Saturday, May 7, 2016

నన్ను ఇంతవాణ్ని చేసింది అభిమానులే!


‘‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాకి పనిచేసినప్పుడు మనిషిగా ఎదిగా. ‘బ్రహ్మోత్సవం’తో మరిన్ని విషయాలు నేర్చుకొన్నాన’’న్నారు మహేష్‌బాబు. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘బ్రహ్మోత్సవం’. సమంత, కాజల్‌, ప్రణీత కథానాయికలు. పీవీపీ సంస్థ నిర్మించింది. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహించారు. మిక్కీ జె.మేయర్‌ సంగీతం అందించిన ఈ చిత్రంలోని గీతాలు శనివారం హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. తొలిసీడీని మహేష్‌ ఆవిష్కరించి చిత్రబృందానికి అందజేశారు. ప్రచార చిత్రాన్ని సమంత, కాజల్‌, రేవతి, సత్యరాజ్‌ విడుదల చేశారు. మహేష్‌బాబు మాట్లాడుతూ ‘‘ఈ రోజు చాలా ప్రత్యేకం. ఎందుకంటే మా అమ్మాయి సితార ఈ ఆడియో ఫంక్షన్‌కి వచ్చింది. నా సినిమాల పాటల వేడుకకు సితార రావడం ఇదే తొలిసారి. అందరికీ మంచే జరుగుతుంది. ఈ సినిమాతో పెద్ద పెద్ద స్టార్స్‌తో పనిచేసే అవకాశం దక్కింది. వాళ్ల నుంచి చాలా నేర్చుకొన్నా. మరీ ముఖ్యంగా సత్యరాజ్‌గారికి నేను పెద్ద అభిమానిని. ఆయనతో కలసి పనిచేయడం ఓ గౌరవం. తోట తరణి గారి గురించి మాట్లాడే అనుభవం నాకు లేదు.‘అర్జున్‌’లో ఆయన వేసిన సెట్‌ ఎప్పటికీ మర్చిపోను. నేను ఫోన్‌ చేసి అడగ్గానే ఈ సినిమా చేయడానికి ఒప్పుకొన్నారు రత్నవేలు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ నా కెరీర్‌లో బెస్ట్‌ ఆల్బమ్‌. దానికంటే ఈ సినిమాలో పాటలు ఇంకా బాగుంటాయి. దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల అంటే నాకు చాలా ఇష్టం. చాలా స్వచ్ఛంగా ఉంటారాయన. పరిశ్రమ వ్యక్తులతో పెద్దగా కలవరు. అందుకే అంత స్వచ్ఛంగా ఉంటారేమో? ఆయనతో ఇంకా చాలా సినిమాలు చేయాలి. పీవీపీ లాంటి అభిరుచి ఉన్న నిర్మాతల అవసరం చాలా ఉంది. అభిమానుల గురించి నేనెప్పుడూ పెద్ద మాటలు మాట్లాడను. నిజంగా ప్రేమ ఉంటే మాటలతో దాన్ని వ్యక్తపరచలేం. నన్ను ఇంత వాణ్ని చేసింది అభిమానులే. ఈ నెల 20న ‘బ్రహ్మోత్సవం’ విడుదలవుతుంది. థియేటర్లలో పండగ చేసుకొందామ’’న్నారు.
‘‘మంచి అభిరుచి ఉన్న నిర్మాణ సంస్థ పీవీపీ. తెలుగు, తమిళ భాషల్లో ఉత్తమ చిత్రాల్ని నిర్మిస్తున్నారు. శ్రీకాంత్‌ అడ్డాల తీసిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చూశా. సహజంగా ఉంటుందా కథ. పాత్రలు నటిస్తున్నట్టు ఎక్కడా కనిపించదు. ప్రవర్తిస్తున్నట్టు అనిపిస్తుంది. ‘బ్రహ్మోత్సవం’ ప్రచార చిత్రం బాగుంది. గత చిత్రాల కంటే మహేష్‌ అందంగా కనిపిస్తున్నాడు. మీక్కీ జె. మేయర్‌ అందించిన సంగీతం నచ్చింది. ‘శ్రీమంతుడు’ మహేష్‌ చిత్రాల్లో రికార్డు వసూళ్లు సాధించింది. ‘బ్రహ్మోత్సవం’ అంతకంటే గొప్పగా ఆడాలి. నిర్మాతలకు మంచి డబ్బులు తీసుకురావాలి’’ అని ఆకాంక్షించారు కృష్ణ. కాజల్‌ మాట్లాడుతూ ‘‘నా ఆలోచనలకు దగ్గరగా ఉండే కథ ఇది. అందుకే ఇష్టంగా చేశా. నటీనటులకు సినిమా ఓ మతం. ఆ మతానికి ‘బ్రహ్మోత్సవం’ ఓ ప్రార్థనా గీతం’’ అంది. ‘‘ఏ సినిమా చేసినా అందులో నేను ఎలా నటించాను? అనే టెన్షన్‌ ఉంటుంది. అదే మహేష్‌ సినిమా అయితే ‘మహేష్‌ పక్కన నేను ఎలా కనిపిస్తా’ అనే టెన్షన్‌ మొదలవుతుంది. తల్లిదండ్రులు తమ పిల్లల్ని వెతుక్కొంటూ వెళ్లడం మామూలే. కానీ ఈ సినిమాలో పిల్లలు తమ మూలాల్ని వెతుక్కొంటూ చేసే ప్రయత్నం కొత్తగా అనిపించింది. శ్రీకాంత్‌ అడ్డాల మాత్రమే ఇలాంటి సినిమా చేయగలర’’ని సమంత చెప్పింది.
దర్శకుడు మాట్లాడుతూ : ‘‘ఇంతమంది సీనియర్‌ నటీనటుల మధ్య, సాంకేతిక నిపుణుల మధ్య పనిచేయాలంటే కాస్త బెరుకుగా ఉండేది. మహేష్‌బాబు చిరునవ్వు చూస్తే అది మాయమైపోయేది. ఆయనే నన్ను ముందుకు నడిపించారు. ఆయన నాకిచ్చిన రెండో అవకాశం ఇది. దాన్ని నిలుపుకోవడానికి శక్తివంచన లేకుండా కృషి చేశా’’ అన్నారు. మిక్కీ జె.మేయర్‌ చెబుతూ ‘‘నెలల తరబడి ఈ పాటల కోసం కష్టపడ్డాం. పాటలు రాసిన వాళ్లకూ, పాడిన వాళ్లకూ కృతజ్ఞతలు. మహేష్‌బాబు సినిమాకి సంగీతం అందించడం ఇది రెండోసారి. ఆయనతో పనిచేయడం ఓ గౌరవం. ఈ సినిమాలో చాలామంది గొప్ప నటీనటులున్నారు. రేవతి గారికి నేను పెద్ద అభిమానిని. ఈ పాటలు అందరికీ నచ్చుతాయన్న నమ్మకం ఉంద’’న్నారు. నమ్రత, విజయనిర్మల, నరేష్‌, రావు రమేష్‌, సుధీర్‌బాబు, పరుచూరి వెంకటేశ్వరరావు, గోపాలకృష్ణ, ప్రణీత, జయసుధ, రేవతి, సత్యరాజ్‌, వంశీ పైడిపల్లి, రత్నవేలు, తోట తరణి, కె.ఎస్‌.రామారావు తదితరులు పాల్గొన్నారు.

పెళ్లికి గ్రీన్‌సిగ్నల్!

 బాలీవుడ్‌లో అత్యంత యోగ్యుడైన బ్రహ్మచారిగా ముద్రపడిన సల్మాన్‌ఖాన్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నట్లు సమాచారం. గతంలో ఎన్నో ప్రేమ వ్యవహారాల్ని నడిపిన ఆయన ప్రస్తుతం రొమానియాకు చెందిన లూలియా వాంటూర్ అనే సుందరితో డేటింగ్ చేస్తున్నాడు. ఈ సంవత్సరాంతంలో సల్మాన్ ఆమెను పెళ్లాడబోతున్నాడని ముంబై సినీ వర్గాల్లో వినిపిస్తోంది. సల్మాన్‌ఖాన్ తల్లి సల్మాఖాన్ ఆరోగ్యం కుదురుగా వుండటం లేదని, తల్లి కోరిక మేరకు సల్మాన్‌ఖాన్ వివాహం చేసుకోవడానికి అంగీకరించాడని చెబుతున్నారు. డిసెంబర్‌లో పెళ్లికి ముహూర్తాన్ని ఖరారు చేసే పనిలో సల్మాన్‌ఖాన్ కుటుంబ సభ్యులు వున్నారని తెలిసింది.

ఆ కల ఇప్పటికి నెరవేరింది

 కథాబలం ఉన్న చిత్రాల్లో నటిస్తూ, హీరోగా  మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సందీప్ కిషన్. ప్రస్తుతం రాజసింహ దర్శకత్వంలో ‘ఒక్క అమ్మాయి తప్ప’ చిత్రంలో నటించారాయన. నేడు సందీప్ కిషన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన విశేషాలు.
* హైటెక్‌సిటీ ఫ్లై ఓవర్ ట్రాఫిక్‌లో జరిగే ప్రేమకథ ఇది. ఇద్దరు ప్రేమికులు ఆ ట్రాఫిక్‌ను దాటుకుని సమస్య నుంచి ఎలా బయటపడ్డారన్నదే కథ. రియలిస్టిక్ ఎమోషన్స్ బేస్ చేసుకుని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రం తెరకెక్కించాం. స్క్రీన్‌ప్లే సినిమాను పరిగెత్తిస్తుంది.

* కళాశాల అంటే ఇష్టం లేక మధ్యలోనే చదువు ఆపేసే పాత్రలో నటించా. ఎదుటివారి మనసు చదివేంత తెలివితేటలున్న అబ్బాయి పాత్ర ఇది. కమర్షియల్ డెరైక్టర్స్‌లో రాజసింహ బెస్ట్ డెరైక్టర్. నేను ఎంచుకున్న మంచి కథల్లో ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’, ‘ఒక్క అమ్మాయి తప్ప’ కూడా ఉంటాయి.  నిత్యామీనన్ ఈ చిత్రం ఒప్పుకోవడానికి కారణం కథే. నాకు, నిత్యామీనన్‌కు హైట్ విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు. సెట్‌లో ఒకరిపై ఒకరు సరదాగా జోకులు వేసుకునేవాళ్లం. మంచి కథ అయితే నెగటివ్ పాత్రల్లో నటిస్తా. హిట్టు, ఫ్లాప్ గురించి పట్టించుకోకుండా ముందుకెళుతుంటా.   

* నేను ఇండస్ట్రీకొచ్చిన కొత్తలో కృష్ణవంశీగారితో పనిచేయాలనుకునేవాణ్ణి. ‘నక్షత్రం’ చిత్రంతో ఆ కల నెరవేరింది. నేను, లావణ్యా త్రిపాఠి కలిసి తమిళంలో ‘మాయవన్’ అనే చిత్రం చేస్తున్నాం. అలాగే మరో తమిళ సినిమాలో నటిస్తున్నాను.