Tuesday, May 24, 2016

నోరు జారె.. కాంట్రాక్టు పోయె!


 వచ్చే బిగ్‌బాష్‌ సీజన్లో క్రిస్‌ గేల్‌ ఆడే అవకాశాలు కనిపించడం లేదు. అతడితో కాంట్రాక్టును పునరుద్ధరించకోబోమని మెల్‌బోర్న్‌ రెనగేడ్స్‌ జట్టు ప్రకటించింది. గత బిగ్‌బాష్‌ సీజన్లో రెనగేడ్స్‌ తరఫున ఆడిన గేల్‌.. తనను ఇంటర్వ్యూ చేస్తున్న ఓ మహిళా టీవీ వ్య్లాఖ్యాతను ఉద్దేశించి అసభ్యకర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.. ఆ సమయంలో మాజీ క్రికెటర్లు చాలా మంది గేల్‌ ప్రవర్తనను తప్పుపట్టారు. రెనగేడ్స్‌ జట్టు కూడా గేల్‌కు జరిమానా విధించింది. మరోసారి ఇలాంటి సంఘటన పునరావృతమవ్వకుండా చూసుకోవాలని గేల్‌ను హెచ్చరించింది కూడా. ఐతే ఈ హెచ్చరికలేవీ ఈ విండీస్‌ క్రికెటర్‌పై పనిచేయలేదు. తాజాగా గేల్‌ మళ్లీ నోరు జారాడు. ఈ సారి తనను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన బ్రిటన్‌ పత్రికకు చెందిన ఓ మహిళా విలేకరితో అసభ్యకరంగా సంభాషించాడు. దీంతో గేల్‌తో సంబంధాలను తెంచుకుంటున్నట్లు రెనగేడ్స్‌ జట్టు ప్రకటించింది. రెనగేడ్సే కాదు... గేల్‌తో కాంట్రాక్టు ఉన్న కౌంటీ జట్టు సోమర్సెట్‌ కూడా ఇలాంటి నిర్ణయం తీసుకునే యోచనలో ఉందని వార్తలొస్తున్నాయి.

సినిమాకథ సినీ పరిశ్రమలో వాళ్లదే ఆధిపత్యం

 మహిళలు పురుషులతో అన్ని రంగాల్లోనూ పోటీపడుతున్నారు. మగవాళ్లకు దీటుగా రాణిస్తున్నారు. సినిమాల్లో అయితే హీరోలతో పోటీపడి హీరోయిన్లు డ్యాన్స్ లు, ఫైట్లతో అదరగొడుతున్నారు. అయితే సినీ పరిశ్రమలో మగవాళ్లదే ఆధిపత్యమని బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ అంటోంది. బాలీవుడ్ లేదా హాలీవుడ్ ఎక్కడైనా వాళ్లదే రాజ్యమని చెబుతోంది.
'సినీ పరిశ్రమంలో మహిళలు, పురుషులు సమానమన్న మాటే లేదు. బాలీవుడ్ లేదా హాలీవుడ్ ఏదైనా మగవాళ్లదే డామినేషన్. ఈ నిజాన్ని దాచలేము' అని కాజోల్ అంది. బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ ను పెళ్లి చేసుకున్న తర్వాత కాజోల్ సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన కాజోల్.. గతేడాది దిల్ వాలే చిత్రం ద్వారా మరోసారి వెండితెరపై కనిపించింది. పెళ్లి, వయసు అన్నవి తన కెరీర్ కు ఎప్పుడూ ప్రతిబంధకం కాదని ఆమె చెప్పింది.

ఆ ఫోన్ కోసం 3 లక్షల మంది ఎదురుచూపు

 ఒక స్మార్ట్‌ఫోన్ కోసం 3 లక్షల మంది ఎదురు చూస్తున్నారట. తాము త్వరలో విడుదల చేయబోయే ఎం3 నోట్ కోసం రెండు వారాల్లో 3 లక్షల మందికి పైగా రిజిస్టర్ చేసుకున్నట్లు చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ మెయిజు ప్రకటించింది. రూ. 9,999 ధరలో ఉన్న ఈ ఫోన్ ఈనెల 31వ తేదీ నుంచి అమెజాన్‌లో అందుబాటులో ఉంటుంది. ఫోన్ స్పెసిఫికేషన్లు ఇలా ఉన్నాయి...

స్క్రీన్: 5.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ
ప్రాసెసర్: ఆక్టాకోర్ హీలియో పి10
సామర్థ్యం: 1.8 గిగాహెర్ట్జ్
ఫోన్ మందం: 5 మిల్లీమీటర్లు
ఓఎస్: ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్
స్టోరేజి: 32 జిబి ఇంటర్నల్ మెమొరీ, మైక్రో ఎస్‌డీ కార్డుతో 128 జిబి వరకు పెంచుకునే అవకాశం
అదనపు హంగులు: గ్రాఫిక్స్ ఎక్కువగా ఉండే గేమ్స్ కోసం మాలి-టి860 జీపీయూ కూడా ఉందట.