Tuesday, March 7, 2017

మొన్న రజనీ... నిన్న కమల్‌

 తమిళనాడులో రాజకీయాలకు, సినిమాకు అవినాభావ సంబంధం ఉంది. ఇప్పటి వరకూ రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రుల్లో 90 శాతం సినిమాకు చెందిన వారేనన్నది జగమెరిగిన సత్యం. జయలలిత మరణానంతరం సినిమా పరిశ్రమకు సంబంధంలేని ముఖ్యమంత్రి చేతిలోకి ప్రభుత్వం వెళ్లింది. దీన్ని తమిళనాడులోని అత్యధిక శాతం ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో నటుడు కమలహాసన్‌ ఇంతకు ముందెప్పుడూ లేని విధంగా తన భావాలను ట్విట్టర్‌ ద్వారా వెలిబుచ్చడం ప్రజలను ఆకర్షించింది.
కమల్‌ బహిరంగంగానే శశికళ నాయకత్వాన్ని వ్యతిరేకించి, పన్నీర్‌సెల్వంకు మద్దతు ప్రకటించారు. దీంతో ఆయన రాజకీయాలపై ఆసక్తి చూపుతున్నారనే ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో కమల్‌ ఆదివారం రాష్ట్రంలోని నలుమూల అభిమానుల ప్రతినిధులను, తన సంఘానికి చెందిన న్యాయవాదులను కలవడంతో  రాజకీయవర్గాల్లో అలజడి మొదలైంది. అయితే సమావేశంలో రాజకీయ ప్రస్తావన తీసుకురాకపోవడంతో వారు ఊపిరిపీల్చుకున్నారు.

కమల్‌ అభిమానులకు ఈ సమావేశం ఏమాత్రం రుచించలేదు. వారు తన అభిమాన నటుడు రాజకీయాల్లోకి ప్రవేశించాలని కోరుకుంటున్నారు. కమల్‌పై ఒత్తిడి తీసుకొస్తామని, ఆయన రాజకీయరంగ ప్రవేశానికి ఇదే సరైన సమయం అని అభిమానులు అంటున్నారు. కాగా మొన్నటి వరకూ ఇలాంటి రాజకీయ సెగ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఎదుర్కొన్నారు. ఇప్పుడు అలాంటి పరిస్థితే కమలహాసన్‌కు ఎదురవుతోందన్నది పరిశీలకుల మాట.