Tuesday, October 18, 2016

ఒక్క హిట్టులేక డబ్బులన్నీ పొగొట్టుకున్నా!

 ఇటీవలికాలంలో ఒక్క హిట్టు సినిమా కూడా లేదు. బాక్సాఫీస్‌ వద్ద నేను ఎంతో డబ్బు పోగొట్టుకున్నా. ఈ సినిమా హిట్‌ అయితే.. జైలు నుంచి విడుదలైన భావన కలుగుతుంది. కొంచెం ఉపశమనంతో, ప్రశాంతతతో రాబోయే సినిమాల్లో పనిచేస్తా.. ఇది బాలీవుడ్‌ రణ్‌బీర్‌ కపూర్‌ ఆవేదన. ఒకప్పుడు వరుస విజయాలతో ఖాన్‌ త్రయంతో తర్వాత ఆ స్థాయి బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌గా రణ్‌బీర్‌ ఎదుగుతాడని అందరూ భావించారు. కానీ ఊహించనిరీతిలో ఎదురైన వరుస పరాజయాలు రణ్‌బీర్‌ కెరీర్‌ను తీవ్రంగా కుంగదీశాయి.
ఈ నేపథ్యంలో తన తాజా సినిమా ‘యే దిల్‌ హై ముష్కిల్‌’పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కరణ్‌ జోహార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పాకిస్థాన్‌ నటుడు ఫవాద్‌ ఖాన్‌ ఉండటంతో విడుదల కోసం అనేక చిక్కులు ఎదుర్కొంటున్నది. దీపావళి కానుకగా మరో పది రోజుల్లో విడుదల కానున్న ఈ సినిమాపై కొన్ని థియేటర్ల సంఘాలు నిషేధం విధించాయి.

ఈ పరిణామాలు ఇలా ఉండగా ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన రణ్‌బీర్‌ ‘యే దిల్‌ హై ముష్కిల్‌’ హిట్‌ కోసం తానెంత ఆశగా ఎదురుచూస్తున్నాడో తెలిపాడు. ‘నా గత సినిమాకు ఈ సినిమాకు మధ్య చాలా గ్యాప్‌ వచ్చింది. నా చివరి సినిమా ’తమాషా’ గత ఏడాది నవంబర్‌లో విడుదల కాగా.. ఇప్పుడు తాజా సినిమా వస్తోంది. నా సినిమాలు బాగా ఆడటం లేదన్న అభిప్రాయం కారణంగా ‘యే దిల్‌ హై ముష్కిల్‌’ విషయంలో ఎంతో ఒత్తిడి ఎదుర్కొంటున్నా. నేను బాక్సాఫీస్‌ వద్ద ఎంతో డబ్బు పోగొట్టుకున్నా. ఒక హిట్టు వస్తే నాకు ఉపశమనం లభిస్తుంది. జైలు నుంచి విడుదలైన భావన కలుగుతుంది. ప్రశాంతంగా రాబోయే సినిమాల కోసం పనిచేస్తా’ అని రణ్‌బీర్‌ వివరించాడు. కాగా, ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఐశ్యర్యరాయ్‌, రణ్‌బీర్‌ కపూర్‌ సాన్నిహిత్యంగా ఉన్న హాట్‌హాట్‌ ఫొటోలను విడుదల చేశారు.

'శ్రీమంతుడు'కి మరో రికార్డ్

 టాలీవుడ్ ఇండస్ట్రీలో నాన్ బాహుబలి రికార్డ్ లన్నింటిని తిరగరాసిన సూపర్ హిట్ సినిమా శ్రీమంతుడు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలన విజయం నమోదు చేసింది. మహేష్ కెరీర్ లోనే కాదు టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అతి పెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచిన ఈసినిమా ఇప్పటికీ తన రికార్డ్ ల హవా కొనసాగిస్తూనే ఉంది.

తాజాగా శ్రీమంతుడు ఆడియో యూట్యూబ్ లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన శ్రీమంతుడు ఆడియో సాంగ్స్ ను అదే కంపెనీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ లోనూ రిలీజ్ చేసింది. దాదాపు ఏడాదిన్నర క్రితం రిలీజ్ అయిన ఈ పాటలను ఇప్పటి వరకు 80 లక్షల మందిపైగా వినటంతో అరుదైన రికార్డ్ శ్రీమంతుడు సొంతమయ్యింది. ఈ విజయం పై ఆదిత్య మ్యూజిక్ కంపెనీతో పాటు సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు.