Sunday, December 18, 2016

రాజమౌళి మహాభారతం తీస్తే నేను శ్రీకృష్ణుణ్ని

ఆమీర్‌ఖాన్‌... బాక్సాఫీసు సంచలనం. ఆయన ఎంచుకొన్న ప్రతి పాత్ర, ప్రతి కథా.. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుంది. ప్రయోగాత్మక చిత్రాలతోనూ వసూళ్ల వర్షం కురిపించొచ్చని నిరూపించిన కథానాయకుడాయన. ‘తారే జమీన్‌ పర్‌’, ‘త్రీ ఇడియట్స్‌’, ‘పీకే’... ఇలా ఒకదాన్ని మించి మరో మైలురాయిని సృష్టించుకొంటూ వెళ్తున్నాడు. ఆమీర్‌ నటించిన ‘దంగల్‌’ విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రం తెలుగులోనూ అనువాదమైంది. ‘దంగల్‌’ ప్రచారంలో భాగంగా ఆదివారం హైదరాబాద్‌ వచ్చాడు ఆమీర్‌ ఖాన్‌. ఈ సందర్భంగా పాత్రికేయులతో ముచ్చటించాడు.
‘దంగల్‌’ తెలుగు వెర్షన్‌ చూశారా? మీ పాత్ర తెలుగులో డైలాగులు చెబుతుంటే ఎలా అనిపిస్తోంది? 
‘దంగల్‌’ నిర్మాణానంతర కార్యక్రమాల్లో బిజీగా ఉండడం వల్ల తెలుగు వెర్షన్‌ని పూర్తిగా చూడలేకపోయా. కానీ తెలుగు ట్రైలర్‌ చూశా. నా పాత్ర తెలుగులో మాట్లాడుతుంటే.. కొత్తగా అనిపించింది.
ఓ తెలుగు కథ మీకెవరైనా వినిపిస్తే చేయడానికి, ఈ భాష నేర్చుకోవడానికి సిద్ధమేనా?
కొత్త భాషలు నేర్చుకోవడం నాకు చాలా ఇష్టం. ‘పీకే’ కోసం భోజ్‌పురి నేర్చుకొన్నా. ‘దంగల్‌’ కోసం హర్యాణీ భాషపై పట్టుసాధించా. ఒకవేళ తెలుగు సినిమాలో నటించాల్సివస్తే తప్పకుండా తెలుగు నేర్చుకొంటా. పూర్తిగా కాకపోయినా నా సంభాషణల వరకూ తెలుసుకొనే ప్రయత్నం చేస్తా.
తెలుగులో నటించాల్సివస్తే మీ సహనటులుగా ఎవరిని ఎంపిక చేసుకొంటారు?
సహ నటుల్ని ఎంపిక చేసే బాధ్యత పూర్తిగా దర్శకుడిదే. నిజంగానే నాకు ఛాయిస్‌ ఉంటే చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌ను ఎంచుకొంటా. తమిళంలో రజనీకాంత్‌ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన అభిమానిని నేను. వీళ్లందరితో పనిచేయాలని ఉంది.
ప్రతిసారి కొత్త కథల్ని ఎంచుకొంటూ ప్రయాణం సాగిస్తున్నారు. ఇది మీకెలా సాధ్యమవుతోంది?
నేను రచయితని కాదు. నా కోసం రచయితలు, దర్శకులు మంచి పాత్రలు రాస్తున్నారు. ఈ విషయంలో వాళ్లకు రుణపడి ఉన్నా. నా వరకూ ఓ కథని సామాన్య ప్రేక్షకుడిలానే వింటా. నాలోని సగటు ప్రేక్షకుణ్ని ఆ కథ సంతృప్తిపరిస్తే చాలు. వెంటనే ఒప్పుకొంటా.
‘దంగల్‌’ కోసం బరువు పెరిగారు.. మళ్లీ తగ్గారు. దాని కోసం మీరు చేసిన కసరత్తులు ఎలాంటివి?
బరువు పెరగడానికి పెద్దగా కష్టపడలేదు. నాలుగైదు నెలల్లో 27 కిలోలు పెరిగా. మళ్లీ తగ్గడానికీ అంతే సమయం పట్టింది. వారానికి ఒక పౌండ్‌ చొప్పున తగ్గితే మంచిది. కానీ నేను మాత్రం వారానికి నాలుగు పౌండ్లు తగ్గేవాణ్ని. అలా మూడు వారాలు చేశా. నిజానికి అలా ఉన్నఫళంగా తగ్గడం అంత శ్రేయస్కరం కాదు. అందుకే ఆ తర్వాత వేగం తగ్గించాను. లావుగా ఉన్నప్పుడు శ్వాస తీసుకోవడం కష్టమయ్యేది. కనీసం వంగి షూ లేస్‌ని కూడా కట్టుకోలేకపోయేవాణ్ని.
పాత్ర కోసం ఇంత సాహసం చేస్తున్నప్పుడు ఇంట్లో వాళ్లు కంగారుపడలేదా?
మా అమ్మ, నా భార్య గట్టి వార్నింగ్‌ ఇచ్చారు (నవ్వుతూ). మరోసారి ఇంత రిస్క్‌ చేయొద్దన్నారు. నా భార్య అయితే ‘ప్రతి సినిమాకీ గెటప్‌ మార్చేస్తున్నారు. మీ నిజమైన ఆకారం మర్చిపోతున్నా’ అంటుంటుంది. నిజమే.. తనని తొలిసారి ‘దిల్‌ చాహతాహై’ గెటప్‌లో కలిశా. అప్పటి నుంచీ.. ప్రతి సినిమాకీ గెటప్‌ మార్చుకొంటూ వెళ్తున్నా.
మీ సినిమా అంటే రికార్డుల గురించి మాట్లాడుకోవాల్సిందే. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆ స్థాయి వసూళ్లు సాధ్యమేనా?
నేనెప్పుడూ రికార్డుల గురించో.. వసూళ్ల కోసమో సినిమా తీయను. ప్రేక్షకుల హృదయాన్ని తాకితే చాలనుకొంటా.
రాజమౌళితో మీరో సినిమా చేస్తారని ప్రచారం సాగుతోంది. అదెప్పుడు?
రాజమౌళి గొప్ప దర్శకుడు. ఆయనతో పనిచేయాలని నాకూ ఆశగా ఉంది.
రాజమౌళి మహాభారతం తీస్తానని చెబుతుంటారు. మహాభారతం తీస్తే మీరు ఏ పాత్రని ఎంచుకొంటారు?
‘మహాభారత్‌’ అంటే నాకు చాలా ఇష్టం. అందులోని ప్రతి పాత్రా ఇష్టమే. ముఖ్యంగా కర్ణుడు, శ్రీకృష్ణుడు పాత్రలు నన్ను ఆకర్షిస్తాయి. కర్ణుడు కవచకుండలాలతో పుట్టాడు. ఓ యుద్ధ వీరుడు. అలాంటి పాత్రలో నన్ను నేను వూహించుకోవడం కష్టం. కాబట్టి శ్రీకృష్ణుడి పాత్రైతే బాగుంటుంది. ఆ పాత్రకు నేను నప్పుతానా లేదా అనేది రాజమౌళి ఆలోచించుకోవాలి.
పెద్ద నోట్ల రద్దుని స్వాగతిస్తున్నారా?
మంచి ప్రయత్నమే. దీర్ఘకాలిక ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకోవాలి. చిన్న చిన్న సమస్యలున్నాయి. ప్రభుత్వం వీలైనంత త్వరగా చక్కదిద్దుతుందనుకొంటున్నా.

కర్నూలు వెళ్లబోయి కరీంనగర్‌ వెళ్లిన ‘జబర్‌దస్త్‌’ నటి

 నాని నటించిన ‘భలే భలే మగాడివోయ్‌’ చిత్రం గుర్తుందా? అందులో హీరోయిన్‌ కుటుంబాన్ని శ్రీశైలం తీసుకెళ్లమంటే మర్చిపోయి ఎక్కడికో తీసుకెళ్తాడు. సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఎదురైంది నటి, వ్యాఖ్యాత రష్మి గౌతమ్‌కు. ‘జబర్‌దస్త్‌’ కార్యక్రమంతో అందరికీ సుపరితురాలైన రష్మి ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు కర్నూలు జిల్లా నంద్యాల వెళ్లాల్సి ఉంది. అయితే ఈ కార్యక్రమానికి ఆలస్యం రావడంతో అక్కడి ప్రేక్షకులకు ఆమె క్షమాపణలు చెప్పారు. కారు డ్రైవర్‌ను కర్నూలు తీసుకెళ్లమంటే కరీంనగర్‌ తీసుకెళ్లాడని దీంతో కార్యక్రమానికి ఆలస్యంగా వచ్చానని ప్రేక్షకులకు సారీ చెప్పింది రష్మి. అనంతరం అక్కడ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో పలు పాటలకు నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా రష్మిని చూసేందుకు అభిమానులు పోటెత్తడంతో వారిని నియంత్రించడానికి పోలీసులు కష్టాలు పడాల్సి వచ్చింది.