Wednesday, October 29, 2014

నటి శ్వేతాబసుకు విడుదలకు నాంపల్లి కోర్డు ఆదేశం

 వ్యభిచారం కేసులో అరెస్టు అయిన హీరోయిన్‌ శ్వేత బసు గత కొంత కాలంగా పోలీసు అధికారుల ఆధ్వర్యంలో పునరావాస కేంద్రంలో ఉంటున్న విషయం తెల్సిందే. ఈమెకు టాలీవుడ్‌ నుండే కాకుండా అనేక భాషల నటీనటులు, దర్శకుల నుండి మద్దతు లభించింది. తన కూతురును విడుదల చేయాల్సిందిగా నాంపల్లి కోర్టులో శ్వేత బసు తల్లి పిటీషన్‌ దాఖలు చేసింది. శ్వేతబసు తల్లి పిటీషన్‌ విచారించిన కోర్టు విడుదలకు ఆదేశాలు జారీ చేసింది. శ్వేతబసు విడుదలయిన తర్వాత తమ సినిమాల్లో అవకాశమిస్తామంటూ పలువురు చెప్పుకొచ్చారు. మరి ఇప్పుడు వారంత శ్వేతను పట్టించుకుంటారో చూడాలి.

Tuesday, October 28, 2014

కలిసి కనిపించిన బాలీవుడ్‌ ప్రేమపక్షులు

  ప్రేమపక్షులుగా చాలా కాలంగా ప్రచారంలో ఉన్న బాలీవుడ్‌ నటి అనుష్కాశర్మ, క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ ఎట్టకేలకు కలిసి.. బహిరంగంగా ఒక చోట కనిపించారు. పుణెలో ఆదివారం జరిగిన ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ ఫుట్‌బాల్‌ ఆటను చూసేందుకు వీళ్లిద్దరూ కలిసి వచ్చారు.ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ ఫుట్‌బాల్‌ జట్లలో విరాట్‌ కోహ్లీ ఎఫ్‌సీ గోవా ఫ్రాంచైజీకి సహ యజమాని.తన జట్టు ఓటమి అంచుల్లో ఉండటంతో కోహ్లీ చాలా ఆందోళనగా కనిపించగా.. తన ప్రేమికుడి ఆందోళనను అనుష్క కూడా పంచుకుంది. ఇక విరాట్‌ జట్టును ఓడించిన ఎఫ్‌సీ పుణె జట్టు సహ యజమాని „హృతిక్‌ రోషన్‌ కూడా మరికొందరు నటులతో కలిసి ఈ ఆట చూసేందుకు వచ్చాడు. అర్జున్‌ కపూర్‌, ఈషాగుప్తాలతో కలిసి ఈ మ్యాచ్‌ని బాగా ఎంజాయ్‌ చేస్తూ „హృతిక్‌ కనిపించాడు.

Monday, October 27, 2014

మూడు రోజుల్లో వందకోట్లు...

 షారుఖ్‌ఖాన్ నటించిన హ్యాపీ న్యూ ఇయర్ చిత్రం బాలీవుడ్‌లో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. పాత రికార్డులన్నింటినీ చేరిపి వేస్తూ మూడు రోజుల వ్యవధిలో వంద కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రంగా చరిత్ర సృష్టించింది. గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చినా వసూళ్లపరంగా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. తొలి రోజు దాదాపు 44 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించి బాలీవుడ్ వర్గాల్ని విస్మయపరిచిన ఈ చిత్రం వారంతానికి 108.86 కోట్ల వసూళ్లకు చేరుకోవడం గమనార్హం. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో షారుఖ్‌కు జోడీగా దీపికా పదుకొనే కథానాయికగా నటించింది.

Sunday, October 26, 2014

పిల్లా నువ్వులేని జీవితం చిత్ర గీతాలు విడుదల

            సాయిధరమ్ తేజ్, రెజీనా జంటగా నటిస్తున్న పిల్లా నువ్వులేని జీవితం చిత్ర గీతాలు శనివారం రాత్రి హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. అల్లు అరవింద్ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని బన్నివాసు, శ్రీహర్షిత్ నిర్మిస్తున్నారు. ఎ.ఎస్. రవికుమార్ చౌదరి దర్శకుడు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియోను చిరంజీవి ఆవిష్కరించారు. తొలి ప్రతిని రామ్‌చరణ్, అల్లు అర్జున్ స్వీకరించారు. వి.వి.వినాయక్ ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. 
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ
 రామ్‌చరణ్‌తో పాటు సాయిధరమ్‌తేజ్ నాకు మరో బిడ్డ. తను మా ఇంట్లోనే పెరిగాడు. అల్లు అరవింద్, దిల్‌రాజు, బన్నివాసు, హర్షిత్‌ల నిర్మాణంలో ఈ సినిమా రూపొందడం ఆనందంగా వుంది. నా మొదటి సినిమా పునాదిరాళ్లు కంటే ముందు రెండవ సినిమా ప్రాణం ఖరీదు విడుదలైంది. అదే సెంటిమెంట్ ఇప్పుడు సాయిధరమ్‌తేజ్ విషయంలో పునరావృతం అవుతోంది. రామ్‌చరణ్ మగధీర ఎంత పెద్ద సక్సెస్ అయిందో అదే స్థాయి విజయాన్ని ఈ సినిమా సాధిస్తుంది. నేను ఏదైతే ఫాలోఅయ్యానో అదే క్రమశిక్షణను మా కుటుంబంలోని హీరోలంతా అనుసరించడం ఆనందంగా వుంది. ఈ ఇండస్ట్రీకి మరో ప్రకాష్‌రాజ్ లాంటి నటుడిగా జగపతిబాబు ఎదుగుతారు.  ఈ కార్యక్రమంలో సాయిధరమ్‌తేజ్, రెజీనా, ఎ.ఎస్.రవికుమార్‌చౌదరి, జగపతిబాబు,అనూప్ రూబెన్స్, బన్నివాసు, హర్షిత్, శిరీష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Saturday, October 25, 2014

రెండూ సమానమే!

 తమిళంలో హన్సిక జోరు కొనసాగుతోంది. కథానాయికగా ఎనిమిది చిత్రాల్లో నటిస్తూ తీరిక లేకుండా గడుపుతోంది. ఒక సినిమా సెట్స్‌పై ఉండగానే మరో చిత్రాన్ని అంగీకరిస్తూ ఇతర హీరోయిన్‌లకు గట్టిపోటీని ఇస్తోంది. తమిళ చిత్రాలపై మాత్రమే దృష్టిసారిస్తున్న ఈ సుందరి తెలుగు భాషా చిత్రాలను పూర్తిగా తగ్గించింది. ఆమె దూకుడు చూస్తుంటే హన్సిక పూర్తి స్థాయిలో తమిళ చిత్రాలకే అంకితమై పోయిందని అంటున్నారు. ఇదే విషయాన్ని హన్సికను అడిగితే... తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ దూరంకానని చెప్పింది. ఆమె మాట్లాడుతూ తెలుగు, తమిళ భాషలు నాకు రెండు కళ్లలాంటివి.

ఈ సారి100కోట్ల హీరో ఎవరు?


 చరణ్‌, బన్ని, మహేష్‌, ఎన్టీఆర్‌, రవితేజ, ప్రభాస్‌ .. వీళ్లంతా 50కోట్ల క్లబ్‌ హీరోలు. ఈ ఆరుగురిలో అరడుగుల బుల్లెట్టు పవన్‌ రికార్డుని అధిగమించే సత్తా ఎవరికి ఉంది? ఉన్నఫళాన ఎవరికైనా 100కోట్ల వసూళ్లు సాధించే సీనుందా? అంటే ఒకే ఒక్కరికి సాధ్యం అని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఆ ఒక్కరు ఎవరు? అనేదే ఈ కథాకమామీషు ... 

             టాలీవుడ్‌లో ఇప్పటివరకూ 100కోట్ల వసూళ్లు సాధించిన ఏకైక చిత్రం `అత్తారింటికి దారేది' పేరు వినిపిస్తోంది. పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ మాత్రమే ఇలాంటి ట్రెండ్‌ని సెట్‌ చేయగలను అని నిరూపించాడు. మరి ఆ తర్వాత ఆ రికార్డును కొట్టే మొనగాడే టాలీవుడ్‌లో లేడా? అంటే ఉన్నాడనే డిస్కషన్‌‌స సాగుతున్నాయి. చరణ్‌, బన్ని, మహేష్‌, ఎన్టీఆర్‌, రవితేజ, ప్రభాస్‌ ఈ ఆరుగురిలో ఒక్కరికే ఆ ఛాన్సుందనేది నిజం. అయితే లేటెస్టు గణాంకాల ప్రకారం ఎన్టీఆర్‌, మహేష్‌ ట్రాక్‌ రికార్డు ఏమంత బాలేదు. ఈ ఇద్దరూ వరుస ప్లాప్‌లతో రేసులో పూర్తిగా వెనుకబడ్డారు. అందువల్ల ఒక్కసారే అంత పికప్‌ సాధ్యపడదు. వంద కోట్లు అని రాసేసినంత సులువు కాదు వసూళ్లు రాబట్టడం. రికార్డులు తిరగరాయడం. కచ్ఛితంగా సినిమాలో స్టామినాతో పాటు, హీరో, దర్శకుడు కాంబినేషన్‌లోనూ ఆ రేంజు ఉండాలి. అలాగే చరణ్‌ ఇప్పటికే మగధీర సినిమాతో దాదాపు 88కోట్ల వసూళ్లు సాధించాడు. 100కోట్లకు చేరువలోనే ఉన్నా చరణ్‌కి ఆ స్థాయి సినిమాని ఇచ్చే దర్శకుడు టాలీవుడ్‌లో వేరెవరూ కనిపించడం లేదు. మళ్లీ రాజమౌళితో సినిమా చేస్తేనే ఆ స్థాయి వస్తుందేమో! అలాగే బన్నీ రేసుగుర్రం సినిమాతో దాదాపు రూ.65కోట్ల వసూళ్లు సాధించాడు. అతడికి ఇదే `జులాయి' తర్వాత 50కోట్ల వసూళ్లు దాటించిన సినిమా. బన్నీకి కూడా సరైన దర్శకుడు పడితే 100కోట్లు సాధ్యమే. కానీ అది అంత ఈజీ కానేకాదు. మాస్‌రాజా రావితేజ కొట్టాలంటే మ్యాజిక్‌ చేసే కథాంశం కావాల్సిందే. మరి యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ కొట్టేస్తాడా? కచ్ఛితంగా .. ఆ ఛాన్‌‌స కనిపిస్తోంది. టాలీవుడ్‌ నంబర్‌ 1 డైరెక్టర్‌ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న `బాహుబలి' చిత్రంతో 100కోట్లు బెంచ్‌మార్‌‌కను ప్రభాస్‌ సునాయాసంగా అధిగమిస్తాడు. ఈ సినిమా భారీ కాన్వాసుతో 300 రేంజులో తెరకెక్కుతోంది.
సౌత్‌లోనే `ఐ' చిత్రం తర్వాత దాదాపు 150కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమా ఇది. అలాగే శంకర్‌ తర్వాత దక్షిణాదిన ఆ స్థాయి ఉన్న దర్శకుడిగా రాజమౌళికి గుర్తింపు ఉంది. మగధీర, ఈగ సినిమాలతో ప్రపంచస్థాయి సినిమాలు తెరకెక్కించే దర్శకుడిగా అంతర్జాతీయ ఖ్యాతి దక్కించుకున్న రాజమౌళి ఈసారి అంతకంటే పకడ్భందీ స్క్రిప్టుతో యూనివర్శల్‌ అప్పీల్‌తో ఉన్న సినిమాతో ముందుకొచ్చాడు. బాహుబలి చిత్రాన్ని ఇటు దేశభాషల్లో, అటు విదేశీ భాషల్లో ఏకకాలంలో రిలీజ్‌ చేయడానికి రెడీగా ఉన్నాడు. ఇప్పటికే ఒక్క తెలుగులోనే దాదాపు రూ.40కోట్లు ముందస్తు అమ్మకాల రూపంలో సంపాదించేశారు. ఏ కోణంలో చూసినా 100కోట్లు చాలా సులువుగా ఈ సినిమా ఆర్జిస్తుందని అంచనాలు వెలువడుతున్నాయి. ఇక్కడో ట్విస్టేమిటంటే బాహుబలి రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఈ రెండు భాగాలు ఒక్కోటి 100కోట్ల వసూళ్లు సాధించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆ రకంగా ప్రభాస్‌ ఒక్కడే ఇప్పటికి పవన్‌ రికార్డును కొట్టేసే ఛాన్సుందన్నమాట! 

Friday, October 24, 2014

శంకర్ దర్శకత్వంలో విక్రమ్ విన్యాసాలు!

 విక్రమ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఐ. ఆస్కార్ ఫిలింస్ పతాకంపై రవిచంంద్రన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆర్.బి.చౌదరి సమర్పణలో మెగా సూపర్‌గుడ్ ఫిలింస్ పతాకంపై ఎన్.వి.ప్రసాద్, పరాస్‌జైన్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. దక్షిణ భారత సినీ చరిత్రలోనే అత్యంత భారీ వ్యయంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం నిర్మాణం నుంచే భారతీయ సినీ వర్గాల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇటీవలే విడుదల చేసిన ఈ చిత్ర ట్రైలర్‌కు సోషల్‌మీడియాలో విశేష ఆదరణ లభించింది. మనిషి, మృగరూపం సమ్మిళితంగా వున్న విక్రమ్ ఆహార్యం సర్వత్రా చర్చనీయాంశమయింది. హాలీవుడ్ సినిమాల్ని తలదన్నే రీతిలో ప్రచార చిత్రం వుందని జాతీయస్థాయిలో ప్రశంసలు లభించాయి.


భారతీయ చలన చిత్ర చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా వినూత్న కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కిందని చిత్ర వర్గాలు వెల్లడించాయి. ఇందులో విక్రమ్ పాత్ర చిత్రణ రెండు భిన్న పార్శాల్లో సాగుతుందని తెలుస్తోంది. థ్రిల్, ఫాంటసీ మేళవించిన ఈ చిత్రంలో సమకాలీన అంశాలు, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై అంతర్లీనంగా చర్చించారని చెన్నై సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కోసం పలువురు విదేశీ సాంకేతిక నిపుణులు పనిచేశారు. ఈ సినిమాకు సంబంధించిన వివిధ భాషా హక్కులు రికార్డుస్థాయిలో అమ్ముడుపోయినట్లు చెన్నై చిత్ర వర్గాలు చెబుతున్నాయి. త్వరలో తెలుగు వెర్షన్ ఆడియోను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Tuesday, October 21, 2014

పెళ్లికి గ్రీన్‌సిగ్నల్!

రణభీర్‌కపూర్, కత్రినాకైఫ్‌ల ప్రేమ వ్యవహారం అందరికీ తెలిసిందే. గత ఐదేళ్లుగా వీరి ప్రేమాయణం సాగుతోంది. ఇదిలావుండగా ఈ జంట త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు బాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారాయి. వివాహం చేసుకోకుండానే కొన్నేళ్లుగా ఈ ప్రేమికుల జంట సహజీవనం చేస్తోంది. ప్రియురాలి కోసం రణభీర్‌కపూర్ తన సొంతం ఇంటిని విడిచిపెట్టిన విషయం తెలిసిందే.
అయితే ఇటీవలే పెళ్లి విషయమై ఇరు కుటుంబాల మధ్య జరిగిన చర్చలు ఫలప్రదంగా ముగిశాయని, వచ్చే ఏడాది ప్రథమార్థంలో వివాహానికి ముహూర్తాన్ని నిశ్చయించారని తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం కత్రినాకైఫ్‌తో వివాహానికి రణభీర్ కపూర్ తండ్రి రిషికపూర్ తొలుత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారని, అయితే కొందరు బాలీవుడ్ పెద్దల మధ్యవర్తిత్వంతో ఆయన వివాహానికి అంగీకరించారని అంటున్నారు. పెళ్లి ఫిబ్రవరి నెలలో జరగొచ్చని తెలుస్తోంది. అత్యంత వైభవంగా విహాహాన్ని జరిపించేందుకు రిషికపూర్ కుటుంబం సన్నాహాలు చేసుకుంటోందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

Wednesday, October 15, 2014

త్రిష తొలిసారిగా ఐటెంసాంగ్



తెలుగులో ఒకప్పుడు అగ్ర కథానాయికగా ఓ వెలుగువెలిగింది చెన్నై చిన్నది త్రిష. వర్ధమాన కథానాయికల జోరుతో ఈ సుందరికి అవకాశాలు కరువయ్యాయి. అయితే తమిళంలో మాత్రం ఇప్పటికీ ఈ సొగసరికి మంచి క్రేజ్ వుంది. అక్కడ నాలుగు చిత్రాల్లో నటిస్తూ బిజీగా వుంది. ఇదిలావుండగా సుదీర్ఘ కెరీర్‌లో ఇప్పటివరకు ప్రత్యేకగీతాల్లో నర్తించని త్రిష తొలిసారిగా అందుకు సిద్ధమవుతోంది. వివరాల్లోకి వెళితే...రజనీకాంత్ కథానాయకుడిగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం లింగా. సోనాక్షిసిన్హా, అనుష్క కథానాయికలు. ఈ చిత్రంలో కథానుగుణంగా ఓ ప్రత్యేకగీతం వుందట. ఇందులో నర్తించే కథానాయిక కోసం పలువురు అగ్రనాయికలు పేర్లను పరిశీలించారు. చివరకు త్రిషను ఎంపికచేశారు. రజనీకాంత్ చిత్రం కావడంతో ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రత్యేక గీతాన్ని చేయడానికి త్రిష అంగీకరించిందని చిత్ర వర్గాలు వెల్లడించాయి. త్వరలో భారీస్థాయిలో ఈ స్పెషల్‌సాంగ్‌ను తెరకెక్కిస్తారని, సినిమాలో ఈ పాట ప్రత్యేక ఆకర్షణగా వుంటుందని అంటున్నారు. దీపావళి కానుకగా ఈ చిత్రం త్వరలో ప్రేక్షకులముందుకురానుంది. 

Tuesday, October 14, 2014

తక్షణ సాయంగా వెయ్యి కోట్లు మోడీ ప్రకటన

 
                    హుద్‌హుద్‌ తుపాను కారణంగా త్రీవంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయ, పునరావాస చర్యలు చేపట్టడానికి తక్షణ సాయంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ వెయ్యికోట్ల రూపాయలు ప్రకటించారు. సర్వే అయిన తర్వాత పూర్తిస్థాయి సాయం అందిస్తామని ఆంద్రప్రదేశ్‌ ప్రభుత్వానికి హామీ ఇచ్చారు. విద్యుత్తు, తాగునీటి సరఫారా, కమ్యూనికేషన్ల వ్యవస్థ పునరుద్దరణే తమ ప్రాథమిక కర్తవ్యమని చెప్పారు. మంగళవారం ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో విశాఖపట్నంకు సుమారు 1.30 గంటలకు చేరుకున్నారు. నగరంలో పర్యటించి నష్టాన్ని ప్రత్యక్షంగా పరిశీలించిన తర్వాత విలేకరుల సమావేశంలో మాట్లాడూతూ సాదారణ పరిస్థితులు నెలకొనే వరకూ విశాఖవాసులకు ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. తుఫాను వల్ల పంటలు నష్టపోయిన విషయాన్ని కూడా బీమా సంస్థలతో మాట్లాడుతానన్నారు. విశాఖను స్మార్ట్‌ సిటీగా చేస్తానని అమెరికాలో చెప్పానని, అలాంటిది ఊహకందని రీతిలో నష్ట ంజరిగిందని వాపోయారు. ఇప్పుడు నష్టం జరిగినంత మాత్రాన నిరుత్సాహ పడక్కర్లేదని కూడా మోడీ ఊరటనిచ్చారు. తర్వలోనే పరిస్థితులు సాధారణ పరిస్థితులకు చేరుకుంటుదని ప్రధాని భరోసా ఇచ్చారు.
అంతక ముందు ఢిల్లీ నుంచి నేరుగా విశాఖకు చేరుకున్న మోడీ గవర్నర్‌ ఇఎస్‌ఎల్‌ నరసింహన్‌, చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, అశోక్‌గజపతిరాజుతోపాటు పలువురు రాష్ట్రమంత్రులు స్వాగతం పలికారు. నగరంలో తుఫాను ప్రభావంతో తీవ్రంగా దెబ్బతిన్న పలు ప్రాంతాలో ప్రధాని పర్యటించారు. అలాగే కలెక్టర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన తుఫాను ప్రభావిత ప్రాంతాల ఫొటో ఎగ్జిబిషన్‌ను మోడీ పరిశీలించారు. ఈ సందర్బంగా మోడీ మాట్లాడుతూ రైల్వేలు, విమానాశ్రయం మరమ్మతు, జాతీయ రహదారులు తదితరాలను కేంద్రమే బాధ్యత తీసుకుంటుందని ప్రధాని భరోసా ఇచ్చారు. మృతులకు లక్షరూపాయాలు, క్షతగాత్రులకు రూ. 50వేలు సాయంగా మోడీ ప్రకటించారు. 

 
తుపాను బాధితులను ఆదుకోవడానికి ముందుకొచ్చిన చిత్ర పరిశ్రమ 
హుదుర్‌ తుపాను ప్రభావానికి తీవ్రంగా నష్టపోయాన ఉత్తరాంధ్ర జిల్లాలను ఆదుకోవడానికి తెలుగు చలన చిత్ర పరిశ్రమ ముందుకువచ్చింది. కథానాయకులు, ఇతరులు విరాళాలు ఇచ్చి తమ పెద్ద మనుసును చాటుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి వారు ప్రకటించిన విరాళాలు
పవన్‌ కల్యాణ్‌ రూ.50 లక్షలు
మహేశ్‌ బాబు రూ. 25 లక్షలు
ప్రభాస్‌ రూ. 20 లక్షలు
జూనియర్‌ ఎన్టీఆర్‌ రూ. 20 లక్షలు
అల్లు అర్జున్‌ రూ. 20 లక్షలు
రామ్‌చరణ్‌ తేజ రూ. 10 లక్షలు మరో 5 లక్షలు రామకృష్ట మిషన్‌కు ప్రకటించారు.
వెంకటసాయి మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీ రాజశేఖర్‌ రూ. 30 లక్షలు

సంపూర్ణేశ్‌ బాబు రూ. 1 లక్ష
సూపర్‌ స్టార్‌ కృష్ణ రూ. 15 లక్షలు
విజయనిర్మల రూ. 10 లక్షలు


మూగబోయిన పోన్లు

                     ఆంధ్రప్రదేశ్‌లోని తుపాను ప్రభావిత విశాఖపట్టణం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో మూగబోయిన ఫోన్లు పూర్తిస్థాయిలో పనిచేయడానికి మరో వారం రోజులు పట్టే అవాకాశం ఉంది. ప్రస్తుతం విశాఖ నగరంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ ల్యాండ్‌లైన్లను పునరుద్ధరించడానికి అధికారులు యుద్ధప్రాతిపదికన పని చేస్తున్నారు. అవసరమైన కేబుల్స్‌, సామగ్రిని ఇతర ప్రాంతాల నుంచి విశాఖకు పంపిస్తున్నారు. ఈ పనుల పర్యవేక్షణకు హైదరాబాదు నుండి పలువురు ఉన్నతాధికారులు విశాఖపట్టం వెళ్లారు. ఈ మూడు జిల్లాలో ఉన్న మొత్తం సెల్‌టవర్లలో సగానికి పైగా విరిగిపోయాయని విశ్వసనీయ సమాచారం.
 

చిన్నారి గిరిజ చనిపోయింది



రంగారెడ్డి జిల్లాలోని మంచాల మండలం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. బోరు బావిలో పడిపోయిన చిన్నారి గిరిజ మృతి చెందిందని మంత్రి మహేందర్‌ రెడ్డి ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా గిరిజ తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. ప్రాణాలతో తిరిగి వస్తుందని అనుకున్న కుటుంబ సభ్యులు ఈ వార్త వినడంతో కుప్పకూలిపోయారు. అధికార యంత్రాంగం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. గడిచిన రెండు రోజులుగా రెస్క్యూ టీం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగించింది. ఆదివారం మధ్యాహ్నం వ్యవసాయ క్షేత్రంలో అడుకుంటున్న గిరిజ (5) ప్రమాదవశాత్తు 60 అడుగులున్న బోరు బావిలో పడిపోయింది. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. చిన్నారిని వెలికి తీసేందుకు ప్రోక్లెయ్నిర్లు, సింరేణి నుంచి వచ్చిన ప్రత్యేక బృందం సహాయక చర్యలు చేపట్టారు. భూమి లోపల బండరాళ్లు అడ్డు తగిలాయి. దీనితో గ్రిల్స్‌ వేస్తూ చర్యలు చేపట్టారు. బాలికను రక్షించేందుకు 4 జేసీబీలతో బోరుబావికి సమాంతరంగా 45 అడుగుల లోతులో గొయ్యి తవ్వి 8 సిలిండర్ల ఆక్సిజన్‌ పంపించినా ప్రయేజనం లేకపోయింది. అత్యాధునికమైన సిసి కెమెరాల సాయంతో చిన్నారిని గుర్తించారు. ఆమె మృతి చెందిందని చేప్పారు. మృతదేహంపైన మూడు అడుగుల నీరు ఉందని గ్రహించారు.

Monday, October 13, 2014

కామెడీ హీరోతో అనుష్క రొమాన్స్


         టాలీవుడ్, కోలీవుడ్‌లలో భారీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న అనుష్క తాజాగా తమిళ హాస్యనటుడు సంతానంతో కలిసి ఓ సినిమాలో రొమాన్స్ చేయడానికి ఒప్పుకుందన్న ప్రచారం ప్రస్తుతం కోలీవుడ్‌లో వినపడుతోంది. ఇంతకుముందు ప్రముఖ తమిళ నటుడు ఆర్య హీరోగా నటించిన బాస్ ఎన్గిర భాస్కరన్ చిత్రాన్ని దర్శకుడు రాజేష్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో ఆర్యతో పాటు అతడి స్నేహితుడిగా సంతానం కామెడీ పాత్రలో చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఇప్పుడు రాజేష్ దర్శకత్వంలోనే తెరకెక్కే కొత్త చిత్రంలో వీరిద్దరు కలిసి నటించనున్నారు. ఈ సినిమాలో ఆర్య సరసన తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. సంతానం సరసన అనుష్కను నటింపజేయాలని చిత్రదర్శక నిర్మాతలు ఆమెను సంప్రదించారట. దర్శకుడు రాజేష్ లింగా చిత్రం షూటింగ్ స్పాట్‌కు వెళ్లి ఆమెను సంప్రదిస్తే ఆమె వెంటనే ఒప్పుకుందని టాక్. మరో విశేషం ఏంటంటే ఈ చిత్రాన్ని దర్శకుడు రాజేష్, హీరో ఆర్య కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం కోలీవుడ్‌లో వినపడుతున్న టాక్ ఏంటంటే ఎలాగు భారీ చిత్రాలు అయిపోతే తర్వాత అనుష్క చేతిలో పెద్ద ప్రాజెక్టులేమి లేవు. ఆమెకు ఇప్పటకే 34 సంవత్సరాలు వచ్చేశాయి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకున్నట్టు వయస్సలో ఉండగానే నాలుగు రాళ్లు వెనకేసుకోపోతే ఎందుకన్నట్టు కామెడీ నటుల పక్కన కూడా హీరోయిన్‌గా నటించేందుకు ఒప్పేసుకుంటుందని గుసగుసలాడుకుంటున్నారు.

గోపీచంద్‌ తండ్రయ్యాడు

 హీరో గోపీచంద్‌ తాజాగా తండ్రయ్యాడు. ఇటీవలే గోపీచంద్‌ తండ్రి కాబోతున్నాడనే విషయం మీడియాలో తెగ ప్రచారం జరిగిన విషయం తెల్సిందే.   తాజాగా నేడు ( అక్టోబర్‌ 13) గోపీచంద్‌ భార్య రేష్మి పండంటి బాబుకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ' లౌక్యం' చిత్ర యూనిట్‌ మీడియాకు వెళ్లడించింది. గోపీచంద్‌ తాజాగా నటించిన ' లౌక్యం' చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆచిత్రం విజయంతో పాటు బాబు పుట్టాడనే సంతోషయంతో గోపీచంద్‌ ఉన్నాడు. గత సంవత్సరం హీరో శ్రీకాంత్‌ మేనకోడలును పెళ్లి చేసుకున్నాడు.

Sunday, October 12, 2014

వణికించిన హుదూద్‌!

 తీవ్ర పెను తుఫాన్‌గా మారిన హుదూద్ ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ తీరం దిశగా శరవేగంగా దూసుకొస్తున్నది. భారీ నుంచి అతి భారీ వర్షాలు, ప్రచండమైన ఈదురుగాలులతో ఆదివారం మధ్యాహ్నం విశాఖ సమీపంలో తీరాన్ని ఢీకొట్టనుంది. గంటకు 195 కిలోమీటర్ల వేగంతో వీచే గాలుల మధ్య తీరం దాటనున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా జిల్లాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి.


తీరం దాటే సమయంలో భారీ వర్షాలు

                        హుదూద్ తుఫాన్ తీరందాటే సమయంలో ఆంధ్రప్రదేశ్, ఒడిశాలోని పలు ప్రాంతాల్లో, భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతాయని భావిస్తున్నారు. విశాఖపట్టణానికి ఆగ్నేయ దిశలో 260 కిలోమీటర్ల దూరంలో, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు దక్షిణ ఆగ్నేయ దిశలో 350 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న తుఫాన్.. గత కొద్ది గంటలుగా పశ్చిమ వాయవ్య దిశగా కదులుతున్నది. ఇది ఉత్తరాంధ్ర తీరం మీదుగా ప్రయాణించి విశాఖపట్టణం సమీపంలో ఆదివారం మధ్యాహ్నం తీరం దాటనుందని భారత వాతావరణశాఖ శనివారం తన బులిటెన్‌లో తెలిపింది.


 మరో 3 రోజులుకుంభవృష్టి    హుదూద్‌ తుఫాన్‌ ప్రభావం కారణంగా మరో మూడు రోజులపాటు ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా విశాఖలో పరిస్ధితి తీవ్రంగా ఉంటుందని వెల్లడించింది. ఆదివారం సాయంత్రం వరకు తుఫాన్‌ ప్రభావం కొంతమేరకు తగ్గినా కూడా ఈ నెల 15 వ తేదీ వరకూ కుంభవృష్టి కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ఒడిశాలో గాలులు తీవ్రత అంతగాలేదని, దక్షిణ ఒడిశాలో మాత్రం విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వర్గాలు వెల్లడించాయి.

తూర్పు గోదావరి జిల్లాల్లోనూ హుదుద్‌ ప్రభావం
                హుదుద్‌ తుఫాను ప్రభావం తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలంపై తీవ్రప్రభావాన్ని చూపించింది. మండలంలోని తిర్రియానం, పల్లంకుర్రు, వలసలతిప్ప గ్రామాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. తుపాను ప్రభావంతో పల్లంకుర్రు గ్రామంలోని పాఠశాలలో బాధితుల కోసం పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. ముమ్మిడివరం ఎమ్మెల్యే సుబ్బరాజు పునరావాలస కేంద్రానికి చేరుకుని బాధితులతో మాట్లాడారు. హుదుద్‌ తుఫాను నేపథ్యంలో విశాఖలోని పునరావాస కేంద్రాల్లో ఉన్న వారి కోసం తూర్పుగోదావరి జిల్లా నుండి లక్ష ఆహార పొట్లాలను ప్రభుత్వం తరలించింది. మరో పక్క విశాఖ నగరంలో పరిస్థితి అస్తవ్యస్థంగా ఉంది. ఈదురుగాలులకు కూలిన కటౌట్లు, ఫ్లెక్సిలు, చెట్ల కొమ్మలతో రోడ్లన్నీ నిండిపోయాయి. పలు వీధులు ద్విచక్ర వాహనాలను నడిపించే పరిస్థితి కూడా లేదంటున్నారు. 


విశాఖలో ఇళ్లకే పరిమితమైన ప్రజలు
                          హుదుద్‌ తుఫాను ప్రభావం విశాఖ నగరంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. తుఫాను తీరం దాటిన సమయం నుండీ భారీ ఈదురుగాలులతో విశాఖ నగరం అతలా కుతలం అయింది. దీనికి తోడు భారీ వర్షం కురుస్తుండడంతో వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ప్రజలు ఇళ్ల నుండి బయటికి వచ్చే పరిస్థితి లేకుండా పొయింది. ముందస్తు చర్యల్లో భాగంగా శనివారం సాయంత్రమే విద్యుత్‌ అధికారులు సరఫరాను నిలిపి వేశారు. దీంతో నగరంలో అంధకారం నెలకొంది. తుఫాను సమాచారం తెలుసుకునేందుకు ప్రజలు రేడియోలను ఆశ్రయిస్తున్నారు. తుఫాను బాధితుల కోసం షెల్టర్లుగా రైలు బోగీలు కాగా తుపాను బాధితుల కోసం ఖాళీ రైలు బోగీలను షెల్టర్లుగా ఉపయోగించాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. దీని కోసం రాజమండ్రి నుండి విశాఖ వరకు 55 ఖాళీ రైలు కోచ్‌లను పంపించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఒడిసా తీరంపై హుదుద్‌ ప్రభావం పాక్షికంగా ఉంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అధికారులు పలువురిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. గోపాల్‌పూర్‌, భవనేశ్వర్‌, కటక్‌, గంజామ్‌ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. గోపాల్‌పూర్‌ తీరంలో బలమైన అల ఒక యువతిని సముద్రంలోకి లాగేయడంతో స్థానికులు ఆమెను రక్షించారు.

Saturday, October 11, 2014

రెండో వన్డేలో భారత్‌ గెలుపు

 టీమిండియా పుంజుకుంది. విండీస్‌తో రెండో వన్డేలో ఘన విజయం సాధించి కోచి పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో సమిష్టిగా రాణించిన ధోనీసేన రెండో వన్డేలో 48 పరుగుల తేడాతో గెలుపొంది సిరీస్‌ను 1-1కు సమం చేసింది. విరాట్‌ కోహ్లి (62, 78 బంతుల్లో 5ఫోర్లు), సురేష్‌ రైనా (62, 60 బంతుల్లో 5ఫోర్లు, 2సిక్స్‌లు), హాఫ్‌ సెంచరీలతో కదం తొక్కారు. కెప్టెన్‌ ధోని (51 నాటౌట్‌) ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. ఛేదనలో విండీస్‌ ఓపెనర్‌ స్మిత్‌ (97) రాణించినా జట్టును ఓటమి నుంచి తప్పించలేదు. బౌలర్లు షమి, జడేజా, మిశ్రాలు విండీస్‌ పతనాన్ని శాసించారు.
263 పరుగుల ఛేదనలో విండీస్‌కు అదిరే ఆరంభం లభించింది. ఓపెనర్లు డ్వేన్‌ స్మిత్‌ (97), డారెన్‌ బ్రావో (26) 64 పరుగులతో శుభారంభాన్ని ఇచ్చారు. లెండ్లీ సిమ్మోన్స్‌ గాయం కారణంగా ఓపెనర్‌గా వచ్చిన బ్రావో..స్మిత్‌తో కలిసి స్వేచ్ఛగా బ్యాటింగ్‌ చేశాడు. అర్థ సెంచరీ భాగస్వామ్యంతో సాఫీగా వెళ్తోన్న విండీస్‌ ఇన్నింగ్స్‌కు మహ్మద్‌ షమి బ్రేక్‌ ఇచ్చాడు. చక్కటి బంతితో బ్రావో వికెట్లను గిరాటేసి టీమిండియాకు బ్రేక్‌ ఇచ్చాడు. ఆల్‌ రౌండర్‌ పొలార్డ్‌ (40) పించ్‌ హిట్టర్‌గా ఎడాపెడా బౌండరీలు బాదాడు. మూడు సిక్స్‌లు కొట్టిన పొలార్డ్‌..మిశ్రా బౌలింగ్‌లో మరో భారీ షాట్‌కు యత్నించి వికెట్‌ను సమర్పించుకున్నాడు. ఓపెనర్‌ డ్వేన్‌ స్మిత్‌ ఏమాత్రం జోరు తగ్గించకుండా నిర్థాక్షిణ్యంగా బౌండరీలు బాదాడు. 11 ఫోర్లు, రెండు సిక్స్‌లు సాధించిన స్మిత్‌ సెంచరీ ముంగిట షమికి వికెట్‌కు కోల్పోయాడు. తొలి వన్డే సెంచరీ హీరో శామ్యూల్స్‌ (16)ను ఉమేష్‌ యాదవ్‌ పెవిలియన్‌కు చేర్చాడు. దినేస్‌ రామ్‌దిన్‌ (3)ను మిశ్రా తన ఆఖరి ఓవర్‌లో ఔట్‌ చేశాడు. వరస ఓవర్లలో ఫామ్‌లో ఉన్న శామ్యూల్స్‌, రామ్‌దిన్‌లు ఔట్‌ కావటంతో విండీస్‌ ఒత్తిడిలో పడింది. కెప్టెన్‌ బ్రావో(10), డారెన్‌ సామీ (1), రస్సెల్‌ (4)లను వెంటవెంటనే పెవిలియన్‌ చేర్చిన ధోనీసేన మ్యాచ్‌పై పట్టు బిగించింది.
రాణించిన కోహ్లి, రైనా : టాస్‌ గెలిచిన భారత్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. అయితే, టీమిండియాకు కోచి వన్డేలాగా శుభారంభం మాత్రం దక్కలేదు. ఓపెనర్లు త్వరగానే పెవిలియన్‌ చేరి నిరుత్సాహపరిచారు. ఫామ్‌లో ఉన్న శిఖర్‌ ధావన్‌ (1)ను టేలర్‌ బలిగొనటంతో టీమిండియా పరుగుల వేటలో వెనకంజ వేసింది. మరో ఓపెనర్‌ అజింక్య రహానే(12) సామీ బౌలింగ్‌లో సులభమైన క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. తెలుగు కుర్రాడు అంబటి రాయుడు (32) మరోసారి చక్కటి శుభారంభాన్ని భారీ స్కోరుగా మలచటంలో విఫలమయ్యాడు. కోహ్లితో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే యత్నంలో రాయుడు స్పిన్నర్‌ సులేమాన్‌ బెన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. రాయుడు నిష్క్రమణ అనంతరం కోహ్లికి జతకలిసిన రైనా టీమిండియాకు భారీ భాగస్వామ్యాన్ని అందించాడు. కోహ్లి నెమ్మదిగా ఆడినా రైనా మంచి స్ట్రయిక్‌ రేట్‌తో బ్యాటింగ్‌ చేశాడు. స్ట్రయిక్‌ రొటేట్‌ చేస్తూ ఇన్నింగ్స్‌ను నిర్మించిన కోహ్లి, రైనా నాల్గో వికెట్‌కు 104 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈక్రమంలోనే రైనా, కోహ్లిలు అర్థ శతకాలు పూర్తి చేశారు. ఐదు ఫోర్లు, రెండు సిక్స్‌లు బాదిన రైనా..మరో సెంచరీ దిశగా సాగుతున్నట్లే కనిపించాడు. స్కోరు వేగాన్ని పెంచే క్రమంలో భారీ షాట్‌కు యత్నించిన రైనా పెవిలియన్‌ బాట పట్టాడు. హాఫ్‌ సెంచరీతో ఫామ్‌లోకొచ్చిన కోహ్లి..ఈఏడాది ఫిబ్రవరి తర్వాత (వన్డే, టెస్ట్‌ల్లో) నమోదు చేసిన ఏకైక అర్థ శతకం ఇదే కావటం విశేషం. కెప్టెన్‌ ధోని (51నాటౌట్‌, 40 బంతుల్లో 5ఫోర్లు, 1సిక్స్‌) ఆఖర్లో ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో జట్టు స్కోరును 250 దాటించాడు. రవీంద్ర జడేజా (6) కీలక సమయంలో పరుగులు చేయటంలో విఫలమయ్యాడు.

Wednesday, October 1, 2014

అమీర్‌ఖాన్‌తో సినిమా!

 దర్శకుడు రాజమౌళికి బాలీవుడ్‌లో కూడా మంచి గుర్తింపు వుంది. ఆయన దర్శకత్వం వహించిన విక్రమార్కుడు మర్యాద రామన్న చిత్రాలు హిందీలో పునర్నిర్మించబడి భారీ విజయాల్ని సొంతం చేసుకున్నాయి. తాజాగా షాహిద్‌కపూర్ హీరోగా సాజిద్‌నదియావాలా దర్శకత్వంలో మగధీర చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని హిందీలో డబ్బింగ్ చేసి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.             
                          ఇదిలావుండగా ఇటీవల ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమీర్‌ఖాన్ హీరోగా హిందీ చిత్రానికి దర్శకత్వం వహించే ఆలోచన వున్నట్లు రాజమౌళి వెల్లడించారు. హిందీ చిత్రాల్ని తక్కువగా చూస్తాను. అయితే అమీర్‌ఖాన్, దర్శకుడు రాజ్‌కుమార్‌హీరాని సినిమాలంటే నాకు చాలా ఇష్టం. భవిష్యత్తులో అమీర్‌ఖాన్ హీరోగా సినిమా చేయాలనే ఆలోచన వుంది. అందుకు ఆయన అంగీకరిస్తాడని ఆశిస్తున్నాను అని చెప్పారు రాజమౌళి.