Thursday, April 14, 2011

హైదరాబాద్‌ తొలి విజయం

ఐపీఎల్‌-4లో డెక్కన్‌ ఛార్జర్స్‌ తొలి విజయం సాధించింది. ఇప్పటి వరకు జరిగిన మూడు మ్యాచ్‌లో డెక్కన్‌ ఛార్జర్స్‌ ఈ రోజు తొలి విజయం సాధించింది. గురువారం నాడు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు, డెక్కన్‌ ఛార్జర్స్‌ల మధ్య జరిగినా మ్యాచ్‌లో డెక్కన్‌ ఛార్జర్స్‌ 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్‌ గెలిచిన బెంగుళూరు జట్టు డెక్కన్‌ ఛార్జర్స్‌కు బ్యాటింగ్‌ ఆహ్వానించింది. డెక్కన్‌ ఛార్జర్స్‌ 20 ఓవర్లలో 175 పరుగులు చేసింది. చిప్లి అర్థసెంచరీ చేసి టాప్‌ స్కోరుగా నిలిచాడు. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగుళూరు జట్టు కేవలం 142 పరుగులు చేసింది. కోహ్లీ 71 పరుగులు చేసి టాప్‌ స్కోరుగా నిలిచాడు.

సినీనటుడు అంకుశం రామిరెడ్డి కన్నుమూత

 ప్రముఖ నటుడు రామిరెడ్డి (58) మరణించారు. గురువారం ఉదయం 10.30 సమయంలో కిమ్స్‌ హాస్పిటల్‌లో కన్నుమూశారు. గతకొంత కాలంగా ఆయన కాలేయం, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. రామిరెడ్డికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. 'అంకుశం' సినిమాతో నటుడిగా సినిమా రంగ ప్రవేశం చేసిన రామిరెడ్డి విలన్‌ అనే పదానికి ఒక కొత్త నిర్వచనం చెప్పారు. 'అంకుశం' ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు. అందులో ఆయన రోల్‌ బాగా పాపులర్‌ అవటంతో అనేక అవకాశాలు వచ్చాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో దాదాపు 250 సినిమాల్లోనూ, పలు టీవీ సీరియల్స్‌లోనూ నటించారు. శ్రీనగర్‌కాలనీలోని ఆయన స్వగృహంలో రామిరెడ్డి భౌతికకాయాన్ని పలువురు సినీప్రముఖులు సందర్శించి, నివాళి అర్పించారు. కోడిరామకృష్ణ, జీవితా రాజశేఖర్‌, సాయికుమార్‌, కాదంబరి కిరణ్‌, తమ్మారెడ్డి భరద్వాజ తదితరులు రామిరెడ్డి భౌతికకాయాన్ని సందర్శించి, సంతాపం వ్యక్తం చేశారు.