Sunday, October 12, 2014

వణికించిన హుదూద్‌!

 తీవ్ర పెను తుఫాన్‌గా మారిన హుదూద్ ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ తీరం దిశగా శరవేగంగా దూసుకొస్తున్నది. భారీ నుంచి అతి భారీ వర్షాలు, ప్రచండమైన ఈదురుగాలులతో ఆదివారం మధ్యాహ్నం విశాఖ సమీపంలో తీరాన్ని ఢీకొట్టనుంది. గంటకు 195 కిలోమీటర్ల వేగంతో వీచే గాలుల మధ్య తీరం దాటనున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా జిల్లాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి.


తీరం దాటే సమయంలో భారీ వర్షాలు

                        హుదూద్ తుఫాన్ తీరందాటే సమయంలో ఆంధ్రప్రదేశ్, ఒడిశాలోని పలు ప్రాంతాల్లో, భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతాయని భావిస్తున్నారు. విశాఖపట్టణానికి ఆగ్నేయ దిశలో 260 కిలోమీటర్ల దూరంలో, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు దక్షిణ ఆగ్నేయ దిశలో 350 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న తుఫాన్.. గత కొద్ది గంటలుగా పశ్చిమ వాయవ్య దిశగా కదులుతున్నది. ఇది ఉత్తరాంధ్ర తీరం మీదుగా ప్రయాణించి విశాఖపట్టణం సమీపంలో ఆదివారం మధ్యాహ్నం తీరం దాటనుందని భారత వాతావరణశాఖ శనివారం తన బులిటెన్‌లో తెలిపింది.


 మరో 3 రోజులుకుంభవృష్టి    హుదూద్‌ తుఫాన్‌ ప్రభావం కారణంగా మరో మూడు రోజులపాటు ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా విశాఖలో పరిస్ధితి తీవ్రంగా ఉంటుందని వెల్లడించింది. ఆదివారం సాయంత్రం వరకు తుఫాన్‌ ప్రభావం కొంతమేరకు తగ్గినా కూడా ఈ నెల 15 వ తేదీ వరకూ కుంభవృష్టి కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ఒడిశాలో గాలులు తీవ్రత అంతగాలేదని, దక్షిణ ఒడిశాలో మాత్రం విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వర్గాలు వెల్లడించాయి.

తూర్పు గోదావరి జిల్లాల్లోనూ హుదుద్‌ ప్రభావం
                హుదుద్‌ తుఫాను ప్రభావం తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలంపై తీవ్రప్రభావాన్ని చూపించింది. మండలంలోని తిర్రియానం, పల్లంకుర్రు, వలసలతిప్ప గ్రామాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. తుపాను ప్రభావంతో పల్లంకుర్రు గ్రామంలోని పాఠశాలలో బాధితుల కోసం పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. ముమ్మిడివరం ఎమ్మెల్యే సుబ్బరాజు పునరావాలస కేంద్రానికి చేరుకుని బాధితులతో మాట్లాడారు. హుదుద్‌ తుఫాను నేపథ్యంలో విశాఖలోని పునరావాస కేంద్రాల్లో ఉన్న వారి కోసం తూర్పుగోదావరి జిల్లా నుండి లక్ష ఆహార పొట్లాలను ప్రభుత్వం తరలించింది. మరో పక్క విశాఖ నగరంలో పరిస్థితి అస్తవ్యస్థంగా ఉంది. ఈదురుగాలులకు కూలిన కటౌట్లు, ఫ్లెక్సిలు, చెట్ల కొమ్మలతో రోడ్లన్నీ నిండిపోయాయి. పలు వీధులు ద్విచక్ర వాహనాలను నడిపించే పరిస్థితి కూడా లేదంటున్నారు. 


విశాఖలో ఇళ్లకే పరిమితమైన ప్రజలు
                          హుదుద్‌ తుఫాను ప్రభావం విశాఖ నగరంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. తుఫాను తీరం దాటిన సమయం నుండీ భారీ ఈదురుగాలులతో విశాఖ నగరం అతలా కుతలం అయింది. దీనికి తోడు భారీ వర్షం కురుస్తుండడంతో వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ప్రజలు ఇళ్ల నుండి బయటికి వచ్చే పరిస్థితి లేకుండా పొయింది. ముందస్తు చర్యల్లో భాగంగా శనివారం సాయంత్రమే విద్యుత్‌ అధికారులు సరఫరాను నిలిపి వేశారు. దీంతో నగరంలో అంధకారం నెలకొంది. తుఫాను సమాచారం తెలుసుకునేందుకు ప్రజలు రేడియోలను ఆశ్రయిస్తున్నారు. తుఫాను బాధితుల కోసం షెల్టర్లుగా రైలు బోగీలు కాగా తుపాను బాధితుల కోసం ఖాళీ రైలు బోగీలను షెల్టర్లుగా ఉపయోగించాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. దీని కోసం రాజమండ్రి నుండి విశాఖ వరకు 55 ఖాళీ రైలు కోచ్‌లను పంపించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఒడిసా తీరంపై హుదుద్‌ ప్రభావం పాక్షికంగా ఉంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అధికారులు పలువురిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. గోపాల్‌పూర్‌, భవనేశ్వర్‌, కటక్‌, గంజామ్‌ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. గోపాల్‌పూర్‌ తీరంలో బలమైన అల ఒక యువతిని సముద్రంలోకి లాగేయడంతో స్థానికులు ఆమెను రక్షించారు.