Monday, February 27, 2017

ఆ కోరిక తీరనుంది!

  వచ్చే అదృష్టాన్ని నిలువరించడం ఎవరితరం కాదు. అలాగే అందని దాని కోసం ఆశ పడడం వృథానే. అలాగని కలల్ని కనడం, వాటిని నెరవేర్చుకోవడానికి కృషి చేయడం సాధికుల లక్షణం. అదే విధంగా అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం తెలివైన వారి పని. ఇక సినీ కథానాయికల విషయానికొస్తే వరించి వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని ఎదిగే వారు కొందరైతే, కోరుకున్న అవకాశాలను సంపాదించుకునే వారు మరి కొందరు. మొదట నుంచి అందాలార బోసి కమర్షియల్‌ హీరోయినన్ లగా పేరు తెచ్చుకుని నటిగా ఒక స్థాయికి చేరిన తరువాత కథలో సెంటరిక్‌ పాత్రలను పోషించాలని ఆశ పడుతుండడం సహజం.
అయితే ఆశపడిన వారందరికీ అలాంటి అవకాశాలు రావడం అన్నది కల్లే. కొందరికి మాత్రం ఆశించకుండానే హీరోయిన్  ఓరియెంటెడ్‌ అవకాశాలు ముంగిట వాలతాయి. ఒకప్పుడు నటి విజయశాంతి అలాంటి లేడీ ఓరియెంటెడ్‌ కథా చిత్రాల్లో నటించి లేడీ సూపర్‌స్టార్‌గా వెలుగొందారు. తాజాగా నటి నయనతార, అనుష్క, త్రిష లాంటి వారు కథల్లో సెంటరిక్‌ పాత్రలో రాణిస్తున్నారు. ఇటీవల నటి సోనియా అగర్వాల్‌ కూడా లేడీ ఓరియెంటెడ్‌ పాత్రలో నటిస్తున్నారు. ఆమె నటిస్తున్న అహల్య అనే చిత్రం ఐదు భాషల్లో తెరకెక్కుతోంది. కాగా నటి కాజల్‌అగర్వాల్‌కు కూడా స్త్రీ ప్రధాన పాత్రతో కూడిన చిత్రాల్లో నటించాలన్న ఆశ పుట్టింది.
ఇప్పటి వరకూ గ్లామరస్‌ పాత్రలకే పరిమితవైున ఈ బ్యూటీ కెరీర్‌ మధ్యలో కాస్త డౌన్ నా మళ్లీ గాడిలో పడింది. ప్రస్తుతం అజిత్‌తో వివేకం చిత్రంలోనూ, విజయ్‌తో ఆయన 61వ చిత్రంలోనూ రొమాన్స్  చేస్తున్న ఈ ఉత్తరాది భామ కోరుకున్నట్లు తాను ఆశపడిన పాత్రలో నటించే అవకాశం వరించిందన్నది తాజా సమాచారం. దర్శకుడు డీకే నయనతార కోసం ఒక హీరోయిన్  సెంటరిక్‌ కథను తయారు చేసుకున్నారు.
ఈ పాత్రలో ఇప్పుడు నటి కాజల్‌అగర్వాల్‌ను ఎంపిక చేసుకున్నారు. కాజల్‌ ఇంతకు ముందు ఆయన దర్శకత్వంలో కవలైవేండామ్‌ చిత్రంలో నటించారు. ఆ స్నేహం కారణంగానే ఈ హీరోయిన్  ఓరియెంటెడ్‌ కథా చిత్రంలో నటించే అవకాశం కాజల్‌ను వరించిందని తెలుస్తోంది. మొత్తం మీద కాజల్‌ కోరుకుంది సాధించుకుంది. ఇప్పుడు ఈ అమ్మడు కూడా నయనతార, త్రిషల వరుసలో చేరబోతున్నందుకు ఆనందంలో తేలిపోతోందట. లక్కు అంటే ఇదే మరి.

Saturday, February 25, 2017

రజనీకాంత్‌ సరసన మరో బాలీవుడ్‌ నటి?

 సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో ‘2.0’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత ఆయన ‘కబాలి’ దర్శకుడు పా రంజిత్‌ దర్శకత్వంలో మరో చిత్రంలో నటిస్తున్నారు. రజనీ అల్లుడు, నటుడు ధనుష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మేలో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శక-నిర్మాతలు చిత్రంలో మిగిలిన నటీనటుల ఎంపిక పనుల్లో పడినట్లు తెలుస్తోంది. రజనీకాంత్‌కి జోడీగా బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌ను అనుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే దర్శక-నిర్మాతలు విద్యాబాలన్‌ను కలిశారని, నటించడానికి ఆమె కూడా ఆసక్తి చూపారని తమిళ చిత్రవర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే విద్యాబాలన్‌ కోలీవుడ్‌లో నటిస్తున్న తొలి చిత్రమిదే అవుతుంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.
లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మిస్తున్న ‘2.0’ చిత్రంలో అమీ జాక్సన్‌ కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబరులో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎ.ఆర్‌. రెహమాన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

Friday, February 24, 2017

రివ్యూ: విన్నర్‌


కథేంటి?: హార్స్‌ రేసింగ్‌నే వ్యాపారంగా చేసుకొన్న కుటుంబానికి చెందిన వ్యక్తి మహేంద్రరెడ్డి (జగపతిబాబు). ఆయన కొడుకే సిద్ధార్థ్‌(సాయిధరమ్‌ తేజ్‌). భార్య చనిపోవడంతో సిద్ధార్థే లోకంగా బతుకుతుంటాడు. కానీ ఉన్నట్టుండి సిద్ధార్థ్‌కి తన తండ్రిపై ద్వేషం పెరుగుతుంది. అందుకే చిన్నప్పుడే ఇంటి నుంచి పారిపోతాడు. పెద్దయ్యాక న్యూ లుక్‌ పత్రికకు క్రియేటివ్‌ హెడ్‌గా పనిచేస్తుంటాడు. ఒక పార్టీలో తొలి చూపులోనే సితార (రకుల్‌ప్రీత్‌సింగ్‌)ని చూసి ప్రేమిస్తాడు. ఒక లక్ష్యం కోసం పాటుపడుతున్న ఆమెని ప్రేమలో దించే క్రమంలో ఓ చిన్న పొరపాటు జరుగుతుంది. దాంతో సితార తండ్రి రాజీవ్‌రెడ్డి (సురేష్‌).. నెంబర్‌ వన్‌ రేసర్‌ అయిన సిద్ధార్థ్‌రెడ్డి(ఠాకూర్‌ అనూప్‌సింగ్‌)తో పెళ్లి చేయాలని నిర్ణయిస్తాడు. అది తెలుసుకొని సిద్ధార్థ్‌ ఎలాగైనా పెళ్లి ఆపాలని వెళతాడు. ఇంతలో సితారే తనకి ఈ పెళ్లి ఇష్టం లేదని, తాను సిద్ధార్థ్‌ని ప్రేమించానని, అతను కూడా హైదరాబాద్‌లో రేసరే అని చెబుతుంది. కావాలంటే సిద్ధార్థ్‌రెడ్డికీ, సిద్ధార్థ్‌కీ మధ్య పోటీ పెట్టమని కూడా చెబుతుంది. అదే సమయంలోనే ఈ పోటీలో త‌న‌ కొడుకు సిద్ధార్థ్‌రెడ్డి గెలుస్తాడని మహేందర్‌రెడ్డి అక్కడికొచ్చి చెబుతాడు. అది చూసి ఒక్కసారిగా షాక్‌ అవుతాడు సిద్ధార్థ్‌. తన స్థానంలో వచ్చిన సిద్ధార్థ్‌రెడ్డి ఎవరో తెలుసుకోవాలనుకొంటాడు. మరింతకీ ఆ సిద్ధార్థ్‌రెడ్డి ఎవరు? రేసింగ్‌లో ఎవరు గెలిచారు? సిద్ధార్థ్‌రెడ్డి అసలు రూపం బయటపెట్టి తన తండ్రికి సిద్ధార్థ్‌ ఎలా దగ్గరయ్యాడు? సితార లక్ష్యం కోసం, ఆమె మనసు సొంతం చేసుకోవడం కోసం సిద్ధార్థ్‌ ఏం చేశాడు? తదితర విషయాల్ని తెరపై చూడాల్సిందే.

ఎలా ఉందంటే?: తెలుగు సినిమాకి అలవాటైన ఫార్ములా కథే ఇది. ఆ మాట కొస్తే ఫార్ములా కథలు తప్పేం కాదు. కాకపోతే ప్రేక్షకుడు థియేటర్లో కూర్చున్నంతసేపూ ఇది మనం చూసేసిన కథే అనిపించకుండా, ఏ సన్నివేశానికి ఆ సన్నివేశం సరదాగా గడిచిపోయిందంటే చాలు.. పాసైపోయినట్టే.. ఆ విషయంలో కొంత వరకు సఫలమయ్యాడు దర్శకుడు. తండ్రీ-కొడుకుల బంధానికి హార్స్‌రేస్‌ నేపథ్యాన్ని జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కథా నేపథ్యంలో కొత్తదనం ఉంది తప్ప కథ, కథనాలు మాత్రం సాధారణంగానే అనిపిస్తాయి. కథ ఎత్తుగడ, హీరోయిన్‌ని చూసి హీరో ప్రేమలో పడటం, ఆ తర్వాత వచ్చే ప్రేమ సన్నివేశాలు రొటీన్‌గా సాగుతాయి. ‘సింగమ్‌ సుజాత’గా పృథ్వీ కథలోకి ప్రవేశించాక సన్నివేశాలు పరుగులు పెట్టాయి. మహేందర్‌రెడ్డి కొడుకుగా, ఠాకూర్‌ అనూప్‌సింగ్‌ ప్రవేశంతో కథ ఆసక్తికర మలుపు తిరుగుతుంది. అయితే ఆ తర్వాత కథ మరింత రక్తి కట్టాల్సి ఉండగా, అలా జరగదు. విరామానికి ముందున్న ఆసక్తి క్రమంగా తగ్గిపోతూ వస్తుంది. ద్వితీయార్ధంలో పీటర్‌హెయిన్స్‌గా అలీ చేసే సందడి, పతాక సన్నివేశాల్లో హార్స్‌రేసింగ్‌ సన్నివేశాలు అలరిస్తాయి. కథంతా ప్రేక్షకుడి వూహకు తగినట్లుగానే సాగుతుంది. ఈ సినిమాలో కొత్తగా ఏదైనా ఉందంటే అది హార్స్‌రేసింగ్‌ నేపథ్యంలో కూడిన సన్నివేశాలే. తొలి సగభాగం స్థాయిలో విరామం తర్వాత కూడా వినోదం మరింత పండుంటే ఈ సినిమా మరోస్థాయికి వెళ్లేది.
ఎవరెలా చేశారంటే: సాయిధరమ్‌తేజ్‌ హుషారుగా నటించాడు. భావోద్వేగంతో కూడిన సన్నివేశాల్లోనూ పర్వాలేదనిపించాడు. డ్యాన్స్‌, ఫైట్ల విషయంలో ఎప్పటిలాగే తన మార్కును చూపించాడు. రకుల్‌ ప్రీత్‌సింగ్‌ అందంగా కనిపించింది. పృథ్వీ, అలీ, వెన్నెల కిషోర్‌ వినోదాన్ని పంచే బాధ్యతను చక్కగా నిర్వర్తించారు. సినిమాలో వాళ్ల పాత్రలే హైలైట్‌ అయ్యాయి. జగపతిబాబు నటన, ఆయన పాత్ర చాలా బాగుంది. ప్రతినాయకుడిగా ఠాకూర్‌ అనూప్‌ సింగ్‌ తన పరిధి మేర బాగానే నటించాడు. సాంకేతికంగా ఈ సినిమాకు మంచి మార్కులు పడతాయి. ఛాయాగ్రహణం, సంగీతం బాగున్నాయి. అబ్బూరి రవి సంభాషణల్లో మెరుపులు కనిపించాయి. దర్శకుడు తాను అనుకున్న కథను అనుకున్నట్లు తెరకెక్కించాడు. అయితే ద్వితీయార్ధంపై దృష్టి పెట్టాల్సింది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. విదేశాల్లో పాటలు, హార్స్‌ రేసింగ్‌ సన్నివేశాలు చక్కటి నిర్మాణ విలువలకు అద్దం పట్టాయి.
చివరిగా: తండ్రీకొడుకుల బంధంతో ‘విన్నర్‌’  

Thursday, February 23, 2017

ధోనీని తప్పించడంపై సెహ్వాగ్‌ హర్షం

ఐపీఎల్‌ ఫ్రాంచైజీ పుణె సూపర్‌ జైంట్స్‌ ధోనీని తమ జట్టు కెప్టెన్‌గా తప్పించిన తర్వాత తదుపరి సారథిగా స్టీవ్‌ స్మిత్‌ను నియమించిన విషయం తెలిసిందే. అయితే ధోనీని తప్పించడంపై అభిమానులంతా నిరాశగా ఉంటే వీరేంద్ర సెహ్వాగ్‌ మాత్రం తనకు సంతోషమని అంటున్నాడు. ‘ధోని కెప్టెన్‌గా లేకపోవడం నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే త్వరలో జరిగే ఐపీఎల్‌ పదో సీజన్‌లోనైనా మా జట్టు కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌.. పుణెను ఓడించగలదని ఆశిస్తున్న’ట్లు సెహ్వాగ్‌ సరదా వ్యాఖ్యలు చేశాడు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న సెహ్వాగ్‌ మాట్లాడుతూ సారథ్య బాధ్యతల నుంచి అతన్ని తప్పించడం ఆ ఫ్రాంచైజీకి సంబంధించిన ఆంతరంగిక విషయమని, కానీ భారత్‌కు నాయకత్వం వహించిన అత్యుత్తమ కెప్టెన్లలో ధోని ఒకడని ప్రశంసించాడు. యాజమానులైన తమను పట్టించుకోకపోవడం, క్రికెటేతర విషయాల్లో కూడా అతడు జోక్యం చేసుకోవడం తదితర కారణాలను చూపుతూ అతడిని కెప్టెన్సీ నుంచి తొలగించినట్లు పుణె యాజమాని సంజీవ్‌ గోయెంకా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే.
సెహ్వాగ్‌ గతంలో పంజాబ్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించి రిటైర్మెంట్‌ ప్రకటించినప్పటికీ అతని సేవలను మాత్రం ఫ్రాంచైజీ ఉపయోగించుకుంటోంది. ఇటీవల పంజాబ్‌ క్రికెట్‌ ఆపరేషన్స్‌ హెడ్‌గా బాధ్యతలు చేపట్టడంతో పాటు మెంటార్‌గా కూడా కొనసాగుతున్నాడు. ధోని సారథిగా లేనందున త్వరలో ఆరంభంకానున్న పదో సీజన్‌లో ఇరు జట్లు తలపడినప్పుడు పుణెపై తమ జట్టు గెలుపొందడం సులభమవుతుందని సెహ్వాగ్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు.

Wednesday, February 22, 2017

ఆయన ప్రపోజ్‌ చేశారు: ఖుష్బూ

 అందం, చక్కటి అభినయంతో ఒకప్పుడు అగ్రకథానాయికగా రాణించిన నటి ఖుష్బూ తన ప్రేమ జీవితం గురించి సోషల్‌మీడియా వేదికగా గుర్తు చేసుకున్నారు. 22 ఏళ్ల క్రితం తీసిన ఫొటోను ట్విటర్‌లో షేర్‌ చేస్తూ.. ఆ సందర్భాన్ని అభిమానులతో పంచుకున్నారు. ‘22 ఏళ్ల క్రితం ఫిబ్రవరి 22న నేను ‘మురైమమన్‌’ సినిమా షూటింగ్‌లో ఉన్నా.. ఆ సమయంలో ఆయన నాకు ప్రపోజ్‌ చేశారు. జంటగా ఇద్దరి ప్రయాణం అలా మొదలైంది’ అని ఖుష్బూ ట్వీట్‌ చేశారు.
2001లో ఖుష్బూ, సి. సుందర్‌ల వివాహం జరిగింది. వీరికి అవంతిక, ఆనందిత అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఖుష్బూ ప్రస్తుతం ఓ తమిళ చిత్రంలో నటిస్తున్నారు. పవన్‌కల్యాణ్‌- త్రివిక్రమ్‌ కలయికలో వస్తున్న మరో చిత్రంలోనూ ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు.

Tuesday, February 21, 2017

ఐపీఎల్‌ పదోసీజన్‌ లోగో ఆవిష్కరణ

 టోర్నీ ఆరంభం నుంచి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకొన్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) ఫీవర్‌ సోమవారం ఆటగాళ్ల వేలం ప్రక్రియతో మొదలైంది. తాజాగా లీగ్‌ పదోసీజన్‌ లోగోను మంగళవారం ఆవిష్కరించారు. తొమ్మిది లీగ్‌లను విజయవంతంగా ముగించుకొని పదో సీజన్‌లోకి ఘనంగా అడుగుపెడుతున్నందున లోగోలో పది సంఖ్యను అందంగా తీర్చిదిద్దారు. సంఖ్య మధ్యలో బ్యాట్స్‌మన్‌ షాట్‌ ఆడుతున్న భంగిమను ఏర్పాటు చేశారు. పక్కనే ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌ వివో, ఐపీఎల్‌ ఆంగ్ల అక్షరాలను డిజైన్‌ చేశారు. ఏప్రిల్‌ 5న హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో తొలి మ్యాచ్‌ అట్టహాసంగా ప్రారంభంకానుంది. మరోవైపు దేశవ్యాప్తంగా 38 నగరాల్లో ఐపీఎల్‌ ఫ్యాన్‌పార్క్‌ల ద్వారా స్టేడియంలో ఉన్న అనుభూతిని అభిమానులకు కలిగించేలా ఏర్పాటు చేస్తున్నారు.

Sunday, February 19, 2017

జీవితం అంటే ఆట!

  పేరు ఉంగరాలు రాంబాబు. ఓహో.. ఉంగరాల వ్యాపారం చేస్తాడేమో అనుకుంటున్నారా? అబ్బే అలాంటిదేం లేదు. మనోడికి జాతకాలంటే మహా నమ్మకం. అందుకే ఆ రాయి.. ఈ రాయి.. అంటూ రాళ్ల ఉంగరాలతో వేళ్లను నింపేసుకున్నాడు. కామెడీ హీరో సునీల్‌ టైటిల్‌ రోల్‌ చేస్తున్న ‘ఉంగరాల రాంబాబు’. పేరుకే కామెడీ హీరో కానీ.. రెగ్యులర్‌ కమర్షియల్‌ హీరోలు చేసే రేంజ్‌లో సునీల్‌ డాన్సులు చేస్తారు. అందుకే ఈ సినిమాలో ఆయన ఇంట్రడక్షన్‌ సాంగ్‌ని భారీగానే ప్లాన్‌ చేశారు.
అన్నపూర్ణ స్టూడియోలో స్పెషల్‌ సెట్‌లో ఈ సాంగ్‌ షూటింగ్‌ జరుగుతోంది. ‘లైఫ్‌ అంటే ఆట..’ అంటూ సాగే ఈ పాటకు డాన్స్‌ మాస్టర్‌ భాను కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఆయన చెప్పిన కొత్త స్టెప్పులను సునీల్‌ ట్రై చేస్తున్నారు. ‘‘ఇది పెప్పీ నంబర్‌. సినిమాలో మొదటి సాంగ్‌. చాలా సై్టల్‌గా ఉండటం కోసం సెపరేట్‌ లైటింగ్‌ స్కీమ్‌తో సెట్‌ వేసాం’’ అని ఆర్ట్‌ డైరక్టర్‌ ఏయస్‌ ప్రకాష్‌ చెప్పారు. అన్నట్లు రాంబాబుకి లవర్‌ లేదా? లేకేం. ఉందండి. ఇందులో మియా జార్జ్‌ కథానాయికగా నటిస్తున్నారు. రాంబాబు ఈవిడగారికి ఉంగరం తొడగటానికి చాలా ఫీట్లే చేస్తాడేమో. ఈ సమ్మర్‌లోనే రాంబాబు సందడి చేయడానికి రాబోతున్నాడు.

Saturday, February 18, 2017

హీరోయిన్‌ను కారులో బందీగా చేసి..

  దక్షిణాది హీరోయిన్ భావనను కొందరు దుండగులు కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. శుక్రవారం రాత్రి కేరళలోని కోచిలో ఈ ఘటన జరిగింది. చివరకు ఆమె సురక్షితంగా ఇంటికి చేరుకున్నారు. ఈ కేసులో పోలీసులు భావన కారు డ్రైవర్‌ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
నిన్న కేరళలోని త్రిస్సూర్ నుంచి కోచికి భావన కారులో బయల్దేరింది. కొంతమంది ఓ టెంపులో భావన కారును ఫాలో అయ్యారు. కోచిలోని నెడుంబస్సెరీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్దకు రాగానే భావన కారును టెంపుతో ఢీకొట్టారు. ఆ తర్వాత టెంపులో ఉన్నవారు కారు డ్రైవర్ మార్టిన్‌ను బయటకు లాగి కారులో కూర్చున్నారు. దుండగులు భావనను బందీగా చేసుకుని కారును నగరంలో గంటన్నర పాటు తిప్పారు. ఆ సమయంలో దుండగులు భావన పట్ల అనుచితంగా ప్రవర్తించి ఆమెతో ఫొటోలు, వీడియోలు దిగారు. ఆ తర్వాత పలరివట్లోమ్ జంక్షన్ వద్ద కారును, ఆమెను వదిలి పారిపోయారు. భావన కారును నడుపుకొంటూ దగ్గరలో ఉన్న ఓ నిర్మాత ఇంటికి వెళ్లి విషయం చెప్పింది.

భావన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ ఘటనలో ఆమె కారు డ్రైవర్ మార్టిన్ పాత్ర ఉండొచ్చని భావిస్తున్నారు. భావన వద్ద గతంలో కారు డ్రైవర్‌గా పనిచేసిన సునీల్ కుమార్ ఆమెను కిడ్నాప్ పథకం వేసినట్టు పోలీసులు చెప్పారు. అతనిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని తెలిపారు. తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నాడనే కారణంతో భావన అతన్ని ఉద్యోగం నుంచి తొలగించింది. మార్టిన్‌కు తెలిసే సునీల్ భావనను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించినట్టు పోలీసులు చెప్పారు.

భావన తెలుగులో ఒంటరి, హీరో, మహాత్మా, నిప్పు సినిమాల్లో నటించింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో మొత్తం 70 సినిమాల్లో నటించింది.

Friday, February 17, 2017

రివ్యూ : ఘాజీ


  కథేంటంటే..?: 1971లో ఇండియన్‌ సబ్‌మెరైన్‌ ఎస్‌ 21కీ.. పాకిస్థానీ జలంతర్గామి ఘాజీకీ మధ్య జరిగే నీటి యుద్ధం ఈ కథ. లెఫ్టినెంట్‌ కమాండర్‌ అర్జున్‌ (రానా).. కెప్టెన్‌ రణ్‌ విజయ్‌సింగ్‌ (కె.కె.మీనన్‌)లు అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించి విశాఖపట్నం తీరాన్ని ఎలా కాపాడారు? 18 రోజుల పాటు నీటిలో జరిపిన పోరాటంలో పాక్‌ జలాంతర్గామి ఘాజీని ఎలా మట్టికరిపించారు? అనేదే కథ.
ఎలా ఉందంటే..?: ఇండియా - పాక్‌ యుద్ధమంటే మనందరికీ కార్గిల్‌ యుద్ధం.. లేదంటే అంతకు ముందు జరిగిన కొన్ని యుద్ధాలే తెలుసు. సముద్ర గర్భంలోనూ ఇండియా - పాక్‌లు హోరాహోరీగా తలపడ్డాయని, ఆ యుద్ధంలో భారతీయ సైనికులు ధృఢచిత్తంతో శత్రువుల్ని ఎదుర్కొని విజయం సాధించారన్న చరిత్రకు ‘ఘాజీ’ అద్దం పట్టింది.
ఈ సినిమాలో దాదాపు 90 శాతం సన్నివేశాలు కేవలం సబ్‌మెరైన్‌లోనే తీశారు. కంటికి సబ్‌ మెరైన్‌ తప్ప ఇంకేం కనిపించదు. అయినా సరే.. విసుగు అనిపించదు. తరవాతేం జరుగుతుందన్న ఉత్కంఠ తప్ప. మనదేశం పాకిస్థాన్‌పై విజయం సాధిస్తుందన్న సంగతి తొలి సన్నివేశంలోనే అర్థమైపోతుంది. కానీ ‘ఎలా’ అనే ఆసక్తిని ప్రేక్షకుల్లో కలిగించడంలో దర్శకుడు సఫలీకృతమయ్యాడు. దేశభక్తి నేపథ్యంలో సాగే చిత్రాల్లో.. ప్రేక్షకుల్ని కనెక్ట్‌ చేయడం తప్పనిసరి. అప్పుడే తెరపై ప్రధాన పాత్రలు ఎంత భావోద్వేగంతో రగిలిపోతాయో.. ప్రేక్షకుల్లోనూ అలాంటి స్పందనే కలుగుతుంటుంది. ఈ విషయంలోనూ దర్శకుడు విజయం సాధించాడు. శత్రువుల నుంచి మన సబ్‌మెరైన్‌ని కాపాడుకొనే సందర్భంలో.. ఘాజీని మట్టుపెట్టినప్పుడు ప్రతి ప్రేక్షకుడూ మనసులో ‘జైహింద్‌’ అనుకోకుండా ఉండలేడేమో..?!
 
అతి తక్కువ పాత్రలతో.. ‘యుద్ధం’ అనే ఒకే లైన్‌తో రెండు గంటలు కూర్చోబెట్టడం.. పట్టుసడలని స్క్రీన్‌ప్లేతోనే సాధ్యమైంది. అక్కడక్కడ నేవీకి సంబంధించిన సాంకేతిక పదాలు ప్రేక్షకులకు అర్థం కావు. కానీ.. అవేవీ ఇబ్బందిని కలిగించవు. కథని.. తెరపై ఉన్న వాతావరణాన్నీ అర్థం చేసుకోవడానికి కాస్త సమయం పడుతుంది. ఒక్కసారి వాతావరణం అలవాటైన తర్వాత.. శుభం కార్డు పడేంత వరకూ తెరపై నుంచి చూపు మరల్చకుండా చేయటంలో విజయవంతమైంది చిత్ర బృందం.
ఎవరెలా చేశారంటే..?: ఈ సినిమాలో పాత్రలు తప్ప పాత్రధారులెవ్వరూ కనిపించనట్లుగా ఉంది. రానా ఈ కథని.. ఈ పాత్రనీ ఏరికోరి ఎందుకు చేశాడో సినిమా చూస్తే అర్థమైపోతుంది. కెకె మీనన్‌ పాత్రని ప్రేమిస్తాం. అతను తెరపై ఇంకాసేపు ఉంటే బాగుణ్ణు అనుకొంటాం. తాప్సిని ఎందుకు తీసుకొన్నారో అర్థం కాదు. ఆమె పాత్రకు ఎలాంటి ప్రాధాన్యం లేదు. ఓంపురి.. నాజర్‌లవి చాలా చిన్న పాత్రలు.
కె అందించిన నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్రాణం పోసింది. మనం కూడా నీటిలో ఉన్నామేమో అనే భావన కేవలం నేపథ్య సంగీతంతోనే కలిగించారు. మది కెమెరా పనితనం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. విజువల్‌ ఎఫెక్ట్స్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఉన్న చిత్రమే అయినా... చిన్న సబ్‌మెరైన్‌ సెట్లో.. కెమెరాని పరుగులు పెట్టించాడు. సంకల్ప్‌ ఆలోచన.. అతని స్క్రీన్‌ ప్లే ‘ఘాజీ’ని ఓ మర్చిపోలేని చిత్రంగా మలిచాయి.
 

Wednesday, February 15, 2017

లేడీ గెటప్.. నాకు అన్నం పెట్టింది


సినిమాలపై మోజుతో ఓ యువకుడు ఇంట్లో చెప్పకుండా కృష్ణానగర్‌ వచ్చి అనేక కష్టాలకు ఓర్చి ఓ సినిమా కార్యాలయంలో ఆఫీస్‌ బాయ్‌గా చేరి తన లక్ష్యానికి చేరువయ్యాడు. ఈ ప్రస్థానంలో ఆ యువకుడు లేడీ గెటప్‌తో ఆకట్టుకుంటూ బుల్లితెరపై వెలుగుతున్నాడు. నటనపై మక్కువతో 15 ఏళ్లుగా సినీ పరిశ్రమలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. తనకు అచ్చొచ్చిన ఆడపాత్రలో బుల్లితెరపై నవ్వులు పూయిస్తున్నాడు. అతడే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొత్తూరు గ్రామానికి చెందిన కె.శాంతికుమార్‌. వాస్తవంగా శాంతికుమార్‌ అంటే ఎవరికీ తెలియదు. లేడీ గెటప్‌లో ‘శాంతి స్వరూప్‌’గా మాత్రమే సుపరిచితుడు. తనదైన మేనరిజంతో సందడి చేస్తూ అలరిస్తున్న ఈ బక్కపల్చటి యువకుడు తన అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నాడు. ఆ వివరాలు అతడి మాటల్లోనే.. 
  అర్ధాకలితో అలమటించా..
సినిమా మోజుతో కృష్ణానగర్‌లో మకాం పెట్టి చాలా కష్టాలు ఎదుర్కొన్నా. కొన్ని రోజులు నీళ్లతోతోనే కడుపు నింపుకోవాల్సి వచ్చింది. తర్వాత ఓ సినిమా కార్యాలయంలో రూ.1000 జీతంతో ఆఫీస్‌ బాయ్‌గా పనిచేస్తూ స్టూడియోల చుట్టూ ఒక్కచాన్స్‌ అంటూ తిరిగాను. అన్నపూర్ణ స్టూడియో చుట్టూ తచ్చాడుతున్న నన్ను జబర్దస్త్‌ కమెడియన్స్‌ రాఘవ, రచ్చ రవి చూశారు. నటనపై నాకున్న మక్కువను వారి దృష్టికి తీసుకెళితే.. తమ జట్టులో ఓ అవకాశం ఇచ్చారు. శాంతిగా కామెడీ టైమింగ్‌తో మంచి మార్కులు పడ్డాయి. దాంతో అవకాశాలు వచ్చాయి.
ఇప్పటి వరకూ 80 స్కిట్స్‌..
వచ్చేవన్నీ లేడీ గెటప్‌లే. అయినా సరే.. ఈ శాంతి ఎప్పుడూ నిరుత్సాహపడలేదు. దాదాపు అన్ని చానళ్లలోనూ ఆ గెటప్‌లోనే కనిపిస్తున్నా. మొన్నటి దసరా మహోత్సవం స్కిట్‌లో యాంకర్‌ శ్రీముఖిని అనుసరిస్తూ చేసిన డ్రామా ప్రేక్షకులకు ఆకట్టుకుంది. నా శరీరతత్వం.. లేడీ గెటప్‌లో నా వేషధారణతో అన్ని టీంలవారు ప్రోత్సహిస్తూ వారి స్కిట్‌లో అవకాశం ఇస్తున్నారు. ఒక్కసారి మొహానికి రంగు వేసుకున్నాక.. ఏ నటుడన్నా ఏ పాత్ర వేయడానికైనా సిద్ధంగా ఉంటాడు.. నేనూ అంతే. 
  నా చీరలు బాగుంటాయట.. 
ఇటీవల ప్రైవేట్‌ ప్రోగ్రామ్స్‌ ఇవ్వడానికి వెళుతున్నా. అక్కడ నన్ను చూసిన చాలామంది మగవాళ్లే మీ చీరలు బాగుంటాయని కితాబిస్తున్నారు. నా భార్యకు కూడా చీరల సెలక్షన్‌లో ఇంత ప్రావీణ్యం లేదంటూ వాళ్ల ముందే నన్ను పొగుడుతుంటారు. అది  నాకు చాలా సంతోసంగా ఉంటుంది.
ఆడీ లేదు.. ఆనందం ఉంది
నాకు ఆడీ కారుందని, పెద్ద ఇల్లు ఉందని ఇటీవల సోషల్‌ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. అవన్నీ నిజం కాదు.. ఆఫీస్‌ బాయ్‌గా పనిచేస్తున్నప్పుడు పైసాపైసా దాచుకుని ఓ స్కూటీ కొనుకున్నా. నాకున్నది అదొక్కటే. ఆడి కారు లేదు కానీ నా కష్టాలు మరిచిపోయేలా రెండు పూటలా తిండికి, ఇంటి అద్దె చెల్లించే స్తోమత మాత్రం జబర్దస్త్‌ ఇచ్చింది. 

Tuesday, February 14, 2017

‘సింగం-4’ చేస్తా: సూర్య

 సూర్య కథానాయకుడిగా ‘సింగం’ సిరీస్‌లో వచ్చిన చిత్రం ‘ఎస్‌3’. అనుష్క, శ్రుతిహాసన్‌ కథానాయికలు. హరి దర్శకుడు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. మంగళవారం హైదరాబాద్‌లో చిత్ర విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ.. ‘ఈ సినిమా నాకు చాలా స్పెషల్‌. ఎందుకంటే విడుదల తేదీ ఇప్పటికే చాలా సార్లు మారింది. సినిమా ఎప్పుడు విడుదలవుతుందనేది మన చేతుల్లో లేదు. నేను చాలా కంగారు పడ్డాను. కానీ ప్రేక్షకుల చిత్రాన్ని ఆదరించారు. దక్షిణాదిన ఏటా సుమారు వెయ్యికు పైగా సినిమాలు విడుదలవుతుంటాయి. అందులో ఏడు శాతం మాత్రమే విజయం సాధిస్తుంటాయి. అందుకే ప్రతి నటుడికీ హిట్‌ అనేది ప్రత్యేకం. మా నాన్నగారు నన్ను ఆలింగనం చేసుకొని అభినందించటం చాలా అరుదైన విషయం. అలాంటిది ఆయన ఈ సినిమా చూసి నన్ను ప్రేమగా ఆలింగనం చేసుకున్నారు. అంతకంటే సంతోషకరమైన విషయం ఇంకేముంటుంది. అందుకే దర్శకుడు హరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈ సినిమా కోసం ఆయన చాలా కష్టపడ్డారు. ఆయనతో మరో సినిమా చేస్తాను. సింగం సిరీస్‌ను కొనసాగించే అవకాశాలూ ఉన్నాయి. అన్నీ కుదిరితే ‘సింగం 4’తో వస్తాం. కానీ దానికి ఐదారేళ్లు పట్టొచ్చు.’ అన్నారు.
దర్శకుడు హరి మాట్లాడుతూ.. ‘గతంలో వచ్చిన ‘సింగం’ చిత్రాలలాగానే దీనికి కూడా చాలా కష్టపడినట్లు తెలిపారు. తనకు ఎన్టీఆర్‌ నటించిన ‘టెంపర్‌’ చిత్ర‌మంటే ఎంతో ఇష్టమని అన్నారు. ఆయనతో కలిసి ఓ పవర్‌ఫుల్‌ చిత్రాన్ని చేయాలనుకొంటున్నట్లు వెల్లడించారు.

Monday, February 13, 2017

రేపు తేలనున్న శశికళ రాజకీయ భవితవ్యం!

  అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ రాజకీయ భవితవ్యం మంగళవారం తేలనుంది. శశికళపై ఉన్న ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీం కోర్టు రేపు తీర్పు వెలువరించే అవకాశం ఉంది. ఈ కేసులో శశికళ నిర్దోషిగా తేలితే ముఖ్యమంత్రి కావడానికి న్యాయపరమైన చిక్కులు ఉండవు. ఒకవేళ శశికళకు శిక్షపడితే ముఖ్యమంత్రి కావాలన్న ఆశలు ఆవిరైనట్టే. ఆమె జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. మరో ఆరేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హురాలవుతారు.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దివంగత జయలలితతో పాటు ఆమె నెచ్చెలి శశికళ కూడా నిందితురాలిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో జయలలిత, శశికళను కర్ణాటకలోని దిగువ కోర్టు దోషులుగా ప్రకటించింది. దీంతో జయలలిత అప్పట్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. వీరిద్దరూ కొన్ని రోజులు జైల్లో గడిపారు. తర్వాత ఈ తీర్పును సవాల్‌ చేస్తూ జయలలిత  కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. కిందికోర్టు తీర్పును హైకోర్టు కొట్టేయడంతో జయలలిత మళ్లీ సీఎం అయ్యారు. కాగా హైకోర్టు తీర్పును కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. ఈ కేసును విచారించిన సుప్రీం కోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది. ఈ నేపథ్యంలో రేపు సుప్రీం కోర్టు వెలువరించే తీర్పుపై తమిళనాట ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Saturday, February 11, 2017

ఒక్క సినిమాలో 29 పాటలు

 ప్రస్తుతం సినిమా స్టైల్, ఆడియన్స్ టేస్ట్ పూర్తిగా మారిపోయింది. గతంలోలా ఆరుపాటలు, ఐదు ఫైట్లు అన్న కాన్సెప్ట్ మారిపోయింది. అవసరం ఉంటేనే సినిమాల్లో పాటలు పెడుతున్నారు. అది కూడా మూడు నిమిషాలకే ముగించేస్తున్నారు. కానీ ఇలాంటి సమయంలో కూడా పాటల పందిరి లాంటి సినిమా ఒకటి ప్రేక్షకుల ముందుకు రానుంది.
కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదరుచూస్తున్న బాలీవుడ్ యువ నటుడు రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా జగ్గా జాసూస్. రణబీర సరసన కత్రినాకైఫ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఏకంగా 29 పాటలున్నాయట. గతంలో 'హమ్ ఆప్ కే హై కౌన్' సినిమాలో 14 పాటలుండగా ఆ రికార్డ్ ను బ్రేక్ చేసి జగ్గా జాసూస్ లో 29 పాటలు పెట్టారు మేకర్స్. ఈ సినిమాకు ప్రీతమ్ సంగీతం అందిస్తున్నాడు.

Friday, February 10, 2017

ఓం నమో వేంకటేశాయ


మర్షియల్‌ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తూ వచ్చిన కె.రాఘవేంద్రరావు తనలోని మరో కోణాన్ని చూపిస్తూ భక్తి ప్రధానమైన చిత్రాల్ని తెరకెక్కిస్తున్నారు. వాటిలోనూ తనదైన మార్క్‌ని చూపిస్తూ ఆబాల గోపాలాన్ని అలరిస్తున్నారు. అందులో భాగంగా రూపుదిద్దుకొన్న చిత్రమే ‘ఓం నమో వేంకటేశాయ’. ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’, ‘శిరిడిసాయి’ చిత్రాల తర్వాత రాఘవేంద్రరావు-నాగార్జున కలయికలో వస్తున్న చిత్రమిది. వేంకటేశ్వరస్వామికి పరమ భక్తుడైన హథీరాం బాబాజీ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాను తీస్తే రాఘవేంద్రరావే తీయాలి.. చేస్తే నాగార్జునే చేయాలి అన్నట్టుగా ఆ ఇద్దరూ భక్తి ప్రధానమైన చిత్రాలపై ఓ ప్రత్యేకమైన ముద్రవేశారు. అందుకే ‘ఓం నమో వేంకటేశాయ’కి కొబ్బరికాయ కొట్టినప్పటి నుంచే అంచనాలు షురూ అయ్యాయి. మరి ఆ మేజిక్‌ మరోసారి తెరపై కనిపించిందా? శ్రీవారి భక్తుడు ‘అన్నమయ్య’గా ఒదిగిపోయిన నాగార్జున, హథీరాం బాబాగా ఎలా నటించాడు.. లాంటి ప్రశ్నలకు సమాధానాలు..
కథేంటంటే?: దేవుడిని చూసే విద్య నేర్చుకోవాలంటూ బాల్యంలోనే ఇంటి నుంచి బయటకొస్తాడు రామ(నాగార్జున). వేద పాఠశాలలో విద్యనభ్యసిస్తూ గురువు(సాయికుమార్‌) చెప్పిన మాటతో తపస్సుకు పూనుకుంటాడు. ఆ తర్వాత తిరుమల చేరతాడు. కానీ స్వామి దర్శనం మాత్రం కాదు. దేవుడ్నే చూడాలంటూ అన్న, పానీయాలు లేకుండా అయిదురోజుల పాటు గుడిముందే కూర్చుంటాడు. స్వామికోసమే ఈ జీవితం అంటూ సదా ఆయన ఆరాధనలో మునిగి తేలుతుంటాడు. అలాంటి పరమ భక్తుడికి స్వామి దర్శన భాగ్యం కలిగిందా? లేదా? తిరుమలలో ఆలయ అధికారి గోవిందరాజులు(రావు రమేష్‌) రామపై ఎందుకు కక్ష కట్టాడు? రామను పరీక్షించేందుకు స్వామి ఏం చేశాడు? ఆ ప్రయత్నంలో రామ జీవితంలో ఎదురైన అనుభవాలు ఎలాంటివి? ఆయన్ని మనువాడాలనుకొన్న భవానీ (ప్రగ్యాజైస్వాల్‌) కథేంటి? రామ కోసం ఆమె చేసిన త్యాగం ఎలాంటిది? శ్రీవారికి మరో భక్తురాలైన కృష్ణమ్మ(అనుష్క)కి రామకి మధ్య సంబంధం ఏమిటి? రామ.. హథీరాం బాబాగా ఎలా మారాడు? తదితర విషయాల్ని తెలుసుకోవాలంటే వెండితెరపై సినిమా చూడాల్సిందే.

  ఎలా ఉందంటే: భక్తికున్న శక్తితో వేంకటేశ్వరస్వామిని మురిపించిన మరో పరమ భక్తుడు హథీరాం బాబా కథ ఇది. బాల్యంలోనే స్వామిని ప్రత్యక్షంగా చూడాలంటూ బయటకొచ్చిన హథీరాం తిరుమలను కలియుగ వైకుంఠంగా మార్చడంలో కృషి ఎలాంటిది? స్వామి వారి చేతుల మీదుగానే సజీవ సమాధి ఎలా అయ్యాడు? తదితర విషయాలతో ఈ చిత్రం సాగుతుంది. వేంకటాచల స్థలపురాణం, హథీరాంబాబా, కృష్ణమ్మల భక్తి నేపథ్యంలో తొలిసగ భాగం సాగుతుంది. భక్తులపై జరుగుతున్న దోపిడీని అడ్డుకుంటూ తిరుమలను పరమ పవిత్రంగా ఉంచేందుకు హథీరాం బాబా ప్రయత్నించడం, స్వామి భక్తులకు పుణ్య క్షేత్రం విశిష్టతను చాటిచెప్పడం తదితర సన్నివేశాలతో చిత్రం సాగుతుంది. అధికారి గోవిందరాజులు, ఆయన బృందం చేసే అరాచకాలను అడ్డుకుంటూ హథీరాం బాబా స్వామి సేవలో పునీతమయ్యే తీరును తెరపై కళ్లకు కట్టారు.
ఎవరెలా: ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’లా భక్తుల పాత్రలో ఒదిగిపోయిన నాగార్జున హథీరాం బాబాగా నటించి ఆ పాత్రకు పూర్తి న్యాయం చేశారు. సౌరభ్‌జైన్‌ వేంకటేశ్వరుడిగా చక్కగా నటించాడు. కృష్ణమ్మగా అనుష్క పాత్ర చాలా కీలకం. పతాక సన్నివేశాల వరకూ ఆమె తెరపై కనిపిస్తూనే ఉంటుంది. వేంకటేశ్వరస్వామి భక్తురాలిగా పవిత్రత ఉట్టిపడేలా తెరపై కన్పించింది. నాగార్జున కూడా పాత్రలో లీనమై నటించారు. పతాక సన్నివేశాల్లో ఆయన నటన మరోస్థాయికి చేరిందనే చెప్పాలి. జగపతిబాబు, ప్రగ్యాజైస్వాల్‌లాంటి నటులు తెరపై కనిపించేది కాసేపే అయినా ప్రేక్షకులకు గుర్తుండిపోతారు. రావురమేష్‌, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్‌ తదితర పాత్రలు వినోదాన్ని పంచుతాయి.
సాంకేతికంగా ఈ సినిమా చాలా బాగుంది. ఎస్‌.గోపాల్‌రెడ్డి కెమెరా పనితనం ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేస్తుంది. ముఖ్యంగా శేషగిరులను చూపించిన విధానం, ప్రతీ సన్నివేశం వర్ణ రంజితంగా ఉంటుంది. కీరవాణి సంగీతం కథకు ప్రాణం పోసింది. చాలా వరకూ కథ పాటల రూపంలోనే చెప్పారు. ఆ సమయంలో కీరవాణి అందించిన స్వరాలు కీలక పాత్ర పోషించాయి. నేపథ్య సంగీతం కథను మరింత గుండెకు హత్తుకునేలా మార్చింది. కిరణ్‌కుమార్‌ కళా ప్రతిభ అడుగడుగునా కనిపిస్తుంది. దర్శకుడిగా కె.రాఘవేంద్రరావు మరోసారి తనదైన మేజిక్‌ను ప్రదర్శించారు. నాగార్జున-ప్రగ్యాజైస్వాల్‌, జగపతిబాబు-అనుష్కలపై తెరకెక్కించిన సన్నివేశాలు భక్తిరస చిత్రంలోనూ కె. రాఘవేంద్రరావు మార్కు కమర్షియల్‌ ఛాయలు స్పష్టంగా కనిపించేలా చేస్తాయి. మిగిలిన చోట్ల కూడా పండ్లు, దీపాలు, పుష్పాలతో తెరను వర్ణ శోభితం చేశారు. కథను చెప్పిన విధానం కూడా చాలా బాగుంది. హథీరాం, కృష్ణమ్మల జీవితాలతో పాటు ఆలయ స్థలపురాణం, వరాహమూర్తి దర్శనం, స్వామివారికి చేసే సేవల విశిష్టతలను సినిమాలో చూపించిన విధానం తెలియని వారికి ఎన్నో విషయాలను తెలియజేస్తుంది.
 
 

Thursday, February 9, 2017

రివ్యూ: ఎస్‌3 (యముడు 3)


కథేంటంటే?: సింగం సిరీస్‌ తొలి భాగం ‘సింగం’ పల్లెటూరి నేపథ్యంలో సినిమా సాగుతుంది. తర్వాత భాగం ‘సింగం 2’ సింగం (సూర్య) పట్టణానికి వస్తాడు. మూడో భాగం ‘సింగం 3’లో పట్టణం నుంచి ఆస్ట్రేలియా వెళ్తాడు. ఒక పోలీసు కమిషనర్‌ హత్యకు సంబంధించిన విచారణ చుట్టూ సాగే కథ ఇది. నిజాయతీ గల పోలీసు అధికారి సిడ్నీలో ఇండియన్‌ పోలీసు పవర్‌ ఎలా చూపించాడన్నది కథ. కథలో కావ్య (అనుష్క).. విద్య (శ్రుతిహాసన్‌)ల మధ్య ఉన్న సంబంధం ఏంటి అన్నది కూడా ఆసక్తికరంగా ఉంటుంది.
ఎలా ఉందంటే?: ఈ సినిమా కేవలం యాక్షన్‌ ప్రియుల్ని దృష్టిలో ఉంచుకునే తీర్చిదిద్దారు దర్శకుడు హరి. అందుకు సంబంధించిన సన్నివేశాలు మాస్‌ను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. సూర్య పవర్‌ఫుల్‌ డైలాగ్‌లు.. మేనరిజం.. ఫైట్లపై దర్శకుడు దృష్టి పెట్టారు. తొలి భాగం నిదానంగా సాగుతుంది. అనవసరంగా ఇరికించిన కామెడీ సన్నివేశాలు కాస్త ఇబ్బంది పెడతాయి. అనుష్క.. సూర్యల మధ్య నడిపించిన ట్రాక్‌ కూడా కథలో ఇమడనట్లుగా ఉందనిపిస్తుంది.
విశ్రాంతికి 20 నిమిషాల ముందు నుంచి థ్రిల్‌ కలిగించే సన్నివేశాలు మొదలవుతాయి. దాంతో ప్రేక్షకుడికి ఆసక్తి మొదలవుతుంది. ఆ నేపథ్యంలో వచ్చే పోరాట ఘట్టాలు అలరిస్తాయి. ద్వితీయార్ధం ప్రారంభంలో సన్నివేశాల్ని పరుగులు పెట్టించాడు దర్శకుడు. సిడ్నీ నేపథ్యంలో సాగిన యాక్షన్‌ ఘట్టాలు ఆకట్టుకుంటాయి. ఛేజింగ్‌లు.. సూర్య చేసిన ఫైట్లు.. పోలీసు పవర్‌ను చూపించిన డైలాగ్‌లు ఇవన్నీ కలిసి ఓ యాక్షన్‌ ప్యాకేజీలా దర్శకుడు చూపించాడు.
 ఆస్ట్రేలియాలో జరిగే సన్నివేశాలు సినిమా స్థాయిని పెంచేలా ఉన్నాయి. మొత్తంగా చూస్తే ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం పట్టుగా సాగింది. కాకపోతే దర్శకుడు తొలి రెండు భాగాల్లో చూపించిన చాకచక్యం ఈ సినిమాలో చూపించలేకపోయాడు. కథ బలహీనంగా ఉండటం.. హీరో పాత్రపై తప్ప మరే పాత్రపైనా దృష్టి పెట్టకపోవడం నిరాశకు గురి చేస్తాయి. ‘వైఫై..’ పాట కోసం మాత్రమే శ్రుతిహాసన్‌ను తీసుకున్నారా.. అనిపిస్తుంది. పతాక సన్నివేశాలు మామూలుగా సాగాయి.
 
ఎవరెలా చేశారంటే: సూర్య కోసమే ఈ సినిమా తీశారా.. అనేలా ఉంది. మరోసారి శక్తిమంతమైన పోలీసు పాత్రలో సూర్య రాణించారు. సూర్య గెటప్‌.. తను చేసిన పోరాట దృశ్యాలు ఆకట్టుకుంటాయి. అనుష్క మరీ లావుగా కనిపించింది. ఈ విషయంలో తాను జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఆమె పాత్రకు అంత ప్రాముఖ్యత లేదు. శ్రుతిహాసన్‌ది కేవలం గ్లామర్‌ పాత్ర మాత్రమే. విలన్‌ పాత్రల్ని పోషించిన వారిని దర్శకుడు స్టైలిష్‌గా చూపించాడు. రాధిక నటన ఆకట్టుకుంటుంది.
చివరగా.. యాక్షన్‌ ప్రియులకు ‘ఎస్‌’3 

Tuesday, February 7, 2017

‘నేను లోకల్‌’


వ‌రుస విజ‌యాల‌తో దూసుకెళుతున్నాడు నాని. భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, కృష్ణగాడివీర ప్రేమ‌గాథ‌, జెంటిల్‌మ‌న్‌, మజ్ను... ఇలా ఆయ‌న జోరు కొన‌సాగుతూఉంది. ప‌లువురు స్టార్ ద‌ర్శ‌కులు నానితో క‌లిసి ప‌నిచేయ‌డానికి ఉత్సాహం చూపించినా ఆయ‌న మాత్రం మ‌ళ్లీ త‌న‌దైన శైలిలోనే కంటెంట్‌కి ప్రాధాన్య‌మిస్తూ నేను లోక‌ల్‌` చేశాడు. వ‌రుస విజ‌యాల నాని.. దిల్‌రాజు నిర్మాణ సంస్థ‌... దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం... ఇలా విడుద‌ల‌కి ముందే ప్రేక్ష‌కుల్ని ఆక‌ర్షిస్తూ అంచ‌నాల్ని పెంచిందీ చిత్రం. మ‌రి సినిమా అంచ‌నాల‌కి త‌గ్గ‌ట్టుగానే ఉందా? నాని విజ‌యాల జోరు కొన‌సాగిన‌ట్టేనా? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటేరివ్యూలోకి వెళ్లాల్సిందే...
కథేంటి: ఇంజినీరింగ్‌ పూర్తి చేసి, సరదా సరదాగా తిరిగే కుర్రాడు బాబు(నాని). తనలాగే తాను జీవించాలనే భావాలున్న వ్యక్తి. ఎవరికోసం తనని తాను మార్చుకోడు. కీర్తి(కీర్తిసురేష్‌)ని తొలిసారి చూడగానే మనసు పారేసుకుంటాడు. తన ప్రేమ విషయం చెబితే అందుకు కీర్తి నో చెబుతుంది. ‘నువ్వు ప్రేమించే వరకూ విసిగిస్తా’నని బాబు ఆమె వెంటపడుతుంటాడు. ఈ క్రమంలో అతని మనసును తెలుసుకున్న కీర్తి ప్రేమలో పడుతుంది. ఆ విషయం రేపు ‘మనం కలుసుకున్నప్పుడు’ చెబుతానని బాబుతో అంటుంది. ఈ నేపథ్యంలో కీర్తి కిడ్నాప్‌నకు గురవుతుంది. ఈ విషయం తెలుసుకున్న బాబు ఆమెను రక్షించేందుకు వెళ్లగా, అక్కడ అప్పటికే పోలీస్‌ అధికారి సిద్ధార్థ వర్మ (నవీన్‌ చంద్ర) రౌడీలను చితకబాదుతాడు. కీర్తిని నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నానని, ఆమె జోలికి ఎవరైనా వస్తే చంపేస్తానంటూ వార్నింగ్‌ ఇస్తాడు. అప్పుడే అక్కడకు వచ్చిన బాబు రియాక్షన్‌ ఏంటి? బాబు, కీర్తిల ప్రేమ కథ సుఖాంతం అయిందా? పోలీస్‌ అధికారి సిద్ధార్థ వర్మ కథ ఏమిటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
 ఎలా ఉందంటే?: నాని సినిమా అంటే కుటుంబం మొత్తం హాయిగా చూసే సినిమా అని ఓ మార్కు ఉంది. ఈసారి కూడా అదే ట్రాక్‌లో నడిచాడు నాని. ప్రథమార్ధం నాని-కీర్తి సురేష్‌ల మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలతో సరదా సరదాగా గడిచిపోతుంది. ఇక నాని తల్లిదండ్రుల పాత్రలను పోసాని కృష్ణమురళి, ఈశ్వరిరావు పోషించారు. ఈ ముగ్గురి మధ్య వచ్చే సన్నివేశాలూ కడుపుబ్బా నవ్విస్తాయి. కీర్తి సురేష్‌ తన అందాలతో మరోసారి అలరించింది. సిద్ధార్థ వర్మ పాత్ర ప్రవేశంతో సరదాగా సాగే కథ ఓ కీలక మలుపు తీసుకుంటుంది. విరామానంతరం వచ్చే సన్నివేశాలు అన్నీ సిదార్థ వర్మ, బాబు నేపథ్యంలో సాగుతాయి. కీర్తిని ప్రేమించిన ఇద్దరూ వాళ్ల మనసుల్లో ప్రేమను ఎలా బయట పెట్టారు? కీర్తి ఎవరిపై ఎలా మొగ్గు చూపుతుంది అనే విషయాలు ఆకట్టుకునేలా సాగిపోతాయి. అయితే ఎవరి ప్రేమలో ఎంత బలముందో నిరూపించాల్సిన సమయంలో సిద్థార్థ వర్మ ప్రయత్నాలు పెద్ద ఎత్తున సాగగా, బాబు ‘నేనేం చేయను’ అంటూ చెప్పే సన్నివేశాలు సాగతీతగా అనిపిస్తాయి. కథ ఎంతకీ ముందుకు సాగకపోవడంతో ప్రేక్షకుడిని ఒకింత అసహనానికి గురిచేస్తాయి. మళ్లీ పతాక సన్నివేశాల రాకతో కథ ఆసక్తికరంగా మారుతుంది. ద్వితీయార్ధం నుంచి ముక్కోణపు ప్రేమ కథలా ఒక అమ్మాయి.. ఇద్దరు అబ్బాయిల మధ్య సాగేపోయేలా సన్నివేశాలు ఉన్నాయి. చివరిలో కూడా ఓ కీలకమైన మలుపు ఉండటంతో కథ రక్తి కట్టిస్తుంది. కథ కొత్తది కాకపోయినా కథనంతో ఆకట్టుకునే ప్రయత్నం తెరపై కనిపిస్తుంది.

ఎవరెలా చేశారంటే: నాని తన నటనతో వన్‌మ్యాన్‌ షోలా ఆకట్టుకున్నాడు. సంభాషణలు పలికే సమయంలో తనకున్న ఈజీనెస్‌ను మరోసారి ప్రదర్శించాడు. ప్రతీ సన్నివేశంలోనూ సంభాషణలు పలికే విధానంలోనూ రజనీకాంత్‌ను అనుసరించినట్టు స్పష్టంగా అర్థమవుతుంటుంది. ఇదో ప్రేమ కథ అయినా మాస్‌ అంశాలు ఉండటంతో నాని రజనీని అనుసరించే ప్రయత్నం చేశాడు. కీర్తి అందంగా కన్పించింది. ఆమెకు నటనా ప్రాధాన్యం ఉన్న పాత్ర లభించింది. సిద్ధార్థ వర్మగా నవీన్‌చంద్ర ద్వితీయార్థంలో కనిపిస్తాడు. అతనికీ మంచి పాత్రే దక్కింది. సాంకేతికంగా మంచి మార్కులు పడతాయి. ప్రసన్నకుమార్‌ మాటలు, త్రినాథరావు దర్శకత్వం వారి వారి శైలిలో సాగుతాయి. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణ తీసుకొచ్చింది. పాటలన్నీ అలరిస్తాయి. ‘దిల్‌’రాజు నిర్మాణ విలువలు అడుగడుగునా కనిపిస్తాయి.
చివరిగా: ‘లోకల్‌’ కుర్రాడి ప్రేమకథ  

Monday, February 6, 2017

అలాంటి సాహసాలు చేయను

దొరికిన పాత్రలతోనే చాలామంది సంతృప్తిపడిపోతారు. కానీ దానికి మించి ఏదో చేయాలని ఇంకొంతమంది చూస్తుంటారు. నా దారి మాత్రం దానికి భిన్నమ’’ంటోంది రకుల్‌ప్రీత్‌ సింగ్‌. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ నుంచీ ఆమె కెరీర్‌ ఎక్స్‌ప్రెస్‌ వేగంతోనే దూసుకుపోతోంది. ఎప్పుడూ తన చేతిలో నాలుగు సినిమాలైనా ఉండేట్టు చూసుకొంటోంది రకుల్‌. అటు మహేష్‌బాబు, రామ్‌చరణ్‌లాంటి స్టార్‌ కథానాయకులతో నటిస్తూనే ఇటు... యువతరం కథానాయకులతోనూ జోడీ కడుతోంది. ఓ పాత్రని ఎంచుకొనేటప్పుడు మీ ఆలోచనలెలా ఉంటాయి? అని అడిగితే ‘‘కెరీర్‌ కొత్తలో నాకొచ్చిన పాత్రల్నే చేసేదాన్ని. అప్పుడు మరో ప్రత్యామ్నాయం ఉండేది కాదు. ఇప్పుడు రొటీన్‌ పాత్రలే వస్తున్నా.. అందులోనూ నా మార్క్‌ ఎలా చూపించాలని ఆలోచిస్తున్నా. నాకోసం కొత్త పాత్రలు సృష్టించండి అని చెప్పే ధైర్యం చేయలేను. ఎందుకంటే ప్రయోగాలు ఎల్లవేళలా విజయాన్ని అందివ్వకపోవొచ్చు. నాలో నటిని సంతృప్తి పరచుకోవడానికి సినిమాలతో ప్రయోగాలు చేసే సాహసాలు చేయను’’అని చెప్పింది రకుల్‌

Sunday, February 5, 2017

బాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకుంటా

 ఇప్పుడిప్పుడే టాలీవుడ్‌లో నటిగా ఎదుగుతోంది రెజీనా. తెలుగుతో పాటు తమిళంలోనూ వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ నటి.. త్వరలోనే బాలీవుడ్‌లో అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి ఓ చిత్రంలో నటించేందుకు సిద్ధమవుతోంది. దీనిపై స్పందిస్తూ బిగ్‌బితో నటించేందుకు ఆతృతగా ఉన్నానంటోంది రెజీనా.
అమితాబ్‌బచ్చన్‌.. అక్షయ్‌కుమార్‌ ప్రధానపాత్రలో 2002లో వచ్చిన ‘ఆంఖేన్‌’ బాక్సాఫీసు వద్ద హిట్‌ సాధించింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘ఆంఖేన్‌-2’ వస్తోంది. ఇందులో నటించడంపై మాట్లాడిన రెజీనా.. ‘‘ అమితాబ్‌బచ్చన్‌తో నటించడానికి భయపడటం లేదు. సినీ ఇండస్ట్రీలో సీనియర్‌ నటుల నుంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చు. అందుకే ఈ సినిమాలో నటించేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నా. కాకపోతే ఇక్కడ ఇదే నా మొదటి చిత్రం కాబట్టి అందరి దృష్టి నాపై ఉంటుంది. వారంతా నా నటనపై దృష్టిపెడతారు.. కాబట్టి వారిని మెప్పించగలగాలి. ఇక్కడ నాకంటూ గుర్తింపు తెచ్చుకోగలగాలి. ఆ విషయంలోనే కొద్దిగా భయంగా ఉంది.’’ అని చెప్పుకొచ్చింది.

Saturday, February 4, 2017

ముద్దు కోసం 19 టేకులు

 ‘బర్మా’, ‘జాక్సన్‌ దురై’ ఫేమ్‌ ధరణిధరన్‌ దర్శకత్వంలో తాజాగా తెరకెక్కుతున్న చిత్రం ‘రాజా రంగుస్కి’. ‘మెట్రో’ ఫేమ్‌ హిరీష్‌, ‘విల్‌ అంబు’ నాయిక శాంథిని జంటగా నటిస్తున్నారు. శక్తివాసన్‌, బర్మా టాకీస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి యువన్‌ శంకర్‌రాజా సంగీతం సమకూరుస్తున్నారు. ఇటీవలే తొలిషెడ్యూల్‌ చిత్రీకరణను పూర్తి చేశారు. సోమవారం నుంచి రెండో షెడ్యూల్‌ చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఇందుకోసం తరమణిలో ప్రత్యేక సెట్‌ను సిద్ధం చేశారు. సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ మేం అనుకున్నదానికన్నా సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. 50 శాతం పైచిలుకు చిత్రీకరణ పూర్తయింది. ఇదేవేగంతోనే సినిమా చిత్రీకరణ పూర్తవుతుందని భావిస్తున్నాం. కథా నాయకుడు హిరీష్‌ తన పాత్రను అద్భుతంగా పోషిస్తున్నారు. ప్రేమ సన్నివేశాల్లో కూడా మేం ఆశించినట్లుగానే నటించారు. కానీ కథానాయికకు ముద్దుపెట్టే సన్నివేశంలో మాత్రం ఆయన చాలా ఇబ్బందికరంగా నటించారు. కానీ మేం అనుకున్నట్లుగా రాలేదు. అందువల్ల ముద్దు సన్నివేశానికి ఏకంగా 19 టేకులు తీసుకున్నారు. ఇతర సన్నివేశాలకు సంబంధించిన పనులన్నీ సిద్ధమయ్యాయి. రెండో షెడ్యూల్‌ కోసం వేచి చూస్తున్నామన్నారు.

Friday, February 3, 2017

'నేను ఐపీఎల్ కు రావడం లేదు'

 ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో తాను పాల్గొనాలని అనుకోవడం లేదని ఇంగ్లండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ స్పష్టం చేశాడు. ప్రస్తుతం తన క్రికెట్ షెడ్యూల్ బిజీగా ఉండటంతో, ఐపీఎల్ కు దూరంగా ఉండనున్నట్లు పేర్కొన్నాడు. గతేడాది రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ తరపున ఆడిన పీటర్సన్.. ఆ ఏడాది నాలుగు మ్యాచ్ లు ఆడిన తరువాత గాయం కారణంగా దూరమయ్యాడు. అయితే గత డిసెంబర్ లో పీటర్సన్ ను పుణె సూపర్ జెయింట్స్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్లో ఆడాలంటే  ఫిబ్రవరి నెలాఖరున జరిగే వేలంలో ఏదొక ప్రాంఛైజీ పీటర్సన్ ను కొనుగోలు చేయాల్సి ఉంది. కాగా,   తాను ఐపీఎల్ కు సిద్ధంగా లేనని పీటర్సన్ ముందుగానే ఓ ప్రకటన విడుదల చేశాడు.
'ఐపీఎల్ వేలానికి నేను రావాలని అనుకోవడం లేదు. ఈ శీతాకాలపు సీజన్ లో అనేక మ్యాచ్ లతో బిజీగా ఉన్నా. ఒకవైపు ప్రయాణాలు, మరొకవైపు మ్యాచ్ లతో తీరిక లేకుండా ఉన్నా. దాంతో వచ్చే వేసవిలో ప్రయాణాలకు దూరంగా ఉండి విశ్రాంతి తీసుకుంటా' అని పీటర్సన్ తెలిపాడు.

Wednesday, February 1, 2017

ఎక్స్‌ట్రాలెందుకు? కాజోల్‌కు కూతురు కౌంటర్‌

  ప్రముఖ బాలీవుడ్‌ నటి కాజోల్‌పై ఆమె కూతురు కౌంటర్లు వేస్తోంది. సోషల్‌ మీడియా ఇన్‌ స్టాగ్రమ్‌లో వివిధ హావభావాలతో కూడిన ఫొటోను కాజోల్‌ పెట్టినందుకు తన 13 ఏళ్ల కూతురు నిసా కామెంట్‌ చేసింది. ‘మామ్‌.. ఎందుకు నువ్వు చాలా ఎక్స్‌ట్రాలు చేస్తున్నావు? అంటూ తన ఫొటోకు కామెంట్‌పెట్టి కాజోల్‌ను అవాక్కయ్యేలా చేసింది. అయితే, నిసా ఇలా చేయడం ఇదేం తొలిసారి కాదు. గతంలో కూడా ఇలాంటి షాకింగ్‌ వ్యాఖ్యలు తల్లి ఫొటోకు ప్రతిస్పందనగా పెట్టింది. కాజోల్‌ (42), అజయ్‌ దేవగన్‌ (47) 1999లో వివాహం చేసుకున్నారు. వారికి నిసా(13), యుగ్ అనే ఆరేళ్ల బాబు ఉన్నారు.
నిసా తల్లితో చాలా చనువుగా ఉంటుంది. ఈ మధ్య తన ఇద్దరు పిల్లలను చూస్తు సంబరాల్లో మునిగిన సమయంలో తన మొఖంలో ఏర్పడిన హావభావాలతో కూడిన ఫొటోను ఇన్‌ స్టాగ్రమ్‌లో పెట్టింది. అందులో ట్యాగ్‌లైన్‌గా నా పిల్లలను జతగా చూసినప్పుడు.. అంటూ పెట్టింది. దీనికే పై విధంగా నిసా బదులిచ్చింది. గతంలో కాజల్‌ దివాళీ పండుగకు సంబంధించిన తన ఫొటో ఒకటి పెట్టినప్పుడు కూడా నిసా ఇలాగే స్పందించి ‘ఇదేం ఫొటో.. నాకు చాలా బ్యాడ్‌గా అనిపిస్తోంది’ అంటూ కామెంట్ పెట్టి అందరినీ ఆకర్షించింది. అయితే, తల్లికూతుర్ల మధ్య చనువుకొద్దే తనలా స్వేచ్ఛగా వ్యాఖ్యలు చేయగలుగుతుందని ఆమె మురిసిపోతుందట.