర్య, కార్తీ, శివకుమార్‌, పాండిరాజ్‌, వూర్వశి, సుధ కొంగర, ఎస్‌.ఆర్‌. ప్రభు తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా జ్యోతిక మాట్లాడుతూ.. ‘సూర్య నా కారు దగ్గరకు వచ్చి మరీ రోజూ బాయ్‌ చెప్తారు. తర్వాతే తాను సినిమా షూటింగ్‌కు బయలుదేరుతారు. బ్రహ్మ తెలిసో, తెలియకో చిత్రంలోని పాత్ర కోసం సరైన మహిళను(తననే) ఎంచుకున్నారు. ఎందుకంటే.. నాకు వివాహమై పదేళ్లవుతోంది. ఈ పదేళ్లలో నా భర్త కోసం స్వయంగా కేవలం ఒక్క దోశ వేశాను. అది కూడా ఇటు దోశ, అటు చపాతీకి మధ్యలో తయారైంది. ఆ దోశ తిన్నందుకు ధన్యవాదాలు సూర్య. ఈ దోశను నేను నా పెళ్లి తర్వాతి రోజు వేశాను. తర్వాత దోశలు పోసే అవసరం లేదని అమ్మ చెప్పారు. కనీసం నా చేత్తో కాఫీ చేసి ఇస్తానన్నా సూర్య అక్కడి నుంచి పరుగు తీస్తారు. ఇందుకే నన్ను నటించడానికి పంపుతున్నారేమో అనిపిస్తుంది. కానీ సూర్య లేకుండా నేను ఈ స్థాయిలో ఉండేదాన్ని కాదు.. థ్యాంక్యూ సూర్య’ అని చెప్పారు.

Tuesday, March 14, 2017

ఫుల్‌గా తాగి.. 175 బాదిన బ్యాట్స్‌మన్‌

 వన్డే క్రికెట్‌ చరిత్రలో 12/3/2006 తేదీకి ఓ ప్రత్యేకమైన స్థానముంది. సరిగ్గా ఇదే తేదీన దక్షిణాఫ్రికా జట్టు 434 పరుగుల అతి భారీ లక్ష్యాన్ని ఛేదించి చరిత్ర సృష్టించింది. వన్డే చరిత్రలో 400కుపైగా పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం అదే తొలిసారి.. ఈ అరుదైన ఘనతను సఫారీలు సొంతం చేసుకోవడం వెనుక చిచ్చరపిడుగు హెర్షల్లీ గిబ్స్‌ పాత్ర ఉంది. జోహాన్నెస్‌బర్గ్‌లో ఆస్ట్రేలియాలో జగిరిన ఈ వన్డేలో గిబ్స్‌ చెలరేగిపోయాడు. ఆసిస్‌ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ.. ఏకంగా 175 పరుగులు చేయడంతో అసాధ్యమనుకున్న 400కుపైగా లక్ష్యాన్ని సఫారీలు సొంతం చేసుకున్నారు.

అయితే, గిబ్స్‌ సాధించిన అరుదైన ఈ ఫీట్‌ వెనుక ఉన్న ఓ రహస్యం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. వన్డే మ్యాచ్‌కు ముందురోజు అర్ధరాత్రి దాకా పీకలవరకు తాగి.. ఫుల్‌ హ్యాంగోవర్‌ స్థితిలో గిబ్స్‌ బ్యాటింగ్‌కు దిగాడు. ఆ హ్యాంగోవర్‌తోనే కంగారు బౌలర్లను కకావికలం చేశాడు. ఈ విషయాన్ని తన ఆత్మకథలో గిబ్స్‌ వెల్లడించాడు. మ్యాచ్‌కు ముందురోజు స్నేహితుడితో కలిసి రాత్రి ఒంటిగంటవరకు ఫుల్‌గా మద్యాన్ని సేవించానని, ఆ తెల్లారి హ్యాంగోవర్‌తోనే బ్యాటింగ్‌కు దిగానని గిబ్స్‌ పేర్కొన్నాడు. సహజంగానే చెలరేగి ఆడే గిబ్స్‌కు ఆ హ్యాంగోవర్‌ ఇంకాస్తా ఊపునిచ్చిందేమో. ఏకంగా 21 ఫోర్లు, ఏడు సిక్సర్లతో ఆ మ్యాచ్‌లో గిబ్స్‌ విధ్వంసం సృష్టించాడు. అతని ఘనతతో దక్షిణాఫ్రికా 434పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది. ఇప్పటికీ వన్డే చరిత్రలో అతి పెద్ద లక్ష్యఛేదన రికార్డుగా ఇది మిగిలిపోయింది.

Sunday, March 12, 2017

పెళ్ళి పెళ్లే... సినిమా సినిమానే!

 అక్కినేని నాగచైతన్య (చైతూ) పేరు వినిపిస్తే చాలు! సమంతతో ప్రేమ, పెళ్లి... ఈ కబుర్లే వినిపిస్తున్నాయి. మనోడు చేస్తున్న సినిమా సంగతులు ప్రేక్షకుల మధ్య పెద్దగా చర్చకు రావడం లేదు. కానీ, చైతూ సైలెంట్‌గా కొత్త సినిమాల షూటింగులు కానిచ్చేస్తున్నాడు. ‘సొగ్గాడే చిన్ని నాయనా’ ఫేమ్‌ కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఓ పక్క ఈ సినిమా షూటింగ్‌ జరుగుతుండగానే... మేనమామ డి. సురేశ్‌బాబు, వారాహి చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటి సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమాని ఈ మధ్యే అంగీకరించాడు.

అప్పుడే ఈ సినిమా ఫస్ట్‌ షెడ్యూల్‌ పూర్తయింది. హైదరాబాద్‌లో 18 రోజుల పాటు చైతూ, ఇతర తారలు పాల్గొనగా కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. నెక్ట్స్‌ షెడ్యూల్‌ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని పేర్కొన్నాడు. లావణ్యా త్రిపాఠి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ నటుడు శ్రీకాంత్‌ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. రాజమౌళి కుమారుడు ఎస్‌.ఎస్‌. కార్తికేయ ఈ సినిమాకు లైన్‌ ప్రొడ్యూసర్‌. ‘జెంటిల్‌మన్‌’ ఫేమ్‌ డేవిడ్‌ ఆర్‌.నాథన్‌ ఈ చిత్రానికి కొత్త తరహా కథ, కథనాలు అందించారట!

Saturday, March 11, 2017

నిర్మాత దిల్‌ రాజుకు సతీ వియోగం

 ప్రముఖ తెలుగు నిర్మాత, పంపిణీదారుడు దిల్‌ రాజు అలియాస్ వి.వెంకట రమణారెడ్డికి సతీ వియోగం జరిగింది. దిల్‌ రాజు భార్య అనిత (46) శనివారం గుండెపోటుతో మృతి చెందారు. హైదరాబాద్‌ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె ఇవాళ తుది శ్వాస విడిచారు. కాగా వరుణ్‌ తేజ్‌ హీరోగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న 'ఫిదా'  చిత్రం షూటింగ్‌ నిమిత్తం దిల్‌ రాజు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు.
ఈ దుర్వార్త విన్న దిల్‌ రాజు... అమెరికా నుంచి హైదరాబాద్‌ బయల్దేరారు. ఆయన వచ్చేవరకు అనిత మృతదేహాన్ని ఆసుపత్రిలోనే ఉంచుతారని తెలిసింది.  విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు దిల్‌రాజు కుటుంబానికి సంతాపం ప్రకటించారు. ఇటీవల దిల్‌ రాజు తమ కుమార్తె హన్హిత రెడ్డి పెళ్లిని గోవాలో గ్రాండ్‌గా జరిపించిన విషయం తెలిసిందే.

దిల్‌ రాజు... శ్రీ వెంకటేశ్వరా ఆర్ట్స్ నిర్మాణ సంస్థను స్థాపించి తెలుగులో పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. ఆయన నిర్మించిన తొలి చిత్రం దిల్‌ విజయవంతం కావడంతో ఆ పేరే ఆయన ఇంటి పేరుగా మారిపోయింది.

Friday, March 10, 2017

తేజ దర్శకత్వంలో స్టార్ వారసురాలు

 చిత్రం, నువ్వు నేను, జయం లాంటి సినిమాలతో ఇండస్ట్రీని మలుపు తిప్పిన దర్శకుడు తేజ. అంత కొత్త వారితో తిరుగులేని విజయాలు సాధించిన ఈ గ్రేట్ డైరెక్టర్, కొంత కాలంగా సక్సెస్ కు దూరమయ్యాడు. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలన్ని వరుసగా ఫ్లాప్ అవ్వటంతో ఆయన కెరీర్ కష్టాల్లో పడింది. లాంగ్ గ్యాప్ తరువాత ప్రస్తుతం రానా హీరోగా ఓ పొలిటికల్ డ్రామాను తెరకెక్కిస్తున్నాడు తేజ. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కావచ్చింది.
నేనే రాజు నేనే మంత్రి పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా తరువాత మరోసారి తన మార్క్ లవ్ స్టోరిని చేసే ఆలోచనలో ఉన్నాడు తేజ. అంతా కొత్త వారితో ఓ క్యూట్ లవ్ స్టోరిని ప్రీపేర్ చేస్తున్నాడు. ఈ సినిమాతో ప్రముఖ హీరో రాజశేఖర్ కూతురు శివానిని హీరోయిన్ గా పరిచయం చేయబోతున్నాడట. గతంలో రాజశేఖర్ హీరోగా తేజ అహం అనే సినిమాను ఎనౌన్స్ చేశాడు. అయితే ఈ సినిమా చర్చల దశలోనే ఆగిపోయింది. గతంలో తేజ పరిచయం చేసిన నటీనటులు ఇప్పుడు స్టార్ గా వెలుగొందుతున్నారు. అదే బాటలో రాజశేఖర్ కూతురికి కూడా తేజ బ్రేక్ ఇస్తాడేమో చూడాలి.