Tuesday, June 7, 2016

'ఐపీఎల్ లో మళ్లీ చాన్స్ ఇవ్వండి'

 పాకిస్తాన్ ఆటగాళ్లకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చోటు కల్పించాలని ఐసీసీ అధ్యక్షుడు జహీర్ అబ్బాస్ బీసీసీఐకి విజ్ఞప్తిచేశారు. బెంగళూరులోని చిన్నస్వామి స్డేడియంలో ఆదివారం జరగనున్న ఫైనల్ మ్యాచ్ వీక్షించడానికి ఆయన రానున్నారు. బీసీసీఐ నూతన అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ ఆహ్వానం మేరకు పాక్ మాజీ కెప్టెన్ బెంగళూరుకు విచ్చేయనున్నారు. ఈ నేపథ్యంలో తమ దేశ ఆటగాళ్లను లీగ్ లో ఆడనిస్తే ఐపీఎల్ కు మరింత జోష్ వస్తుందని అభిప్రాయపడ్డాడు.                        2007 తర్వాత పాక్, భారత్ మధ్య 2012-13 సీజన్లో మూడు వన్డేలు, రెండు టీ20 మ్యాచ్ లు జరిగాయి. ఐపీఎల్ మొదటి సీజన్లో(2008లో) పాక్ క్రికెటర్లు భాగస్వాయులయ్యారని, అయితే ముంబై దాడుల తర్వాత తమ ఆటగాళ్లను లీగ్ నుంచి నిషేధించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. భారత్ ఆహ్వానం మేరకు ఐపీఎల్ ఫైనల్ వీక్షించేందుకు వస్తున్నాను, ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు మెరుగు పడేందుకు బీజం పడేలా చేస్తానని ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రపంచమంతా భారత్-పాక్ మ్యాచుల కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తుందని జహీర్ అబ్బాస్ పేర్కొన్నారు.

పోలీస్‌ స్టేషన్‌లో రామ్‌చరణ్‌

 పోలీసు కథలంటే మన కథానాయకులకు చాలా మక్కువ. అసలు సిసలైన హీరోయిజం చూపించే అవకాశం ఈ కథల్లోనే ఎక్కువ దొరుకుతుంది. మాస్‌కి త్వరగా దగ్గరైపోవొచ్చు. దానికి తోడు స్టైలిష్‌గానూ కనిపించొచ్చు. అందుకే రామ్‌చరణ్‌ మరోసారి ఖాకీ కట్టేశారు. పోలీసు స్టేషన్‌లో హంగామా మొదలెట్టారు. రామ్‌చరణ్‌ కథానాయకుడిగా గీతా ఆర్ట్స్‌ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. సురేందర్‌రెడ్డి దర్శకుడు. రకుల్‌ప్రీత్‌సింగ్‌ కథానాయిక. అరవింద్‌ స్వామి ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. నవదీప్‌ కీలక పాత్రధారి. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. పోలీస్‌ స్టేషన్‌ సెట్‌లో రామ్‌చరణ్‌ పోలీస్‌ గెటప్‌ వేసి హంగామా చేస్తున్నాడు. ప్రస్తుతం పోలీస్‌ స్టేషన్‌ నేపథ్యంలో సాగే సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. తమిళంలో ఘన విజయం సాధించిన ‘తని ఒరువన్‌’కి రీమేక్‌ ఇది. ‘ధ్రువ’ అనే పేరు పరిశీలిస్తున్నారు. దసరా బరిలో ఈ సినిమాను దింపాలన్నది చిత్రబృందం ఆలోచన.

మేం కలిసి పనిచేయకపోవడమే మంచిది

 ‘పా’.. ‘డర్టీ పిక్చర్‌’.. ‘కహానీ’ వంటి చిత్రాలతో జాతీయస్థాయిలో ఉత్తమ నటిగా నిరూపించుకుంది విద్యాబాలన్‌. ప్రముఖ నిర్మాత సిద్ధార్థ్‌రాయ్‌ కపూర్‌తో వివాహమైన తర్వాత కూడా వరుస సినిమాలతో కెరీర్‌ని గాడిన పెడుతోంది. ఇటీవల ‘తీన్‌’ చిత్రం ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న విద్యా.. తన మరిది కునాల్‌రాయ్‌ కపూర్‌ దర్శకత్వంలో చిన్న పాత్రైనా చేయాలని ఉంది అని చెప్పింది. కానీ.. తన భర్త నిర్మాణంలో మాత్రం నటించనంటోంది. వృత్తిని.. వ్యక్తిగత జీవితాన్ని కలపకుండా ఉంచడానికే మేం ప్రయత్నిస్తాం. అదే తమ వైవాహిక జీవితానికి చాలా మంచిదని చెబుతోంది విద్యాబాలన్‌.
‘‘మేం జంటగా కలిసి పనిచేస్తే చాలా బాగుంటుందని తెలుసు. కానీ వృత్తిని.. వ్యక్తిగత జీవితాన్ని ఎప్పుడూ కలపకూడదని నా అభిప్రాయం. ఆ విధంగా ఉండటానికి మేం ప్రయత్నిస్తాం. అదే మా వైవాహిక జీవితానికి మంచిది. ఎందుకంటే కొన్నిసార్లు మంచి సినిమాలు కూడా ఆడకపోవచ్చు. పైగా ఇప్పటివరకు వృత్తిపరంగా మేమిద్దరం చర్చించుకున్న సందర్భాలు చాలా తక్కువ. అందుకే కలిసి పనిచేయకపోవటమే మాకు మంచిది’’ అని చెప్పింది విద్యాబాలన్‌.

ఆమె కళ్లు చెమర్చాయి!


పాపం, పుణ్యం, ప్రపంచం... ఇవన్నీ తెలియక స్వచ్ఛమైన మనసుతో ఆనందంగా నవ్వుతూ, తుళ్లుతూ ఆడిపాడే ఆ పిల్లలను చూసి కాజల్ కళ్లు చెమర్చాయి. ఎందుకంటే ఈ అందమైన లోకాన్ని చూడలేని చిన్నారులు వాళ్లు. అందుకే ఓ మంచి నిర్ణయమే తీసుకున్నారు కాజల్. అసలు విషయంలోకి వెళితే...  హిందీ చిత్రం ‘దో లఫ్జోంకీ కహానీ’లో కాజల్ అగర్వాల్  అంధురాలిగా నటించిన విషయం తెలిసిందే.
               ఇప్పటివరకూ చాలా సినిమాల్లో అందాలతో కనువిందు చేసిన కాజల్ తొలిసారిగా ఓ అంధురాలి పాత్ర చేశారు. ఈ పాత్ర కోసం ఆమె చాలా హోం వర్క్ చేశారు. తన ఇంటి దగ్గర్లోని ఓ అంధుల పాఠశాలకు వెళ్లి వాళ్ల జీవన విధానం ఎలా ఉంటుంది..? ఎలా ప్రవరిస్తారు? అన్న విషయాలను గమనించారట. ఆ తర్వాత షూటింగ్‌కు వెళ్లారు... డెరైక్టర్ యాక్షన్ అని చెప్పగానే కాజల్ కంగారు పడిపోయారట. మరి.. మామూలుగా నటించకూడదు... కళ్లు లేని వాళ్లలా కనిపించాలి కదా.
             అందుకే టేక్‌ల మీద టేక్‌లు తీసుకున్నారు. దాంతో చిన్న పనులు చేయాలన్నా కళ్లు కనిపించని వాళ్లకెంత కష్టమో కాజల్‌కి అర్థమైంది. అందుకే తన వంతుగా ఏదైనా చేయాలనుకున్నారు. చనిపోయాక  మట్టిలో కలిసిపోయే కళ్లను దానం చేస్తే బాగుంటుందని నిర్ణయించుకున్నారు. ఈ సినిమాలో హీరోగా నటించిన రణదీప్ హుడా కూడా ఇదే నిర్ణయం తీసుకోవడం విశేషం.