Monday, April 11, 2016

కోహ్లితో గొడవపడ్డా.. కానీ కలిసి ఆడతా..!


భారత్‌ స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ విరాట్‌ కోహ్లితో గతంలో ఎన్నోసార్లు మైదానంలో గొడవపడ్డాను. కానీ అతని కెప్టెన్సీలోనే ఇప్పుడు ఆడాల్సి వస్తోందని.. ఇలాంటి వింతలు ఐపీఎల్‌ లాంటి దేశవాళీ టోర్నీలోనే సాధ్యమవుతాయని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ షేన్‌ వాట్సన్‌ అభిప్రాయపడ్డాడు.
ఐపీఎల్‌-9 వేలంలో వాట్సన్‌ను రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఫ్రాంఛైజీ సీజన్‌లోనే అత్యధిక ధర రూ.9.5 కోట్లకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు మంగళవారం తొలి మ్యాచ్‌ ఆడనుంది. ఈ నేపథ్యంలో బెంగళూరు కెప్టెన్‌ కోహ్లి గురించి వాట్సన్‌ మాట్లాడుతూ ‘ఇలా కోహ్లితో కలిసి ఆడతానని అసలు వూహించలేదు.. ఓ క్రికెటర్‌గా అతణ్ని ఎక్కువగా గౌరవిస్తా’ అని అన్నాడు.

 అలానే జట్టులో ఉన్న వెస్టిండీస్‌ విధ్వసంక ఓపెనర్‌ క్రిస్‌గేల్‌తో 2009లో జరిగిన గొడవపై కూడా వాట్సన్‌ స్పందించాడు. ఆ గొడవ అనంతరం క్రిస్‌గేల్‌ ఓ ఇంటర్వ్యూలో ‘వాట్సన్‌ చూడ్డానికి గంభీరంగా ఉన్నా చాలా సున్నితమైన వ్యక్తి’ అంటూ వ్యాఖ్యానించాడని గుర్తు చేశాడు. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వాట్సన్‌ జట్టు అవసరార్థం తాను ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని వివరించాడు. కోహ్లి, క్రిస్‌గేల్‌, డివిలియర్స్‌ లాంటి హిట్టర్లు ఉన్నప్పటికీ ఇంతవరకూ ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఒక్కసారి కూడా విజేతగా నిలవలేదు. మరి టీ20ల్లో అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా పేరొందిన వాట్సన్‌ రాకతోనైనా ఈ సీజన్‌లో బెంగళూరు విజేతగా నిలుస్తుందేమో చూడాలి..! 

No comments:

Post a Comment