Monday, January 9, 2017

ధోనీ రిటైర్మెంట్‌ పై వివాదం

  టీమిండియా వన్డే, టి-20 కెప్టెన్ గా మహేంద్ర సింగ్‌ ధోనీ తప్పుకోవడంపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వచ్చే వన్డే ప్రపంచ కప్‌ ను దృష్టిలో ఉంచుకుని కొత్త సారథిని ఎంపిక చేసేందుకు వీలుగా ధోనీ వైదొలగాడని పలువురు క్రికెటర్లు, మాజీలు అభిప్రాయపడగా.. కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని బీసీసీఐ అతనిపై ఒత్తిడి చేసినట్టు తాజాగా జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. మహీ స్వతహాగా రిటైర్మెంట్‌ నిర్ణయం తీసుకోలేదని కథనాలు ప్రచురితమయ్యాయి. దీంతో ధోనీ రిటైర్మెంట్‌ ప్రకటనపై వివాదం ఏర్పడటంతో భారత సెలెక్షన్‌ కమిటీ చైర్మన్‌ ఎంఎస్‌ కే ప్రసాద్‌ స్పందించాడు.
కెప్టెన్సీ నుంచి తప్పుకోవాల్సిందిగా ధోనీపై ఎవరూ ఎలాంటి ఒత్తిడి చేయలేదని, అతను స్వతహాగానే నిర్ణయం తీసుకున్నాడని ప్రసాద్‌ స్పష్టం చేశాడు. రంజీ ట్రోఫీ సెమీస్‌ మ్యాచ్‌ సందర్భంగా ధోనీ రిటైర్మెంట్‌ గురించి తనతో మాట్లాడినట్టు వెల్లడించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌ కెప్టెన్‌ పదవి నుంచి తాను వైదొలగాలని భావిస్తున్నానని, తన స్థానంలో మరొకరిని కెప్టెన్ గా ఎంపిక చేయాలని కోరినట్టు ప్రసాద్‌ తెలిపాడు. ఆటగాడిగా జట్టులో కొనసాగుతానని ధోనీ తనతో చెప్పాడని ఎంఎస్ కే ప్రసాద్‌ వివరణ ఇచ్చాడు. ధోనీ నిజాయతీ గల వ్యక్తని, అతని నిర్ణయం తనను ఆశ్చర్యపరిచిందని చెప్పాడు. విరాట్‌ కోహ్లీకి జట్టు పగ్గాలు అప్పగించేందుకు ఇదే సరైన నిర్ణయమని, అతనికి ధోనీ గైడ్‌గా వ్యవహరించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డాడు. త్వరలో ఇంగ్లండ్‌ తో జరిగే వన్డే, టి-20 సిరీస్ లకు విరాట్‌ కోహ్లీని కెప్టెన్ గా నియమించిన సంగతి తెలిసిందే. ఈ జట్టులో ధోనీకి స్థానం కల్పించారు.