Saturday, November 21, 2015

సినిమా రివ్యూ: చీకటి రాజ్యం


రేటింగ్‌: 2.75/5


               ఫ్రెంచ్‌ సినిమా 'స్లీప్‌లెస్‌ నైట్‌'కి అధికారిక రీమేక్‌ అయిన 'చీకటి రాజ్యం' సగటు ఇండియన్‌ మసాలా చిత్రాల మూస పోకడలన్నిటికీ భిన్నంగా తెరకెక్కింది. హాలీవుడ్‌ లేదా ప్రపంచ భాషల్లో ఏ సినిమాల్లో చూసినా హీరో గ్లోరిఫికేషన్‌ అనేది యాక్షన్‌ సినిమాల్లో తప్ప మిగతా వాటిలో ఉండదు. కానీ మనకి ప్రతి సినిమాలోను కథానాయకుడినే హైలైట్‌ చేస్తుండాలి. 'చీకటి రాజ్యం' ఎలాంటి 'నేల విడిచి సాము' చేయని ఒక మామూలు థ్రిల్లర్‌. కథాపరంగానే పాత్రలన్నీ కనిపిస్తుంటాయి తప్ప ఒకరు హీరో, ఒకరు హీరోయిన్‌, వీళ్లకో పాట, వీళ్లకిక్కడ కామెడీ అంటూ కొలతలేమీ ఉండవు.
               రొటీన్‌ పోకడలేం లేకపోవడం వల్ల 'చీకటి రాజ్యం' ఫ్రెష్‌ అనుభూతినిస్తుంది. స్టోరీగా చెప్పుకుంటే చాలా సింపుల్‌ పాయింట్‌. కొకైన్‌ బ్యాగ్‌ స్వాధీనం చేసుకున్న అండర్‌ కవర్‌ పోలీస్‌ (కమల్‌) కొడుకుని విలన్‌ (ప్రకాష్‌రాజ్‌) కిడ్నాప్‌ చేస్తాడు. బ్యాగ్‌ ఇస్తే పిల్లాడ్ని ఇస్తా అని డీల్‌ మాట్లాడితే ఆ బ్యాగ్‌ పట్టుకుని వెళ్లిన పోలీస్‌ తమ డిపార్ట్‌మెంట్‌ వాళ్లకే (త్రిష, కిషోర్‌) క్రిమినల్‌గా కనిపిస్తాడు. విలన్‌ ఉన్న పబ్‌లోకి వెళ్లి బ్యాగ్‌ని బాత్రూమ్‌లో దాచి కొడుకు క్షేమం తెలుసుకుని బ్యాగ్‌ ఇచ్చేద్దామని వస్తే అక్కడ అది ఉండదు. తన వెనకపడ్డ పోలీసులు అది తీసేస్తారు. ఆ బ్యాగ్‌ ఇవ్వకపోతే కొడుకుని సేఫ్‌గా తీసుకెళ్లడం కష్టమైన పరిస్థితుల్లో ఆ పోలీస్‌ ఏం చేస్తాడు? రాత్రి గడిచేలోగా కొడుకుని ఎలా కాపాడుకుంటాడు?
                           కథ మొత్తం ఇరవై నాలుగు గంటల్లో నడుస్తుంది. దాదాపుగా ఒక నైట్‌ క్లబ్‌లోనే సినిమా అంతా సాగుతుంది. కొడుకుని కాపాడుకునే ప్రయత్నంలో తండ్రి, క్రిమినల్‌ కాప్‌ని పట్టుకోవాలనే లేడీ పోలీస్‌, కొకైన్‌ బ్యాగ్‌ కోసం చూసే డాన్‌, అతడినుంచి కొకైన్‌ ఆశిస్తున్న మరో క్రిమినల్‌ (సంపత్‌ రాజ్‌), తండ్రి కోసం ఎదురు చూస్తూ ఒక కిడ్నాపర్‌తో కాలక్షేపం చేసే కొడుకు, బాయ్‌ఫ్రెండ్‌తో పబ్‌కొచ్చి అతని నిజ స్వరూపం తెలిసి కాపాడిన పోలీస్‌ వెంట తిరిగే నర్స్‌ (మధు షాలిని)... ఇలా వివిధ క్యారెక్టర్స్‌ అన్నీ ఆ నైట్‌ క్లబ్‌లో చేరితే తెల్లారేలోగా కథ కంచికెలా చేరుతుందనేదే 'చీకటి రాజ్యం'. కిడ్నాప్‌, కొకైన్‌, క్లబ్‌, పోలీస్‌.. ఇలా అన్నీ ఒక బిగి సడలని థ్రిల్లర్‌కి కావాల్సిన లక్షణాలే ఉన్నాయి. కానీ 'చీకటి రాజ్యం' మాత్రం ఆద్యంతం చప్పగా సాగిపోతుంది. 


ప్రథమార్థం వరకు ఎలాంటి థ్రిల్స్‌ లేకుండా మామూలుగా వెళ్లిపోయినా ద్వితీయార్ధంలో అయినా కథనంలో ట్విస్టులు, ఎడ్జ్‌ ఆఫ్‌ ది సీట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌లాంటివి కోరుకుంటాం. కానీ 'చీకటి రాజ్యం' ద్వితీయార్ధం కూడా ఏ విధమైన ఎక్సయిట్‌మెంట్‌ లేకుండా అలా ఫ్లాట్‌గా వెళ్లిపోతుంది. క్రిమినల్‌ చేతిలో కొడుకు కిడ్నాప్‌ అయి ఉన్నాడు, తండ్రి కీలకమైన కొకైన్‌ బ్యాగ్‌ పోగొట్టుకున్నాడంటే ఉత్కంఠ పుట్టించే అవకాశమున్న సరంజామా ఉన్నా కానీ ఎంతసేపు ఒకరికి కనిపించకుండా ఒకరు తప్పించుకు తిరగడమే సరిపోయింది. కొకైన్‌ బ్యాగ్‌ మిస్‌ అయినప్పుడు దానికి బదులుగా మైదా పిండి ప్యాకెట్లు పట్టుకెళ్లి ఇవ్వడం, ఆ బ్యాగ్‌ చుట్టూ నడిపిన పాటి కాస్త డ్రామా అయినా మళ్లీ ఎక్కడా లేకపోయింది. అంతో ఇంతో బాగున్న అంశం ఏదైనా ఉంటే కమల్‌హాసన్‌, త్రిషల ఫైట్‌ సీన్‌. హీరో హీరోయిన్లు సీరియస్‌గా ఫైట్‌ చేసుకోవడం తరచుగా చూసే సన్నివేశం కాదుగా. 
               ఫైట్ల చిత్రీకరణ మాత్రం బాగా చేసారు. నిజంగా ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటే ఎలా ఉంటుందో అలానే అనిపిస్తుంది తప్ప ఎక్కడా సినిమాటిక్‌ ఫీల్‌ ఉండదు. షర్టు నలగకుండా కొట్టేసే హీరో కనిపించడు. ఒకడ్ని కొట్టి చెయ్యి నొప్పెడితే ఆ బాధని భరిస్తున్న సంగతి చూపెడతాడు. సహజత్వానికి దగ్గరగా ఉందనేది ప్లస్‌ పాయింటే కానీ ఆకట్టుకునే కథనం లేకపోవడంతో ఇది వెండితెరపై వీక్షించే సినిమాలా అనిపించలేదు. ఏదో సరదాగా డివిడిలో కాలక్షేపం చేయడానికి పనికొచ్చే బాపతు సినిమా అన్నమాట. తన ప్రతి సినిమాలోను హాస్యం జోడించే ప్రయత్నం చేసే కమల్‌ ఇందులో కూడా అక్కడక్కడా కామెడీని ఇరికించారు కానీ సీరియస్‌ సెటప్‌ మధ్య అదంతగా పేలలేదు. 
                         కమల్‌లోని నటుడ్ని పరీక్షించేంత సీన్‌ ఉన్న క్యారెక్టర్‌ కాదు. ఆయన చాలా ఈజీగా చేసుకుపోయాడు. త్రిష మేకప్‌ లేకుండా పోలీస్‌ పాత్రలో సహజంగా కనిపించింది. పదేళ్లుగా హీరోల వెంట చెట్లు, పుట్టలు తిరుగుతోన్న ఆమెకిది కొత్త ఎక్స్‌పీరియన్సే. మధు షాలిని కేవలం కమల్‌కి ముద్దులు పెట్టడానికి ఉన్నట్టుగా అనిపిస్తుంది. ప్రకాష్‌రాజ్‌కి కూడా చాలా సాధారణ క్యారెక్టర్‌. సంపత్‌ రాజ్‌ ఫర్వాలేదు. సాంకేతికంగా ఈ చిత్రం ఉన్నతంగా ఉంది.
                       లొకేషన్స్‌ ఎక్కువ లేని ఈ సినిమాలో సినిమాటోగ్రాఫర్‌ ప్రతిభ బాగా కనిపిస్తుంది. జిబ్రాన్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ బ్రహ్మాండంగా ఉంది. దర్శకుడు ఉన్న కథని బాగానే తెరకెక్కించాడు కానీ ఉత్కంఠభరిత సన్నివేశాలని జోడించగలిగి ఉంటే 'చీకటి రాజ్యం' మంచి ప్రయత్నంగానే కాక బాక్సాఫీస్‌ వద్ద విజయాన్ని కూడా దక్కించుకునేది. రొటీన్‌ సినిమాలతో విసిగిపోయిన వారికి కాస్త రిలీఫ్‌ అయితే ఇస్తుంది కానీ ఒక మంచి సినిమా చూసిన అనుభూతిని మాత్రం అందించలేకపోయింది.