Monday, July 11, 2016

అనుష్కపై పొగడ్తల వర్షం

 సల్మాన్‌ఖాన్‌ ప్రధానపాత్రలో తెరకెక్కి ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటున్న చిత్రం ‘సుల్తాన్‌’. రంజాన్‌ సందర్భంగా విడుదలైన ఈ చిత్రంలో సల్మాన్‌ఖాన్‌తో పాటు ఆర్ఫాగా అనుష్కశర్మ నటనపైప్రశంసల వర్షం కురుస్తోంది. సల్మాన్‌కి దీటుగా కుస్తీ సన్నివేశాల్లో మెప్పించింది అనుష్క. తొలుత చాలామంది పేర్లను పరిశీలించిన దర్శకుడు అలీ.. ఆ పాత్రలో అనుష్కను కాకుండా వేరే వారిని చూడలేమంటూ పొగిడేస్తున్నాడు.
‘‘‘సుల్తాన్‌’ సినిమాలోని ఆర్ఫా పాత్రకు అనుష్క శర్మ తప్ప మరెవ్వరూ న్యాయం చేయలేరు. అత్యద్భుతమైన ప్రతిభ దాగి ఉన్న సహజనటి ఆమె’’ అంటూ పొగడ్తల్లో ముంచెత్తాడు దర్శకుడు. అంతేకాదు.. ఈ చిత్రంలో కండలవీరుడికి సరిజోడీగా కనిపించిన ఈ సొట్టబుగ్గల సుందరీమణీ గురించి గతంలో సల్మాన్‌ కూడా ‘‘ప్రతిభ ఉన్న వారితో పనిచేయటం చాలా బాగుంటుంది’’ అని పొగిడేశాడు.
నిజమే.. ‘సుల్తాన్‌’ చిత్రంలో మల్లయోధురాలిగా అనుష్క పోషించిన పాత్ర ఆమెలోని భిన్నమైన ప్రతిభకు అద్దంపడుతుంది మరి.

సచిన్ తో పోల్చడం ఆపండి!

 పరుగుల యంత్రాన్ని తలపిస్తూ ఇప్పటికే పలు ఘనతలను తన ఖాతాలో వేసుకున్న టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పై ఉన్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నాడు. ఆ దిగ్గజ ఆటగాడితో తనను దయచేసి పోల్చవద్దంటూ అభిమానులకు మరోమారు విజ్ఞప్తి చేశాడు. అసలు తనకు సచిన్ తో ఎటువంటి పోలికా లేదని విరాట్  తెలిపాడు.  సచిన్ తో తనను పోల్చే విషయాన్ని ఇకనుంచైనా ఆపాలని విజ్ఞప్తి చేశాడు. ఈ విషయంలో అభిమానులు, మీడియా కాస్త సంయమనం పాటించాలని సూచించాడు.
'అసలు సచిన్ తో నాకు పోలిక లేదు. అతనితో నన్ను ఎందుకు పోల్చుతున్నారో అర్థం కావడం లేదు. సచిన్ ఆడినన్ని రోజులు ప్రజలకు అతనొక ఆదర్శం. ఆ రకమైన ఘనతను సాధించానని నేను అనుకోవడం లేదు. టెండూల్కర్ చాలా మందికి ప్రేరణగా నిలిచాడు.. మానవతా కోణంలో కూడా సచిన్ కు నేను ఏమాత్రం సరిపోను'అని విరాట్ తెలిపాడు.