Monday, October 23, 2017

వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్‌ వచ్చేస్తోంది..

 సోషల్‌ మీడియా యాప్‌లో ఎక్కువగా ప్రాచుర్యం సంపాదించుకున్న వాట్సాప్‌, కొత్త కొత్త ఫీచర్లతో అలరిస్తోంది. తాజాగా వాట్సాప్‌ గ్రూప్‌ వాయిస్‌, వీడియో కాలింగ్‌ ఫీచర్‌ను కూడా యూజర్లకు అందుబాటులోకి తీసుకొస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ ఐఫోన్‌ యాప్‌ లేటెస్ట్‌ బీటా వెర్షన్‌లో అందుబాటులో ఉంది. ఇప్పటికే వాట్సాప్‌ ఈ ఏడాదిలో పలు ఫీచర్లను ప్రవేశపెట్టి, 1 బిలియన్‌కు పైగా యూజర్లను తన సొంతం చేసుకుంది.  ఇటీవ‌ల ఐఫోన్ల‌లో ఉప‌యోగించే వాట్సాప్ అప్‌డేట్ కోడ్‌లో ఈ విషయానికి సంబంధించి సంకేతాలు ఉన్న‌ట్లు అంత‌ర్జాతీయ టెక్నిక‌ల్ వెబ్‌సైట్లు చెబుతున్నాయి.  2.17.70 ఐఓఎస్‌ అప్‌డేట్‌లో గ్రూప్‌ కాల్స్‌కు సంబంధించిన సూచనలు కలిగి ఉందని, ప్రస్తుతం ఇది ధృవీకరణ అయినట్టు డబ్ల్యూఏబీటాఇన్ఫో ఆదివారం ట్వీట్‌ చేసింది. 
గ్రూప్‌ వాయిస్‌ కాల్స్‌ గురించి చాలా సంకేతాలున్నప్పటికీ, గ్రూప్‌ వీడియో కాల్స్‌కు సంబంధించి ఒకే ఒక సంకేతం ఉన్నట్టు పేర్కొంది. గ్రూప్‌ వాయిస్‌ కాల్స్‌కు ఫీచర్‌పై ఈ యాప్‌ ప్రస్తుతం పనిచేస్తుందని, వచ్చే ఏడాది దీన్ని విడుదల చేయనున్నట్టు అంతకముందే పలు రిపోర్టులు నివేదించాయి. గ్రూప్ వీడియో కాలింగ్ గురించి కొద్దిగా సందిగ్ధ‌త ఉన్నా... గ్రూప్ వాయిస్ కాలింగ్ స‌దుపాయాన్ని మాత్రం వాట్సాప్ త్వ‌ర‌లో త‌ప్ప‌కుండా క‌ల్పించ‌నుంద‌ని తెలుస్తోంది. అయితే ఈ ఫీచ‌ర్లు ఎప్పుడు అందుబాటులోకి వ‌స్తాయనే విష‌యం ఇంకా తెలియాల్సి ఉంది.

Sunday, October 22, 2017

పుట్టిన రోజు శుభాకాంక్షలు ప్రభాస్‌

 
 యంగ్ రెబల్‌ స్టార్ ప్రభాస్ కొత్త చిత్రం సాహో ఫస్ట్ లుక్‌ వచ్చేసింది. ప్రభాస్‌ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ తమ అధికారిక ట్విట్టర్‌ పేజీలో దీనిని రిలీజ్ చేశారు. విదేశీ వీధుల్లో పొగ మంచు మసకలో.. ముసుగు ధరించిన ప్రభాస్‌ నడిచి వస్తున్న పోస్టర్‌ను వదిలారు. చూస్తుంటే హాలీవుడ్ స్థాయిలోనే దర్శకుడు సుజిత్ దీనిని రూపొందిస్తున్నాడేమో అనిపిస్తుంది.

Friday, October 20, 2017

క్రికెట్‌లో రాజు.. రారాజు

 
సుమారు 15 ఏళ్ల పాటు క్రికెట్‌ మైదానంలో తనదైన శైలిలో అలరించాడు వీరేంద్ర సెహ్వాగ్‌. మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ తెందుల్కర్‌తో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగి ఒంటి చేత్తో జట్టుకు విజయాలను అందించాడు. ఆ తర్వాత తనదైన ట్వీట్‌ షాట్లను సంధిస్తూ అభిమానుల్ని అలరిస్తూనే ఉన్నాడు. ఈ రోజు వీరూ 39వ పుట్టిన రోజును జరుపుకొంటున్నాడు. ఈ సందర్భంగా మాజీ, ప్రస్తుత క్రికెటర్లు, అభిమానుల నుంచి సెహ్వాగ్‌కు సామాజిక మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

* బౌలర్లకు ఎన్నో నిద్రపట్టిని రాత్రులు మిగిల్చి, విధ్వంసానికి మారుపేరుగా నిలిచిన వీరేంద్ర సెహ్వాగ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు: సురేశ్‌ రైనా
* హ్యాపీ బర్త్‌ డే సెహ్వాగ్‌: అనిల్‌ కుంబ్లే
* క్రికెట్‌లో తొలి ఇన్నింగ్స్‌లో రాజుగా.. వ్యాఖ్యాతగా రెండో ఇన్నింగ్స్‌లో రారాజుగా వెలిగిపోతున్న వీరేంద్ర సెహ్వాగ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. పండగ చేస్కో: హర్ష భోగ్లే
* ఎప్పుడైతే సెహ్వాగ్‌ క్రికెట్‌ ఆడటం మానేశాడో... అప్పట్నుంచే నేను ఇంట్లో కూర్చుని క్రికెట్‌ చూడటం మానేశా. హ్యాపీ బర్త్‌ డే సెహ్వాగ్‌: విజేందర్‌ సింగ్‌
* వీరూ నువ్వు మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నా: పార్ధీవ్‌ పటేల్‌
* గోల్డెన్‌ హార్ట్‌ కలిగిన లెజండ్‌ వీరూకి పుట్టిన రోజు శుభాకాంక్షలు: మిథున్‌ మన్‌హాస్‌
* హ్యాపీ బర్త్‌ డే పాజీ: మహమ్మద్‌ షమి
* హ్యాపీ బర్త్‌ డే లెజండ్‌. మరింత కాలం నిన్ను చూసేలా దేవుడు దీవించాలని కోరుకుంటున్నా: క్రిస్‌ గేల్‌
* హ్యాపీ బర్త్‌ డే వీరూ. ఫియర్‌లెస్‌ అన్న పదానికి అర్ధం చెప్పినందుకు ధన్యవాదాలు. నాన్‌ స్ట్రైకర్‌ ఎండ్‌లో ఉండి నీ త్రిశతకాన్ని చూడగలిగాను: రహానె
* క్రికెట్‌ చరిత్రలో విధ్వంసకరమైన ఓపెనింగ్‌ బ్యాట్స్‌మెన్‌గా పేరు తెచ్చుకున్న వీరూకి హ్యాపీ బర్త్‌ డే. వ్యాఖ్యాతగా నువ్వు మమ్మల్ని ఇలాగే ఎంటటైన్‌ చేస్తూ ఉండు: ఇషాంత్‌ శర్మ
* అంతర్జాతీయ క్రికెట్‌లో 17,253 పరుగులు, టెస్టుల్లో రెండు త్రిశతకాలు సాధించిన ఇద్దరు క్రికెటర్లలో ఒకడు, వన్డే క్రికెట్‌ మ్యాచ్‌లో 200పైగా పరుగులు సాధించిన వీరేంద్ర సెహ్వాగ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు: ఐసీసీ
* వీరూ భాయ్‌కి జన్మదిన శుభాకాంక్షలు. సోషల్‌ మీడియాకి ఎక్కువ సమయం కేటాయించు: హర్భజన్‌ సింగ్‌
1999లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన సెహ్వాగ్‌ 104 టెస్టుల్లో 49.34 సగటుతో 8,586 పరుగులు చేయగా 251 వన్డేల్లో 35.05 సగటుతో 8,273 పరుగులు సాధించాడు. 1999లో పాకిస్థాన్‌పై సెహ్వాగ్‌ వన్డే క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. 2004లో అదే పాకిస్థాన్‌పై టెస్టుల్లో తొలి త్రిశతకాన్ని నమోదు చేశాడు సెహ్వాగ్‌. భారత్‌ తరఫున ఈ ఘనత అందుకున్న మొదటి ఆటగాడు సెహ్వాగ్‌. ఆ తర్వాత 2008లో దక్షిణాఫ్రికాపై సెహ్వాగ్‌ 319 పరుగులు చేశాడు. 2011లో వెస్టిండీస్‌పై ఇండోర్‌లో జరిగిన వన్డేల్లో ఈ డాషింగ్‌ ఓపెనర్‌ 149 బంతుల్లో 219 పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు మన సెహ్వాగ్‌. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మన వీరేంద్రుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పేయండి.
 
 

 

Wednesday, October 18, 2017

'రాజా ది గ్రేట్' మూవీ రివ్యూ


దాదాపు రెండేళ్ల విరామం తరువాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ అంధుడిగా కనిపించి షాక్ ఇచ్చాడు. పటాస్, సుప్రీమ్ లాంటి వరుస హిట్స్ తో మంచి ఫాంలో ఉన్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాజా ది గ్రేట్ సినిమాతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన రాజా ది గ్రేట్ మరోసారి మాస్ మహరాజ్ స్టామినాను ప్రూవ్ చేసిందా..? రెండేళ్ల విరామం తరువాత వెండితెర మీద కనిపించిన రవితేజ, అదే స్థాయిలో అలరించాడా..? దర్శకుడు అనిల్ రావిపూడికి హ్యాట్రిక్ విజయం దక్కిందా..?

కథేంటంటే: నిజాయతీ కలిగిన ఓ పోలీస్‌ ఆఫీసర్‌(ప్రకాష్‌రాజ్‌). ఆయనకో కుమార్తె లక్కీ(మెహరీన్‌). ఆ ఆఫీసర్‌కు కూతురంటే ప్రాణం. ఓ కేసు విషయంలో దేవ(వివ‌న్‌ భటేనా) తమ్ముడిని ఎన్‌కౌంటర్‌ చేస్తాడు ఆ పోలీస్‌ ఆఫీసర్‌. తన తమ్ముడిని చంపేశాడనే కోపంతో అతడిపైనా, అతని కుమార్తె లక్కీపైనా పగ పెంచుకుంటాడు దేవ. లక్కీ కళ్లముందే ఆమె తండ్రిని చంపేస్తాడు. అప్పటినుంచి దేవ నుంచి తప్పించుకుని తిరుగుతుంటుంది లక్కీ. రాజా(రవితేజ) పుట్టుకతో అంధుడు. కానీ ఆత్మవిశ్వాసం ఎక్కువ. రాజాను వాళ్ల అమ్మ(రాధిక‌) పోలీస్‌ ఆఫీసర్‌ చేయాలనుకుంటుంది. మరోపక్క దేవ నుంచి లక్కీని కాపాడేందుకు పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రయత్నిస్తుంటుంది. ఈ విషయం తెలుసుకున్న రాజా ఏం చేశాడు? విలన్‌ గ్యాంగ్‌ నుంచి ఆమె ఎలా కాపాడాడు? అంధుడైన రాజా చివరికి ‘రాజా ది గ్రేట్‌’ అనిపించుకున్నాడా? 

ఎలా ఉందంటే: ఒక హీరో.. హీరోయిన్‌ను కాపాడటం అనేది రొటీన్‌ స్టోరీ. అయితే ఆ హీరో అంధుడు కావడమే ‘రాజా ది గ్రేట్‌’ చిత్రం ప్రత్యేకత. ముఖ్యంగా హీరో పాత్రను డిజైన్‌ చేసిన విధానం అందరికీ నచ్చుతుంది. అంధుడైన కథానాయకుడు ఒక బలమైన ప్రతినాయకుడిని ఎలా ఎదుర్కొన్నాడనే దాన్ని దర్శకుడు ఆకట్టుకునేలా చూపించాడు. డార్జిలింగ్‌ ఎపిసోడ్‌, కబడ్డీ ఆడే సన్నివేశాలు అలరిస్తాయి. యాక్షన్‌ సన్నివేశాలను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. ప్రథమార్ధం చక్కని హాస్య సన్నివేశాలతో ఎంటర్‌టైనింగ్‌గా సాగిపోతుంది. ఇక ద్వితీయార్ధాన్ని హీరో-విలన్ల మధ్య వచ్చే సన్నివేశాలతో తీర్చిదిద్దాడు దర్శకుడు. ఎంటర్‌టైన్‌మెంట్‌ కన్నా యాక్షన్‌కు ప్రాధాన్యం ఇచ్చాడు. సెకండాఫ్‌లో వచ్చే మూడు ఫైట్‌లను మూడు రకాలుగా డిజైన్‌ చేసుకున్నాడు. ఒక దశలో సినిమా అయిపోయిందేమో అనిపిస్తుంది. కానీ పాటో, ఫైటో వస్తుంది. కొన్ని సన్నివేశాలు కేవలం నిడివి కోసం రాసుకున్నారేమో అనిపిస్తుంది. కాస్త సాగ‌దీత‌తో ఉన్నప్పటికీ అది వినోదాత్మకంగా చెప్పడంతో ప్రేక్షకుడు ఎక్కడా ఇబ్బందిపడడు. అయితే ద్వితీయార్ధాన్ని మరింత షార్ప్‌గా ఎడిట్‌ చేయాల్సింది. సినిమా మొత్తంలో హీరో-హీరోయిన్‌ల మధ్య ఎక్కడా లవ్‌ ట్రాక్‌ కనిపించదు. కానీ పాటలు వచ్చిపోతుంటాయి. వారి మధ్య కెమిస్ట్రీ చూపించలేదు. ‘గున్నాగున్నామామిడి...’ పాట ఎపిసోడ్‌ నవ్వులు పూయిస్తుంది.

చివరిగా: ‘రాజా ది గ్రేట్‌’.. రవితేజ ది గ్రేట్‌