Saturday, November 12, 2011

ఘనంగా 'దూకుడు' అర్థ శతదినోత్సవం

 ప్రముఖ నటుడు మహేష్‌బాబు, నటి సమంత నటించిన 'దూకుడు' అర్థ శతదినోత్సవం శనివారం విజయవాడలో ఘనంగా జరిగింది. వేలాదిగా తరలొచ్చిన అభిమానులతో విజయవాడలోని కానూరు సిద్ధార్థ కళాశాల మైదానం హోరెత్తింది. రాత్రి ఏడు గంటలకు మొదలైన ఈ వేడుకలకు నటుడు మహేష్‌బాబు ముందుగా గన్నవరం విమానాశ్రయం నుంచి రోడ్డుమార్గం ద్వారా వచ్చారు. మహేష్‌బాబు, ఇతర సినీనటులను చూసేందుకు వచ్చిన వారితో బందరురోడ్డులో ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. ఒకానొక సమయంలో కళాశాల గేటువద్ద స్వల్ప తొక్కిసలాట జరిగింది. అభిమానులను నియంత్రించేందుకు పోలీసులు తీవ్ర అవస్థలు పడ్డారు. హీరో మహేష్‌బాబును అభిమానులు గజమాలతో సత్కరించారు. అనంతరం ప్రముఖ నిర్మాతలు దగ్గుబాటి సురేష్‌బాబు, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, అశ్వనీదత్‌, రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, సుంకర అనీల్‌ నటీనటులు, సాంకేతికవర్గాన్ని అభినందించారు. సినీరంగంలో ఉన్న సగం మంది కానూరు కళాశాలకు రావడంతో అభిమానులు వారిని చూసేందుకు ఎగబడ్డారు. ఈ సందర్భంగా ప్రముఖ నటుడు, సూపర్‌స్టార్‌ కృష్ణ, నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ చిన్నతనంలోనే సినిమారంగంలో 'దూకుడు' ప్రదర్శించిన మహేష్‌బాబు పెద్దయిన తరువాత కూడా అదే ఒరవడి కొనసాగిస్తున్నారని అన్నారు. 75 ఏళ్ల సినీ చరిత్రలో రికార్డులు సృష్టించిన 'పోకిరి' అతని కీర్తిలో కలికితురాయని అన్నారు. దాని రికార్డులకు చేరువగా 'దూకుడు' వెళుతుందని అన్నారు. నటి సమంత మాట్లాడుతూ 'దూకుడు' సినిమా తనకు జీవితంలో గుర్తుండిపోయే విజయాన్ని అందించిందన్నారు.

పెళ్లి పీటలెక్కనున్న మమత